Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review Race Gurram

ఈ సంచికలో >> సినిమా >>

బ‌న్నీ ఇచ్చిన ధైర్యం అది... - సురేందర్ రెడ్డి

Interview with Surender Reddy

క‌థానాయ‌కుల‌కే కాదు.. ద‌ర్శ‌కుల‌కూ ఓ విభిన్న‌మైన ఇమేజ్ ఉంటుంది. పూరి సినిమాకెళ్లండి.. భ‌యంక‌ర‌మైన హీరోయిజం చూసి త‌రించాల్సిందే. త్రివిక్ర‌మ్ అయితే సీరియ‌స్ డైలాగుల్లోనూ పంచ్ ప‌డాల్సిందే. రాజ‌మౌళి అన‌గానే తెర‌పై భారీద‌నం త‌న్నుకొచ్చేస్తుంది. దర్శ‌కేంద్రుడు అన‌గానే పూలూ, పండ్లూ మామూలే!  క‌థ ఎక్క‌డ మొద‌లెట్టి ఎలా ముగించినా ఈ దారులు తొక్కుకొంటూ రావాలి. హీరో ఎవ‌రైనా ఈ విన్యాసాలు చేయాలి. సురేంద‌ర్‌రెడ్డికీ అలాంటి ఇమేజ్ వ‌చ్చేసింది. ఆయ‌న స్టైలీష్ డైరెక్ట‌ర్‌. యాక్ష‌న్ సీన్స్‌ని సురేంద‌ర్‌రెడ్డి తీసినంత స్టైలీష్‌గా ప‌ద్ధ‌తిగా మ‌రొక‌రు తీయ‌రేమో. ర‌క్త‌పాతాన్ని సృష్టించ‌డంలోనూ ఇంత స్టైలేంటీ? అనుకొన్నా.. సురేంద‌ర్ రెడ్డి టేకింగ్ వాల్యూ కి స‌లాం కొట్టాల్సిందే. అత‌నొక్క‌డే, అశోక్‌, అతిథి, కిక్‌, ఊస‌ర‌వెల్లి... సినిమా ఏదైనా స‌రే, అందులో స్టైల్ ఉంటుంది. అది సురేంద‌ర్‌రెడ్డి ముద్ర‌. క‌థ చెప్ప‌డంలో ఓ డిఫ‌రెంట్ థీరీ ఫాలో అవుతారు. ఇవ‌న్నీ రేసుగుర్రంలోనూ ఉంటాయ‌న్న‌ది స‌గ‌టు సినీ అభిమాని న‌మ్మ‌కం. ఈ చిత్రం శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కులు ముందుకు వచ్చింది. ఈసంద‌ర్భంగా సురేంద‌ర్‌రెడ్డితో స్పెష‌ల్ చిట్ చాట్‌.

* దాదాపు ప‌దేళ్ల కెరీర్‌.. తీసింది ఐదు సినిమాలే. మీ కెరీర్‌లో రేసుగుర్రంలాంటి వేగం లేదు. కార‌ణం ఏంటి?
- (న‌వ్వుతూ) నేను రేసుగుర్రం కాదు.. నా సినిమాలో హీరో అలా ఉంటాడు. బైదిబై... నేను చాలా స్లో. సినిమా సెట్స్‌కి వెళ్లే ముందు.. స‌ర్వం సిద్ధం చేసుకోవాల‌న్న‌ది నా ప‌ద్ధ‌తి. అవ‌న్నీ రెడీ అయి సెట్‌కి వెళ్ల‌డానికి టైమ్ ప‌డుతుంది. ముఖ్యంగా నేను ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌ను. కాగితంపై అన్నీ ప‌ర్ ఫెక్ట్‌గా క‌నిపించాలి. ఇంకో విష‌యం ఏమిటంటే.. సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌నం తొంద‌ర‌గా రెడీ అయిపోతే కుద‌ర‌దు. నా హీరో డేట్లు దొరకాలి. హీరోయిన్ కావాలి.. ఇలా అన్నీ కుద‌రాలి. వాటికి టైమ్ ప‌డుతుంటుంది.

* హిట్స్‌, ఫ్లాప్స్ నిష్ఫ‌త్తి చూసుకొన్నారా?
- జ‌యాప‌జ‌యాలు ఎవ్వ‌రికైనా ఉండేవే. హిట్ వ‌చ్చినంత మాత్రాన కాల‌ర్ ఎగ‌ర‌వేయ‌లేదు. ఫ్లాప్ వ‌చ్చినంత మాత్ర‌న భ‌య‌ప‌డిపోలేదు. కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని ముందుకు వెళ్ల‌డ‌మే. సురేంద‌ర్‌రెడ్డి మంచి సినిమా తీశాడు.. అన్న‌దే ఎక్కువ సంతృప్తినిస్తుంది.

* ఊస‌ర‌వెల్లి ఫ‌లితం నిరాశ ప‌రిచిందా? అస‌లింత‌కీ త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది?
- ఇప్ప‌టికీ నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. చాలామంది.. `మంచి సినిమా తీశావ్‌. కొత్త‌గా ఉంది.` అని మెచ్చుకొన్నారు. కానీ కొన్ని త‌ప్పులు జ‌రిగిపోయాయి. వాటిని ప్ర‌స్తావించ‌డం అన‌వ‌స‌రం. అయితే ఆ త‌ప్పులు మ‌ళ్లీ రేసుగుర్రం విష‌యంలో రిపీట్ చేయ‌లేదు. అందుకే ఈ సినిమాపై అంత న‌మ్మ‌కం.

* రేసుగుర్రం.. అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ పెట్టేశారు. అంచ‌నాలు పెరుగుతాయ్ అన్న భ‌యం వేయ‌లేదా?
- లేదు.. ఎందుకంటే నాకు ఇలాంటి టైటిల్ పెట్ట‌గ‌ల ధైర్యం ఇచ్చింది బ‌న్నీనే. బ‌న్నీకి మాత్ర‌మే ఈ పేరు స‌రిపోతుంది. అత‌ని క్యారెక్ట‌ర్‌ని దృష్టిలో ఉంచుకొనే ఆ పేరు పెట్టాం.

* బ‌న్నీని ఎలా చూపించబోతున్నారు..?
- బ‌న్నీ ద‌గ్గ‌ర ఓ థీరి ఉంది. ఏ సినిమా ఒప్పుకొన్నా.. `నా గ‌త చిత్రాల్లా ఈ సినిమా ఉండ‌కూడ‌దు..` అనుకొంటాడు. నాకు చెప్పింది కూడా అదే. నేనూ అదే చేశా. ఇప్ప‌టి వ‌ర‌కూ మీరు చూసిన బ‌న్నీ వేరు. రేసు గుర్రంలో బ‌న్నీ వేరు. త‌న ఎన‌ర్జీ చూస్తే ముచ్చ‌టేస్తుంది. సెట్స్‌లో ఇద్ద‌రం ద‌ర్శ‌కుడు, హీరోలా ప‌నిచేయ‌లేదు. అన్నాద‌మ్మ‌ల్లానే మెగిగాం. సీన్ గురించి డెప్త్ కి వెళ్లి చ‌ర్చించుకొనేవాళ్లం. అది సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.

* కిక్ శ్యామ్‌ని తీసుకోవ‌డానికి కార‌ణం ఏంటి?  కిక్ సెంటిమెంట్‌తోనేనా?
- అదేంకాదు.. బ‌న్నీ అన్న‌య్య పాత్ర‌ని శ్యామ్ త‌ప్ప మ‌రో న‌టుడు క‌నిపించ‌లేదు. అత‌ని బాడీ లాంగ్వెజ్ ఆ పాత్ర‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. అందుకే శ్యామ్‌ని తీసుకొన్నాం.

* క‌థానాయ‌కుడిని స్టైలీష్‌గా చూపించ‌డానికి ఎక్కువ‌గా తాప‌త్ర‌య‌ప‌డ‌తారెందుకు?
- నేను అలాంటి సినిమాల్నే ఇష్ట‌ప‌డ‌తా. అందుకే స్టైలీష్‌గా తీస్తా. అయితే కేవ‌లం క‌థానాయ‌కుడిని మాత్ర‌మే టార్గెట్ చేయ‌ను. నా సినిమా అంతా స్టైలీష్‌గా ఉండాల‌నుకొంటా. క‌థానాయ‌కుడే ఎక్కువ సీన్ల‌లో క‌నిపిస్తాడు కాబట్టి నా సినిమాలో హీరో స్టెలీష్‌గా క‌నిపిస్తుంటాడు. అంతే తేడా.

* తీసిన‌వన్నీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్లే. జోన‌ర్ మార్చే ఉద్దేశం లేదా?
- ఏ దర్శ‌కుడికీ ఒకేలాంటి సినిమాలు తీయాల‌ని ఉండ‌దు. త‌ప్ప‌కుండా.. అప్పుడ‌ప్పుడూ కాస్త గేర్ మార్చాల్సిందే. ఓ ప్రేమ‌క‌థ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నా. త్వ‌ర‌లోనే నా ఆలోచ‌న‌ల‌కు అద్దం ప‌ట్టే.. ఓ ల‌వ్ స్టోరీ తీస్తా.

* బాలీవుడ్‌కి వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లేదా?
- కిక్ సినిమాని న‌న్నే చేయ‌మ‌న్నారు. కానీ.. తెలుగులో అప్ప‌టికి నాకు ఫ్లాప్ వ‌చ్చింది. ఇక్క‌డ మానేసి... అక్క‌డ‌కు వెళ్లి సినిమా చేస్తే.. కంప్లీట్ ఎన‌ర్జీతో ప‌నిచేయ‌లేను. అందుకే ఒప్పుకోలేదు. ఊస‌ర‌వెల్లి సినిమాని కొన్ని మార్పుల‌తో హిందీలో చేస్తా.. అయితే అంత‌కంటే ముందు.. ఇక్క‌డో సూప‌ర్ హిట్ కొట్టాలి.

* కిక్ 2 ఎప్పుడు?
- ఆగ‌స్టులో ఈ సినిమా మొద‌లెడ‌తాం. క‌థ రెడీ అవుతోంది. రేసుగుర్రం త‌ర‌వాత‌.. కిక్ 2 ప‌నిలో ప‌డిపోతాం.

* కిక్, కిక్ 2 క‌థ‌ల‌కు ఉన్న పోలికేంటి?
- క‌థ పూర్తిగా వేరు. హీరో క్యారెక్ట‌ర్ ఒక్క‌టే.. కంటిన్యూ అవుతుంది. కొత్త పాత్ర‌లొస్తాయి. హీరోకీ ఓ కొత్త ల‌క్ష్యం ఏర్ప‌డుతుంది.

* ఇక మీద‌టైనా స్పీడుగా సినిమాలు చేస్తారా?
- నా ప్ర‌య‌త్నం కూడా అదే.. రేసుగుర్రం అనే టైటిల్‌ని నేను కూడా న్యాయం చేయాల‌నుకొంటున్నా.

* ఒకే.. ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌.

- కాత్యాయని

 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka