Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrudayam

ప్పుడప్పుడు ఆగుతూ, అప్పుడప్పుడు ఆడుతూ నా హృదయం పేరు మీద ఈ కాలమ్ సినిమాల క్లైమాక్సుల్లో ఈసీజీ షాట్లు తీసి డైరెక్టర్లు టెన్షన్ పెట్టినట్టు నడుస్తోంది. నాకే నచ్చట్లేదు. కానీ కుదరట్లేదు. గో తెలుగు యాజమాన్యం, రెగ్యులర్ పాఠకులు మనస్ఫూర్తిగా మన్నించాలి. తప్పు నా వల్ల జరిగితే క్షమించమని అడగడంలో గొప్ప తృప్తి ఉంటుంది. అది అనుభవిస్తే గాని తెలీదు. మన తప్పుల్ని ఎదుటి వాడి మీద బ్లేమ్ చేయడం, మన ఈగోని కాపాడుకోవడం ఈ రెండూ ప్రపంచంలో చాలా చాలా తేలికైన పనులు. కానీ, కష్టమైన పనులేంటంటే, మన ఈగోని సరెండర్ చేయడం. అయినా, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా ఉండటం. అప్పు చేసి, సమయానికి తీర్చలేకపోతే మన తప్పే. కానీ ఒప్పుకోం. తప్పనిసరైతే తప్పించుకు తిరగడాలు,  ఫోన్ నెంబర్లు మార్చడాలు చేస్తాం. అంతే తప్ప తీసుకున్న వాణ్ని పిలిచి నాలుగు నిమిషాలు మాట్లాడం. వాడేమన్నా అంటే మన ఈగో ఒప్పుకోదు. చిన్నతనంగా భావిస్తాం.

పుట్టిన దగ్గర్నుంచి బ్యాంక్ ఆఫీసర్ కొడుకుగా సుఖంగా పెరిగిన నేను సినిమా ఇండస్ట్రీకి రావడమే జీవితంలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయం. దానికి జీవితాంతం కట్టుబడి ఉండడం మరింత క్లిష్టమైన నిర్ణయం. ఈ మధ్యలో సినిమాలు తీయడం కోసం ఫైనాన్స్ లు తీస్కోవడం, అవి తీర్చడం, మళ్లీ ఇంకో ప్రాజెక్ట్ మీద ఫైనాన్స్ రైజ్ చేయడం ఈ రోలర్ కోస్టర్ రైడ్ కి మెంటల్ గా ఎప్పుడో ప్రిపేరైపోయాను. నేను హిట్ లో ఉంటే పొగరుగా, ఫ్లాప్ లో ఉంటే అణుకువగా ఉంటే నాకొక వ్యక్తిత్వం లేకుండా పోతుందని, ఎంత పెద్ద డైరెక్టరైనా అన్నీ వరసగా హిట్లే ఇవ్వలేదని, ఇవ్వలేడని ప్రేక్షకుడిగా అనేకానేక సినిమాలు చూసిన అనుభవం మీద నేను తెలుసుకున్నదేంటంటే, ఫ్లాప్ లో కూడా పొగరుగా ఉండడం చాలా కష్టం - అది అసహజంగా అనిపించేస్తుంటుంది కాబట్టి,

"ఒరులేయవి యొనరించిన
నరవర అప్రియమ్ము తన మనమునకగు, తా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమ ధర్మ పధముల కెల్లన్"

అన్నట్టు, ఎదుటివారు ఎల్లవేళలా నాతో స్నేహం నెరపడానికి, నాతో సుహృద్భావంగా ఉండడానికి నేను అణకువ అనే మార్గాన్ని అణువణువునా నింపుకుని ఎంచుకున్నాను.

అదే ఈ రోజు ఫ్లాప్ లో అయినా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకొక్క అవకాశం ఇప్పిస్తోంది. ఆ కోవలోనే ఇప్పుడు 'పార్క్' అనే ఒక మంచి ప్రేమకథ తో ఈ వేసవిలో చల్లగా మీ ముందుకి వస్తున్నాను. జయ నామ సంవత్సరం అందరిలాగే నాకూ జయం వర్ధిల్లేలా చేయాలని విఘ్నేశ్వరున్ని, సర్వేశ్వరున్ని, అమ్మ వారిని, అందరినీ సభక్తికంగా వేడుకుంటున్నాను.

అణకువ ఉన్నవాడికి సహనం సహజంగా ఉంటుంది. అది పనిని అనుకున్నట్టు పూర్తి చేయిస్తుంది. అసహనం ఉన్నవాళ్ళకీ పనౌతుంది. కానీ కంగారులో, కోపంలో ఏదో అసంపూర్ణంగా అవుతుంది. నాలో ఉన్న కొన్ని మంచి లక్షణాలలో అణకువ, సహనం ప్రధానమైనవి కాబట్టి, ఈ కాలమ్ లో ఏది రాసినా ఎవరో ఒకరికి పనికొచ్చే అంశాలే రాయాలని నియమం పెట్టుకున్నాం కాబట్టి వీటిని ప్రస్తావించాను తప్ప, స్వోత్కర్ష కోసం కాదు.

సినిమాల్లో డబ్బులు పెడితే తిరిగి రావు అన్న దుష్ప్రచారం బాగా పాకిపోతోంది ఈ మధ్య. అలా అని తీసేవాళ్లు ఏమన్నా ఆగుతున్నారా? లేదు. ఒక సినిమా హిట్ అయితే దబ్బులొచ్చినప్పుడు, ఇంకో సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు పోయినపుడు - డబ్బులు పోవడాన్ని మాత్రమే జెనరలైజ్ చేసి ఎలా చెప్తారు? ఫ్లాప్ సినిమాకి దర్శకుడో, రచయితో, హీరోనో, నిర్మాతో తీసుకున్న నిర్ణయాలే కారణాలు గాని, అది పరిశ్రమ వ్యాపార ముఖచిత్రం కాదు గదా!

పెర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ తక్కువ కాబట్టి లాస్ ని జెనరలైజ్ చేసి ప్రచారం చేస్తున్నారనుకొందాం. అలా చూస్తే, పెర్సంటేజ్ ఆఫ్ లాస్ ఎక్కువుండడానికి పెర్సన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ డెసిషన్ మేకింగ్ ఎక్కువున్నట్టే కదా! వాళ్లని స్పాట్ అవుట్ చేసి సక్సెస్ ఫుల్ పీపుల్ తో ఇంటరాక్ట్ చేయాలి. ఏ విషయాల్లో వాళ్ల నిర్ణయాలు తప్పయ్యాయో విశ్లేషించి చెప్పాలి. అందుకు నిర్మాతల మండలి నిర్మాతలని, 'మా', మూవీ ఆర్టిస్ట్స్ ని, దర్శకుల సంఘం దర్శకులని, రచయితల సంఘం రచయితల్ని కూర్చో పెట్టుకుని ఏ  ఏటికా ఏడు పరిశ్రమ పురోగమించడానికి కావలసిన మార్గదర్శకాలు, ఆడిన సినిమాలని బట్టి మారుతున్న ప్రేక్షకుడి పల్స్ ని కనిపెట్టి చెప్పే విశ్లేషణ, ఆడని సినిమాలలో జరిగిన తప్పులు, సద్విమర్శలు వర్క్ షాపులుగా రెండు, మూడు రోజులు నిర్వహించుకుంటే, తెలుగు సినిమా స్థాయి మళ్లీ పెరగదూ! ఈ వర్క్ షాప్స్ లో పాత్రికేయుల్ని ఇన్ వాల్వ్ చేయాలి. తెలుగు సినిమా సాంకేతికంగా ఎంత ఎదుగుతుందో, సృజనాత్మకంగా అంతే స్థాయిలో ఎదిగే చర్యలు ఇప్పటికైనా చేపట్టడం చాలా అవసరం.

ఇవాళ ప్రపంచ సినిమా ఇంట్లో ఉంది ప్రతి ప్రేక్షకుడికి. మూస కథనాల నుంచి బైటికి రాకపోతే మూసీ నదిలా మన కథలు కంపు కొట్టేసే ప్రమాదముంది. కొత్తవాళ్లు నటీ నటులుగా తామర తంపరలుగా వస్తున్నారు. కథకులు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. ఓ వీడియో షాపులో ఇంగ్లీషు, ఫారెన్ లాంగ్వేజ్ వీడియోలు ఎన్నుంటాయో, ఇండస్ట్రీలో కొత్త దర్శకులు అంతమందొస్తున్నారు. కానీ, కొత్తగా నిర్మాతలు ఈ సంఖ్యలో రావడం లేదు.

పై మూడు శాఖలతో సమానంగా నిర్మాతలూ విరివిగా వచ్చినపుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది - లేకపోతే, తీపి లేకుండా కేవలం చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు మాత్రమే ఉన్న ఉగాది పచ్చడిలా తయారవుతుంది తెలుగు సినిమా. జయనామ సంవత్సరానికి, తెలుగు పరిశ్రమలో మరికొందరు మంచి నిర్మాతల ఆగమనానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ...

 

మీ
వి.ఎన్. ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
palletoori ram charan