Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review Legend

ఈ సంచికలో >> సినిమా >>

మొద‌టి సినిమాకే నా ల‌క్ష్యాల‌న్నీ నెర‌వేరిపోయాయి! - స‌మంత‌

Interview with samantha

మంత....

టాప్ హీరోయినే... కానీ సగ‌టు అమ్మాయిలానే మాట్లాడుతుంది.

అందంగా ఉంటుంది.. కానీ అంద‌మంటే గిట్ట‌దు అనిచెప్తుంటుంది

కోట్ల‌లో పారితోషికం ఇవ్వ‌డానికి నిర్మాత‌లు రెడీ.. కానీ డ‌బ్బులంటే వ్యామోహం లేదంటుంది

సినిమాలు ఒప్పుకోవ‌డానికి ఖాళీ ఉండ‌దు... కానీ సామాజిక సేవాకార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటుంది.

అందుకే స‌మంత.. స‌మ్‌థింగ్ స్పెష‌ల్ అయ్యింది. త‌క్కువ వ‌య‌సులో వ‌చ్చేసిన పేరు..  సంపాదిస్తున్న డ‌బ్బు ఇవేం స‌మంత‌లోని స‌గ‌టు అమ్మాయిని దాచలేక‌పోయింది. త‌న స్నేహితుల‌తో క‌ల‌సి ఇప్ప‌టికీ అల్ల‌రి చేస్తుంది, వ‌ర్షంలో త‌డుస్తుంది, కొత్త సినిమా వ‌చ్చిందంటే, రిలీజ్ రోజున థియేట‌ర్లో వాలిపోతుంది. ``నేను ఇప్పుడు హీరోయిన్‌నే కావ‌చ్చు. కానీ అంత‌క్రితం నాకో లైఫ్ ఉంది. నాచుట్టూ వ్య‌క్తులున్నారు. వాటిని మ‌ర్చిపోకూడ‌దు క‌దా..`` అంటున్న‌ స‌మంత‌తో ఈ వారం చిట్ చాట్‌.

* క‌థానాయిక అవ్వ‌డం వ‌ల్ల మీ జీవితంలో వ‌చ్చిన గొప్ప మార్పు ఏమిటి?
- ఇది వ‌ర‌కు మా ఇంట్లోవాళ్ల‌కూ, స్నేహితుల‌కు మాత్ర‌మే తెలిసిన నేను... ఈ రోజు ల‌క్ష‌లాది మందికి తెలుసు. నేను కోరుకొన్న జీవితం నాచేతికొచ్చింది. ఇంత‌కంటే ఏం కావాలి?

* వ్య‌క్తిగ‌త జీవితం కోల్పోయా అన్న బాధ లేదా?
- ఎందుకు కోల్పోయా?  నాలుగేళ్ల క్రితం ఎలా ఉన్నానో, ఇప్ప‌టికీ అలానే ఉన్నా. నా బ్యాంక్ బాలెన్స్ పెరిగింది. అంతే త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎలాంటి మార్పులేదు. ఇదివ‌ర‌క‌టిలానే స్నేహితుల‌తో క‌ల‌సి అల్ల‌రి చేస్తున్నా. సినిమాల‌కు వెళ్తున్నా. అనుకొంటాం గానీ.. నేను బ‌య‌ట‌కు వెళ్తే స‌రిగా గుర్తించ‌లేరు. ఒక‌వేళ గుర్తుప‌ట్టినా పెద్ద ఇబ్బందేం లేదు. హైద‌రాబాద్‌లోని గ‌ల్లీల‌న్నీ తిరిగేస్తా తెలుసా..? 

* బ్యాంక్ బాలెన్స్ పెరిగింద‌న్నారు.. దానివ‌ల్ల కూడా మార్పు రాలేదా?
- ప్ర‌తి మ‌నిషికీ ఆర్థిక భ‌ద్ర‌త కావాలి.  అదుంటే మరింత‌ స్వేచ్ఛ‌గా జీవించొచ్చు. అంతకు మించి డ‌బ్బు వ‌ల్ల కొత్త‌గా వ‌చ్చే సౌఖ్యాలేం ఉండ‌వు. ఎంత సంపాదించినా.. రెండు పూట‌లే తింటాం క‌దా. నేను ఎక్క‌డి నుంచి వ‌చ్చానో నాకు బాగా తెలుసు. సంపాద‌న మీద వ్యామోహం లేదు. ఇన్ని కోట్లు సంపాదించి ఏం చేసుకొంటాం..?  చివ‌రికి ఉత్తి చేతుల‌తోనే క‌దా, వెళ్లిపోవాలి.

* ఇంత చిన్న వ‌య‌సులోనే వేదాంత‌మా?
- నేనేం వేదాంతం మాట్లాడ‌డం లేదు. ఇది నిజ‌మే క‌దా..?  మ‌నిషికి కావ‌ల్సింది తిండి, ఇల్లు.. కొన్ని క‌నీస సౌక‌ర్యాలు. వాటిని మించి సంపాదించినా.. అందులో సుఖం ఉండ‌దు.

*  సినిమాలో చేసే పాత్ర‌ల‌కూ, నిజ జీవితంలోని స‌మంత‌కూ ఏమైనా పోలిక‌లుంటాయా?
-  సినిమా వేరు.. జీవితం వేరు. సినిమాలో ముద్దు పెట్టుకొన్నాం క‌దా, అని నిజ జీవితంలోనూ పెట్టుకోం క‌దా..?  నేను ఒద్దికైన అమ్మాయిని. పెద్ద పెద్ద కోరిక‌లేం లేవు. ఈ ల‌క్ష‌ణాలు నేను చేసిన సినిమాల్లో ఏ పాత్ర‌కైనా ఉన్నాయా??  కాస్తో కూస్తో నా మొద‌టి సినిమా ఏమాయ చేశావెలో జెస్సీ పాత్ర‌కే ఉన్నాయి.

* తొలి సినిమాతోనే విప‌రీత‌మైన పాపులారిటీ వ‌చ్చేసింది. దాన్ని ఎలా కాపాడుకోవాల‌న్న భ‌యం వేయ‌లేదా?
- నిజ‌మే. చాలా టెన్ష‌న్ ప‌డ్డాడు. వంద సినిమాల‌కు స‌రిప‌డా గుర్తింపు అది. అది కాపాడుకోవాలంటే త‌రువాత చేసే సినిమాలు మ‌రింత శ్ర‌ద్ధ‌తో చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నా. ఇప్ప‌టికీ అదే ఫాలో అవుతున్నా.

* మీ జీవిత ల‌క్ష్యం ఏమిటి?
- నా తొలి సినిమాతోనే జీవిత ల‌క్ష్యం నెర‌వేరిపోయింది. జ‌నం మ‌ర్చిపోలేని ఓ మంచి పాత్ర‌లో క‌నిపించాల‌ని. ఆ త‌ర‌వాత పెద్ద‌గా ల‌క్ష్యాలు పెట్టుకోలేదు. నేను చేసిన ప్ర‌తీ సినిమా బాగుండాలి.. అంతే. నావైపు నుంచి ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందీ రాకూడ‌దు.

* క‌థానాయిక‌ల మ‌ధ్య పోటీని ఎలా ఎదుర్కొన‌బోతున్నారు?
- పోటీ అని కాదు గానీ.. చేతికి అందిన సినిమాలు శ్ర‌ద్ధగా చేయాలి. ఇక్క‌డ ఎవ‌రైనా కొంత‌కాల‌మే. ఆ సంగ‌తి నాకు తెలుసు. ఒకొక్క‌సారి ఒకొక్క‌రి హ‌వా న‌డుస్తుంటుంది. పేరొచ్చినా, పోయినా... అట్టే స‌మ‌యం ప‌ట్ట‌దు. ఇప్పుడు ఒక ఫేజ్ చూస్తున్నా. రెండో ఫేజ్ చూడ‌డానికి కూడా నేను రెడీనే. ఈలోగానే మంచి సినిమాలు చేయాలి. అంతే.

* అభిమానుల్ని క‌లుస్తుంటారు క‌దా?  వాళ్లేం చెబుతుంటారు..?
- చాలామంది నా సినిమాల పేర్లు, అందులో నా పాత్ర‌ల పేర్లు ప్ర‌స్తావిస్తుంటారు. కొంత‌మంది... సొంత మ‌నిషిని చూస్తున్న‌ట్టు ఆరాధానా భావంతో చూస్తారు. ఇంకొంత‌మంది పెద్ద‌వాళ్లు నువ్వు మా కూతురిలా ఉన్నావ్ అంటారు.. ఆరోగ్యం జాగ్ర‌త్త అని చెప్పేవాళ్లూ ఉన్నారు. ఇదంతా ఏనాటి బంధ‌మో అనిపిస్తుంది.

* సేవా కార్య‌క్ర‌మాల్ని విస్రృతం చేసే ఆలోచ‌న ఉందా?
- త‌ప్ప‌కుండా. ఇప్పుడు నాకు తోచినంత‌, చేత‌నైన మార్గంలో చేసుకొంటూ వెళ్తున్నా. నాలానే ఆలోచించేవాళ్లు చాలామంది ఉన్నారు. మేమంతా క‌లిస్తే.. మ‌రింత సేవ చేయొచ్చు క‌దా అనిపిస్తుంది. దానికి సంబంధించిన ఓ ప్ర‌ణాళిక సిద్ధం చేయాలి.

* బాలీవుడ్ వెళ్లే ఆలోచ‌న లేదా?
- ఇక్క‌డ హ్యాపీగా ఉన్నాను. తెలుగు, త‌మిళ సినిమాలు చేసుకొంటే చాలు. చెప్పాను క‌దా. నాకు పెద్ద‌గా ఆశ‌లు, ఆశ‌యాలు లేవ‌ని. జీవితం ఇలా కూల్‌గా సాగిపోతే చాలు.

* పెళ్లెప్పుడు?
- ఈ విష‌యంలో మాత్రం ఓ క్లారిటీ ఉంది. అయితే దొంగ పెళ్లి మాత్రం చేసుకోను. అంద‌రికీ చెప్పి ద‌ర్జాగా చేసుకొంటా.

* ఆల్ ద బెస్ట్‌..
- థ్యాంక్యూ.


- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka