Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrudayam

ఎన్నికలలో ఎన్ని 'కల' లో...

కరికి ఎమ్మెల్యే నో, సర్పంచో, వార్డ్ కౌన్సిలరో, ఎమ్ పీ నో, సి ఎమ్ ఓ, పీ ఎమ్ ఓ ఏదో ఒకటి అయిపోవాలని ఆశ.

ఇంకొకరికి ఇలా అయిన వాళ్ళందరినీ ఎండగట్టి, ఉతికారేసే ఉద్యోగం చేయాలని ఆశ.

ఇంకొకరికి వీళ్లు పదో, పరకో, ల్యాప్ టాపో, సెల్ ఫోనో, వెయ్యి నోటో, మందు బాటిలో, పట్టు చీరో, వాషింగ్ మెషినో, టేబుల్ ఫ్యానో, స్కూలు బ్యాగో ఇస్తే తీసుకుందామని ఆశ.

మరొకరికి ఇవేవీ కాకుండా మంచివాళ్లని, విద్యాధికుల్ని, నీతిమంతుల్ని, బుద్ధిమంతుల్ని వోటేసి ఉన్నత పదవుల్లో కూర్చోపెట్టాలని ఆశ.

ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కల... ఎన్ని 'కల' వేళ. సారీ... ఎన్ని 'కలల' వేళ.

వ్యక్తి బావుంటే కుటుంబం, కుటుంబం బావుంటే వీధి, వీధి బావుంటే ఊరు, ఊరు బావుంటే జిల్లా, జిల్లా బావుంటే రాష్ట్రం, రాష్ట్రం బావుంటే దేశం, దేశం బావుంటే ప్రపంచం బావుంటాయని. ఇది నిజమైతే, వ్యక్తి బావుండాలని  ప్రయత్నించడాన్ని స్వార్ధం అని ఎందుకంటారో...

దేశం కోసం త్యాగం చేస్తేనే దేశభక్తుడని, దేశం కోసం ఓ మనిషి బాగుపడితే స్వార్ధ పరుడనో, దేశద్రోహి అనో ఎలా అంటారో నాకు అర్ధం కాదు.

కుటుంబం వరకు ఓ వ్యక్తి ఎదిగితే హర్షిస్తారు. అది దాటి ప్రజల్లో కొచ్చాక త్యాగం చేయకపోతే విమర్శిస్తారు. ఏ స్థాయిలో ఉన్న ప్రజలకైనా వాళ్లపైన ఓ నాయకుడు ఉన్నాడంటే నచ్చదు. వాణ్ని ఏదో రకంగా విమర్శించాలనో, నిలదీయాలనో ఉంటుంది. ఆ ఇగోని చల్లార్చడానికే ఎన్నికలప్పుడు నాయకులు సేవకుల్లాగా వంగి వంగి దణ్ణాలు పెడతారు, కాళ్ల మీద పడతారు. కోట్లు ఖర్చుపెడతారు.

ఒక్కసారి వోటు పడి, ఒడ్డున పడ్డారా... కాళ్లకింద తొక్కుతారు, వంగోపెట్టి తంతారు, కోట్లు సంపాదించడానికి ఉద్యమిస్తారు. ఇది ఎన్నికలకి ముందు, ఆ తర్వాత ప్రతిసారీ జరిగే తతంగమే. ఈ చక్రభ్రమణంలో వంగినా, వంగోపెట్టి తన్నినా నాయకుడిదే పైచేయి. ప్రజలది చాలా తాత్కాలికమైన అహం సంతృప్తి - అంతే.

ఈ మధ్య అనుకోకుండా కొన్ని కుగ్రామాలు సందర్శించాల్సి వచ్చింది నేను. నిజాం పాలన కంటే ముందు అభివృద్ధి ఎక్కడ ఆగిందో, ఇవాళ్టికీ అక్కడే ఆగిపోయినట్టున్నాయి తెలంగాణాలో ఆ ప్రాంతాలు. పోనీ మారుమూల ఉన్నాయా అంటే, హైదరాబాద్ కి 80 కిలోమీటర్ల లోపు దూరంలో.

అయిదు మండలాల్లో, రెండు వందల గ్రామాలకి కలిపి ఒక్క సినిమా థియేటర్ కూడా లేదు. ఇంకా ఆ ప్రజలకి చాలా సదుపాయాలు కూడా లేవు. విచిత్రంగా అక్కడ ప్రస్తుతం పదవులు పొందిన నాయకులకి తమగోడు వెళ్లబోసుకుందామని వెళ్తే, భుజం మీద చెయ్యేసి జేబులో వెయ్యినోటు పెడతాట్ట పబ్లిక్ గానే. అయినా ధైర్యం చేసుకొని సమస్య చెప్పబోతే భుజం నొక్కి వెనక్కి నెడతారట! వెనకున్న అనుచరులు అలాగే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి సెల్ లో పెడతారట, సదరు నేత ఊరొదిలి వెళ్ళగానే వదిలేస్తారట.

మరోచోట స్త్రీలు వెళ్లి మాకు, మగవాళ్లకి బహిర్భూమి ఒక దగ్గరే ఉంది. ఏళ్ల తరబడి ఇది ఇబ్బందిగా ఉంది మహిళలకి ప్రత్యేకంగా మరుగుదొడ్లు కట్టించమని అడిగితే, మీరు ఓట్లేశారా నాకు? మీరు ఓట్లేసిన వాడు ఓడిపోయాడు. వెళ్లి వాణ్ని అడగండి - నాకు ఓటెయ్యకుండా నన్నెందుకు అడుగుతున్నారు? అని ఎదురు నిలదీశాట్ట. తెల్లపోవడం వీళ్ల వంతైంది.

మొన్నా మధ్యన ఎక్కడో ఓ ప్రజానేత ఎన్నికల్లో ఓడిపోగానే తన అనుచరుల్ని పంపించి గ్రామస్తుల్ని కొట్టించాట్ట - డబ్బు తీసుకుని ఓటెయ్యలేదని.

ఇంత ఖచ్చితంగా నాయకులకి ఎలా తెలిసిపోతోందో... ఎవరు ఓట్లేశారు, ఎవరు వేయలేదు అని.

పత్రికలు, ఛానల్స్, జర్నలిస్టులు, సినిమా వాళ్లు, వ్యాపార వర్గాల వాళ్లు అందరూ ఈసారి ఎన్నికల్లో పార్టీల జెండాలు పట్టేసుకున్నారు. ఒకే కుటుంబంలో, ఒకే సంస్థలో, ఒకే పరిశ్రమలో కలిసున్న వాళ్ళంతా ఈ ఎన్నికల పుణ్యమా అని అయిదారు భాగాలైపోయారు. కానీ, అలా విడగొట్టిన నేతలు మాత్రం విభజించిన రెండు భాగాల గురించే మాట్లాడతారు.

విభజన ఏళ్ల తరబడి జరిగిపోతోంది ఎన్నికలప్పుడు.

ప్రతి ఎన్నికల్లోను ఎవరో ఒకరికి ప్రచార దురద ఉంటుంది. దానివల్ల మిగిలిన అందరూ ఆ రేంజ్ లో ప్రచారాలకి ఆర్భాటంగా ఖర్చుపెట్టాల్సి వస్తుంది.

వందకోట్ల పైచిలుకు ప్రజలున్న భారతదేశంలో ప్రచారం ధాటిగా చేయకపోతే అందరికీ తెలీదని సరిపెట్టుకుందాం. అదే ప్రణాళిక పథకాలు అందరికీ అందడానికి ఎందుకు రచించరో నాకిప్పటికీ అర్ధం కాదు.

ఈ ఎన్నికల్లో ప్రధాని అవ్వాలన్న కలతో ప్రచార దురద ప్రారంభించింది నమోగారు. ఆయన పుణ్యమాని ఆయన పెడుతున్న మూడొందల కోట్ల పైబడిన ప్రచార బడ్జెట్ ని మీట్ అవ్వడానికి మిగిలిన పార్టీలన్నీ నానా కష్టాలు పడుతున్నాయి.

కానీ, ఈ ప్రచార పోటీవల్ల సినిమా, టీవీ పరిశ్రమల వాళ్లకి మాత్రం ఈ మూడు నెలలు మంచి ఆదాయం. రచయితలు, దర్శకులు, కెమెరామెన్లు, ఎడిటింగ్ సూట్ లు, పాటల రికార్డింగ్ లు, దాదాపు సినిమాకి, టీవీకి ఎడ్వర్టైజ్ మెంట్ కి చేసే పనంతా చేయాలి. డబ్బులు చేతికందుతుంటాయి. ఇదింకా ఎక్కువై జనాభా పెరుగుతున్న నిష్పత్తిలో ప్రచారం పెరగాలన్నది నా కల. ఎన్నికల వల్ల ప్రజలకెలాగూ పెద్ద ఉపయోగం లేదు. మనం ఎప్పుడూ మనక్కావలసిన మంచి నాయకుడిని ఎన్నుకోం కాబట్టి, పబ్లిక్ ఛరిష్మా ఉన్న వ్యక్తినే ఫాలో అయిపోతాం కాబట్టి.

ఆ వ్యక్తి సహజంగానే తనని తాను ప్రమోట్ చేసుకునే పైకొచ్చుంటాడు కాబట్టి, కొద్దో గొప్పో ప్రచారప్పిచ్చి ఉండే ఉంటుంది.

నిర్భయకన్నా ముందు, తర్వాత కూడా ఆడవారిపై ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి.

జెస్సికాలాల్ కన్నా ముందు, తర్వాత కూడా ఎందరో అబలలు బలైపోయారు. కానీ, ప్రాచుర్యం లభించిందన్న ఒకే ఒక్క కారణంతో వాటిల్లో దోషులకు కఠిన శిక్షలు పడ్డాయి. చట్టాలు కూడా మారాయి.

మంచికైనా, చెడుకైనా ప్రచారం ఎంత ముఖ్యమో కద! ఆ ప్రచారం చేసి పెట్టగలిగిన వృత్తిలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది.

ఓటు హక్కుని అది ఉన్న ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని, ఓటు వేయడానికి కచ్చితంగా అందరూ ఆ ఒక్కరోజు ఫ్రీగా టైమ్ పెట్టుకుని ఓపికని, సహనాన్ని చూపాలని, దానివల్ల అయిదేళ్లు సమాజం కష్టపడాల్సిన పని తప్పుతుందని గ్రహించాలని మనసారా కోరుకుంటూ, వెయ్యిస్తేనో, మందుపోస్తేనో, బిర్యానీ పెడితేనో ఒక నాయకుడు పదవిలోకి రాడని, ప్రజలు ఈ ఎన్నికల్లో నిరూపించాలని ఈ ఎన్నికల వేళ నా 'కల'.

 

మీ
వి.ఎన్. ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
kobbarimatta