Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

స్టార్ లతో ప్రయోగాలు చేయకూడదు..! - బోయపాటి శ్రీను

Interview with Boyapati Srinu

హీరోని ఎలా చూపించాలో... ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఎవరెస్ట్ అంత ఇమేజ్  ఉన్న హీరోని ఆయన ఆకాశమంత ఎత్తున చూపిస్తారు. ఎమోషన్స్ ని పండించడంలో బోయపాటి తరవాతే ఎవరైనా!  తెరపై ఆయన హీరో ఎంత జోష్ తో ఉంటాడో... సెట్లో ఆయన అంతకంటే హుషారుగా ఉంటాడు. వెయ్యి ఓల్ట కరెంట్ ప్రవహించే ఎనర్జీ బోయపాటి సొంతం. అది ఆసాంతం హీరో పాత్రకు ధారబోస్తాడు. అందుకే బోయపాటి శ్రీను సినిమాలో పరర్ ఫుల్ హీరోలు దర్శనమిస్తుంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అందులో విజయాలెక్కువ. దాంతో నిర్మాతలకూ, హీరోలకూ, తెలుగు ప్రేక్షకులకు బోయపాటి అంటే నమ్మకం ఎక్కువ. సింహాతో బాలయ్య అభిమానుల్ని మెప్పించిన ఈ దర్శకుడు లెజెండ్ తో మరోసారి తన పంథా చాటుకొన్నాడు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీనుతో జరిపిన చిట్ చాట్ ఇది.

* లెజెండ్ కి వస్తున్న స్పందన చూస్తుంటే ఏమనిపిస్తోంది..?
- చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం ఊహించినదే. ఎందుకంటే బాలయ్యను.. అలా, ఆ స్థాయిలో చూపించడానికి చాలా కష్టపడ్డాం. ఒక విధంగా బ్లడ్ బాయిల్ అయిపోయింది. ఎందుకంటే అందరూ సింహా.... అంచనాలతో థియేటర్లకు వస్తారు. వాళ్లని ఒప్పించడం అంత సులభం కాదు. ఏమాత్రం తేడా జరిగినా మొదటికే మోసం వస్తుంది. అందుకే.. చాలా జాగ్రత్తగా ఈ సినిమా తీశాం. ఎక్కడా చిన్న తప్పు దొర్లకుండా శ్రమించాం. ఇప్పుడు దానికి తగిన ప్రతిఫలం వస్తోంది.

* సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వచ్చాయి. అవి మిమ్మల్ని టెన్షన్ పెట్టలేదా?
- ఒత్తిడి లేదు.. అని చెబితే అబద్ధం. ఆడియన్ ఏం ఆశిస్తాడో ముందే గెస్ చేయగలిగాం. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఆశించి థియేటర్ కి వచ్చినా.. సంతృప్తి పర్చి తీరతాం.. అనేదాన్ని నేను బాగా నమ్మా.

* అంత నమ్మకం దేనిపైన?
- కథపై. నా హీరోపై. సింహాతో ఓ క్లారిటీ వచ్చింది. బాలయ్యను ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో అంచనా వేయగలిగాం. అలాగని.. ఇప్పుడూ సింహాలానే సినిమా తీస్తే.. ఏమాత్రం హర్షించరు. దానికి మించిన ఎలిమెంట్ కథలో ఉండాలి. బాలయ్యని అంతకంటే శక్తిమంతంగా చూపించాలి. దాని కోసం చాలా శ్రమించాం. గెటప్, డైలాగ్స్... ఇలా ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొన్నాం. ఈవేళ అవే... ప్రేక్షకులకు నచ్చాయి.

* బాలయ్య పొలిటికల్ ఎంట్రీకి ఈ సినిమా చాలా కీలకం. ఈ విషయంలో మీ ఆలోచనలు ఏమిటి?  దాని కోసం కథలో ఏమైనా మార్పులు చేశారా?
- ఇక్కడో విషయం చెప్పాలి. ఈ సినిమాతోనే బాలయ్య పొలిటికల్ ఎంట్రీ జరుగుతుందా?? ఆయన ఆల్రెడీ ప్రజల మనిషి. ఎన్టీఆర్ కుమారుడిగా ఆయనకు ఓ ఇమేజ్ ఉంది. ఈ సినిమాకి ముందు ఆయన జనంలోకి వెళ్లినా... ఇలాంటి ఆదరణే వస్తుంది. సో... పొలిటికల్ ఎంట్రీకీ ఈ సినిమాకీ సంబంధం లేదు. కానీ... బాలయ్య సినిమా అనేసరికి, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొన్ని సన్నివేశాలు, ఇంకొన్ని డైలాగులూ ఆశిస్తారు. వాటిని దృష్టిలో ఉంచుకొన్నాం. పతాక సన్నివేశాల్లో వచ్చే డైలాగులు కథకు అవసరం. లెజెండ్ పాత్ర ఎలివేట్ కావడానికి అవసరం. అంతే తప్ప.. పనిగట్టుకొని రాసినవి కావు. ఊరుమారితే తినే ఫుడ్డు మారుతుందేమో, బెడ్డు మారుతుందేమో.. బ్లడ్డెందుకు మారుతుంది రా బ్లెడీ ఫ్లూ.. రాజకీయం నా రక్తంలోనే ఉంది.. ఇలాంటి డైలాగులు బాలయ్య చెబితేనే బాగుంటుంది. అందుకే రాశాం.

* సినిమాలో రక్తపాతం ఎక్కువైందని అంటున్నారు. మీరేమంటారు..?
- అది రక్తపాతం కాదండీ. ఎమోషన్. పగ.. ప్రతీకారాలు కూడా భాదోద్వేగాలే. దాన్ని ఎలా చూపించాలి..?  ఒకడు కొడితే.. తిరిగి కొట్టాల్సిందే. అది హ్యూమన్ ఎమోషన్. దాన్ని రక్తపాతం అనకూడదు. కథానాయకుడిగా పాత్ర ఎలివేట్ కావడానికి అది చాలా అవసరం.

* సెకండాఫ్ లో చిన్న బాలకృష్ణ కనిపించలేదు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు..
- చిన్న బాలకృష్ణ వచ్చి ఏం చేయాలండీ? అన్ని బుల్లెట్టు దూసుకెళ్లిన మనిషి తిరిగి వచ్చి ఫైట్ చేస్తే జనం ఏమంటారు..? ఈ కథ... లెజెండ్ కి సంబంధించినది. జయ్ దేవ్ అనే పాత్ర కీలకం. ముందు చూపించిన చిన్న బాలకృష్ణ కేవలం సపోర్టింగ్ మాత్రమే. ఊర్లో ఓ సమస్య మిగిలిపోయింది. దాన్ని తొలగించడానికి వచ్చిన జయ్ దేవ్ సెకండాఫ్ లో ఏం చేశాడన్నది కీలకం. ఇప్పుడు నేను మరో బాలకృష్ణని తీసుకొస్తే.. సినిమా లాంగ్ అవుతుంది. అందుకే ఆయన్ని ఆసుపత్రిలో ఉంచేశాం.

* బాలయ్యబాబుతో హ్యాట్రిక్ సినిమా ఆశించొచ్చా?
- తప్పకుండా. సింహా తరవాత బాలయ్య బాబుని ఎలా చూపించాలి?? అనే విషయంలో చాలా మథన పడ్డా. అది అసంభవం ఏమో అనిపించింది. అయితే మంచి కథ దొరికితే అన్ని సాధ్యమేనండీ. బాలయ్యకు సరిపడా పవర్ ఫుల్ కథ దొరికితే.. ఆయనతో మరో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.

