Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

''ఇదిగో అబ్బాయ్‌. ఎవర్నువ్వు?'' అంటూ ఎదుటి బెర్త్‌మీది ఓ పెద్దాయన అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు.

''మీరెవరు...?'' అయనవైపు తిరిగి ఎదురు ప్రశ్నించాడు త్రివిక్రమ్‌.

సుమారు అరవై అయిదేళ్లు వయసు బట్టతల, కోరమీసంతో చాలా హూందాగా వున్నాడాయన. ఎ.సి. కోచ్‌ గావటంతో ఆహ్లాదంగా కంపర్టబుల్‌గా వుంది.

ఆయన బాసిపట్టు వేసుక్కూర్చున్నాడు.

''నా సంగతికాదు, నీ సంగతి చెప్పు. ఆ సూట్‌కేసు నీదికాదు'' దబాయించాడాయన.

ఏదో ట్రబుల్‌ స్టార్ట్‌ కాబోతోందని....

త్రివిక్రమ్‌కి అర్థమైపోయింది.

ఎవడీ ముసలాడు?

'దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడంటే ఇదే కావచ్చు. ఈ ముసలాడు ఎవడండీ బాబూ....' అనుకుంటూ ఆయన్ని చూసి పళ్ళికిలించాడు.

''ఈ సూట్‌కేస్‌ నాది కాదని మీతోచెప్పిన శుంఠెవడు?'' అనడిగాడు.

''ఎవడో ఏమిటయ్యా. సూట్‌కేస్‌ ఇక్కడ పెట్టింది నువ్వుకాదు. ఎవడో కుర్రాడు ఇప్పుడే వచ్చేస్తాను. చూస్తుండండి అనిచెప్పి వేగంగా బయటికెళ్ళాడు. ఇప్పుడు నువ్వెవరో వచ్చి, ఈ పెట్టి నాదంటే ఎలా.'' దబాయించాడాయన.

''ఎలా అంటే? ఎవరిదో సూట్‌కేసు నేను దోచుకుంటున్నాననా మీ ఉద్దేశం? భలే వారండి. మీకు మతిమరుపు ఎక్కువైనట్టుంది. సరిగ్గా చూడండి. మీతో చెప్పి వెళ్ళింది నేనే'' అంటూ సమర్థించుకున్నాడు త్రివిక్రమ్‌.

ముసలాయన నమ్మలేదు.

''అబద్ధం... ఇది పచ్చి అబద్ధం నాకు చెప్పిన కుర్రాడు నువ్వుకాదు'' అన్నాడు పట్టుదలగా.

''నేను గాకపోతే నా బ్రదర్‌ ఇప్పుడేమంటావ్‌...? హలో మీ వయసుకు మర్యాద యిచ్చి మాట్లాడుతున్నాను. అనవసరంగా గొడవపెట్టుకోవద్దు. తర్వాత బాగుండదు.''

''ఏమిటయ్యా దబాయింపు. నువ్వు కాదంటున్నాగా. ఆ కుర్రాడు రానీ. అంతదాకా నువ్వు సూట్‌కేసు టచ్‌ చేయటానికి వీల్లేదు...'' అన్నాడాయన.

ఇంతలో టి.సి. వచ్చాడు.

''ఏమిటండీ! ఏమిటిక్కడ గొడవ...?'' యిద్దర్నీ చూస్తూ విచారించాడు.

''చూడండి సార్‌. ఈ ముసలాయన నాకు పెద్ద తలనొప్పి కలిగిస్తున్నాడు. నా సూట్‌కేస్‌ బెర్త్‌మీద పెట్టి, డోర్‌లోకి వెళ్ళి ఫ్రెండ్‌కి టాటా చెప్పి వచ్చాను. ఇంతలో ఈయన ఈ సూట్‌కేసు పెట్టింది నువ్వు కాదు అంటున్నాడు. అలా వంకపెట్టి నా సూట్‌కేసు కొట్టేయాలని చూస్తున్నాడు సార్‌.

మీరే చూడండి. ఇది నా రిజర్వేషన్‌ టికెట్‌. అయాం వినోద్‌. ఇది నాపర్సు. ఈ తాళంచెవి చూసారా? ఇది నా సూట్‌కేస్‌ తాళం. మీరేచూడండి. ఏమిటీ ముసలాయన? నా సూట్‌కేసుని పట్టుకుని, వాడెవడిదో అంటాడు'' అంటూ సమస్య వివరించాడు త్రివిక్రమ్‌.

టి.సి. టికెట్‌ చెక్‌చేసిచ్చాడు.

''మీరింకేం మాట్లాడకండి సార్‌. వాడెవడో సూట్‌కేస్‌ వదిలిపోతే ఈ టికెట్టు, సూట్‌కేసు తాళం ఇవన్నీ ఇతనికెలా వచ్చాయి? అనవసరంగా న్యూసెన్స్‌ చేయకండి ప్లీజ్‌ కీప్‌ క్వైట్‌'' అంటూ ఆ పెద్దాయన్ని మందలించి అక్కడ్నించి వెళ్ళిపోయాడు టి.సి.

అప్పుడుగాని ఆ పెద్దాయన నోరు మూతపడలేదు.

సూట్‌కేస్‌ ఓపెన్‌ చేసాడు త్రివిక్రమ్‌.

లోన అయిదు జతల ఖరీదైన డ్రస్‌లు వున్నాయి. క్రెడిట్‌ కార్డుతో బాటు మరికొంత కేష్‌కూడా వుంది. సన్‌ ఆటోమొబైల్స్‌ స్పేర్‌పార్ట్‌ కంపెనీకి సంబంధించి రెండు ఫైళ్ళు వున్నాయి. ఒక పర్సనల్‌ ఫైల్‌ కూడా వుంది. అందులోని వివరాలు చదివి ఆశ్చర్యంతో నిజంగానే తలమునకలయ్యాడు త్రివిక్రమ్‌.

ఎందుకంటే....

సదరు ఒరిజినల్‌ కంగారు జంతువు అనుకున్న వినోద్‌ అతను ఒక అసాధారణమైన వ్యక్తి అని ఆ ఫైల్‌ చూసాక అర్థమైంది.

అతను ఇండియాలో ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ చేసాడు. డెట్రాయిట్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ మిచిగాన్‌లో ఆటోమొబైల్‌లో ఎమ్‌.ఎస్‌. చేసాడు. అంతేకాదు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ఎం.బి.ఎ. చేసాడు.

చిన్నవయసులోనే ఇంత చదువు చదవటం అనేది అరుదయిన విషయం. ఇంటర్మీడియట్‌ తప్పిన తను ఎక్కడ, ఫారిన్‌లో ఇంజనీరింగ్‌ పై చదువులు చదివిన వినోద్‌ ఎక్కడ?

ఇదే అంటారు. చదివేస్తే వున్న మతి పోయింది అని. ఆ మాట కొందరి విషయంలో ముఖ్యంగా వినోద్‌లాంటి వాళ్ళ విషయంలో కరక్టే అన్పిస్తుంది. అందుకే అతడిలో అంత కంగారు... మతిమరుపు... లేకపోతే ఇంత చదివినవాడు అటు పర్సు, ఇటు సూట్‌కేసు కూడా పోగొట్టుకుని దిక్కులు చూస్తూ ప్లాట్‌ఫాంమీద ఎందుకు నిలబడతాడు.

వినోద్‌ గురించి ఆలోచిస్తుంటే...

ఒక పిట్టకథ గుర్తుకొచ్చింది త్రివిక్రమ్‌కి.

