Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

"వరికి పెళ్ళి కాలేదు? వీళ్ళ నలుగురికీ ఎప్పుడో పెళ్ళిళ్ళయిపోయాయి. నాకే ఇంకా కాలేదు" అంటూ తలదించుకుని విచారంగా అన్నాడు ఏకాంబర్ ముదర బ్రహ్మచారిలా మిగిలిపోయానన్నట్టు!

"ఇంతకీ ఇన్స్యూరెన్స్ కంపెనీలో నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిట్రా బాబూ!" ఆచారి కల్పించుకుని అడిగాడు.

"డెవలప్ మెంట్ ఆఫీసర్!" కొంచెం హుందాగా అన్నాడు రాజేంద్ర.

"దేన్ని డెవలప్ చెయ్యడానికిరా" కుతూహలంగా అన్నాడు రామకృష్ణ.

"ఓర్నాయనో! మీకర్థమయి అడుగుతున్నారో? అర్ధం కాక ఇలా అడుగుతున్నారో నాకు అర్ధం కావటంలేదురా బాబూ! ఇన్స్యూరెన్స్ ని అభివృద్ధి చేయడమే నా ఉద్యోగం రా." అందరికీ అర్ధమయ్యేలా చెప్పాడు రాజేంద్ర.

"నువ్వు ఇన్స్యూరెన్స్ పాలసీలు చేయిస్తావా?" రాజేంద్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు అనిల్.

"నా ఉద్యోగం అది కాదు. 'ఇన్స్యూరెన్స్ కట్టించడానికి 'ఏజంట్ల'ని నియమిస్తాను. నా అండర్ లో నిరుద్యోగులైన యువకుల్ని పట్టుకుని వారిని 'ఏజెంట్లు' గా నియమిస్తాను. వారు ఇంటింటికి తిరిగి, మనిషి మనిషిని పట్టుకుని 'పాలసీ'లు రాయిస్తారు" పూస గుచ్చినట్లు చెప్పాడు రాజనాల రాజేంద్ర.

"ఐసీ, మరి ఇలా వచ్చావేరా! నిజంగా నువ్వు మమ్మల్ని వెదుక్కునే వచ్చావా?!" రాజనాల రాజేంద్ర కేసి చూస్తూ అన్నాడు రామకృష్ణ.

"అవున్రా బాబు! ఇందులో జాయిన్ అయి రెండు నెలలయింది. ఒక్కడంటే ఒక్కడు కూడా దొరకలేదు. ఎవర్ని కలిసినా ఏదో పని చేస్తున్నామని తప్పించుకుంటున్నారు. చిన్నప్పుడు చదువుకున్న వూరు కదా! పనీ పాటూ లేకుండా ఉన్నవాళ్ళు ఒక్కరు దొరకరా అని ఇలా మిమ్మల్ని వెదుక్కుంటూ వచ్చాను" చెప్పాడు రాజేంద్ర.

"నువ్వనుకున్నట్టూ మేమందరం ఖాళీగా లేమురా బాబు! ఇదిగో వీడొక్కడే ప్రస్తుతానికి పనీపాటూ లేకుండా తిరుగుతున్నది" అంటూ మిగతా నలుగురూ 'ఏకాంబరాన్ని' చూపిస్తూ చెప్పారు.

వాళ్ళు నలుగురూ ఒక్కసారే అలా అంటూ ఏకాంబరాన్ని చూపించేసరికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు తెగ సంబరపడిపోతూ ఏకాంబర్ కేసి ఆశగా ఆనందంగా చూసాడు రాజనాల రాజేంద్ర.

మిత్రులు నలుగురూ ఒక్కసారే తనకేసే చూస్తూ, తనని అమాయకుడ్ని చేసి 'బలి పశువు' గా రాజనాల గాడికి అప్పగించడం గమనించిన ఏకాంబర్ అదిరిపడ్డాడు.

అంతే!

"ఒరేయ్! ఉండండిరా! మా అమ్మ కూరగాయలు తెమ్మంది ఆ విషయమే మర్చిపోయాను" అంటూ ఇక ఒక్క క్షణం అక్కడ నిలబడకుండా పరుగందుకున్నాడు ఏకాంబర్.

"ఒరేయ్... ఏకాంబర్..." అంటూ మిగతా మిత్రులంతా గొంతు చించుకు అరుస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు ఏకాంబర్.

