Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
o college drop out gadi prema katha

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

టేప్ రికార్డర్ లో... "నాజియా హాసన్" పాటలు, "డిస్కో దివానే" ఆహా... ఓహో..,

"ఉషా ఊతప్పం" పాటలు "గాలు తేరా గప్పు తిప్పు రంగు తెరె లాయి" ఆహా... ఒహో..,

"ఐయామే డిస్కో డ్యాన్సర్" లాంటి పాటలు పెట్టి, వాటికి సరిపోయేలా డ్యాన్స్ చేసేవాడు కుమార్.

అబ్బ... నువ్వు సూపర్ రా అనేవారు ఫ్రెండ్స్... ఎంతో ఉత్సాహంగా ఫీలయ్యేవాడు కుమార్. ఎప్పుడయినా కరణం గారి ఇంటి ఆవరణలో కుమార్ డ్యాన్స్ ప్రదర్శన జరిగేది. చుట్టు పక్కల వాళ్ళందరూ చూసి చప్పట్లు కొట్టేవారు. కుమార్ ని చూసి రాముకి ఊపువచ్చేది. నోటితో అం'చుక్... అం'చుక్... అని అంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయేవాడు.

కాసేపాగి, పూనకం తగ్గాక పక్కకు వచ్చేవాడు.

మామ నా డాన్సెలా ఉందిరా? అని అడిగేవాడు.

అరే! "మిథున్ చక్రవర్తి" నీ ముందు ఎందుకు పనిచేస్తాడురా మామా! అని సమాధానం వస్తే, అంతలేదురా మామా... కమ్మగట్టకు (వేళాకోళం పట్టించకు) అనేవాడు.

***

పురుషోత్తం మెస్... కంభం వాడు పురుషోత్తం... స్టూడెంట్స్ కోసం మెస్ నడుపుతున్నాడు...

కిట్టు, వరద, రాము, రాజు, గుర్నాధం, శీను, సుబ్రావ్, చందు, గిరి, కుమార్...

మొత్తం పదిమంది గ్యాంగ్ ఒకేసారి ఈ మెస్ కి వెళ్లేవాళ్లు.

ఒకరోజు మెస్ దగ్గర సుబ్రావ్ చెప్పులు కనిపించలేదు.

పురుషోత్తం! నా 'జోడు' పోయింది అన్నాడు సుబ్రావ్.

పకపకా నవ్వాడు పురుషోత్తం. నీకు పెళ్లెప్పుడయింది? అంటూ మళ్లీ నవ్వాడు పురుషోత్తం...

ఇజ్ నగరం (విజయనగరం) భాష కంభానికి నవ్వు తెప్పిస్తుంది. ఒరే... వాడు ఇల్లెక్కేసి, గెంతీసినాడు అంటాడు సీకాకుళం వాడు.

ఇదేం భాష?

ఇల్లు ఎక్కాడు, అక్కడి నుండి దూకాడు అనాలి అని ఎగతాళి చేశాడు కిట్టు.

నీదేం భాష?

బాగా సాగదీసి, ఆయ్... ఆయ్... అంటూ మట్టాడతావ్?

ఇంటికాడ ఏంది?

ఇల్లు ఏమన్నా తామరపువ్వా?

దానికో కాడ ఉంటుందా?

ఏడిసినట్టుంది మీ గోదావరి భాష అంటూ మిగిలిన వాళ్లు తిట్టేవారు కిట్టుని.

అరే మా గోదావరి భాష స్వచ్చమైనది.

మీ ఇజ్ నగరం, సికాకుళం, మచిలీపట్నం, ఒంగోలు, విశాఖ భాషలు ఎందుకు పనిచేస్తాయి అనేవాడు కిట్టు.

అవును, భాషను ఇంకా సాగదీసి... సాగదీసి మాట్లాడితే ఇంకా బాగుంటుంది.

నీదొక భాష... మూసుకో నోరు' అనేవాళ్లు మిగిలిన వాళ్లు.

'ఏంది' అంటారేమిటి? ఏమిటి? అనాలి.

ఏంది అంటే తప్పేముంది?

అందరూ వాడేదే అది.

కమ్మగట్టడం ఏమిటి?

వేళాకోళం అనాలి.

బంగాళాఖాతంలాగా బంగాళాదుంపలేంటి?

ఉర్లగడ్డ అనేది కరెక్ట్, మీ గోదావరి భాష వేస్ట్...

పిడి గొట్టడం ఏమిటి?

రుబ్బడం ఏమిటి?

బాగా చదువుతున్నావా? అనాలి.

వాణ్ణి తోలుకురా!

తోలుకురావడానికి వాడు ఏమైనా ఆవు, గేదెనా?

ఎత్తుకురా... దెంకరా...

ఎత్తుకురావడమేమిటి?

దెంకరావడం ఏమిటి?

తీసుకురా, పట్టుకురా అనాలి కదా!

బర్రె అనేది కరెక్ట్... ఆవు అనేది కరెక్ట్...

ఎవడు ఎవడికి మామ?

ఏందిరా 'మామా'

మెట్టుతో గొడతా (చెప్పుతో కొడతా)

ఎర్రగడ్డ (ఉల్లిపాయ)

గనిసి గడ్డ (చిలగడ దుంప)

ఇలా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియకుండా గందరగోళంగా... ఒకరితో ఒకరు పిచ్చి పిచ్చిగా వాదించుకునేవారు.

కంభంకి వెళ్లబట్టి కిట్టుకి కొన్ని విషయాలు తెలిసాయి.

ఒక ప్రాంతం వాడు వాడి భాష "భేషు" అనుకుంటాడు. మిగిలిన వాళ్ల భాష 'తుస్సు' అనుకుంటాడు.

ఇతర ప్రాంతం వాడు కూడా వీడి గురించి అదే విధంగా అనుకుంటాడని ఒకరికొకరు ఎదురు పడితే గానీ తెలియదు.

తెలుగు భాషలో ఏదీ తప్పు కాదు, ఏదీ ఒప్పు కాదు.

రకరకాల ప్రాంతాల వారు మాట్లాడే తెలుగు భాషని 'మాండలికాలు' అంటారని తర్వాత తెలుసుకున్నాడు కిట్టు.

తెలియనితనం వల్ల నా 'భాషే గొప్ప' అనుకునే భావన 'తప్పు' అని తెలుసుకున్నాడు. ఇతర మాండలికాల్ని గౌరవించడం నేర్చుకున్నాడు, అలవాటు చేసుకున్నాడు.

***

భీమవరం ఊరు పెద్దదా?

ఊరంటావేమిటి?

సిటీ అది.

హ్హ హ్హ హ్హ... భీమవరం సిటీ అంటరా...!!!

సిటీ అంటే విశాఖపట్నం...

ఏడిసావు...

అనకాపల్లి... గాజువాక... సీతమ్మధార... ఇంకా నాలుగు ఊర్లు కలిపితే సిటీ అయిపోతుందా?

విశాఖపట్నం కార్పోరేషన్ తెలుసా?

భీమవరం కూడా కార్పోరేషనే... మున్సిపాలిటీ కాదు...

మున్సిపాలిటీ కార్పోరేషన్ ఐపోయిందా?

'శతాబ్ధాల చరిత గల సుందరనగరం రాజమండ్రి (రాజమహేంద్రవరం). "బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ"... అంటే అందరికీ తెలుసు. గోదావరి నది ఒడ్డున ఉన్న గొప్ప ప్రదేశం.'

'భీమవరం ఇటలీలోని వెనిస్ నగరంతో సమానం...

వెనిస్ నగర మధ్యలో పారే నది నగరాన్ని రెండుగా విభజిస్తుంది

కాలువకి ఇవతల వన్ టౌన్ అవతల టూ టౌన్.

వెనిస్ నదిని భీమవరం మురిక్కాలువతో పోలుస్తావా? భీమవరం ఎక్కడ?

వెనిస్ ఎక్కడ? హ్హ... హ్హ... హ్హ'

'విశాఖపట్నంలో బీచ్ ఉంది... భీమవరంకీ బీచ్ ఉంది... గొల్లపాలెం బీచ్...'

'అరె మా ఒంగోలుకి బీచ్ ఉంది. అందరూ వస్తారక్కడికి...'

'ఎమ్.టి.ఎమ్. అంటే మా మచిలీపట్నం "పోర్ట్ టౌన్" బ్రిటీష్ కాలం నుండి దానికి చాలా పెద్ద పేరుంది అంటాడు వరద'

'రాజమండ్రికి త్వరలో ఎయిర్ పోర్ట్ రానుంది'! 'దానికంటే ముందే భీమవరంలో ఎయిర్ పోర్ట్ వస్తుంది'!

'ఇజ్ నగరం రాజులంటే పెద్దపేరు... కృష్ణదేవరాయల కాలం నుండి ఇప్పటి వరకు ఇజ్ నగరం గొప్పనగరంగా ఉంది'

'భీమవరం రాజులంటే ఇంకా పెద్దపేరు' వాళ్ళెంతో ధనవంతులు, వాళ్లేకాక సాధారణంగా భీమవరంలో ఆడవాళ్లు డబ్బు కట్టలను చేతులతో పట్టుకుని, భయం అనేది లేకుండా భీమవరంలో బంగారు కొట్లకి వెళ్లి, బంగారు నగలు కొనడం, ఒక నగ చెడగొట్టి, ఇంకో నగ తయారు చేయించడం, చాలా సునాయాసంగా చేస్తారు 'భీమవరంలో సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందేలకి, పేకాటలకీ కొన్ని కోట్లు ఖర్చుపెడతారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగే 'గాంబ్లింగ్' భీమవరం ముందు ఎందుకూ పనికిరాదు' (అనుకోకుండా కిట్టు అన్న మాటలు... ఆ తర్వాత టీవీ వాళ్లు ప్రసారం చేసిన కార్యక్రమంలో అన్నారు.)

'రాష్ట్రగవర్నర్ ఎప్పుడైనా వస్తే 'భీమవరం'లోనే బస చేస్తారు. ఇంకెక్కడికీ వెళ్లరు'

'భీమవరం "రెస్ట్ హౌస్ రోడ్డు" కి ఆ పేరు రావడానికి కారణం గవర్నర్ గారి బంగ్లానే'

'రెస్ట్ హౌస్ రోడ్డులోని రిక్షా గవరయ్య అంటే చాలా పెద్దపేరు'

ఓహో!

రిక్షా గవరయ్య రిక్షాలు తయారు చేసి అమెరికాకి ఎగుమతి చేస్తాడనుకుంటా!!

'సీకాకుళంలో సీమకొండకి... ఏం పిల్లడో ఎల్దామొస్తవా... ఏంపిల్లో ఎల్దమొస్తవా...

అని పాట కట్టారంటే సీకాకుళం ఎంత ఫేమస్సో తెలుస్తుంది.

గొప్ప గొప్ప ఆటగాళ్లు సీకాకుళం నుండే వస్తారు'

ఇలా ఒకళ్ల ఊళ్ల గురించి ఒకళ్లు వాదించుకునేవాళ్లు.

దీన్నిబట్టి కిట్టుకి ఇంకో విషయం అర్ధమైంది. ఏ ఊరు గొప్పదనం ఆ ఊరుది. ఎవరి ఊరంటే వాళ్లకు మక్కువ, గొప్ప. ఒకటి ఎక్కువా, ఇంకోటి తక్కువా కాదు.

***

సంవత్సరం గడిచింది. కిట్టు వాళ్ల గ్యాంగ్ సీనియర్లు అయ్యారు. జూనియర్ లు రావడం మొదలు పెట్టారు.

జూనియర్లు కూడా రకరకాల ప్రదేశాల నుండి వస్తున్నారు. రకరకాల వేషభాషలు...

కిట్టు వాళ్ల గ్యాంగ్ 'జూనియర్లని ర్యాగింగ్ చెయ్యాలని నిశ్చయించుకున్నారు'.

కిట్టు వాళ్ల గ్యాంగ్ కథలు కథలుగా అంతకు ముందుకాలంలో ర్యాగింగ్ ఎలా జరిగేదో విన్నారు.

'జూనియర్లని గుడ్డలూడదీసి నగ్నంగా నడిపించడం, ఒకణ్ణి టార్గెట్ చేసి చితకబాదడం, వాడితో మూత్రం తాగించడం... ఇలాంటి అమానుష పద్ధతిలో ర్యాగింగ్ జరిగేది. అవమానం తట్టుకోలేక, గుర్తుకొచ్చేబాధని మింగలేక కాలేజీ వదిలి పారిపోయిన విద్యార్ధులు ఉన్నారు.  ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులు దేశం మొత్తం మీద కొంతమంది ఉన్నారు.'

పశువుల కంటే హీనంగా, దారుణమైన పైశాచికానందంతో చేసే ర్యాగింగ్, ర్యాగింగేకాదు.

కిట్టు వాళ్ల గ్యాంగ్ ఒక నలుగురి జూనియర్లని పట్టుకుంది.

ఒక్కొక్కన్నీ ర్యాగింగ్ చెయ్యడం మొదలైంది.

ఏ ఊరు? ఇంటర్మీడియట్? డిగ్రీ చదివావా?

ఏవీ? నీ అరచేతులు చూపించు... కుడి చెయ్యి ఎక్కువగా వాడతావా? ఎడమ చెయ్యి ఎక్కువగా వాడతావా?

సమాధాన్ని బట్టి మళ్లీ ప్రశ్న వచ్చేది...

నీ చేతి రేఖల్ని బట్టి నువ్వు ఎడమచెయ్యి ఎక్కువగా వాడతావు... కుడి చెయ్యి అని చెపుతావేంటి?

గాంధీ గారికీ జై... అను...

గాంధీగారు యువకులకు ఒక మంత్రం చెప్పారు. అది ఫాలో అవుతున్నవా లేదా?

ఇంజనీరింగ్ సాల్యూట్ చెయ్యడం వచ్చా? రాకపోతే ఇప్పుడు నేర్చుకో...

ఎడమ చేతిని మైఖేల్ జాక్సన్ ఎక్కువగా ఎక్కడ పెడతాడో అక్కడపెట్టి, గాల్లోకి పైకెగిరి, కిందకు వచ్చేటప్పుడు పెద్ద శబ్దం చేస్తూ కుడి చేత్తో సాల్యూట్ చెయ్యాలి.

మేం ఎప్పుడు ఎక్కడ కనబడితే అక్కడ ఈ సాల్యూట్ చెయ్యాలి.

అక్కడ స్తంభానికి శ్రీదేవి పోస్టర్ అతికించి ఉంది... ఆమెతో ఆమెని ప్రేమిస్తున్నట్లు... అందరూ మెచ్చుకునేలా చెప్పు...

అబ్బే సరిగ్గా చెప్పలేదు... మళ్లీ చెప్పు... ఆమెకి ముద్దు కూడా పెట్టు... నీకిష్టమైతేనే... లేకపోతే లేదు.

లేటెస్ట్ సినిమా పాట పాడు...

జనగణమణ పాడు...

రాదా? సినిమా పాటలు బాగావచ్చు... జాతీయ గీతం రాదా?

ప్రతిజ్ఞ చెప్పు...

అది కూడా రాదా? ఏమీ రాకుండా ఎగురుకుంటూ పాలిటెక్నిక్ కు ఎలా వచ్చేశావు?

ఇక్కడ ఏం చదువుతున్నావో తెలుసా.....

డిప్లొమా కాదు.....

పీ' టెక్ అని చెప్పాలి ఎవరైనా అడిగితే.....

పీ' టెక్ అంటే పాలిటెక్నిక్. బీ' టెక్ వాడు బీటెక్ అని చెప్తాడు ఎవరైనా అడిగితే... మనం కూడా అదే విధంగా పీ' టెక్ అని చెప్పాలి. అర్ధమయ్యిందా....

డ్యాన్స్ వచ్చా?

వస్తే చెయ్యి... మ్యూజిక్ ప్లీజ్...

నీ జుట్టు విచిత్రంగా ఉంది...

ఇప్పటి లేటెస్ట్ ఫాషన్ 'తమ్మెలు' (విస్కర్స్) తీసివేసి 'ఈకలు పీకిన కోడి'లా కనబడడం.

మమ్మల్ని చూసి నేర్చుకో.....

నీకు కూడా తీసేయమంటావా?

యస్' అయితే వెంటనే తీసివేయడం, నో' అయితే వదిలేయడం.

నీకు లవరుందా?

అంతకు ముందు ఎప్పుడైనా అమ్మాయిల మీద కామెంట్ చేశావా?

కంభం సంగతి నీకు తెలుసా?

ఇక్కడ అలాంటి పనులు చేస్తే దఫ దఫాలుగా కొడతారు. అలాంటి పని పొరపాట్న కూడా చేయకు.

మందు కొడతావా లేదా? సిగరెట్టు తాగుతావా? ఏంటీ అలవాటుందా?

సిగరెట్టు కాల్చి చూపించు ఇదిగో... మందు కొడతావా... ఔనా... సరే మేము మందు పార్టీ చేసుకునేటప్పుడు నిన్ను పిలుస్తాం... వచ్చి చేరిపో... మీరు చేసుకునేటప్పుడు మమ్మల్ని పిలువు...

ఏంటీ మందు తాగవా?

ఇదిగో థమ్స్ అప్... తాగు... ఇదే మందుగా భావించి కిక్కు ఎక్కినట్టుగా, నీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్లని బాగా తిట్టు...

పాట చాలా బాగా పాడావు... డ్యాన్స్ చాలా బాగా చేశావు...

కుమార్ గారు డ్యాన్స్ బాగా చేస్తారు... నువ్వు కూడా ప్రాక్టీసుకు రావచ్చు...

అంతకు ముందు తెలుగు మీడియమా? ఇప్పుడు పుస్తకాలన్నీ, ఇంగ్లీష్ మీడియంలలో ఉంటాయి.

నీవు ఎక్కువ కష్టపడాలి. మేము రాసుకున్న నోట్సు ఉన్నాయి... ఎప్పుడన్నా వచ్చి తీసుకెళ్లు... కాపీ చేసుకుని తెచ్చి ఇచ్చెయ్...

ఏ విషయంలో నీకు ఏ డౌట్ ఉన్నా... మా దగ్గరికి రా... మాకు తెల్సినంతలో మేము చెప్తాము...

చివరగా...

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్