Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekamber

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha
''ఫూల్‌! ఇడియట్‌... బుద్ధిలేదూ? హడావిడిగా నేను వెళుతుంటే అడ్డం వచ్చేస్తావా...?'' కోపంగా అరిచాడతను.
 
''హలో! ఒక్క గుద్దు గుద్దితే ముక్కు చట్నీ అయిపోతుంది. వచ్చి గుద్దింది నువ్వు. పైగా నన్నంటావా? మేనర్స్‌ తెలుసా? పోరా'' అంటూ విసుక్కుని ముందుకు కదిలాడు త్రివిక్రమ్‌.
 
''నువ్వు జైలునుంచి తప్పించుకు వస్తున్నట్టున్నావ్‌. నేనిప్పుడే పోలీసులకి ఫోన్‌ చేస్తాను'' వెనకనుంచి బెదిరించాడతను.
 
వెళుతున్నవాడల్లా చివ్వున తిరిగి....
 
వెనక్కి వచ్చాడు త్రివిక్రమ్‌.
 
''నీకు ధైర్యం వుటే ఫోన్‌ చెయ్యి. అయిదు మర్డర్లు చేసి జైలుకెళ్ళి తప్పించుకొస్తున్నవాడ్ని. నువ్వు ఆరో మర్డరయిపోతావ్‌. చెయ్యి ఫోన్‌ చెయ్యి. సెల్‌ వుందా? తియ్యి'' అంటూ దబాయించాడు.
 
ఠారెత్తిపోయాడతను.
 
''సారీ! నేను ఫోన్‌ చేయను. నీ దారినీది. నాదారి నాది. ఒకె?'' అన్నాడు గుటకలు మింగుతూ.
 
''ఇప్పుడు నచ్చావ్‌ బ్రదర్‌. బుద్ధిమంతుడివి వెళ్ళిరా.''
 
''అలాగే!'' అంటూ తన సూట్‌కేస్‌ అందుకుని ఎవరో తరుముకొస్తున్నట్టు వెగంగా తన దారిన వెళ్ళిపోయాడతను.
 
తనలో తను నవ్వుకొంటూ....
 
వెనుతిరిగాడు త్రివిక్రమ్‌.
 
నాటుదారి దాటి, ఇంకా తోపుచివరకు అడుగులు వేసాడు. పదినిముషాల నడకతో ఇంచుమించుగా చెట్లతోపు చివరకు వచ్చేసాడు. అంతలో దగ్గరలో అలికిడి, మనుషుల కలకలం విన్పించింది. అదేమిటో తెలుసుకునే ఉద్దేశంతో ఆ ప్రదేశానికి దగ్గరగా వెళ్ళాడు.
 
అక్కడ ఏదో సినిమా షూటింగ్‌ జరుగుతోంది.
 
ఇంకాస్త సమీపానికి వెళ్ళి క్లోజ్‌గా గమనించాడు.
 
ఒకటే హడావిడిగా ఉందక్కడ.
 
సినిమా యూనిట్‌ హీరోయిన్‌ మీద షాట్స్‌ తీస్తోంది. అది ఏ సినిమా షూటింగో తెలీదు. కాని సీన్‌ మాత్రం జైలునుంచి తప్పించుకుని పారిపోయి వస్తున్న హీరో అక్కడ సైకిల్‌మీద వస్తున్న హీరోయిన్‌ని గుద్దుకోవటం ఇద్దరి మధ్యన జగడం సీను.
 
ప్రస్తుతం హీరోయిన్‌మీద షాట్స్‌ తీస్తున్నాడు డైరెక్టర్‌. హీరో ఇంతవరకూ రాలేదట. కనీసం జైలు డ్రస్‌లో డూప్‌నయినా త్వరగా రెడీ చేసి పంపమని, డైరెక్టర్‌ అరుస్తున్నాడు. అంతా బిజిబిజి గజిబిజి. పనీ పాటాలేని కొంతమంది చుట్టూచేరి షూటింగ్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.
 
త్రివిక్రమ్‌ మనసులో అప్పటికప్పుడు రూపుదిద్దుకుంది చక్కటి ప్లాన్‌. షూటింగ్‌ చూస్తున్న వాళ్ళలో తనంత ఒడ్డూపొడుగు వున్న కుర్రాడ్ని సెలక్ట్‌ చేసుకుని 'ఇస్‌ ఇస్‌....' అంటూ శబ్దంచేసి పిలిచాడు.
 
