Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Poor Mans Apple

ఈ సంచికలో >> శీర్షికలు >>

పేర్లూ-ముద్దుపేర్లూ... - భమిడిపాటి ఫణిబాబు.

perlu-mudduperlu

న ఇళ్ళల్లో పాతరోజుల్లో ఇంటినిండా పిల్లా, పాపలతో కళకళ్ళాడుతూ ఉండేవి. ఎంతమంది పిల్లలుంటే అంత గొప్ప. వారికి పేర్లు పెట్టడంలో కూడా ఓ పధ్ధతి ఉండేది. పెద్దకొడుక్కి ఇంటిపెద్ద గారి తండ్రిపేరు గ్యారెంటీ. రెండోవాడికి ఇంకో తాతయ్య పేరు, మధ్యలో దేవుళ్ళ పేర్లూ, అంతా కలిపి SSLC Book లో ఓ రెండులైన్లు దాకా వచ్చేది. అమ్మాయిల విషయానికొచ్చేటప్పటికి నానమ్మా, అమ్మమ్మా పేర్లు. వీటిల్లో సదుపాయం ఏమిటంటే ఆ పిల్లలు ఎంత అల్లరిచేసినా, వారికున్న నామధేయాల ధర్మమా అని, ఎవరూ వారిని పెద్దగా కోప్పడేవారుకాదు. సెంటిమెంటు అడ్డం వచ్చేది. అంతంత పెద్దపెద్ద పేర్లు అస్తమానూ పిలవడం కష్టమని ఏదో ముద్దు పేరుతో పిలిచేవారు. పెద్దబ్బాయి, చిన్నబ్బాయి, బుల్లబ్బాయి అని. వాళ్ళు బతికున్నంతకాలం ఆ ముద్దుపేరుతోనే చలామణీ అయేవారు. సూర్యనారాయణ అయితే “సూరీడూ”, సత్యనారాయణ అయితే “సత్తిపండూ” ఆడపిల్లలకైతే ఏదో “బేబీ” “చంటీ” ”చెల్లీ” లాటి వుండేవి. వీళ్ళు అమ్మమ్మలూ, నానమ్మలూ అయిన తరువాతకూడా అదే ముద్దుపేరు ఉండేది.

ఇదివరకటి రోజుల్లో  ఏదో పెళ్ళిసంబరాల్లో భాగంగా, కొత్తపెళ్ళికూతురూ, పెళ్ళికొడుకులచేత, గడప దగ్గర ఒకళ్ళపేర్లొకళ్ళు చెప్పడం అదో ముచ్చట. అప్పుడు కూడా, పెళ్ళికూతురు మహ సిగ్గు పడిపోయి, చెప్పేది. ఒక్కొక్కప్పుడైతే, అతని పేరు అర్ధం వచ్చేటట్లుగా, సరదాగా ఓ పద్యమో, పొడుపుకథో చెప్పేది. అవన్నీ ఇప్పుడు పాత జ్ఞాపకాల్లోకి, చరిత్రలోకీ వెళ్ళిపోయాయి. ఇప్పుడో, అసలా  ముచ్చట అవసరమే ఉన్నట్లు లేదు. అక్కడికేదో ఒకరి పేరొకరికి తెలియదని కాదూ, పెళ్ళిలో అదో తంతు. అయినా ఈ రోజుల్లో సుముహూర్తం, వధూవరుల మధ్యలో ఓ తెరా లాటివి బొత్తిగా reduntant అనిపిస్తుంది. అందరికీ సౌకర్యంగా ఉండేటట్లు ఓ వీకెండులో ముహూర్తం, పెళ్ళికి ముందురోజో, లేక ఏ అర్ధరాత్రో ముహూర్తం అయితే, అదే రోజు సాయంత్రం రిసెప్షనూ, రాత్రి పెళ్ళీ, మరి ఈ ముచ్చట్లకన్నిటికీ టైమెక్కడిదీ? చాలామంది రిసెప్షన్ కి వచ్చి భోజనం చేసేసి వెళ్ళిపోయేవారే. ఏదో దగ్గర చుట్టాలుమాత్రం ఉంటారు. ఇంకో విషయమేమిటంటే, ఈరోజుల్లో పెళ్ళిసంబరాలు అన్నీ made to order కదా. ఏదో ఫలానా గంటలకోసం ఓ కల్యాణమండపం బుక్ చేసికోడం, మొత్తం తతంగం అంతా ఆ టైములోనే పూర్తిచేయాలి. పెళ్ళివారు పేర్లు చెప్పుకోడాలూ, అప్పగింతలూ అంటూ కూర్చుంటే ఎలా, ఆ కల్యాణమండపం తరువాత బుక్ చేసికున్నవాడు వచ్చేస్తాడు. మొత్తానికి కారణాలు ఏమైతేనేం, ఈ “పేర్లు చెప్పుకోడాలు” అనే ముచ్చట అటకెక్కేసింది.

ఇదివరకటి రోజుల్లో, భార్యాభర్తల మధ్య వయస్సు కూడా అయిదునుండి, పది సంవత్సరాలదాకా తేడా ఉండేది. ఇప్పుడో, మరీ పెళ్ళికూతురు, పెళ్ళికొడుక్కంటే పెద్దగా ఉండకపోతే చాలు. కొండొకచో అలాటివీ చూస్తున్నాము. ఎవరిష్టం వారిది. మరీ భార్య, భర్తని పేరుపెట్టి పిలిచే అలవాటుండేది కాదు. ఎట్లీస్ట్ పబ్లిగ్గా! పడగ్గదిలో వాళ్ళు ఏం పిల్చుకుంటే మనకెందుకూ? ఏదో " ఏమండీ..", "మిమ్మల్నే.." లాటివాటితో జరిగిపోయేది, అదే అలవాటు కంటిన్యూ అవుతోంది. ఏ  మేనత్తకొడుకో అయితే, "బావా" అని పిలిచేవారు. మరీ అతికి వెళ్ళి "బావగారూ.." అంటే, భర్తగారి ఏ అన్నయ్యో పరిగెత్తుకొస్తే మళ్ళీ అదో గొడవా! అదే కాకుండా, పేర్లుకూడా మరీ పాతచింతకాయ పచ్చడిలాగ ఉండడం ఓ కారణం అయుండొచ్చు. భార్య ఏదో ముచ్చటకోసం పేరు పెట్టి పిలుద్దామన్నా మరీ "సోమనాధం, వెంకట్రామయ్యా, రామారావూ, యాజ్ఞ్యవల్క్యం ..." అంటూ పిలిస్తే మరీ అన్ రొమాంటిక్ గా ఉంటుంది! పైగా ఇంట్లో ఉండే ఏ పెద్దవాళ్ళో విన్నారంటే పెద్ద గొడవైపోయేది. ఇప్పుడెక్కడచూసినా స్టైలిష్, మోడరన్ పేర్లే. పిలవడానిక్కూడా ఈజీ! రమేష్, యోగేష్, లాటివి. మళ్ళీ వీటికి షార్ట్ కట్లూ రమ్మీ, యోగీ అంటూ, పేకాడదామని పిలుస్తోందో, లేక భర్తని ప్రేమగా పిలుస్తోందో అర్ధమై చావదు వినేవాళ్ళకి. అలాగే అమ్మాయిలపేర్లు కూడా స్వీట్ గానే ఉంటున్నాయి. పెళ్ళాం ఎప్పుడూ బెల్లం ముక్కేలెండి, దానికి సాయం పేరుకూడా  స్వీట్ అయితే సోనే పే సుహాగా !! వచ్చిన గొడవేమిటంటే పేర్ల విషయానికొచ్చేటప్పటికి పెంచుకునే కుక్కపిల్ల కి కూడా ఓ అందమైన పేరు ఉండడం పెద్ద విశేషం.

మేము ఉద్యోగంలో చేరినప్పుడు, మన పై ఉద్యోగిని ( వాడు ఎంత దౌర్భాగ్యుడైనా) "సర్ " అనే పిలవ్వల్సొచ్చేది. Ofcourse మన కిందవాడు మనల్నీ అలాగే ఎడ్రస్ చేసేవాడు (మనం ఎంత బడుధ్ధాయిలమైనా!). అటెండెన్స్ రిజిస్టర్ లోనో, పే బిల్లు లోనో చూస్తేకానీ తెలిసేది కాదు మన పైవాడి పేరు. ఓ నేం బోర్డుండేదీ అనుకోండి. చెప్పొచ్చేదేమిటంటే, మన పైవారిని ఎవరినీ పేరుపెట్టి పిలిచే అదృష్టం ఉండేది కాదు.

ఈ రోజుల్లో అంతా  Corporate Culture ధర్మమా అని ఎవరినైనా సరే పేరుపెట్టే పిలవాలిట! పైగా మిస్టరూ, మిస్సూ, మిస్సెస్సూ అనికూడా అనకూడదుట. సర్వమానవసౌభ్రాత్వుత్వం. రోజంతా ఆఫీసుల్లో పేర్లుపెట్టి పిలవడంతో ఇంట్లోనూ అదే అలవాటైపోయింది. అదేమీ తప్పనడం లేదు. కానీ ఇప్పటికీ గవర్నమెంటాఫీసుల్లో పాతలవాట్లే. వాళ్ళు పుటం వేసినా మారరు. ఎంతైనా బ్రిటిష్ లెగసీ!

ఇదివరకటి రోజుల్లో, స్కూల్లోనూ, కాలేజీల్లోనూ ఏవేవో పేర్లుపెట్టి ఏడిపించేవారు. కానీ ఇప్పుడో, ఎంత విలక్షణ పేరుంటే అంత గొప్ప! ప్రపంచం లో ఎక్కడా వినని పేర్లు ఇప్పుడు ఫాషనైపోయాయి. ఇంక కొంతమందికి అవేవో పెన్నేమ్ములో, పెన్సిల్నేమ్ములో! శుభ్రంగా అమ్మానాన్నలు పెట్టిన పేర్లొదిలేసి ఈ తిప్పలెందుకో అర్ధం కాదు. ఆరోజుల్లో మహాభారతం లో పాండవులు మారు పేర్లెట్టుకున్నారంటే, వాళ్ళేదో అజ్ఞాతవాసం లో ఉండబట్టీ. మనకేం కర్మండి బాబూ?. ఈమధ్యన ఓ కొత్త రంధి ఏర్పడింది, ఇదివరకటి రోజుల్లో అమ్మాయికి పెళ్ళి అయినతరువాత తప్పనిసరిగా ఇంటిపేరు మారేది. కానీ, ఆ పెళ్ళి బంధం ఎప్పుడు ఊడిపోతుందో అనే “భయం” కావొచ్చు, లేదా సమాన హక్కులూ వగైరాలు కావొచ్చు, పుట్టింటివారి ఇంటిపేరుతోనే కంటిన్యూ అయిపోతున్నారు, అందరూ అని కాదు, నూటికి పదిశాతం వరకూ. ఏదైనా అన్నా వారి కారణాలు వారికి ఉన్నాయనుకోండి, ఈరోజుల్లో ఎవరు చూసినా విదేశాలకి వెళ్ళడానికి అవేవో passport లు పాత ఇంటిపేరుతోనే చేయించుకున్నాముకదా, మళ్ళీ ఇప్పుడు వాటిని మార్చాలంటే పెద్ద హడావిడీ అదీనూ, అంతేకానీ మెట్టినింటివారిని అగౌరవపరచడానికి కాదూ అంటారు. నిజంగా ఆ passport అనేది ఓ వంక కానీ, ఇంటిపేరు మార్చుకోడం ఏమైనా పెద్ద పనా ఏమిటీ, “మార్చుకోడం ఇష్టంలేదూ.. బస్.. నీకేమైనా నష్టమా..” అంటారు గట్టిగా అడిగితే.

ఇంక ఈ రోజుల్లో ఇంటి పేరుతో సహా చెప్పుకోడం చాలా బాగుంది. నా ఉద్దేశ్యంలో మనకొచ్చే గౌరవం ఇంటిపేరువల్లే అని. ఏదో అదృష్టంకొద్దీ ఆ ఇంటిపేరున్న ఇంట్లో పుట్టాం, అలాటప్పుడు, పుట్టినింటి/మెట్టినింటి పేరుతో పిలిపించుకోడానికి అంత నామోషీ ఎందుకో అర్ధం అవదు. చాలామంది ఒట్టి ఇనీషియల్సే పెట్టుకుంటారు. ఈ దౌర్భాగ్యం మనకే అనుకుంటా, దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా పూర్తిపేరు, కొన్నిచోట్ల తండ్రి పేరుతో సహా ఉంటుంది.

ఈమధ్యన నవలలూ, కథలూ వ్రాసేవారు కూడా మారుపేరుమీదే వ్రాస్తున్నారు. బహుశా ఏ “న్యూమరాలజిస్టో” చెప్పుంటాడు, ఫలానా పేరుతో వ్రాస్తే ప్రైజు గ్యారెంటీ అని.

गर्व से कहो  మాఇంటి పేరు ఫలానా है అని...

 

మరిన్ని శీర్షికలు
duradrushtapu dongalu