Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

దెబ్బతిన్న తమ నేస్తాన్ని అక్కున చేర్చుకుంటాయి... ఎంత తెలివైనవీ అడవి దున్నపోతులు? ఎవరిచ్చారు వాటికా తెలివితేటలు? ఎంతో తెలివైన వాడిననుకునే మనిషి దున్నపోతుల నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది...

'శుభస్య శ్రీఘ్రం' అన్నారు పెద్దాలు...

మంచి ఆలోచన రాగానే దాన్ని వెంటనే అమలుపరచడం మంచిదని దాని అర్ధం...

కరణం గారిని రిక్వెస్ట్ చెయ్యడం, ఆయన వెంటనే ఓకే అనడం, కిట్టు, వరద, రాములు ఆ ఇంట్లో చేరిపోవడం, అన్నీ చకచకా జరిగిపోయాయి. యుద్ధం నెగ్గడమనేది... యుద్ధభూమిలో జరగదు.

మానవుని మస్తిష్కంలోనే జరుగుతుంది...

అదెలాగంటే...

ఎదుటివాడి సైన్యమెంత?... వాడి బలాబలాలేమిటి?.. వాడు వేసే ఎత్తులేమిటి..? ఇలాంటివన్నీ తెలుసుకుని, ఎదుటివాడి సైన్యానికి రెట్టింపు సైన్యంతోనూ, ఎదుటివాడి బలానికి రెట్టింపు బలంతోనూ, ఎదుటివాడి ఎత్తులను చిత్తు చేసే పన్నాగాలతోనూ, యుద్ధానికి సిద్ధమైతే... యుద్ధభూమికి వెళ్లకముందే నెగ్గేదెవరో చెప్పవచ్చు.

కిట్టు చేసింది కూడా అదే...

ఇంట్లో ఉండగానే దాడి జరిగే అవకాశం లేకుండా కరణంగారింట్లో మకాం...

బయటకెళ్ళినప్పుడు దాడి జరగకుండా ఒక పదిమంది ఎల్లప్పుడూ కలిసి ఉండేలా ఏర్పాటు...

ఇక చాలు...

యుద్ధం చేయకుండానే యుద్ధం నెగ్గాడు కిట్టు.

కంభం ఆకతాయిలు కిట్టు వైపు, కిట్టు గ్యాంగ్ వైపు ఆ తర్వాతెప్పుడూ కన్నెత్తి చూడలేదు... పన్నెత్తి మాట్లాడలేదు... కిట్టు గ్యాంగ్ కంభం ఆకతాయిలని ఏ గొడవలకీ ఆహ్వానించలేదు.

కిట్టుకి, కిట్టు ఫ్రెండ్స్ కీ కంభం లో గడిపిన సమయం అంతా ఏ గొడవా లేకుండా, హాయిగా, ఆటపాటలతో గడిచిపోయింది.

***

ఇక రూమ్మేట్ల విషయానికొస్తే ముందుగా చెప్పుకోదగినవాడు 'రాజు'... ఫ్రమ్ వైజాగ్... ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్... ఎత్తుగా, లావుగా... ఉంటాడు... 'బాల నెరుపు... అంటే చిన్నప్పుడే తల వెంట్రుకలు నెరసిపోవడం... రంగు వేసే ఆలోచనే లేదు... ఎప్పుడూ తెల్లని లాల్చీ పైజామాలో కనబడతాడు.

రయ్యి రయ్యిన సైకిల్ తొక్కుతాడు. తెలియని వాళ్లు చూస్తే చిన్నవాడనుకోరు... ఓ పదేళ్ల వయసు కలుపుకుంటారు... ఈ గ్యాంగ్ వాళ్లంతా రాజుకు "దిబ్బరాజు" అని నామకరణం చేసుకున్నారు'.

మాటలు చాలా హడావుడిగా మాట్లాడతారు...

'భోజనానికి పోయి, అట్నుంచి, కాలేజికి పోదాం' అనే మాటను చాలా హడావుడిగా, సునామీ వచ్చినట్లు, కొంపలు మునిగిపోతున్నట్లు చెబుతాడు.

కొత్త వాళ్లయితే ఏకంగా ఆందోళనకు గురవుతారు. మళ్లీ గుచ్చి గుచ్చి అడుగుతారు. ఏమైంది? ఏమైందని? అబ్బా... ఏమీ లేదయ్యా బాబూ... కాలేజికి లేటవుతుంది... భోజనానికి పోదాం... అని అంటున్నాడు... అని వివరిస్తే ఆ... అని నోరు వెళ్లబెడతారు...

