Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
saahithi interview

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

(సినిమా పరిశ్రమ పుట్టి వందేళ్లయిన శుభ సందర్భంలో ... )

వందేళ్ల వెండితెర వెలుగులు వెనక తెరవేలుపులయిన మహానుభావులు కొందరయితే, తెరమరుగయిన జీవితాలెన్నో....
ఓ వెలుగు వెలిగి ఆరిపోయినవి, వెలగకుండానే ఆవిరయిపోయినవి...
మిణుకుమిణుకుమంటూ  కొనవూపిరితో కొట్టుకుంటున్నవీ -
నూనె ఉన్నా ప్రమిద దొరక్క సీసాలోనే ఎదురుచూస్తున్నవీ -
మల్టీప్లెక్స్ ల మెత్తని సీటింగ్ లో టూరింగ్ టాకీస్ మాయం -
వేయి థియేటర్లలో ఒకేసారి రిలీజులతో వందరోజుల వేడుకలు మృగ్యం -
నిర్మాతలకు నష్టాలు, హీరోలు, దర్శకులకు భారాన్ని మోయాల్సిన కష్టాలు -
మంచి కధలకు మార్కెట్ వాల్యూ సున్నా -
మూసకధలు రాయటమే మిన్న -
అయినా ఆగని ప్రస్థానం -
సాంకేతికతలో పురోగమనం -
ట్రేడ్ ని ఫాలో అవుతూ కొన్నిసార్లు,
ట్రెండ్ ని క్రియేట్ చేసి ట్రేడ్ ని తన వెనక తిప్పుకుంటూ మరికొన్ని సార్లు -
మూకీ నుండి టాకీ దాకా, స్టేజి నుంచి టాకీస్ దాకా -
ప్రతి దశలోనూ సృజనాత్మకశక్తితో పోరాటం -
ప్రేక్షకులని మెప్పించాలనే ఆరాటం,
సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే వెర్రి, సినిమాయే జీవితం,
సినిమాలే శాశ్వతం అనుకున్న రోజులనుంచి
సినిమాల్లో ఉంటే గ్లామర్, సినిమాల్లోఉంటేనే సెలబ్రిటీ,
సినిమావాడైతే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు -
సినిమాల్లో పెడితేనే డబ్బుకి ఏ బ్యాంకులోకన్న తక్కువ టైములో -
ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటున్న రోజులు -

"కళాత్మక వ్యాపారం"లో కళ తప్పింది. ఆత్మ చచ్చిపోయింది - వ్యాపారం మిగిలింది - మళ్ళీ పునర్జన్మ వస్తుంది -
ఆరునెలల్లో ఎక్కడో, ఏ మూలో ఏ దర్శక, రచయిత మస్తిష్కంలోనో సినిమా ఎప్పుడూ చిగురిస్తూనే ఉంటుంది -
అల్లూరి సీతారామరాజు ఆఖరి డైలాగులాగ -
ఒక్క అల్లూరి చనిపోయినా తన ప్రతి రక్తపు బొట్టులోంచి వేలమంది సీతారామరాజులు పుడతారన్నట్టు, ప్రతి దశలోనూ దీని పనైపోయిందన్న ప్రతీసారీ ఓ నిర్మాతో, ఓ దర్శకుడో, ఓ కథానాయకుడో, ఓ కథానాయికో తమ నిర్ణయాలతో ముందుకు తోస్తూనే ఉన్నారీ సినిమా అనే జగన్నాథ రధ చక్రాన్ని - వంద సంవత్సరాల రిలే పరుగుపందెంలో టార్చ్ ప్రతి సినిమాకీ చేతులు మారుతూనే ఉంది.

ఇలాగే ఇంకో వందేళ్ళు మారుతుంది - అలాగే మరో వందేళ్ళు మారుతుంది. సినిమా పరిశ్రమకు వందేళ్ళంటే నూరేళ్ళు నిండడం కాదు...
వెయ్యేళ్ళలో పదోవంతు గడవడం మాత్రమే... ప్రశంసించినకొద్దీ తరుగుతుంది - విమర్శించినకొద్దీ మెరుగవుతుంది - ఇంత వి 'చిత్ర' పరిశ్రమ ప్రపంచంలో ఏ జీవనోపాధిలోను ఉండదు.

కానీ నా మనసులో ఒకటే బాధ -

ఎన్టీవోడు , నాగ్గాడు, కిట్టిగాడు, సోగ్గాడు, సావిత్రమ్మ, జమునమ్మ, ఎస్వీవోడు, రేలంగోడు, బక్కరెడ్డి, రాజబాబు, చలం - ఇలా అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునేలా ముద్దు ముద్దుగా తిట్టుకునేలా కధానాయకులు, నాయికలు జనానికి చేరువౌతున్నారా ? అని ఆలోచించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు - కళాసరస్వతి పైట కొంగుకు నేసిన జరీ జిలుగు వెండి తెర - కళా పోషకులను దేవుళ్లను చేసిన మంచి మనసు సినిమావాదిదేరా - పాత్రికేయులు, పాత్రధారులు, గాత్రధారులు, వ్యాపారవేత్తలు, సరస్వతీపుత్రులు, సంగీతజ్ఞులు,
శ్రామికులు, బండబరువులు మోసేవాళ్లు, బండబారిన మెదళ్లవాళ్లు, దర్జీలు, దర్జాగా బ్రతికేవాళ్లు, చోదకులు, చేతిపనివాళ్లు, చదువుకున్నవాళ్లు , నిరక్షర కుక్షులు, సంపన్నులు, మధ్యతరగతి వాళ్లు, పేదవారు, నిరుపేదలు - అందరూ కలిసి కొన్ని రోజులపాటు ఒకే కుటుంబంలా ఒకే పనిని చేయగలరా ఏ వృత్తిలోనన్నా - ఇంతకన్న కమ్యూ'నిజం' నటన ప్రధానమైన వృత్తిలో ఉంటుందా ?

అందుకే సినిమా అంటే నాకిష్టం.
నా హృదయంలో చాలా ప్రత్యేకం.
మళ్ళీ వారం మరిన్ని విశేషాలతో....

                                                                       మీ
                                                                       వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
raja music muchchatlu