వేదవేదాంగాలు చదివిన పండితుడు ఒకాయన సంధ్యవార్చుకోడానికి ఒక నదివద్దకొచ్చాడు. పై బట్టను ఉతికి పిండి పొదలమీద ఆరేసుకున్నాడు. నడుంకి తుండుగుడ్డ చుట్టుకుని స్నానానికి నదిలో దిగాడు. స్నానంచేసి సంధ్య వార్చుకుని పైకి వస్తూండగా తుండుగుడ్డ జారి నీటిలో కొట్టుకు పోనారంభించింది. దాన్ని పట్టుకోవాలని కంగారుగా ప్రవాహంలో కాసేపు వెదికాడుగాని అది దొరకలేదు.

సరి పొదలమీద ఆరేసిన పైబట్ట వుందికదా దాన్ని వంటికి చుట్టుకుందామని తీరం ఎక్కాడు. సరిగ్గా అదే సమయంలో పెద్ద సుడిగాలి వచ్చింది పొదలమీది పైబట్ట కూడా సుడిగాలి వెంట ఎగిరి నదిమధ్యలో పడి ప్రవాహంలో కలిసిపోయింది. రెంటికి చెడ్డాడు అంత పండితుడు కూడా. ప్రస్తుతం ఆ పండితుడికి, ఈ వినోద్‌కి అట్టే తేడా లేదనిపించింది.

అయినా తనేమన్నా కావాలని అతడి పర్సు, సూట్‌కేసు కొట్టేయలేదుకదా. మహా అయితే తను క్రికెట్‌ మేచ్‌ చూసి తిరిగి హైదరాబాద్‌ చేరుకోడానికి రెండు వేలకు మించదు ఖర్చు. తను తిరిగి రాగానే ఈ పెద్ద మనిషికి ఫోన్‌చేసి అతడి పర్సు, సూట్‌కేసు అతడికి తిరిగి ఇచ్చేస్తే సరి. జైల్లో తన దగ్గర పాతిక ముప్పై వేలవరకు డబ్బుంది. నో ప్రాబ్లం.

ఇలా మనసును సరిపెట్టుకుని....

సూట్‌కేసును యధాప్రకారం మూసి లాక్‌ చేసి సీట్‌ కిందకు తోసాడు త్రివిక్రమ్‌.

పాపం! అక్కడ ప్లాట్‌ఫాం మీద మిష్టర్‌ వినోద్‌ అన్‌హేపీ కావచ్చుగాని తను మాత్రం హేపీగా టికెట్‌ లెస్‌గా జనరల్‌ బోగీలో దొంగలా నక్కి టి.సి. కంటపడకుండా భయంభయంగా ప్రయాణం చేయాల్సిన తను ఏకంగా తన్నితే బూరెల గంపలో పడ్డట్టు వచ్చి ఎ.సి. కంపార్ట్‌మెంట్‌లో పడ్డాడు. పడుకోడానికి బెర్తు, చేతినిండా డబ్బు ఇంకేం కావాలి? విశాఖలో రైలు దిగగానే ముందుగా టాక్సీలో స్టేడియంకి వెళ్ళి క్రికెట్‌కి టిక్కెట్‌ సంపాదించాలి. తర్వాత ఓ మాదిరి లాడ్జి చూసుకుని సెటిలవ్వాలి.

జైలర్‌ ఆంజనేయులు అసాధ్యుడు.

ఇక్కడి పోలీసులకు ఉప్పందించి తనను వెనక్కి రప్పించుకునే ప్రయత్నం చేసినా చేయొచ్చు. అందుకే దిగేది ఏదో కాస్త ఖరీదయిన లాడ్జిలోనే దిగాలి. ఎందుకంటే తను అలాంటిచోట వుంటాడని ఎవరూ వూహించలేరు.

తను ఇక నిశ్చింత.

హేపీగా కావలసినవి కొనుక్కుతిన్నాడు.

కేటరింగ్‌ నుంచి మంచి పుడ్‌ ఆర్డర్‌ చేసి సుష్టుగా భోంచేసాడు. బెర్త్‌మీద పడుకుని నిశ్చింతగా నిద్రకుపక్రమించాడు.

