Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope March 21- March 28

ఈ సంచికలో >> శీర్షికలు >>

కుక్కేయడం... అనబడే ఓవర్ లోడింగ్... - భమిడిపాటి ఫణిబాబు

kukkeyadam... anabade over loading...

షేర్ ఆటోల్లో చూస్తూంటాము, ముగ్గురో నలుగురో ఎక్కాల్సిన ఆటోలో ఓ అరడజనుమంది వేళ్ళాడుతూ కనిపిస్తూంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే, ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ "కుక్కేయడం" అనే పదాన్నిఎన్నో సందర్భాల్లో వాడుకోవచ్చు. ఇదివరకటి రోజుల్లో, ఎప్పుడైనా ప్రయాణాలు చేయాల్సొస్తే, తీసికెళ్ళే బట్టలన్నిటినీ ఓ ట్రంకు పెట్టిలొనో, హోల్డాలు లోనో కుక్కేసేవారు. అలాగే రైళ్ళలో, unreserved compartment లో జనం కిక్కిరిసి ఉంటారు. ఇదికూడా కుక్కేయడం లోకే వస్తుంది. బస్సుల్లో అయితే ప్రతీ రోజూ చూస్తూనే ఉంటాము. చివరాఖరికి మన బట్టలు ఏ ఇస్త్రీ కైనా తీసికెళ్ళాలంటే ఓ క్యారీ బాగ్ లో కుక్కేసి తీసికెళ్తాము. చెప్పొచ్చేదేమిటంటే, ఉన్న అసలు కెపాసిటీ కంటే ఎక్కువగా సర్దడానికి ప్రయత్నించడం. దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తూనే ఉంది.

ఈ ప్రక్రియలోకే వస్తుంది, ఈ రోజుల్లో చిన్న పిల్లల బుల్లి బ్రైనులోకి తల్లితండ్రులు, వాళ్ళు చేయలేకపోయినవన్నీ కుక్కేయడం! అసలా బుల్లి బుర్రెంతుంటుందండీ పాపం. ఏమిటో మాటలు వచ్చినప్పటినుండీ, వాళ్ళని హోరెత్తించేయడం. ఒకటని కాదు, ప్రపంచంలో ఉన్న విశేషాలన్నీ, మన పిల్లలకే వచ్చేయాలి. వాళ్ళ రిటైనింగ్ కెపాసిటీ ఏమిటో తెలిసికుంటే ఏం పోయిందిట? ఏమైనా అంటే, కాంపిటీటివ్ ప్రపంచంలో, అలా ఉండకపోతే, ఎందుకూ పనికి రారూ అని ఓ సమర్ధింపోటీ. అసలు ఆ చిన్ని బుర్రలకు విశ్రాంతి అనేది ఏమైనా ఉంటుందా అనికూడా ఆలోచించరు. ఇదివరకటి రోజుల్లో వేసంగి శలవల్లాటివి వస్తే, పిల్లల్ని తీసికుని ఏ అమ్మమ్మగారింటికో, నానమ్మ గారింటికో తీసికెళ్ళేవారు. ఆ పిల్లల ప్రాణాలకీ హాయిగా ఉండేది. ఆ శలవల్లో తాతయ్యలు చెప్పే కబుర్లతోనూ, అమ్మమ్మ/నానమ్మ లు వండిపెట్టిన పిండివంటలతోనూ, తమతమ బ్యాటరీలు రీఛార్జ్ చేసేసికుని, తిరిగి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి ఫ్రెష్ గా స్కూళ్ళకి వెళ్ళేవారు. చిత్రం ఏమిటంటే ఇలా తమపిల్లల్ని ఓవర్ లోడ్ చేసే తల్లితండ్రులందరూ వారి వారి చిన్నతనంలో శలవలు వచ్చేసరికి తాతలూ. అమ్మమ్మా, నానమ్మా దగ్గరకు వెళ్ళిన ఘటాలే, కానీ తమ పిల్లలదగ్గరకొచ్చేటప్పటికి “జ్ఞానోదయం” కలిగినట్టు ప్రవర్తిస్తారు. ఆ రోజుల్లో శలవలొచ్చేసరికి ఎప్పుడు ఊరికి వెళ్ళిపోదామా అనే. తమ పిల్లలకి కూడా అలా ఉంటుందేమో అని ఎందుకు తట్టదో అర్ధం అవదు. ఇప్పుడు, ఏ కొద్దిమందిలోనో తప్ప ఈ concept అటకెక్కేసింది.

ఈ రోజుల్లో శలవలొచ్చాయంటే, ఇంకొక సో కాల్డ్ ఆర్టులో ట్యూషనుకి పంపిద్దామా అనే కానీ, పోనీ ఏడాదంతా స్కూలుకెళ్ళడానికి ప్రొద్దుటే నిద్రలేవడం, సాయంత్రాలు ట్యూషన్లతోనూ బుర్ర వేడెక్కిపోయిందే, ఈ శలవల్లోనైనా, హాయిగా కంటి నిండుగా నిద్రపోనిస్తారా అంటే అదీ లేదు.ఏ స్విమ్మింగో, డాన్సింగో, మ్యూజిక్కో అంటూ వాళ్ళ ప్రాణాలు తీస్తారు. వీటికి సాయం టీ.వీ. ల్లో వచ్చే 'సరిగమ', పాడుతా తీయగా', 'సూపర్ సింగరూ', అదీ ఇదీ కాకపోతే 'ఆట', డ్యాన్స్ బేబీ డ్యాన్సో' ఇంకో మట్టీ మశానమో! ఎంతదాకా వస్తుందంటే పరిస్థితీ, అబ్బ ఈ శలవలు ఎప్పుడు అయిపోతాయిరా భగవంతుడా, స్కూలున్నప్పుడే బాగుండేదీ, హాయిగా పాఠాలతో సరిపోయేదీ ఈ గొడవలుండవుకదా అనేంతవరకూ. ఆ పిల్లల దారిన పిల్లల్ని వదిలేస్తే, వాళ్ళకి దేంట్లో ఇష్టమో చెప్తారుకదా. అబ్బే వాళ్ళకేం తెలుస్తుందండీ చిన్న పిల్లలూ అనడం. అక్కడికి వీళ్ళకే అన్నీ తెలిసినట్లు! వచ్చిన గొడవ ఏమిటంటే, ఈరోజుల్లో తల్లితండ్రులలో చాలామందికి ఓ పెద్ద  “అపోహ” ఉంది - తమ తల్లితండ్రులు వారికి భావ స్వాతంత్ర్యం అసలు ఇవ్వలేదని. తాము పొందలేనివన్నీ తమ “ఆంఖోం కా తారా” ల ద్వారా తీర్చుకోడమే వారి జీవితోద్దేశ్యం అనుకుంటా. అస్తమానూ చదువేకాకుండా, మిగిలినవాటిలోనూ పిల్లలకి కొంతకాకపోతే కొంతైనా నేర్పించాలి, కాదనం, కానీ ఆ నేర్చుకునేవాటికి కూడా ఓ లిమిట్ ఉండాలి. అంతేకానీ, వేలంవెర్రిలా కుక్కేయకూడదు. పోనీ అలా నేర్చుకున్న “కళలు” జీవితాంతం ఉంటాయా అంటే అదీ లేదు, పెళ్ళయినతరువాత పరిస్థితుల ప్రభావం మూలంగా వాటికి న్యాయం చేయలేకపోయినవారు ఎంతో మంది ఉన్నారు.

ఇంక క్రమశిక్షణ పేరుతో, చిన్న పిల్లల్ని పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా తిండి విషయంలో, ఏ డాక్టరునడిగినా చెప్తారు, వాళ్ళకి కావలిసిందేదో తింటారు, బలవంతం చేయొద్దూ అని. మనం ఏ నెట్ లోనో చూడ్డం, లేకపోతే, టి.వీ ల్లో వచ్చే ప్రకటనల ప్రభావం అనండి, ఫలానా క్యాలరీల తిండి తినాలీ, లేకపోతే అదేదో యాడ్ లో చెప్పినట్లుగా, సైకిలు తొక్కేటప్పుడు పెడలందదూ, మామిడికాయ చేతికందదూ, వయస్సొచ్చేస్తోందీ. మరి ఆ ప్రకటనల ప్రకారం, ఓ కాంప్లాన్ త్రాగేసి, ఫార్ట్యూన్ నూనె తో సమోసాలు చేసేసికుని, ధారా నూనెతో గారెలూ, జిలేబీలు తయారుచేసికుని, మాగ్గీ నూడిల్స్ తాగేసో, తినేసో, ఓ లైఫ్ బాయ్ సబ్బుతో ప్రతీ రోజూ స్నానం చేసేసి రోజులు గడిపేస్తే, మరి లక్షలు పోసి డిగ్రీలు తెచ్చుకున్న డాక్టర్లందరూ ఎక్కడకి పోతారమ్మా వల్లకాట్లోకా? మన టీవీల్లో వచ్చే ప్రకటనల ప్రకారం, పిల్లల్ని పెంచడం మొదలెడితే, అసలు దేశంలో డాక్టర్ల అవసరమే ఉండదేమో!!

అందువలన ప్రకటనలని నమ్ముకుని చిన్న పిల్లలకి టైంటేబుల్ ప్రకారం, రోజంతా నోట్లో కుక్కేస్తూ ఉంటే వాళ్ళకి విశ్రాంతనేది ఎక్కడా? పైగా ఇంకో గోలోటీ, పళ్ళెంలో పెట్టిందంతా పూర్తిచేయాలీ అని! కడుపు అనేదొకటి ఉందికదా, దానికీ లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళకలిగినంతే వెళ్తుంది. ఎక్కువయితే బయటకి వచ్చేస్తుంది. ఏదో వాళ్ళకి కావలిసినదేదో తిననీయాలి కానీ, ఈ క్రమశిక్షణ పేరుతో హింసించకూడదు. తల్లితండ్రులు, వాళ్ళేదో పిల్లల్ని ఆరోగ్యంగా పెంచుతున్నామనే అపోహలో ఉంటున్నారు. అంత ఆరోగ్యంగా పెంచుతూంటే, ఏ child specialist దగ్గరైనా అంతంత క్యూలు ఎందుకుంటాయీ? ఏమైనా అంటే, అంతా పొల్యూషన్ మహాత్మ్యం అంటారు కానీ, వాళ్ళు తిండి విషయంలో పిల్లల్ని హింసిస్తున్నారూ అనే విషయం మాత్రం ఒప్పుకోరు! పెద్దాళ్ళు ఈ విషయంలో జోక్యం చేసికోకూడదు. వాళ్ళంతా బూజు పట్టేసిన వాళ్ళు!

అంతదాకా ఎందుకూ, కంచంలో పెట్టిన ఆధరువులనే తిసికోండి, శుభ్రంగా అన్నంతో కలిపి తినిపిస్తే ఎంత బావుంటుందీ, అబ్బే అలా కాదు, వేళ్ళతో కోడి కెక్కరించినట్లు సుతారంగా, నామ్ కే వాస్తే ఓసారి రాసేసి నోట్లో, అదీ నోరు మరీ తెరవకూడదు పడేయడం. ఏమైనా అంటే ఎవరి పనులు వాళ్ళు చేసికోడం ఇప్పటినుండీ నేర్పకపోతే ఎలాగా అనడం. ఇదంతా చూసి ఆహా ఓహో అని తల్లితండ్రులు మురిసిపోవడం.

చెప్పొచ్చేదేమిటంటే, ఈ రోజుల్లో పిల్లో, పిల్లాడో పుట్టినప్పటినుండీ ఈ 'కుక్కేయించుకోవడం' అనే చిత్రహింసకి బలైపోతున్నాడు. మరి ఎక్కడ చూసినా కాంపిటీషనాయె! ఎవడెక్కువ తింటే వాడు ఫస్ట్. ఎవడికెక్కువ బట్టలుంటే వాడు ఫస్ట్. ఎవడెంత భారీ బ్యాగ్గులో పుస్తకాలు తీసికెళ్తాడో వాడు అంత బాగా చదువుతున్నట్టన్నమాట. అలాగే ఎన్నేసి ట్యూషన్లకెళతాడో అంత బుధ్ధిమంతుడన్నమాట.

ఈమధ్యన తెలుగు చానెళ్ళలో అదేదో కొత్తకార్యక్రమం ఒకటి చూస్తున్నాము, ఎవడో ఓ పిల్లాడిని ఓ పిచ్చి ప్రశ్న వేయడం, వాడేమో దానికి ఓ తిక్క సమాధానం చెప్పడం, దానికి ఆ యాంకరూ, ఆడియెన్సులో ఉన్న తల్లితండ్రులు మురిసిపోవడం, ఇదివరకటి రోజుల్లో చిన్న పిల్లలకి ఏవో పద్యాలూ, శతకాలూ నేర్పేవారు. కానీ ఈ రోజుల్లో... అడక్కండి. ఇదంతా చిన్నపిల్లల మేధాశక్తిని అభివృధ్ధి చేసే ప్రణాళికలోకి వస్తుందట.

సర్వే జనా సుఖినోభవంతూ!

మరిన్ని శీర్షికలు
Gosaala