***

"అంబర్ సార్! ఏంది సార్! సరదాగా పార్క్ కి రమ్మని ఇలా బుర్ర తినేస్తున్నారేమిటి సార్!" సిమ్మెంటు కుర్చీకి జారగిలబడి ఏదో ట్రాన్స్ లోకి వెళ్లిపోయి తన గతమంతా పూస గుచ్చినట్టు చెప్తున్న ఏకాంబర్ ని పట్టి కుదుపుతూ అంది నూకరత్నం.

ఆమె అలా రెండు చేతుల్తో పట్టుకుని కుదిపేసరికి ఉలిక్కిపడి ఇహానికి వచ్చాడు ఏకాంబర్.

"ఏదో చెప్తానని... ఇంకేదో చెప్తున్నారేమిటి సార్!" ఏకాంబర్ కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అంది నూకరత్నం.

"ఏం చెప్పాను. నేనీ స్థితికి రావడానికి ఎన్ని అవస్థలు అగచాట్లు పడ్డానో చెప్తున్నాను" అన్నాడు ఏకాంబర్.

"మీ గోడు వింటూంటే ఇక్కడ నాకు కడుపులో గోలగోలగా ఉంది. ఆకలి దంచేస్తోంది సార్! ఇక మీ సినిమా కష్టాల మీద మనసెలా పెట్టగలను" పొట్ట మీద చేతులు వేసుకుని దీనంగా ఏకాంబర్ కేసి చూస్తూ అంది నూకరత్నం.

ఆమె అలా ఆకలి అని చెప్పేసరికి అదిరిపడి ఛటుక్కున వాచీ కేసి చూసాడు ఏకాంబర్.

మిట్ట మధ్యాహ్నం పన్నెండు దాటి ఒంటిగంట కావస్తోంది. 'పాపం! ఉదయాన్నే ఎప్పుడో టిఫిన్ చేసి ఉంటుంది' అనుకుంటూ గబుక్కున లేచి నిలబడ్డాడు ఏకాంబర్.

"పదండి! అలా వెళ్ళి నాస్తా చేసి వద్దాం" నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

"నాకు నాస్తా గీస్తా జాన్తానై. ఖానా... కావాలి ఉదయం ఎప్పుడో రెండిడ్లీ తిన్నాను. తృప్తిగా, పుష్టిగా భోజనం లాగించెయ్యాలి" అంది లేస్తూ.

"అలాగే! మీ అభిప్రాయమే మా అభిప్రాయం. పదండి మేడం గారు!" రెండు చేతుల్తో దారి చూపిస్తూ అన్నాడు ఏకాంబర్.

పార్క్ లో నుండి ఇద్దరూ బయటకు వచ్చారు.

"ఈ దగ్గర్లో ఎక్కడా హొటల్స్ లేనట్టున్నాయే" చుట్టూరా చూస్తూ అంది నూకరత్నం.

"ఈ ప్రక్కనే ఉందిగా పార్క్ హొటల్. ఆ ప్రక్కనే పామ్ బీచ్ హొటల్. మనం తినే తిండికి ఈ రెండూ చాలవా" కొంటెగా నూకరత్నం కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"అమ్మో! ఇవి పెద్ద హొటళ్ళు కదా! స్టార్ హొటల్లో భోజనం అంటే... నా నెల రోజుల జీతం" ఆశ్చర్యంగా అంది నూకరత్నం.

"ఈ రోజే కదా మనం కలిసింది. ఈ మాత్రం ఖర్చు పెద్ద లెక్కలోంది కాదు లెండి" అంటూ పార్క్ బీచ్ హొటల్ కేసి దారి తీస్తూ అన్నాడు ఏకాంబర్.

"వద్దండి అంబర్ గారూ! వద్దు ఏదైనా చిన్న హొటల్ కి వెళ్దాం" ఏకాంబరాన్ని బ్రతిమాలాడుతూ అంది నూకరత్నం.

"ఫర్వాలేదు. మీతో మొదటిసారిగా ఇలా కలిసి తినే అవకాశం అదృష్టం దొరికింది. దాన్ని ఎంత అందంగా... ఆకర్షణీయంగా మలచుకోవాలో నాకు తెలీదు. కనీసం, మీకు కలకాలం గుర్తుండిపోయేలా ఈ ఆతిధ్యమైనా స్వీకరించండి రత్నం గారూ!" నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

"సరే పదండి సార్! మీ ఆనందం ఎందుకు కాదనాలి" సిగ్గుతో ముడుచుకుపోతూ అంది నూకరత్నం.

ఇద్దరూ పామ్ బీచ్ హొటల్ మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ సెక్యూరిటీగా నిలబడ్డ గార్డు నిటారుగా నిలబడి వాళ్ళిద్దరికీ స్వాగతం పలుకుతూ సెల్యూట్ చేసాడు.

మనిషంత మనిషి పాలమీగడ లాంటి తెల్లటి యూనిఫారంలో తల మీద రాజకిరీటం లాంటి కుచ్చు టోపీ పెట్టుకుని ఎంతో వినయంగా నిలబడి తమ ఇద్దరికీ వంగి వంగి నమస్కారాలు చేస్తుంటే ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది నూకరత్నం.

ఏకాంబరం ఈ మర్యాదలన్నీ ఎప్పుడో అంది పుచ్చుకున్నాడు. ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా జాయిన్ అయిన కొత్తలోనే అంతా వింతగా విడ్డూరంలా చూసేవాడు. ఆ తర్వాత తర్వాత విశాఖనగరంలో ఉన్న స్టార్ హొటళ్ళన్నింటిలోనూ కంపెనీ ఖర్చులతోనే ఎన్నో రకాల ఆతిధ్యాలు స్వీకరించాడు.

పామ్ బీచ్ హొటల్ లోకి నూకరత్నాన్ని దగ్గరుండి తీసుకువెళ్తూ ఆమె మొహంలో కనిపిస్తున్న ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ఆమె కళ్ళల్లో విరిసిన అబ్బురాన్ని తిలకిస్తూ ఏదో తెలియని ఆనందానికి లోనయ్యాడు ఏకాంబర్.

మొట్టమొదటిసారిగా తన సంపాదనతో తనకి ఇష్టమైన ఒక అమ్మాయిని ఇంత తన్మయానికి లోను చేయగలగడం మరింత సంతోషాన్ని కలిగించింది ఏకాంబరానికి.

తాను ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా మూడేళ్ళు పూర్తి చేసుకుని బ్రాంచి మేనేజర్ క్లబ్ లో చేరినప్పుడు ఇన్స్యూరెన్స్ కంపెనీవారు విశాఖ నగరంలోనే పేరెన్నికగన్న తాజ్ రెసిడెన్సీ స్టార్ హొటల్ లో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అమ్మ, నాన్న, చెల్లెల్ని తనతోపాటు తీసుకువెళ్ళాడు. ఆ రోజు... వాళ్ళ కళ్ళల్లో కనిపించిన సంబరం చూసి ఎంత ఆనందపడ్డాడు. ఆ ఆనందమే మళ్ళీ ఈ రోజు కలుగుతోంది.

ఏ వ్యక్తి అయినా ఎంత ఉన్నత శిఖరాల్ని అధిరోహించినా ఆ సంతోషాన్ని తన వారితో పంచుకుంటేనే ఆ ఆనందం తృప్తి పుష్టిగా లభించేది. ఎక్కడో ఖండాంతరాల అవతల... ఏడు సముద్రాల ఆవల మనం 'బంగారం' తింటే ఎవరు చూస్తారు?! ఆ ఆనందం ఎవరికి పంచగలం?

తమ ఎదుగుదల... సుఖ సంతోషాలు తమ వారి మధ్య ఉంటూ పంచుకోగలిగితేనే ఉంది అందులో మజా. అదిప్పుడు తనకి కళ్ళారా కనిపిస్తోంది. మనసారా ఆస్వాదిస్తున్నాడు. మనసులోనే ఎన్నో ఆలోచనలతో, ఆనందాశ్చర్యాలతో రెస్టారెంట్ లోకి అడుగుపెట్టాడు ఏకాంబర్.

ఏకాంబర్ వెనుకే మంత్రముగ్ధలా గాలిలో తేలిపోతూ నడిచి వెళ్ళింది నూకరత్నం.

రెస్టారెంట్ ఇంద్రసభలా ఉంది. ఖరీదయిన కుర్చీలు, టేబుళ్ళు, గాల్లో తేలియాడుతున్న లైట్లు, ఖరీదయిన సూట్లు ధరించిన వెయిటర్లు, అప్సరసలకు మల్లే రెస్టారెంటు నలుమూలలా నిలబడి అందాలు గుమ్మరిస్తున్న అమ్మాయిలు.

ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నారిద్దరూ. ఆ రెస్టారెంట్ లో అక్కడక్కడా యువజంటలు, పెద్దవాళ్ళు నడివయసువాళ్ళు, ముసలివాళ్ళు... అందరూ ఖరీదయిన మనుషులే!

రెస్టారెంట్ చుట్టూ అద్దాల గోడలు. ఆ అద్దాల్లో నుండి చూస్తుంటే దూరంగా కెరటాలతో ఉరకలు వేస్తున్న సముద్రం. రెస్టారెంట్ ప్రక్కనే స్విమ్మింగ్ పూల్.

ఆ స్విమ్మింగ్ పూల్ లో విదేశీయులు ఆడా మగా అర్ధనగ్నంగా ఈత కొడుతూ ఆనందిస్తున్నారు.

ఆ స్విమ్మింగ్ పూల్ గట్టు మీద పెద్ద పెద్ద గొడుగులు ఆ గొడుగుల క్రింద విదేశీయులు, స్వదేశీయులు ఒకో గొడుగు క్రింద ముగ్గురూ నలుగురూ ఆడా మగా అని బేధం లేకుండా కూర్చుని ఉన్నారు.

అందరిముందు ఖరీదైన మద్యం అందమైన గాజు గ్లాసుల్లో రకరకాల రంగుల్లో తేలిపోతూ విలాసంగా నవ్వుతోంది. కొందరు గ్లాసులు చేతుల్తో పట్టుకుని సుతారంగా పెదవులకందిస్తూ ఎదురుగా ఉన్న మగువల అందాల్ని ఆనందిస్తూ మత్తుగా మందుతో మజా చేస్తున్నారు.

నూకరత్నం కుర్చీలో కూర్చుందే గాని తల వాలకం, తన బట్టలకేసి ఓసారి చూసుకుని మనసులోనే నొచ్చుకుంది. తన బట్టలకున్న మురికి వలన తను కూర్చున్న కుర్చీ మాసిపోతుందేమోనని బాధపడింది. తనని ఎవరైనా గమనిస్తున్నారేమోనని క్షణం తటపటాయిస్తూ కూర్చుంది.

రెస్టారెంట్ చుట్టూరా చూస్తూ తల దించుకుని మౌనంగా కూర్చుండిపోయింది. తనకి అత్యంత చేరువలోనే గోడలా అడ్డుగా ఉన్న అద్దానికి ఆవల విదేశీయులు అర్ధనగ్నంగా కనిపిస్తూంటే అటు చూడలేక సిగ్గుపడిపోయి తల దించుకుంది. కానీ, ఆమె తన 'మనసు'ని అధీనంలో ఉంచుకోలేకపోతోంది.

"ప్లీజ్! వాడ్డూ యూ వాంట్ సార్!" ఓ అందమైన అమ్మాయి చేతిలో చిన్న పేపర్ పేడ్ పట్టుకుని వచ్చి వారి దగ్గర నిలబడి అడిగింది.

"టూ ఇండియన్ తాళీ" స్టైల్ గా ఆర్డరిచ్చాడు ఏకాంబర్.

"నార్త్ ఇండియనా సార్!" మళ్ళీ ఆ అమ్మాయి అడిగింది.

"నో! నో! సౌత్ ఇండియన్ ఫుడ్" మళ్ళీ ఏకాంబరే అన్నాడు.

"ఓకే సార్! ఫైవ్ మినిట్స్ లో సర్వ్ చేస్తాం సార్" అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.

ఆమె అలా వెళ్ళిన వెంటనే సూటూ బూటు వేసుకున్న సర్వర్ వచ్చి రెండు గ్లాసుల్లో జ్యూస్ తెచ్చి వారి ముందుంచాడు.

"ఇదెందుకు అంబర్ గారు?" నెమ్మదిగా గుసగుసగా అంది నూకరత్నం.

"తాగడానికి" అని ఆమె చెవిలో ఊది వెంటనే తన గ్లాసు తీసుకుని స్టైల్ గా నెమ్మది నెమ్మదిగా సిప్ చేస్తున్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ జ్యూస్ చేత్తో తీసుకోగానే తను కూడా జ్యూస్ గ్లాసు చేత్తో పట్టుకుని గడగడా త్రాగేసి గ్లాసు క్రింద పెట్టింది నూకరత్నం.

ఏకాంబర్ మాత్రం చుట్టూ ఓరకంట గమనిస్తూ నెమ్మదినెమ్మదిగా జ్యూస్ చప్పరిస్తున్నట్టు గ్లాసు పట్టుకుని కూర్చున్నాడు.

ఇంతలో సర్వర్ మీల్స్ ప్లేట్లు తెచ్చి వారి ముందుంచి వెళ్ళిపోయాడు.

"వేగంగా త్రాగండి అంబర్! అందరూ మిమ్మల్నే చూస్తున్నారు" అమాయకంగా అంది నూకరత్నం.

నూకరత్నం మాటలకి ఏకాంబర్ గతుక్కుమన్నాడు. ఆమె గడగడా జ్యూస్ త్రాగడం చూసి అందరూ ఎగతాళిగా చూస్తున్నారేమోనని అనుకున్నాడు. కానీ, తననే అందరూ గేలి చేస్తున్నట్టు చూస్తున్నారని రత్నం అంటోంది అనుకున్నాడు ఏకాంబర్.

సర్వర్ మీల్స్ ప్లేట్స్ తెచ్చి ముందు పెట్టగానే ఆబగా పళ్ళెంలో వున్న పదార్ధాల మీదకు దాడి చేసింది నూకరత్నం. రెస్టారెంట్ లో అంతా ఒక్కసారి పరిశీలనగా చూసి తమని ఎవరూ గమనించలేదని గ్రహించి ఏకాంబర్ కూడా తేలిగ్గా ఊపిరి పీల్చుకుని భోజనానికి ఉపక్రమించాడు.

ఇద్దరూ హాయిగా కబుర్లాడుకుంటూ భోజనం చేసారు. అందరూ తమనే గమనిస్తారేమోనని కంగారుపడ్డ ఏకాంబర్ రెస్టారెంట్ లో ఉన్న అందరూ ఎవరి మానాన వాళ్ళు కబుర్లాడుకుంటూ కూర్చునేసరికి బిడియం వదిలి నూకరత్నాన్ని మాటల్లోకి దింపాడు.

నూకరత్నం కూడా అలా ఏకాంబరంతో కలిసి కబుర్లాడుకుంటూ భోజనం చేయడం ఆమె మనసుకి ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది.

భోజనం కాగానే పెద్ద పెద్ద కప్పులతో ఐస్ క్రీమ్ లు తెచ్చి ఇచ్చాడు సర్వర్. దాంతో పాటు కిల్లీలు కూడా అందంగా ప్యాక్ చేసి తెచ్చి టేబుల్ దగ్గర పెట్టాడు.

ఐస్ క్రీమ్ తిని కిళ్ళీ వేసుకుని ఇద్దరూ ఓ పావుగంట సముద్రం కేసి చూస్తూ గడిపారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర రాను రాను విదేశీయులు పెరిగిపోతున్నారు.

స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన కొందరు విదేశీయులు అక్కడనుండి నేరుగా నడుచుకుంటూ హొటల్ లో ఉన్న గార్డెన్ దాటి కొద్ది దూరంలో ఉన్న బీచ్ కు దగ్గరగా వెళ్ళి కూర్చుంటున్నారు.

బీచ్ దగ్గర స్విమ్మింగ్ చేసినవాళ్ళు కూర్చోడానికి, పడుకోడానికి వీలుగా పెద్ద పెద్ద బల్లలు, కుర్చీలు అమర్చి ఉన్నాయి. వాటిపైన రంగురంగుల్లో పెద్ద పెద్ద గొడుగులు ఉన్నాయి. ఆ బల్లల మీద ఎవరైనా కూర్చున్నా, పడుకున్నా వారి మొహాలకు ఎండ తగలకుండా ఏర్పాటు చేసినట్టున్నాయి ఆ గొడుగులు.

ఆ దృశ్యం చూస్తూంటే ఇద్దరి మనసుల్లోనూ ఏవేవో కోర్కెలు రగులుతూనే ఉన్నాయి. కానీ, ఏమీ తెలియనట్లు... తమకేమీ కానట్టు ఇద్దరూ గుంభనంగా ఒకర్నొకరు క్రీగంట చూసుకుంటూ కూర్చుని ఉన్నారు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college drop out gadi prema katha