***

గుర్నాధం... ఫ్రమ్ సికాకుళం... సివిల్ బ్రాంచ్...

రాజు సైకిల్ పై వెనక క్యారేజీ మీద కూర్చొని కాలేజికి వెళ్లేవాడు గుర్నాధం...

రాజుని ఏనుగుతో పోలిస్తే, గుర్నాధాన్ని ఎలుకతో పోల్చవచ్చు... కంభం వాసులు అదే పోలికతో వీళ్ళిద్దరినీ పోల్చేసారు కూడా... గుర్నాధం డైరెక్ట్ గా టెన్త్ క్లాస్ నుండి పాలిటెక్నిక్ కి వచ్చేశాడు.

చిన్న శరీరం, పెద్ద చెవులు, సొట్టబుగ్గలు, పొట్టిక్రాఫ్... గుర్నాధం క్లాసులో చాలా అలర్ట్ గా ఉండేవాడు.

మాస్టారు చెప్పినవన్నీ తన పెద్ద చెవులను రిక్కించి వినేవాడు. "ఒక్కముక్క కూడా గుర్నాధం చెవుల్ని దాటిపోదు..." అనేవాడు వరద. గుర్నాధంకు కాన్సట్రేషన్ చాలా ఎక్కువ... వందకి డెబ్బై ఐదు కంటే ఎక్కువ మార్కులు రావాలి. ఒక్క మార్కు తగ్గినా ఏడ్చినంత పని చేసేవాడు...

మిగిలిన వాళ్లు అంత సీరియస్ కాదు. కిట్టుకి, వరదకి, రాముకి పాస్ మార్కులు వస్తే చాలు...

పరీక్షల సమయంలో అందరూ గుర్నాధం చుట్టూ చేరేవారు... అప్పటి వరకు "గుండు గుర్నాధం" అనే వరద... గురువుగారు... గురువుగారు... మాకు కొంచెం నేర్పించండి గురువుగారు... అనేవాడు. గుర్నాధం ఆనందంగా తనకు తెలిసింది అందరికీ నేర్పించేవాడు.

పరీక్షలు బాగా రాసిన తర్వాత అందరూ గుర్నాధానికి థాంక్స్ చెప్పేవారు.

మనమంతా ఒక బ్యాచ్...

మనలో మనకి థాంక్స్ ఏమిటి... అనేవాడు గుర్నాధం.

గుర్నాధం వాళ్ల అన్నయ్య శ్రీను. ఇంటర్ పాసై తమ్ముడితోపాటుగా అదే బ్రాంచ్ లో చేరాడు.

***

"ఇజ్ నగరం సుబ్రావ్"... ఇజ్ నగరం అంటే విజయనగరం... సుబ్బారావుని "సుబ్రావ్" చేసేసారు... సుబ్రావ్ జన్మతహా దృఢకాయుడు... అందుకని "బిల్డర్ వాయ్"... అనేవారు ఫ్రెండ్సంతా... వరద అప్పుడప్పుడూ "రావు గారూ" అనేవాడు... సుబ్రావ్, సినీ హీరో "బాలకృష్ణ" అభిమాని... అందుకని అప్పుడప్పుడూ "బాలయ్యగారూ" అనేవాడు వరద...

సుబ్రావ్ కి ఒక విచిత్రమైన హాబీ ఉండేది...

ఏదన్నా సబ్జెక్ట్ చదవాలంటే... దానికి సంబంధించిన రకరకాల పుస్తకాలు సేకరించేవాడు. పద్నాలుగో శతాబ్దం, పదమూడో శతాబ్దంలో రాసినవైనా ఫర్వాలేదు. 'ఇప్పటికి అవసరమైన పుస్తకాలు చదివితే చాలు, పాత పాత "బీసీ" నాటి పుస్తకాలు ఎందుకురా చదవడం? అనేవారు ఫ్రెండ్సంతా...'

అయినా సరే సుబ్రావ్ ఏమాత్రం లెక్కచేసేవాడు కాదు...

సరే...

"బీసీ" నాటి పుస్తకాలు లేటెస్ట్ పుస్తకాలు, కలిపి చదివితే మంచి మార్కులు రావాలి కదా...!

సుబ్రావ్ కి వచ్చేమార్కులు అందరితో పాటే ఉండేవి...

దీన్ని బట్టి కిట్టు నేర్చుకున్నదేమిటంటే...

ఎన్నిపుస్తకాలు చదివామన్నది కాదు ముఖ్యం... సరైన పుస్తకం ఒకటైనా, క్షుణ్ణంగా చదవాలి.

సాధారణంగా మగపిల్లల్లో కనబడే అలవాటు ఒకటుంది...

కాలేజి నుండి తిరిగి వచ్చేటప్పుడు... ఖాళీ స్థలం కనబడగానే ఒకడు సైకిల్ ఆపేవాడు... 'నేను అర్జంట్ గా పాస్ పోసుకోవాలి మీరు వెళ్తే వెళ్లండి' అనేవాడు... వాణ్ణి చూడగానే ఇంకొకడు సైకిల్ దిగుతాడు... వీళ్ళిద్దర్నీ చూసి ఇంకొకడు... ఇలా మొత్తం అందరూ మొదలుపెడతారు... ఇదొక "సామూహిక మూత్రవిసర్జన" కార్యక్రమం అయిపోతుంది...

సుబ్రావ్ కి మూత్రనాళం నొక్కుబడి పోయి ఉండటం వలన చాలా నెమ్మదిగా మూత్ర విసర్జన చేసేవాడు.

అందరికీ పట్టే సమయంకంటే సుబ్రావ్ కి రెట్టింపు సమయం పట్టేది... వాడికోసం మిగిలిన వాళ్లు వెయిట్ చెయ్యాల్సి వచ్చేది. ఒరే సుబ్రావ్... నువ్వు మొదలెట్టకురా... అనేవారు...

ఒరే... మొదలెట్టేసావా... 'సరే'... రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాము... అప్పటికి నీ పని అయిపోతే మాతోపాటు వద్దువుగానీ' అనేవారు.

సుబ్రావ్ కి కోపం వచ్చేది... కానీ, ఏం చేయగలం...? ఇక లాభం లేదని, ఒక డాక్టర్నికలిసాడు...

డాక్టరుగారన్నారు...

'ఇది చాలా చిన్న విషయం... చిన్న ఆపరేషన్ చేస్తే చాలు, నీకింక ఏ ప్రాబ్లం ఉండదు... ఒక్క రాత్రి హాస్పిటల్ లో ఉంటే చాలు'

ఆపరేషన్ కి రెడీ అయిపోయాడు సుబ్రావ్... కానీ సుబ్రావ్ కి భయమెక్కువ... ఫ్రెండ్సందరినీ హాస్పిటల్ లో తోడుగా పడుకోమన్నాడు. అందరూ సుబ్రావ్ కి తోడుగా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే సుబ్రావ్ కి పూర్తి స్వస్థత చేకూరింది...

ఈసారి 'సామూహిక మూత్ర విసర్జన' కార్యక్రమంలో ఎవరైనా ఆలస్యం చేస్తే,

'అరే... ఎంతసేపురా...' అనేవాడు సుబ్రావ్... మిగిలిన వాళ్లంతా పెద్దగా నవ్వేవాళ్ళు. నిన్నమొన్నటి దాకా అందరూ నిన్ను అనేవారు ఈ మాట... ఇప్పుడు నువ్వు ఇంకొకన్ని అంటున్నావు... అనేవారు నవ్వుతూ... సుబ్రావ్ కూడా వాళ్ల నవ్వుల్తో జతకలిపేవాడు.

***

చందు... అందరికీ ప్రీతిపాత్రమైనవాడు... విశాఖ వాసి... చిన్న పర్సనాలిటీతో స్టైలుగా, చిన్న సైజు సినిమా హీరోలా ఉంటాడు...

'ఇంటర్ పాసవ్వరా... నీకు 'పోలండ్ లో' ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నిస్తాను అన్నాడంట చందు వాళ్ల అన్నయ్య...' సరిగ్గా దానికి వ్యతిరేఖంగా, ఇంటర్ ఫెయిలయ్యి కూర్చున్నాడు చందు.

ఇక లాభంలేదని పాలిటెక్నిక్ లో చేర్పించాడు వాళ్ల అన్నయ్య...

ఎవరు ఏ సహాయం అడిగినా ఎప్పుడూ కాదనేవాడు కాదు చందు. ఎవడికి ఏ పని ఉన్నా, ముందుగా చందు జ్ఞాపకం వస్తాడు. డబ్బులు కూడా లెక్కచేసేవాడు కాదు... ఎవరికైనా అవసరం వస్తే ఇచ్చేసి, మళ్లీ నీ మనియార్డర్ రాగానే ఇచ్చెయ్యి అనేవాడు. చూసేసిన సినిమా అయినా సరే...

ఒరే చందు... నాకు కంపెనీగా రారా... అంటే... ముందు మాత్రం... ఒరే... నాకు బోరు కొడుతుందిరా... నేనురాను... అనేవాడు. ప్లీజ్ రా చందూ... నాకోసం రారా... అనగానే... సర్లే పదరా అనేవాడు. తన మంచితనంతో అందరికీ చేరువైన చందుని ఫ్రెండ్సంతా, మరీ ముఖ్యంగా వరద రకరకాల పేర్లతో పిలుచుకునేవారు.

"చంద్రం బాబాయ్"... "బాబాయ్ గాడు"... "దాసుగాడు (చందు పూర్తిపేరులో దాసు ఉంది)"

"దాసు... దోసకాయ..." ఫైనల్ గా ఖరారైన పేరు మాత్రం 'బాబాయ్'.

చందు ఎప్పుడూ నవ్వుతూ... ఇతరులను నవ్విస్తూ... పిల్ల చేష్టలు చేస్తుండేవాడు...

ఒకసారి...

ఒక కానిస్టేబుల్, లాఠీ పక్కన పెట్టుకుని, కుర్చీలో కూర్చొని, కునికిపాట్లు పడుతుంటే... ఆ లాఠీ తీసుకుని, దాని ఆధారంగా నాలుగైదు సార్లు అటూ ఇటూ జంప్ చేసి, మళ్ళీ లాఠీని యధావిధిగా పెట్టాడు చందు... ఈలోపు కానిస్టేబుల్ కి మెలకువ వచ్చి... ఒరేయ్ నా లాఠీని అవమానిస్తావు రా... అంటూ లాఠీని పట్టుకుని చందు వెనకాలపడ్డాడు. కానిస్టేబుల్ కి దొరకకుండా వేగంగా పరిగెత్తి పారిపోయాడు చందు... 'ఒరే... దొరికిపోయి ఉంటే, నా చమడాలు తీసి ఉండేవాడురా ఆ కానిస్టేబుల్...' అని ఫ్రెండ్స్ తో చెప్పి నవ్వేవాడు చందు... 'అంత స్పీడుగా దొరకకుండా ఎలా పరిగెత్తగలిగావురా' అని అడిగితే...

'లాఠీ దెబ్బల భయ్యం ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎవర్జీ' అనేవాడు.

***

గిరి... రాజమండ్రి దగ్గర "నందరాడ" వాసి.

గిరి పోలికలు సినీ హీరో "వెంకటేష్" లా ఉంటాయి.

ఇద్దర్నీ పక్కపక్కనే పెడితే గిరియే స్మార్ట్ అంటారు.

గిరికి నాయకత్వ లక్షణాలెక్కువ. ఎప్పుడూ రూమ్ లో ఉండేవాడు కాదు. బయట ఫ్రెండ్స్ తో తిరిగేవాడు.

అసలు నీ ఫ్రెండ్స్ సర్కిల్ కంభంలో ఎంతుందిరా అంటే... నాకే తెలీదు అనేవాడు. హ్యాపీగా దమ్ము కొట్టేవాడు.

పరీక్షల సమయంలో... 'వీడికి చదివే టైమే లేదు, ఎప్పుడూ గాలికి తిరుగుతాడు, వీడికేమీరాదు, ఐనా వీడికి నిమ్మతోటలు గట్రా ఉన్నాయి కదా... వీడికి చదువేమీ అవసరం లేదు' అనుకున్న ఫ్రెండ్స్ గిరిని పరీక్షించేవారు...

'గిరి... ఈ లెక్కలు ఎలా చెయ్యాలో చెప్పు' అనేవారు... గిరికి తెలుసు... వీళ్లంతా తన గురించి ఏమనుకుంటున్నారో. సీరియస్ గా చూసి, సిగరెట్ వెలిగించేవాడు... అప్పుడప్పుడూ దమ్ములాగుతూ, ఇంకో చేత్తో పెన్ను పట్టుకుని, టప టపా... లెక్కలు చేసి పారేసేవాడు. ఇదిగో అయిపోయింది... చూసుకోండి... అంటూ... పెన్ను పక్కన పడేసి, లేచి వెళ్ళిపోయేవాడు.

ఫ్రెండ్స్ అందరికీ ఆశ్చర్యం... ఒరే... ఎలా చేశావురా... అని ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు... ఏముంది... అందులో... పెద్ద కష్టమేమీకాదు... 'లెక్కలు చెయ్యడం చాలా ఈజీ... కానీ, పేజీలకు పేజీలు  చాట భారతం రాయడం మాత్రం నాకు కష్టం. అయినా ఇదేముంది? కేవలం పాలిటెక్నిక్, దీని తర్వాత బీటెక్, ఆ తర్వాత ఎమ్ టెక్ చేస్తేనే ఒక స్టేజీకి వచ్చినట్టు... ఎమ్ టెక్ చెయ్యకపోతే నా తాట తీస్తానన్నాడు మా అబ్బ' అన్నాడు గిరి.

అమ్మో... వీడు సామాన్యుడు కాదురా... అనుకునేవారు ఫ్రెండ్సంతా.

***

రాజమండ్రి 'కుమార్'... కుమార్ అంటేనే "ఫ్యాషన్"

స్టోన్ వాష్, యాసిడ్ వాష్ ప్యాంట్లు ధరించేవాడు. చొక్కాలు, ప్యాంట్లు రకరకాల ప్రింట్లు, అడ్డచారలు, నిలువు చారలు, చిత్రవిచిత్రమైన ఫ్యాషన్ లలో కుట్టించేవాడు. కనీసం ఒక డజను జతలు ఉండేవి.

సెలవులకు ఇంటికి వెళ్తే, మళ్లీ కొత్త ఫ్యాషన్, కొత్త డిజైన్ల డ్రస్సులతో వచ్చేవాడు.

మిగిలిన వాళ్లు కుమార్ ని బ్రతిమాలి వాడి డ్రస్సులు ఒకటి రెండు సార్లు వేసుకుని, ఉతికి, ఇస్త్రీ చేయించి ఇచ్చేవారు. కొన్నాళ్ళకి బ్రతిమాలడం మానేసి, కుమార్ బట్టలు వేసుకుని వాడికి ఎదురుపడేవాడు.

ఆశ్చర్యపోవడం కుమార్ వంతయ్యేది... ఎవడ్రా నా పెట్టె తాళాలు పగలగొట్టింది? అసలు మీకు బుద్ధి... జ్ఞానం ఉందా? మనుషులా... పశువులా? అన్నం తింటున్నారా... గడ్డి తింటున్నారా? అంటూ ఇంతెత్తున ఎగిరేవాడు. ఎవ్వడూ ఏమీ సమాధానం చెప్పేవాడు కాదు. దున్నపోతు మీద వర్షం కురిస్తే, అదెలా లెక్క చేయకుండా కదలక, మెదలక ఉంటుందో అలా ఉండేవాళ్లు మిగిలిన వాళ్లు.

కొత్త తాళం వేస్తే అదీ పగలగొట్టేశారు. అసలు తాళం వెయ్యడానికి వీలులేకుండా గొల్లాల్ని కూడా పీకేశారు. ఇంకా చేసేదేముంది... కుమార్ కూడా అరవడం మానేసి... అలవాటు పడిపోయాడు.

ఇంతకీ విషయమేమిటంటే... కుమార్ వాళ్లు క్లాత్ మర్చంట్స్... రాజమండ్రిలో పేరొందినవారు...

ఈ విషయం తెలిసిన ఫ్రెండ్స్... కుమార్ కి "మూటలోడు" (సింపుల్ గా మూట్లోడు) అని పేరు పెట్టారు.

మళ్లీ కుమార్ కి బీపీ పెరిగింది. ఎవడ్రా నాకు 'మూట్లోడు' అని పేరు పెట్టింది! నేనేమన్నా సైకిలు మీద బట్టల మూటలు పెట్టుకుని, ఇంటింటికి తిరిగి అమ్మేవాడిలాగా కనబడుతున్నానా?

మాది హోల్ సేల్ వ్యాపారం... ఒకటి... రెండు... కాదు... బేళ్లు... బేళ్లు... సప్లై చేస్తాం... ఒక బేలులో కొన్ని వందల బట్టలుంటాయి... తెలిసి ఏడిస్తే కదా మీకు!

ఆహా... బేలుని తెలుగులో ఏమంటారు...? బట్టల మూటే కదా!. అందుచేత నువ్వు మూట్లోడివే... చంపేస్తాను ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే.... అన్నాడు కుమార్. ఆ అప్పుడు చూద్దాంలే అన్నారు మిగతా వాళ్లు. ఇక ఆ విషయాన్ని వదిలేసాడు కుమార్.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college drop out gadi prema katha