జైలు డ్రస్‌లో వున్న త్రివిక్రమ్‌ని చూడగానే వాడి ముఖంలో సంతోషం పొంగుకొచ్చింది. దేవుడు ప్రత్యక్షమైనంతగా సంబరపడిపోతూ గబగబా వచ్చేసాడు దగ్గరకి.
 
''సార్‌! ఈ సినిమాలో హీరో మీరేకదూ!'' అనడిగాడు.
 
''అవును. నీకేమన్నా డౌటా?''
 
''లేదుసార్‌.... ఇంతకుముందు ఏ సినిమా చేసారు సార్‌?''
 
''మళయాళంలో అరడజను చేసాను. తెలుగులో ఇదే ఫస్ట్‌ పిక్చర్‌.''
 
''మీకోసం వాళ్ళంతా వెయిటింగ్‌ సార్‌.''
 
''అదేనయ్యా బాధ. నా కాలు బెణికి నడవలేకపోతున్నాను. వాళ్ళు ఎలాగూ డూప్‌ని పెట్టి కవర్‌ చెయ్యాలనుకుంటున్నారు. నాకో సాయం చేస్తావా?''
 
''చెప్పండిసార్‌. ఏం కావాలి?''
 
''ఏంలేదు, నువ్వు కూడా హీరోలా వున్నావ్‌.''
 
''థ్యాంక్యూ సార్‌. ప్రయత్నించమంటారా?''
 
''ఇప్పట్నుంచే ప్రయత్నించు. నా జైలు డ్రస్సు నీకిస్తాను. వెళ్ళి డూప్‌గా నటించు ఫస్ట్‌షాట్‌ సైకిల్‌మీద వస్తున్న హీరోయిన్‌ని గుద్దుకోడం. లక్కీఫెలోవి. నేనిక్కడ వున్న సంగతి చెప్పకు. వెళ్ళి నటిస్తావా?''
 
''మీరు నా గురువులాంటివారు సార్‌. నటనలో జీవిస్తాను సార్‌. నాకీ ఛాన్సివ్విండి.''
 
''అయితే ఓ.కె. డ్రస్‌ మార్చుకుందాం. ఓ.కె?''
 
తను జైలు డ్రస్సువిప్పి ఇచ్చేసాడు త్రివిక్రమ్‌.
 
తన ఫాంటు షర్టు అక్కడ పడేసి జైలు డ్రస్సు వేసుకున్నాడా కుర్రాడు. వాడి డ్రస్సు తను వేసుకున్నాడు త్రివిక్రమ్‌.
 
''బెస్టాఫ్‌లక్‌ మైఫ్రెండ్‌. వెళ్ళి అదృష్టాన్ని పరీక్షించుకో....'' అన్నాడు.
 
అతడు షూటింగ్‌ స్పాట్‌కు అటు వెళ్ళగానే..
 
ఇటు తోపు చివరకు పరుగుతీసాడు త్రివిక్రమ్‌.
 
జేబులు వెదికాడు.
 
సిగరెట్‌ పాకెట్‌. అగ్గిపెట్టెతోబాబు ఏభైరూపాయలు దొరికాయి. అవి రైలు టికెట్‌కి చాలవుగాని, ఆకలిబాధ తీరుస్తాయి ఇక ఆలోచించలేదు.
 
సిగరెట్‌ ముట్టించుకొని దమ్ము కొడుతూ వేగంగా తోపుదాటి, అవతల మెయిన్‌రోడ్‌ను చేరుకుని సికింద్రాబాద్‌ బస్‌ టెర్నినల్‌కు బస్‌ ఎక్కేసాడు.
 
కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరిగిపోవచ్చు. కాని అవి ఎందుకు చికాకు పరుస్తాయో మాత్రం అర్థం కాదు.
 
త్రివిక్రమ్‌ సికింద్రాబాద్‌లో బస్‌ దిగాడు.
 
వైజాగ్‌ వెళ్ళే రైలుకి ఇంకా గంటన్నర టైముంది. ఈలోపల ప్రధాన సమస్య తను పోలీసుల కంటపడకుండా వుండటం. ఈ పాటికి జైలర్‌ ఆంజనేయులు తను తప్పించుకున్న విషయం సిటీ పోలీసుల్ని అలర్ట్‌ చేస్తే? తను జైలునుంచి పరారయిన వార్త వినగానే ఆయన ముఖం, ఆ బుర్ర మీసాలు వూహించుకొంటుంటే నవ్వు ముంచుకొస్తోంది త్రివిక్రమ్‌కి. 
 
ముందుగా ఆకలి.... ఆకలి సమస్య తీరాలి.
 
ఆలస్యం చేయకుండా.......
 
సమీపంలోని హోటల్లోకి వెళ్ళి కూర్చున్నాడు.
 
ముప్పై రూపాయలిచ్చి ఫుల్‌గా భోంచేసాడు.
 
భోంచేసి బయటికొస్తున్నంతలో టేబుళ్ళ మధ్యగా హడావిడిగా వస్తూ ఎవడో తనని బలంగా ఢీకొట్టాడు. పైగా కీచుగా అరుస్తూ పడిపోయాడు కూడా. వెంటనే పట్టుకుని ఆపాడు లేకపోతే వెల్లకిలా పడిపోయేవాడు. తీరా పట్టుకున్న తర్వాత అతడ్ని చూసి ఆశ్చర్యపోయాడు.
 
అతడ్ని చూసి త్రివిక్రమ్‌ షాకయితే....
 
త్రివిక్రమ్‌ని చూసి అతడు షాక్‌.
 
షాకేకాదు. చచ్చేంత భయం.
 
''సారీ.... సారీ యంగ్‌మాన్‌. నాదే పొరబాటు. సారీ'' అన్నాడు కంగారుగా.
 
''హలో! ఏమిటి కంగారుపడుతున్నారు?'' ఏమీ తెలీనట్టే అడిగాడు త్రివిక్రమ్‌.
 
''ఏంలేదు... ఇందాక జైలు డ్రస్‌లో చూసాను. ఇప్పుడు పాంటు షర్టులో చూస్తున్నాను....''
 
''తర్వాత సూటు బూటులో చూస్తానంటావ్‌. భలే వాడివి బ్రదర్‌ నువ్వు జైలు డ్రస్‌లో చూసినవాడు నా బ్రదర్‌. వాడికి జైలు డ్రస్‌ అంటే యిష్టం. ఆ డ్రస్‌లోనే తిరుగుతూ వుంటాడు. వాడు వేరు. నేను వేరు. థాంక్యూ'' అంటూ ఎక్కువసేపు ఆగకుండా బయటికొచ్చేసాడు త్రివిక్రమ్‌.
 
'డ్రస్‌ మారిందిగాని అచ్చుగుద్దినట్టు ఒక్కలాగే వున్నారు. వాడు వేరు అంటాడేమిటి? అయినా ఇంతలోనే జైలు డ్రస్‌నుంచి పాంటు షర్టులోకి ఎలా మారిపోయాడు? అంతా విచిత్రంగా వుంది' అనుకుంటూ వెళ్ళి భోజనానిక్కూర్చున్నాడా యువకుడు.
 
ఈ లోపల....
 
తనని రెండుసార్లు చిరాకుపరచిన కంగారు మనిషి గురించి మనసులోనే విసుక్కొంటూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి ఎంటరయ్యాడు త్రివిక్రమ్‌. ప్లాట్‌ఫారం మీద నిలబడి పోలీసులు ఎవరన్నా కన్పిస్తారేమోనన్న డౌటుతో అటుయిటు చూసాడు. చిన్నగావెళ్ళి సమీపంలోని టెలిఫోన్‌ బూత్‌ పక్కనున్న చిన్న తిన్నెమీద ముఖం అటు తిప్పుకుని కూర్చున్నాడు.
 
అప్పటికింకా రైలు ప్లాట్‌ఫాంకి రావటానికి...
 
ముప్పావుగంట టైముంది.
 
టికెట్టు కొనడానికి తన దగ్గర డబ్బుల్లేవు. ముందు రైలు ఎక్కేస్తే తర్వాత ఎలాగో మేనేజ్‌ చేసుకోవచ్చు. వైజాగ్‌ వెళ్ళిపోతే ఖర్చులకి డబ్బు సంపాదించటం పెద్ద కష్టం ఏమీ కాదు.
 
ఆ ధీమాతోనే రైలుకోసం వెయిట్‌ చేస్తూ....
 
అక్కడే కూర్చున్నాడు త్రివిక్రమ్‌.
 
***
 
కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు ఎందుకలా జరుగాతాయో ఎవరూ వూహించలేరు. కొన్ని మంచి సంఘటనలు, కొన్ని చెడ్డ సంఘటనలు. మంచి అదృష్టం అంటారు. చెడు జరిగితే బేడ్‌టైం అంటారు. మరికొందరు వున్నారు. వీరు తాత్వికులు. ఏం జరిగినా అంతా మనమంచికే అంటారు.
 
ఇక్కడ త్రివిక్రమ్‌ విషయంలో కూడా అలాంటిదే ఒక సంఘటన చోటుచేసుకుంది. జీవితాలను మలుపుతిప్పే సంఘటనలు కొన్ని వుంటాయి. 
 
నిజానికి రెండు గంటల క్రితం వరకు తను జైల్లోంచి బయటపడగలడనిగాని విశాఖపట్నం వెళ్ళి క్రికెట్‌మేచ్‌ కనులారా చూడగలడనిగాని అతను కొంచెం కూడా వూహించలేదు. తనమీద అలాంటి నిఘా ఏర్పాటు చేసాడు జైలర్‌ ఆంజనేయులు. మేచ్‌ అయ్యేంతవరకు జైలు ఆవరణ దాటకుండా కఠినమైన ఆర్డర్‌ జారీచేసాడు.
 
అయినా కూడా....
 
తనకుగల క్రికెట్‌ అభిమానానికి సానుకూలంగా స్పందించి తోటి ఖైదీలు సహకరించటంతో అతిసులువుగా పచ్చగడ్డి బండిలో దాక్కుని బయటి ప్రపంచంలోకి వచ్చేసాడు. జైలు డ్రస్సుకూడా వదిలించుకుని సివిల్‌ డ్రస్‌లోకి మారిపోయాడు. బట్‌...
 
డబ్బు.... జేబులో పైసా లేకుండా రోజు ఎలా గడుస్తుంది? వైజాగ్‌ ఎలా చేరుకోగలడు? అయినా చింతపడలేదు త్రివిక్రమ్‌. టికెట్‌ లేకుండానే రైలు ఎక్కేస్తే మిగిలింది ఎలా వుంటే అలా జరుగుతుందనే వుద్దేశంతో....
 
అక్కడ టెలిఫోన్‌ బూత్‌ పక్కన కొంచెం ప్లేస్‌లోనే ఒదిగి కూర్చుని రైలు రాకకోసం ఎదురుచూస్తున్నాడు.
 
క్షణాలు భారంగా కదులుతున్నాయి.
 
ఇంతలో అటుగా వస్తున్న కంగారు శాల్తీని చూసి తను కంగారు పడ్డాడు త్రివిక్రమ్‌. అతను ఎవరో కాదు. ఇప్పటికే రెండుసార్లు తనకు తారసపడి హడావిడిచేసిన హంగామా యువకుడు. మొదటిసారి చెట్లతోపులోను రెండోసారి హోటల్లోను తగిలాడు. ఇది మూడోసారి. అంటే ఇతనుకూడా యిదే రైలుకి రాబోతున్నాడా?
 
త్రివిక్రమ్‌ ఆలోచించేలోపలే....
 
కొంపలు మునిగిపోతున్నంత హడావిడిగా టెలిఫోన్‌ బూత్‌వైపు వచ్చేసాడతను. కాని పక్కన కూర్చున్న త్రివిక్రమ్‌ను చూడలేదు సరికదా బూత్‌లో చొరబడుతూ త్రివిక్రమ్‌ కాలు తొక్కి మరీ లోనకెళ్ళాడు. అయినా తను ఒక మనిషి కాలు తొక్కిన స్పృహ అతడికి లేదు.
 
కాని బూటుకాలు వత్తిడికి కాలు నలిగి త్రివిక్రమ్‌కి పీకదాకా పొంగుకొచ్చింది కోపం. లేచి ఆ కంగారుజంతువుని బూత్‌లోపల పెట్టి నాలుగు ఉతికితే ఎలా వుంటుందాని ఆలోచించాడు. కాని అంతలోనే రైలు ప్లాట్‌ఫాంకి రావటం గమనించగానే అతడి ఆలోచనలు చెదిరిపోయాయి.
 
ప్లాట్‌ఫాం పొడవునా ఒకే హడావిడి. సందడి.
 
జనం కంపార్ట్‌మెంట్లకు ఎగబడుతున్నారు.
 
అయినా ఉన్నచోటునుంచి కదల్లేదు త్రివిక్రమ్‌.
 
బూత్‌లో యువకుడు ఎవరెవరికో వరసపెట్టి ఫోన్లుచేసి మాట్లాడుతూనే వున్నాడు. ఇటు ప్లాట్‌ఫాంవెంట అక్కడక్కడ పోలీసులు కన్పిస్తున్నారు. వెంటనే తను లేచివెళ్ళటం మంచిదికాదని ఉన్నచోటునుంచి కదల్లేదు త్రివిక్రమ్‌. రైలు మూవ్‌ కాగానే వెళ్ళే ఉద్దేశంలో వున్నాడు.
 
బూత్‌లో వున్న యువకుడు కూడా రైలు మూవ్‌ అవుతుందేమో అనే డౌటుతో కంగారుగా రైలువంక చూస్తూనే వున్నాడు.
 
సరిగ్గా ఇరవైయ్యో నిముషంలో....
 
దూరంగా గార్డు విజిల్‌ విన్పించింది.
 
ఆ వెనకే రైలు కూత.
 
బండి కొద్దికొద్దిగా మూవ్‌ కానారంభించింది. బండి కదలటం చూడగానే బూత్‌లో యువకుడు ఫోన్‌ పెట్టేసి తన సూట్‌కేస్‌ అందుకుని అదే కంగారుతో బూత్‌లోంచి బయటకు దూకి అడ్డదెడ్డంగా పరుగెత్తి జనాన్ని తప్పించుకుంటూ వెళ్ళి ఎ.సి. కోచ్‌లోకి ఎక్కేసాడు.
 
అతను బూత్‌లోంచి వస్తుండగానే దబ్బున ఏదో కిందపడిన చప్పుడయింది. తనున్న కంగారులో ఆ యువకుడు పట్టించుకోలేదుగాని బూత్‌ పక్కనున్న త్రివిక్రమ్‌ పట్టించుకున్నాడు. ఉన్నచోటునుంచి లేచి యధాలాపంగా బూత్‌లోకి చూసిన త్రివిక్రమ్‌కి అక్కడ కిందపడి కన్పించింది బరువుగా పర్సు. ఆలస్యం చేయకుండా చటుక్కున ఆ పర్సుతీసి జేబులో వేసుకున్నాడు.
 
రైలు చిన్నగా కదులుతోంది.
 
రైలు ఎక్కగానే పర్సు ఆ యువకుడికి ఇచ్చేసే ఉద్దేశంతో తనూ అదే ఎ.సి. కోచ్‌ వైపు పరుగెత్తాడు. సరిగ్గా అతను రాడ్‌ పట్టుకుని ఎక్కబోతుండగా మళ్ళీ ప్రత్యక్షమయ్యాడా యువకుడు.
 
అదే కంగారు.
 
డోర్‌లోంచి కిందకు దిగుతూ త్రివిక్రమ్‌ని గుద్దుకున్నాడు. పైగా 'ఇడియట్‌...ఫూల్‌' అని తిట్టుకొంటూ మరీ పరుగెత్తాడు టెలిఫోన్‌బూత్‌ వైపు.
 
మరొకప్పుడయితే....
 
అతగాడు అలా తిట్టినందుకు కాలర్‌ పట్టిలాగి నాలుగు దులిపేసి వుండేవాడు. కాని రైలు వెళ్ళిపోతోంది. అతడు ఎందుకు పరిగెడుతున్నాడో తనకు తెలుసు. న్యాయంగా అయితే పిలిచి పర్సు అతనికి యిచ్చేయాలి. కాని అన్యాయంగా అతను తనని ఫూల్‌ ఇడియట్‌ అని తిట్లతో సత్కరించటంతో త్రివిక్రమ్‌కి ఒళ్ళు మండింది.
 
''నీకలా జరగాల్సిందేరా కంగారు. రా.... వచ్చి బండి ఎక్కితే అప్పుడు చూద్దాం నీ పర్సు గురించి...'' అనుకుంటూ రైలు ఎక్కేసాడు.
 
కాని లోనకు పోలేదు.
 
ఆ యువకుడు ఏం చేస్తాడో చూడాలనే కుతూహలంతో అక్కడే డోర్‌లో నిలబడి ప్లాట్‌ఫారం మీదకు చూడసాగాడు.
 
అతను టెలిఫోన్‌ బూత్‌నుంచి బయట వెదుకులాడుతున్నాడు. పర్సు దొరక్క అతడి ముఖంనిండా ఆందోళన.
 
అదే సమయంలో రైలు స్పీడు అందుకోవటం చూసి కంగారుపడి పోయాడు. వెనుతిరిగి రైలుకోసం వేగంగా పరుగు ఆరంభించాడు అలా పరుగుతీస్తూ దారిలో యిద్దర్ని గుద్దుకుని కిందపడ్డాడు. లేచి మళ్ళీ పరుగులు.
 
ఈ లోపల రైలు వేగం మరింత పెరిగింది.
 
ఎయిర్‌ కండిషన్‌లో కోచ్‌ని చేరటం వీలుకాలేదు. రైలు వేగం మరింత పెరిగింది. దొరికిన ఏదో కోచ్‌ ఎక్కి రైల్లోకి చేరుకోవాలని ప్రయత్నించాడు.
 
అక్కడా చుక్కెదురయింది అతడికి. ఎవరినో గుద్దుకుని మరోసారి కిందపడ్డాడు. తిరిగి లేచి పరుగెత్లేలోన రైలు వేగం బాగా పెరిగింది. రైలు ఎక్కడానికి కూడా అతడికి ధైర్యం చాల్లేదు.
 
మరికాస్తదూరం పరుగెత్తుకువచ్చి ఆయసంతో రొప్పుతూ చివరకు నిరాశతో దిక్కులుచూస్తూ అక్కడే ఆగిపోయాడు. రైలు స్టేషన్ను వదిలి శరవేగంతో పరుగులు ఆరంభించింది.
 
ఆ యువకుడు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను మిస్సవటం....
 
స్పష్టంగా చూశాడు త్రివిక్రమ్‌.
 
భారంగా నిట్టూర్చాడు.
 
''ఇదే అంటారు. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే జరుగుతుందని భలే కారక్టర్‌ రా బాబునీది నన్ను ఫూల్‌, ఇడియట్‌ అనితిట్టి, చివరకు నువ్వే పెద్ద ఫూల్‌వయ్యావ్‌. డబ్బులేక వైజాగ్‌ ఎలా చేరుకోవాలా అనుకున్న నా బెంగ తీర్చావ్‌రా.
 
నీ పర్సులో వందరూపాయలున్నా చాలు. నా ఖర్చులకి సరిపోతుంది.
 
పై స్టేషన్‌లో బండిదిగి, జనరల్‌ బోగీలోకి మారిపోతాను. థాంక్స్‌ బ్రదర్‌'' అనుకుంటూ జేబులో పర్సుతీసి ముద్దు పెట్టుకున్నాడు.
 
పర్సు ఓపెన్‌ చేయగానే....
 
త్రివిక్రమ్‌ కళ్ళు జిగేల్‌మన్నాయి.
 
హూషారుగా విజిల్‌ వేసాడు.
 
పర్సులో వందరూపాయలేం ఖర్మ. సుమారు రెండువేలకు కేష్‌ వుంది. విశాఖవరకు ఎ.సి కోచ్‌ రిజర్వేషన్‌ టికెట్‌ వుంది. పేరు వినోద్‌. మేల్‌.. వయస్సు 26 బెర్త్‌ నంబరు తొమ్మిది.
 
ఇకనేం? చేతినిండా డబ్బులు, జర్నీకి టికెట్టు. పాపం ఈ కంగారు జంతువు వినోద్‌ ఎవడోగాని, తనని విసిగించిన పాపం వూరికే తగల్లేదు వాడ్ని.
 
అనవసరంగా తనకి బుక్కయిపోయాడు. బేడ్‌ టైం అంటే ఇదే. వాడి ఖర్మ. చేతిరాతనయితే మార్చగలంగాని, తలరాతను ఎవరూ మార్చలేరుగదా....
 
లోపలకొచ్చి తొమ్మిదో నంబరు బెర్త్‌మీద కూర్చున్నాడు.
 
పక్కన ఖరీదయిన సూట్‌కేసు.
 
వినోద్‌ చేతిలో తను చూసినది అదే సూట్‌కేస్‌. పర్సులో వుంది దీని తాళంచెవి అయివుండాలి. సూట్‌కేసు తనవైపు తిప్పుకుని, తాళం చెవితో ప్రయత్నించాడు. డౌటు తీరిపోయింది. లాక్‌ ఓపెన్‌ అయింది.
 
ఇంతలో...
 

(... ఇంకా వుంది)

 
జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugadu inter fail ias pass