* హీరోయిజాన్ని ప్రతి సినిమాలోనూ అద్భుతంగా పండిస్తారు. మీ విజయ రహస్యం ఇదేనా??
- నాకు సినిమాలంటే పిచ్చి. ఏ హీరోని తెరపై ఎలా చూడాలనుకొంటానో నాకు తెలుసు. సగటు అభిమానిగా చెబుతున్నా.. హీరో అంటేనే పవర్ ఫుల్ గా కనిపించాలని ఆశపడతా. నేను అలానేచూపిస్తా. అయితే అదొక్కటే సరిపోదు. సినిమా అన్నాక.. అన్ని ఎమోషన్స్ ఉండాలి. అందులో హీరోయిజం కూడా ఒకటి. నా సినిమాలు తీసుకోండి. ప్రతీ సినిమాలోనూ ఫ్యామిలీ టచ్ ఉంటుంది. అది లేకుండా నా సినిమా ఏదీ లేదు. వినోదం, మంచి పాటలు ఉంటాయి. ఇవీ సినిమాకి ముఖ్యమే కదా.. కాకపోతే హీరోయిజమే బాగా ఎలివేట్ అయ్యింది. దాంతో నాకూ ఆ పేరొచ్చింది.

* పెద్ద హీరో దొరగ్గానే... కమర్షియల్ సినిమాలు తీసుకొంటూ వెళ్తున్నాం. మరి ప్రయోగాలు చేసేదెప్పుడు?
- పెద్ద హీరోలతో ప్రయోగాలు చేయకూడదు. మా హీరోని ఇలానే చూడాలనుకొంటాం.. అని అభిమానులు థియేటర్లకు వస్తారు. వాని ఆశలకు భంగం కలగకూడదు. వాళ్లేం ఆశిస్తారో అవన్నీ తెరపై కనిపిస్తేనే సంబరంగా ఉంటుంది. అలాగని మూస ధోరణిలోకి వెళ్లకూడదు. వాళ్లు కోరుకొనే అంశాలనే కొత్తగా చూపించాలి. మంచి సినిమాలు మనం తీయలేక కాదు.. మనకు చేతకాకా కాదు. కాని ఓ సినిమా తీసేముందు చాలా విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. కొత్త వాళ్లతో ప్రయోగాలు చేసుకోవచ్చు. కానీ స్టార్ హీరోలతో చేస్తే చాలా రిస్క్. నిర్మాతలనీ దృష్టిలో ఉంచుకోవాలి కదా?

* మీ నుంచి యాక్షన్ కథలే ఆశించాలా?
- అలాగని ఏం లేదు. అన్ని రకాల సినిమాలూ చేయాలి. అయితే కథను బట్టి, మనకు దొరికిన హీరోని బట్టి.. ప్రయాణం సాగించాలి. ఇలాంటి కథలే చేయాలన్న రూలు లేదు. అన్నీ చేస్తా.

* చరణ్ తో సినిమా ఎప్పుడు? అదెలా ఉంటుంది?
- చరణ్ గారికీ, చిరంజీవిగారికీ కథ వినిపించా. అదో.. రొమాంటిక్ యాక్షన్ సినిమా. ప్రేమ, యాక్షన్, వినోదం అన్నీ ఉంటాయి. మెగా అభిమానులకు పండగలా ఉంటుంది. పూర్తి స్థాయిలో స్ర్కిప్ట్ సిద్ధం చేసుకోవడానికి ఇంకొంత సమయం పడుతుంది.

* చరణ్ పక్కన కథానాయిక ఎవరు?
- ఇంకా ఏం అనుకోలేదు. కథ సిద్ధం చేయాలి. ఆ తరవాతే... మిగిలిన అంశాలు.

* ఓకే... మీనుంచి మరో హిట్ ఆశిస్తున్నాం.. ఆల్ ది బెస్ట్
- థ్యాంక్యూ. నా ప్రయత్నంకూడా అదే. ఇక మీదట కూడా మంచి సినిమాలే తీస్తా..! చివరగా లెజెండ్ ని ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
movie review Rowdy