***

''నాకు తెలుసు.... నాకు ఎప్పుడో తెలుసురా. ఈ త్రివిక్రమ్‌ ఓ రోజు మన పీకలమీదకు తెస్తాడని నాకు బాగా తెలుసు. అందుకే చిలక్కి చెప్పినట్టు మీ అందరికీ ముందే చెప్పి హెచ్చరించాను. ఏం చేసారు? సెంట్రీలుగా కాదుగదా కనీసం సర్వెంట్స్‌గా కూడా ఎందుకూ పనికిరారని నిరూపించుకున్నారు. వాడు... ఆ బ్లడీఫూల్‌ అందరి కళ్ళు కప్పి మంత్రం వేసినట్టు మాయమయ్యాడు. ఎలా తప్పించుకున్నాడో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. వాడ్ని పట్టుకుని కట్టి వెనక్కి లాక్కొస్తామని పెద్దపోటుగాళ్ళలా వెళ్ళిన నలుగురూ చీకటిపడేసరికి చేతులూపుకుంటూ తిరిగొచ్చారు. చెప్పండి. ఇదంతా మీ అజాగ్రత్తవల్ల జరిగింది. ఏం చేద్దామనుకుంటున్నారు?'' జైలు స్టాఫ్‌ని చూస్తూ మిరపకాయ కొరికినంత ఘాటుగా కేకలు వేస్తున్నాడు జైలర్‌ ఆంజనేయులు.

''సార్‌.... త్రివిక్రమ్‌ చాలా మంచి కుర్రాడండి. క్రికెట్‌ చూసి తిరిగి జైలుకు వచ్చేస్తాడండి. టెంక్షన్‌ పడక్కర్లేదు'' అక్కడే వున్న ఓ ఖైదీ నచ్చచెప్పే ధోరణిలో తన అభిప్రాయం చెప్పాడు.

ఆ మాటలతో....

అగ్గిలం మీద గుగ్గిలంలా భగ్గుమన్నాడు ఆంజనేయులు.

''నువ్వు నోర్ముయ్‌. వాడ్ని జైలునుంచి తప్పించిన వాళ్ళలో నువ్వూ వున్నావా? చెప్పరా. ఎలారా తప్పించుకున్నాడు వాడు? ఎలా మాయమయ్యాడు వాడు? పచ్చగడ్డి బండిమీదనే తప్పించారు కదూ వాడ్ని?'' లాఠీ వూపుతూ మీదికొస్తున్న జైలర్‌ని చూసి ఠారెత్తిపోతూ అయిదుఅడుగులు వెనక్కి వెళ్ళి నిల్చున్నాడా ఖైదీ.

''అయ్యబాబోయ్‌. నాకేం తెలీదు సార్‌! ఇది అన్యాయం. త్రివిక్రమ్‌ మంచి కుర్రాడన్నానుగాని వాడు ఎలా తప్పించుకున్నాడో నాకసలు తెలీదు సార్‌?'' అనరిచాడు.

''తెలీనివాడివి తెలీనట్టు వుండు. పిచ్చివాగుడు వాగితే తాటతీస్తా'' అంటూ తన స్టాఫ్‌ వంక సీరియస్‌గా చూసాడు జైలరు.

''చెప్పండయ్యా! వినపడటంలేదా! నా మాటలు మీకు విన్పించటం లేదా? వాడ్ని ఎలాగూ బయటకు పోకుండా ఆపలేకపోయారు. కనీసం ఏం చేస్తే ఈ గండం గడుస్తుందో అదయినా చెప్పి తగలడండి''.

''సార్‌! నాదో డౌటు'' అన్నాడు ఓ కానిస్టేబుల్‌.

''నీ బతుకు ఎప్పుడూ డౌట్లతోనే గడచిపోతుంది. నేను ఈ జైలు సూపర్నెంట్‌గా వచ్చినప్పట్నుంచి నిన్ను చూస్తూనే వున్నాను. చెప్పి తగలడు. ఏమిటా డౌటు?'' అనడిగాడు ఆంజనేయులు.

''ఆ కుర్రాడు జైలు డ్రస్‌లో వున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. అంచేత వాడు విశాఖపట్నం ఇంకా వెళ్ళుండడు. ఇక్కడే సిటీలో ఎక్కడో తిరుగుతూ డబ్బుకోసం చూస్తూంటాడు. మనం గాలింపు ముమ్మరం చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాడు'' చెప్పాడతను.

ఆ మాటలతో జైలర్‌ కోపం మరో మెట్టు పైకి పోయింది.

''ముయ్‌... నోర్ముయ్‌.. చచ్చు సలహా నువ్వూను. వాడేమన్నా నీలా తెలివితక్కువ ఫూల్‌ అనుకున్నావా? జగత్‌జంత్రీ. ఏదో ఒకటిచేసి ఈ పాటికి విశాఖ జర్నీ చేస్తుంటాడు. పూల్‌. ఇడియట్‌. ఇక్కడ టౌన్‌లో గాలించాలట. చచ్చు సలహాలిస్తే కాల్చిపారేస్తాను. లాభం లేదుగాని ఇదిగో సుబ్బారావ్‌. ఇలారా'' అంటూ ఇన్‌చార్జిని పలిచాడు.

''యస్‌ సార్‌!'' అంటూ ముందుకొచ్చాడతను.

''ఈ గొడవ బయటకు పొక్కితే జైలుపరువులు వీధినపడతాయి. పచ్చగడ్డి కోతవద్ద కాపలా వున్న సెంట్రీలు ముగ్గురూ ఎక్కడ?'' అడిగాడు.

''వాళ్ళే సార్‌'' అంటూ ముగ్గుర్ని చూపించాడు సుబ్బారావు.

''ఇలా రండిరా'' వాళ్ళు ముగ్గుర్ని దగ్గరకు పిలిచాడు.

''ఈ రోజునుంచి మీ ముగ్గురి డ్యూటీ ఏమిటో తెలుసా? సెంట్రీ డ్యూటీ కాదు. సెల్‌ డ్యూటీ. రాత్రి ఒకడు. పగలు ఒకడు. జైలు డ్రస్సు వేసుకుని త్రివిక్రమ్‌ సెల్‌లో వుండండి. పై అధికారులు ఎవరు వచ్చినా సెల్‌ ఖాళీగా కనబడకూడదు. మీ అజాగ్రత్తకి అదే సరయిన శిక్ష ఇదిగో సుబ్బారావ్‌. వీళ్ళని కనిపెట్టి చూడాల్సిని బాధ్యత నీది''

''అలాగే సార్‌.''

''మరో మాట.''

''చెప్పండి సార్‌.''

''ఏడీ.... వెంకటసామి ఎక్కడ?''

''ఇక్కడ వున్నాను సార్‌'' అంటూ పోలీసు వెంకటసామి ముందు కొచ్చాడు.

''ఆ! నీకు, ఆ ధర్మారావుకి వారం రోజులు శెలవు యిస్తున్నాను. అలాగని మీరు హేపీగా ఇంట్లో కాలక్షేపం చేస్తారని కాదు. మీ ఇద్దరూ ఉదయం వైజాగ్‌ రైలెక్కి విశాఖపట్నం వెళుతున్నారు. ఆ మాయగాడు త్రివిక్రమ్‌ ఎక్కడున్నా పట్టుకుని నచ్చచెప్పి వెనక్కి తీసుకొస్తున్నారు.''

''అమ్మో.... ఈ ధర్మారావుకి అన్నీ ధర్మసందేహాలే వస్తుంటాయి. మరొకడ్ని యివ్వండి సార్‌'' అరిచాడు పోలీసు వెంకటసామి.

''ధర్మసందేహాలు వాడి సహజగుణం. కానీ ఓర్పుగా నచ్చచెప్పటంలో వాడు నీకన్నా ఎక్కువ. అందుకే వాడ్ని నీ వెంట పంపిస్తున్నాను'' వివరించాడు జైలరు.

''సార్‌'' అనరిచాడు ధర్మారావు.

''ఏమైంది?''

''ఏం లేదు సార్‌! సందేహం... అంత మహానగరంలో ఈ త్రివిక్రముడ్ని వెదికి పట్టుకోవటం మావల్లవుతుందంటారా?''

తల విదిలించాడు జైలరు.

''ఆరంభించావా నీ సందేహాలు? ఆలోచించండయ్యా! దేవుడు మనిషికి రెండు కాళ్ళు, రెండు చేతులిచ్చింది కష్టపడి పనిచేయటానికి. తలకాయలో మెదడు వుంచింది ఆలోచించి పనిచేయటానికి. ఆ త్రివిక్రమ్‌కి క్రికెట్‌ పిచ్చి అని తెలుసుగదా! స్టేడియం దగ్గరో, ఆ పరిసరాల్లోనో తిరుగుతుంటాడు. ఇదికూడా నేను చెప్పాలా... ఇంద... మీ ఇద్దరికీ ఖర్చులకి చెరో వెయ్యిరూపాయలు యిస్తున్నాను. తెల్లవారేసరికిక మీరిక్కడ వుండకూడదు. వైజాగ్‌ రైల్లో వుండాలి. డబ్బు తీసుకుని ఇక్కడే కన్పిస్తే కాల్చి పారేస్తాను కమాన్‌'' అంటూ వెంకటసామికి వెయ్యి, ధర్మారావుకి వెయ్యి రూపాయలిచ్చి పంపించేసాడు ఆంజనేయులు.

స్టాఫ్‌ డిస్టర్బ్‌ అయింది.

ఇన్‌చార్జి సుబ్బారావు, జైలరు ఆంజనేయులు మాత్రం మిగిలారు.

సుబ్బారావు తల తడవుకుంటూ సందేహంగా చూసాడు.

''ఏమిటయ్యా... ఏనీ ప్రాబ్లం?'' అడిగాడు జైలరు.

''ఈ త్రివిక్రమే సర్‌ మనకి ప్రాబ్లం! ఈ విషయం పై అధికారులకి చెప్పకుండా దాచి పొరబాటు చేస్తున్నామేమోనని డౌటుగా వుంది'' నసిగాడు.

''అవును. పొరపాటే... కానీ తప్పదు. ఈ వెధవ హత్యలో, మానభంగాలో చేసి జైలుకురాలేదు. బ్యాంకుదోపిడీ కేసు. కుర్రాడు మంచాడయ్యా. వాడా దొంగతనం చేసాడో లేదోగానీ ఈ విషయాన్ని సీరియస్‌చేస్తే అదనంగా మరో మూడేళ్ళు జైలుశిక్ష పడుతుంది వాడికి. అందుకే... వాడ్ని కాపాడాలని నాప్రయత్నం. ఒక మంచి పనికోసం రిస్క్‌ తీసుకోక తప్పటంలేదు. చెప్పింది గుర్తుందిగా... ఆ వెధవలు ముగ్గురికీ రోజుకొకడికి జైలు దుస్తులువేసి త్రివిక్రమ్‌ సెల్లో కూర్చోబెట్టు. బి కేర్‌పుల్‌'' అంటూ హెచ్చరించి సుబ్బారావుని పంపించిచేసాడు ఆంజనేయులు.

***

''దయచేసి వినండి ... సికింద్రాబాద్‌ నుండి విశాఖపట్నం వచ్చు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ మరికొద్దినిముషాల్లో ఒకటో నంబరు ఫ్లాట్‌ పారమునకు వచ్చుచున్నది.

విశాఖటప్నం రైల్వేస్టేషన్‌ స్పీకర్లోంచి మార్చి మార్చి మూడు భాషల్లో  రైల్వే అనౌన్స్‌మెంట్‌.

ఒకటో నంబరు ప్లాట్‌ఫారం అంతా ఒకటే సందడిగా ఉంది

ఉదయం ఆరుగంటల ప్రాంతం.

సరిగ్గా ఏ.సి. కంపార్ట్‌మెంట్‌ ఆగేచోట

సుమారు ఇరవైమంది గుంపుగా నిలబడున్నారు.

వాళ్ళలో అరడజనుమంది లేడీస్‌ కూడా వున్నారు. అంతా చాలా నీట్‌గా, ఆఫీషియల్‌గా తయారై వచ్చారు. అందరి ఛాతీలమీద సన్‌ ఆటో మొబైల్స్‌లోగోలు వేలాడుతున్నాయి. నలుగురి చేతిలో బొకేలు, ఇద్దరి చేతుల్లో పూలదండలు కూడా వున్నాయి.

వాళ్ళంతా సన్‌ఆటోమొబైల్‌ విశాఖపట్నంకి చెందిన స్టాఫ్‌.

హైద్రాబాద్‌లోని మెయిన్‌బ్రాంచి నుంచి ఇక్కడి బ్రాంచిని తనిఖీచేయటంకోసం ఒక ఆటోమొబైల్‌ ఇంజనీర్‌ వస్తున్నాడని తెలీగానే ఆయన్ని మంచిచేసుకోవటం కోసం, ఫార్మాలిటీగా స్వాగత సత్కారాలకు ఏర్పాటుచేస్తూ ఉదయమే స్టాఫ్‌తో స్టేషన్‌కు చేరుకున్నాడు బ్రాంచి మేనేజర్‌ మధుసూధనరావు.

ఆయనకు ఏభై సంవత్సరాలుంటాయి.

జుత్తు నెరిసింది. నీట్‌గా టక్‌చేసి, టై కట్టాడు

చేతిలో ఫ్లవర్‌ బొకే ఉంది.

ఆయన పక్కనే ఒక అమ్మాయి నిలబడుంది.

లావుగా, బొద్దుగా, గుండుమల్లిలా వుంది.

స్లిమ్‌గా కనబడాలని కాబోలు చుడీదార్‌ ధరించి, చున్నీ వేసుకుంది. ఆపైన పోనీటైల్‌, కళ్ళకు కళ్ళజోడు, గుండ్రంగా చపాతీలాంటి ముఖం.

రైల్వే అనౌస్స్‌మెంట్‌ వినగానే ఆ అమ్మాయి ముఖం ఉత్సాహంతో మతాబులా వెలిగింది.

''వచ్చేస్తున్నాడు... మనోజ్‌ వచ్చేస్తున్నాడు డాడీ! ఆయన వచ్చేస్తున్నాడు'' అంటూ మధుసూదనరావు చేయి పుచ్చుకొని చిన్నపిల్లలా ఎగిరింది.

ఆయన నుదురు కొట్టుకున్నాడు.

''నా ఖర్మ! నిన్ను వెంట తీసుకొచ్చానుచూడు.... వచ్చేది మనిషికాదే, రైలు రైలు వస్తుంది, ఆయన రైలు దిగుతాడు. ఆయన పేరు మనోజ్‌ కాదు వినోద్‌..... అర్ధమైంది?'' అంటూ హెచ్చరించాడు.

ఆ పిల్ల ముఖం చిన్నబుచ్చుకుంది.

''అదేమిటో  డాడీ! వచ్చేది వినోద్‌కాదు, మనోజ్‌ అని నా మనసుచెపుతోంది''.

''వచ్చేది వినోద్‌. అది మర్చిపోకు, ఆయన ముందు కూడా ఇలా పిచ్చి పిచ్చిగా వాగి నా పరువుతీయకు నీకు మా ఆఫీసులో జాబ్‌పెట్టి తప్పుచేసాను'' అంటూ విసుకున్నాడాయన''.

అంతేకాదు

స్టాఫ్‌వంక సీరియస్‌గా చూసాడు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekamber