Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekamber

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

గోవిందరావుకి తెలుసు.

నాలుగురోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయని, ప్రస్తుతానికి డబ్బు టెన్షన్ తీరింది.

కాబట్టి తను హేపీ. అందుకే ఇక ఆమె గురించి పట్టించుకోకుండా క్యాష్‌బ్యాగ్‌ తీసుకుని లోనకు వెళ్ళిపోయాడు. త్రివిక్రమ్‌చేత నిజం చెప్పించటం పోలీసులవల్ల కాలేదు. ఇంకా చెప్పాలంటే, ఈ నేరం అతడే చేసాడనటానికి పోలీసుల దగ్గర తగిన సాక్ష్యాధారాలు కూడా లేవు.   

రంగు రంగు బుడగలు బూరలు అమ్ముకొనే ముసలాడు ఒకడు బ్యాంకులోకి వచ్చాడు. వాడు వచ్చిన కొద్దిసేపట్లోనే బ్యాంకులో అరడజను నాగుపాములు బుసలుకొడుతూ సరుగులు తీసాయి.

అటు బ్యాంకు సిబ్బంది, ఇటు కస్టమర్లుకూడా కకావికలై భయంతో గంతులు వేసారు కొందరు బయటికి పరుగులెత్తారు. కొందరు కుర్చీలు, టేబుళ్ళు ఎక్కారు.

ఈ టైంలోనే ఆ ముసలాడు కౌంటర్లలో జొరపడి, కేష్‌ బేగల్‌లో పడేసుకుని బయటకొచ్చాడు. అడ్డం వచ్చినసెంట్రీనికొట్టి, తెలివిగాతప్పించుకొని వీధిలోకి పారిపోయాడు.

వీధిలో ఆ ముసలాడ్ని అనుమానించి తరుముకెళ్ళారు పోలీసులు,

ఇదీ అక్కడ జరిగిన సంఘటనల ఆర్డరు.

అయితే

తాము వెంబడించి ఛేజ్‌ చేసింది ముసలాడినికాని, చివరకు పట్టుకుంది ఒక యువకుడ్ని. ముసలాడు యువకుడిగా ఎలా మారిపోయాడంటే పోలీసుల దగ్గర సమాధానం లేదు.

మనిషి మారిపోయాడుగాని, బేగ్‌ అదే బేగ్‌ కాని అందులో డబ్బులేదు. అనేక కోణాలనుంచి ఆలోచించినప్పుడు విక్రమ్‌ నిర్దోషిగా బయటపడ్డానికి తొంబైతొమ్మిదిశాతం అవకాశం వుంది.

అయితే

రెండు పాయింట్లు జడ్జిగారిని ఆలోచింపచేసేవిగా వుండి పోయాయి.   

అందులో మొదటిది పోలీసు జాగిలాలు, ఎన్నిసార్లు వదిలినా అది తిరిగి తిరిగి విక్రమ్‌వద్దకే వచ్చి ఆగిపోతున్నాయి. రెండో కారణం బ్యాంకు వద్ద డ్యూటీలో వున్న సెంట్రీ.

''ఆ కళ్ళు.... అది చిరుతపులి కళ్ళు వాటిని మర్చిపోలేను. నన్ను కొట్టింది వాడే. కాదంటే నన్ను కొట్టినప్పుడు వాడు ముసలివేషంలో వుండి వుంటాడు'' అని వాడు అనేకసార్లు నమ్మకంగా చెప్పటం.

కాగా

దోపిడిసొత్తు దొరక్కపోవడం పోలీసులకు పెద్ద మైనస్‌పాయింట్‌ అయింది. ఇవన్నీ దృష్టిలో వుంచుకునే, సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా త్రివిక్రమ్‌ నేరస్తుడనటానికి ఫిప్టి ఫిప్టి ఛాన్స్‌ వున్నందున కోర్టు త్రివిక్రమ్‌కి మూడు సంవత్సరాలు జైలుశిక్ష విధించింది.

ఆ విధంగా నేరం పూర్తిగా ఋజవుకానప్పటికీ వచ్చి సబ్‌జైల్లో పడ్డాడు త్రివిక్రమ్‌.

***

''నా పేరు ఆంజనేయులు తోక ఒకటి తక్కువకాని ఆయనకు, నాకు అట్టే తేడాలేదు. క్రమశిక్షణ తప్పినవాళ్ళని చచ్చినా క్షమించను. చండశాసనుడ్ని, కొత్తగా వచ్చిన మీకు నా గురించి అస్సలు తెలీదుగాబట్టి హెచ్చరిస్తునాను. అర్ధమైందా?'' ఎదురుగా వరసగా నిలబడున్న అరడజనుమంది ఖైదీలను చూస్తూ పెద్దగా నోరు తెరచి అరిచాడు జైలర్‌.

ఎంతో బుద్దిమంతుల్లా తలాడించారు వాళ్ళంతా.

ఆ ఆరుగురులోనూ త్రివిక్రమ్‌ ఒకడు.

ఎదుటి వాళ్ళను అంచనా వేయటంలో

త్రివిక్రమ్‌ ఎప్పుడూ పొరబాటు పడడు.

యావరేజ్‌ హైట్‌తో బుర్రమీసాలతో, కండపుష్టి కలిగిన జైలరు ఆంజనేయులు ఎంత గంభీరంగా వుంటాడో, అతడు అంత బోళాశంకరుడని అర్ధమైపోయింది.

జైలర్‌ ఒక్కొక్కడ్నే పిలిచి సంతకాలు తీసుకుంటున్నాడు.

''నీ పేరేమిట్రా'' ముందుగా వచ్చిన బట్టతలవాడ్ని అడిగాడు.

''అందగాడు సార్‌'' చెప్పాడు వాడు.

''ఇదేదో సినిమా పేరులా వుందేమిట్రా?''.

''కాదండీ నా పేరు''

''పగలుచూస్తే రాత్రి కల్లోకొచ్చి భయపెట్టేలా వున్నావ్‌ వెధవాని నీకు పేరు పెట్టిన వాళ్ళని అనాలి.''

''నా పేరు అదేసార్‌...''

''సరిసరి, రికార్డులో అలాగే వుంది, ఇక్కడ సంతకంపెట్టి చావు. ఇంతకీ ఏం నేరం చేసావేమిటి?''

''రేప్‌ కేస్‌ సార్‌.''

''ఓర్నీ..... రేప్‌ చేసావా?''

''అదీ రేప్‌కాదు సార్‌. పక్కింటావిడ తెగసైటు కొడుతుంటేనూ పోన్లే పాపం అని వెళ్ళాసార్‌, తీరా ఆ టైంలో మొగుడు వచ్చేసరికి లవ్‌ కేస్‌ని కాస్త ఆవిడ రేప్‌కేస్‌ చేసేసింది. అయిదు వేలు ఫైను, ఆరుమాసాలు జైలు అన్యాయంకదు సార్‌?''

''ఓర్నీ..... ఎయిడ్స్‌ని మించిన భయంకరరోగం వచ్చినా మీరు మాత్రం మారర్రా.. పోరా నెక్‌స్ట్‌''

వరసగా అయిదుగురి సంతకాలు అయిపోయాయి. ఆరోవాడు త్రివిక్రమ్‌. సైలంట్‌గా వచ్చి ఆయన ఎదురుగా నిలబడ్డాడు.

''నీ పేరేమిటి? ఎగాదిగా చూస్తూ అడిగాడు జైలరు.

''నా పేరు త్రివిక్రమ్‌ సార్‌'' చెప్పాడు.

ఆ పేరు వినగానే

తేలు కుట్టినట్టు ఉలిక్కిపడ్డాడు జైలరు.

''అదేమిటి ? అక్కడ మార్కండేయ అని రాసుంది....'' అడిగాడు.

''వాళ్ళు అలా రాసుకున్నారు సార్‌.''

''అయితే అలాగే సంతకం పెట్టు''

సంతకం చేసాడు త్రివిక్రమ్‌.

''ఇంతకీ నీ అసలు పేరేమిటి? మార్కండేయా, త్రివిక్రమా..... ? అనుమానంగా అడిగాడు జైలరు.

''మీరు ఏది పిలిస్తే అదే అసలు పేరవుతుంది సార్‌. ఎందుకంటే ఈ జైలుగోడల మధ్యమీరు కింగ్‌. మీరు పిలిచాక తిరుగేముంటుంది?''

''నేను ఇక్కడ రాజునయినా పైన చక్రవర్తులున్నారు. కాకాపట్టాలని చూడకు. ఏం నేరం చేసావ్‌?''

''చేయలేదండీ.''

''మరి?''

''బ్యాంకు దొంగతనం అంటగట్టి ఇక్కడికి తెచ్చిపడేసారండి.''

''ఓహో.. రాబరీకేసా.... ఓ.కే.''

''సార్‌. నేనోమాట అడగొచ్చా?''

''అడుగు. డౌట్లు ఏమన్నా వుంటే ఇప్పుడే అడిగిచావండి, లేదంటే ఆనక ఏదో వెధవపనిచేసి తన్నులు తింటారు.''

''ఏం లేదు సార్‌, తమ పేరే ఆంజనేయులు, అంచేత హనుమంతుడి చరిత్ర తమకు తెలిసే ఉంటుంది''. ''షూర్‌... మొత్తం తెలుసు.''

''అయితే మరి హనుమంతుడి పిన్నమ్మ ఎవరు సార్‌?''

''హనుమంతుడి..... పినతల్లా.... ఓర్నీ.... ఆయనకి పినతల్లి పెద్దతల్లి అని ఇంతమంది తల్లులులేరు. ఒకేతల్లి ఆంజనాదేవి. అందుకే ఆయన్ని ఆంజనేయులు అన్నారు, వెళ్ళిరా.''

''ఆయనకి పినతల్లి వుంది సార్‌.''

''ఓహో.... ఈ ఆంజనేయులుకే సవాలా? బెట్‌ కాద్దామా? పినతల్లి లేదంటాను.''

''ఓ.కే. సర్‌. నేను వుంది అంటాను. బెట్‌.... ఇంత క్రితమే నా బట్టలతోపాటు ఐదు వందలరూపాయలు మీ వాళ్ళకిచ్చాను. ఆ అయిదువందలు బెట్‌. మీరు విన్‌చేస్తే ఆ డబ్బు మీది. నేను విన్‌చేస్తే మీరు నాకు అయిదు వందలు యివ్వాలి. నో క్రెటిడ్‌.''

''క్రెడిటా... '' అంటూ పెళ్ళున నవ్వాడు ఆంజనేయులు.

''ఓరిపిచ్చోడా! క్షత్రీయ వంశంరా మాది. నా పూర్తిపేరు సీతారామాంజనేయరాజు. సింపుల్‌గా ఆంజనేయులు అంటారు. పూర్వం ఉద్యోగం పురుషలక్షణం అన్నారు గాబట్టి డిపార్ట్‌మెంట్‌లో చేరాను. మన నిజాయితీ, సిన్సియారిటీ పైవాళ్ళకి నచ్చలేదు. బుద్దిగా వుండరాని ఇక్కడ పడేసారు. సో..... క్రెడిట్‌ లేదు. అంతా క్యష్‌డౌన్‌, చూపించు. ఎక్కడ వుంది ఆ పినతల్లి?''

''సారీ సార్‌! చూపించటం సాధ్యంకాదు, చెప్తాను.''

''ఆవిడ ఎవరోకాదు సార్‌, కుంతి.''

''కుంతీదేవి ఆంజనేయుడి పినతల్లా......ఒప్పుకోను చచ్చినా ఒప్పుకోను. రామాయణానికి, భారతానికి లింకు పెడతావేమిటి?''

''ఇందులో ఏ లింకూలేదు సార్‌! అంతటి కృష్ణభగవానుడే భీమసేనుడు ఆంజనేయుడి తమ్ముడన్నాడు, కాలం ఏదయినా తమ్ముడు తమ్ముడే కదా ఆ వరుస చూసినప్పుడు కుంతి పినతల్లి గాక ఏమవుతుంది సార్‌?''

టోపీతీసి జుత్తు పీక్కున్నాడు, ఆంజనేయులు.

ఆశ్చర్యంగా త్రివిక్రమ్‌ని చూసాడు.

''ఓర్నీ..... ఉండాల్సిన వాడివిరా... ఆసాధ్యుడిని, ఇలా వచ్చావో లేదో అలా నా జేబుకి పెట్టేసావ్‌ కన్నం. నాతో కడితే కట్టావ్‌గాని లోపల బెట్టింగ్‌చేసి ఖైదీలను చెడగొట్టకు'' అంటూ కరెన్సీనోట్లు అయిదు తీసి త్రివిక్రమ్‌ చేతిలో వుంచాడాయన.

''బెట్టింగ్‌ లేకపోతే లైఫ్‌బోర్‌ కొడుతంది సార్‌. పైగా మీ హ్యాండ్‌ చాలా మంచిది. కొంచెం చూసీచూడనట్టు వదిలేయండి ప్లీజ్‌'' అంటూ డబ్బు తీసుకొని సల్యూట్‌ చేసాడు త్రివిక్రమ్‌.

నవ్వుకొంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు జైలర్‌.

మిగిలిన ఖైదీలతోబాటు పోలీసులవెంట లోనకు నడిచాడు త్రివిక్రమ్‌.

ఆరు మాసాలు గడిచిపోయాయి.

ఈ ఆరుమాసాలు జైలు జీవితంలో త్రివిక్రమ్‌ హేపిగానే వున్నాడు అతను జైలుకొచ్చిన నెలరోజుల తర్వాత అతని ఫ్రెండ్స్‌ శివా, చైతన్యలు యిద్దరూ అతడ్ని చూడటానికి వచ్చారు.

వాళ్ళని చూసినప్పుడు మాత్రం

త్రివిక్రమ్‌ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

''అమ్మా...... అమ్మ ఎలా వుందిరా, అమ్మను చూడాలనుంది'' అన్నాడు బాధగా.

''బాధపడకురా, అమ్మ బాగానే వుంది. నీ గురించి బాధపడుతూ వుంటుంది. దుబాయ్‌నుంచి నీ ఫోను ఎప్పుడొస్తుందాని ఎదురు చూస్తుంటుంది. ముఖ్యంగా చెల్లాయి పెళ్ళి హేపీగా జరిగిపోయింది. తన పెళ్ళికి నువ్వు లేవని రమ్య ఏడ్చిండి. చాలా బాధపడింది. ఇప్పుడు అత్తారింట్లో హేపీగావుంది. వాళ్ళ గురించి నువ్వు దిగులు పెట్టుకోవాల్సిన పనిలేదు'' అంటూ వివరించాడు శివా.

''డాడీ... డాడీ ఎలా వున్నారు?'' కళ్ళు తుడుచుకుని అడిగాడు.

''ఆయన బాగానే వున్నారు. పైకి చెప్పకపోయినా నీ గురించి ఆయన మనసులో బాధ వుంది. ఆ విషయం ఈ మధ్యే తెలిసింది. వాడు బాగుపడాలనే నేను కఠినంగా వ్యవహరించాను. అంతే కాని వాడిమీద ప్రేమ లేక కాదు. కాని వాడు అది గుర్తించలేకపోయాడు. మమ్మల్ని వద్దనుకున్నాడు. అందుకే ఇన్ని రోజులయినా ఉత్తరంగాని, ఫోన్‌గాని చేయలేక పోయాడు అంటూ నా ముందే చాలా బాధపడ్డారాయన'' అన్నాడు చైతన్య.

''వాళ్ళని అలాగే వుండనీ... నేను జైల్లో వున్నాననే నిజం తెలిస్తే పడే బాధకన్నా దుబాయ్‌నుంచి ఫోన్‌ చేయలేదనే బాధ చిన్నది కదూ? మీరు నాకు చేసిన హెల్ప్‌ జీవితంలో మర్చిపోలేనిదిరా. థ్యాంక్యూ'' అన్నాడు చిన్నగా నవ్వుతూ త్రివిక్రమ్‌.

''థాంక్స్‌ చెప్పక్కర్లేదురా. డాడీకి ఆరులక్షలు ఇచ్చాం. మిగిలింది మేమిద్దరం తీసుకున్నాం...''

''ఓ.కె... ఓ.కె. ఆ విషయం వదిలేయండి. అప్పుడప్పుడూ వెళ్ళి మమ్మీ డాడీలను చూసిరండి. మూడేళ్ళు ఎంత. కళ్ళు మూసుకుంటే కాలం తిరిగిపోతుంది'' అంటూ నవ్వేసాడు.

శివా, చైతన్యలు వెళ్ళిపోయారు.

ఇక ఈ ఆరు మాసాల్లోనూ జైలువిశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్‌ అక్కడ అందరికీ అత్యంత ఆప్తుడుగా మారిపోవటం.

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ వుండే హుషారయిన యువకుడు త్రివిక్రమ్‌ అంటే అక్కడ అందరికీ అభిమానమే.

ఎదుటివాళ్ళని బెట్‌కట్టేలా టెమ్ట్‌ చేయటం ఒక ఆర్ట్‌. త్రివిక్రమ్‌కి వెన్నతో పెట్టిన విద్య. జైల్లో అడుగుపెట్టినరోజే జైలర్‌ సాబ్‌ని బెట్‌లో ఓడించి అయిదు వందలు కొట్టేసాడంటే అతడి టాలెంట్‌ వూహించుకోవచ్చు.

మొదట్లో సాటి ఖైదీలు డ్యూటీలోని పోలీసులతో చిన్న చిన్న పందాలు కాచి కావాలని ఓడిపోయాడు. తర్వాత పందెం సొమ్ము డబుల్‌ చేసి మరో బెట్‌లో వడ్డీతోసహా వసూలుచేసేవాడు. క్రమంగా జైలు అధికారులు, పోలీసు, ఖైదీలు అంతా కూడా త్రివిక్రమ్‌తో బెట్టింగ్‌లో ఓడిపోయి డబ్బులు పోగొట్టుకున్నవాళ్ళే. అయినా త్రివిక్రమ్‌ అంటే వాళ్ళందరికీ అభిమానమే.

ఎందుకంటే, అందరినీ ఏదో ఒక వరసపెట్టి ఆప్యాయంగా పిలుస్తాడు. అవసరానికి డబ్బు సాయం చేస్తూంటాడు. ఎవరిదగ్గర లేకపోయినా త్రివిక్రమ్‌ తగ్గర ఎప్పుడూ డబ్బులుంటాయని అందరికీ తెలుసు. అంతే కాదు, జైలుస్టాప్‌లో చాలా మంది వెయ్యి, రెండువేలు ఇలా త్రివిక్రమ్‌ దగ్గర అప్పుగా తీసుకోవటమేగాని తిరిగి ఇచ్చిందిలేదు. అంచేత త్రివిక్రమ్‌ ఏం చెప్పినా అతడికి సహకరించటానికి వాళ్ళు సిద్ధమే.

''ఏమిటి బ్రదర్‌! ఈ నైట్‌ డ్యూటీ నీదా?'' సాయంత్రం డ్యూటీ కొచ్చిన కానిస్టేబుల్‌ని పలకరించాడు త్రివిక్రమ్‌.

''నాదేగాని ఏమిటి కథ? హూషారుగా వున్నావ్‌?'' అడిగాడతను.

''ఏం లేదుగాని మీరు నాకో చిన్న హెల్ఫ్‌ చేయాలి.''

''ఏమిటది?''

''జైలు కూడుతిని నాలుక చచ్చిపోయింది. అలా టౌన్‌లోకి వెళ్ళి బార్‌లో మందుకొట్టి, బిర్యానీ తిని, సెకండ్‌షో సినిమాచూసి రావాలనుంది. నీకేమన్నా అభ్యంతరమా?''

''అభ్యంతరం నాక్కాదు బాబూ, చట్టానికి. రూల్స్‌ ఒప్పుకోవు. తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయి'' కావాలంటే మా ఇంట్లో వండించి కోడి కూరతో నీకు భోజనం తెచ్చిస్తానుగాని బయటకు పోడానికి వీల్లేదంతే.''

''అంతే అంటే ఎలా బాబోయ్‌......? వెళ్ళాలి మరి. మీరు గాకపోతే నాకు ఎవరు సాయం చేస్తారు? నామీద నమ్మకం లేదా? పిలు. మిగిలిన వాళ్ళని కూడా పిలు.''

సెంట్రి డ్యూటీలో వాళ్ళని ఒప్పించి ఒక సెంట్రీకి తన జైలు డ్రసువేసి తనసెల్‌లో కూర్చోబెట్టి తను సివిల్‌ డ్రస్‌లో బయటికెళ్ళి హేపిగా తిని తాగి, సినిమా చూసి బుద్ధిగా అర్థరాత్రి రెండు గంటలకి తిరిగి జైలుకి వచ్చేసాడు త్రివిక్రమ్‌.

ఇలా అనేకసార్లు జరిగింది. త్రివిక్రమ్‌ మీద అందుకే అందరికీ నమ్మకం. జైలర్‌ ఆంజనేయులుకి తెలిసినా త్రివిక్రమ్‌మీద నమ్మకంతో తనూ ఈ విషయాన్ని చూసీ చూడనట్టు వదిలేసాడు.

ఆ విధంగా.......

తను వుంటోంది జైల్లో అయినా....

ఆ ఫీలింగే తెలీనంత హేపీగా ............

అక్కడ రోజులు గడిపేస్తున్నాడు త్రివిక్రమ్‌.

మనిషయి పుట్టాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి వుంటుంది. కొందరికి మందు పిచ్చి, కొందరికి మగువల పిచ్చి, కొందరికి సినిమా పిచ్చి, కొందరికి డబ్బు పిచ్చి. ఇలా లోకంలో ఎన్నో రకాల పిచ్చివాళ్ళున్నారు.

త్రివిక్రమ్‌కి సంబంధించినంతవరకు....

అతడిది క్రికెట్‌ పిచ్చి.

టి.వి లో గేమ్‌ వస్తోందంటే చాలు అన్నం, నీరు కూడా మర్చిపోతాడు. అంతటి క్రికెట్‌ వీరాభిమాని.

ఈ విషయం అక్కడ అందరికీ తెలుసు.

జైలర్‌ ఆంజనేయులుకి కూడా తెలుసు.

క్రికెట్‌ మేచ్‌ వుందంటేచాలు జైలర్‌ గది వదిలి బయటకు పోడు త్రివిక్రమ్‌. సచిన్‌ సిక్సర్‌ కొడతాడని, సెహవాగ్‌ ఫోర్‌ కొడతాడని కూంబ్లే వికెట్‌ తీసుకుంటాడనీ, హరభజన్‌ సింగ్‌ ప్రత్యర్థిని క్లీన్‌బౌల్డ్‌ చేస్తాడని. ఇలా ఆయా సందర్భాల్నిబట్టి త్రివిక్రమ్‌తో బెట్‌ కాచి పాపం ఆంజనేయులు చాలా డబ్బు పోగొట్టుకున్నాడు.

త్రివిక్రమ్‌కి చాలాకాలంగా ఓ లైఫ్‌ ఆంబిషనుంది. తను స్టేడియంకెళ్ళి గాలరీలో కూర్చుని మేచ్‌ చూడాలి. మన అభిమాన క్రికెట్‌ హీరోల్ని ప్రత్యక్షంగా చూసి తరించాలన్నదే ఆ ఆంబిషన్‌, ఇంత వరకూ తను డైరెక్టుగా ప్లేయర్స్‌ ఎవర్నీ చూళ్ళేదు. ముఖ్యంగా సచిన్‌ అంటే మరీ అభిమానం.

ఆ నేపధ్యంలో......

ఆ రోజు పేపర్‌లో ఒక మ్యాచ్‌.

క్రికెట్‌ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగించే న్యూస్‌ అది.

భారత పాకిస్థాన్‌ సీరీస్‌లో అయిదు ఒన్‌ డే మేచ్‌ల్లో ఒకటి విశాఖపట్నంలో జరగనుంది. డేట్‌ కూడా అనౌన్స్‌ చేసారు. రెండ్రోజుల్లో టికెట్ల అమ్మకాలు కూడా ఆరంభం కానున్నాయి.

ఆ వార్త చదివిన వెంటనే ఎలాగయినా వైజాగ్‌ వెళ్ళి కనులవిందుగా ఆ మేచ్‌ని తిలకించి రావాలని త్రివిక్రమ్‌లో ఆశ కలిగింది.

***

జైలర్‌ ఆంజనేయులికి ఒక అలవాటుంది.

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏవో అలవాట్లు ఉంటూనే ఉంటాయి. వాటిలో కొన్ని చిత్రాతిచిత్రమైన విచిత్రపు అలవాట్లు వుంటూంటాయి.

ఆంజనేయులు అలవాటు మరీ విచిత్రమని చెప్పలేంగానీ ఆయన మామూలుగా ఉదయం స్నానాధికాలు ముగించుకుని పూజ చేసుకునే ఇంట్లోంచి బయలుదేరి వస్తాడు. అయినా కూడా మళ్ళీ ఇక్కడ ఆఫీసు గదిలో గోడకు తగిలించున్న శ్రీరామ పట్టాభిషేకం పటానికి అగరువత్తులు చూపించి దండం పెట్టుకున్న తర్వాత గానీ డ్యూటీ ఆరంభించడు.

ఆ రోజు కూడా ఎప్పటిలాగే...

 

(... ఇంకా వుంది)

 

 

 

 

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugadu inter fail ias pass