Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
abhinava pothana shree vaanamaamalai varadaachaaryulugaaru

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

sahitee vanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిషమనుసంభవము

(గత సంచిక తరువాయి)


ఒక్క యెఱుకుఱేఁడు నక్కకొమ్మును నిఱ్ఱి
గోరజంబు జున్నుఁ జాఱపప్పు
పీలిగఱుల యంపకోలలు సెలవిండ్లు
కానుకిచ్చి కరయుగంబు మొగిచి

ఆ పర్వత శిఖరము మీద తన అనుచరులతో కొలువుతీర్చి కబుర్లాడుతూ, ప్రకృతి రామణీయకతను దర్శిస్తున్న స్వరోచి వద్దకు ఒక ఎరుకల రాజు వచ్చాడు. ప్రభువుకు కానుకలుగా తను తెచ్చిన వనమూలికలను, కస్తూరిని (ఇర్రి గోరజంబు), జున్నును, జీడిపప్పును, దేన్నైనా సరే చీల్చిపారేసే పదునైన బాణములను, ధనుస్సులను సమర్పించి, నమస్కరించి,

అల్లదె కంటే పొనపొన
దెల్లని గట్టఱుత మబ్బుదేఱెడి పొలమం
దెల్లెడ జూచిన ధరణీ
వల్లభ సీరాముసేన వాలు మెకంబుల్

దొరా! అదిగదిగో! సూడు..అక్కడ తల్లమబ్బు దిగిన దగ్గర పొలంలో ఎక్కడ జూసినా పెద్ద పెద్ద కోతులు, కొండముచ్చులు, అడవిపందుల మయం! ఆ అడవిపందుల పొగరు ఏం జెప్పను దొరా!

కండూతికై రాయుఁ గర్కశం బగుతుంటిఁ / బీఁటవెట్టిన మ్రాను పెల్లగిల్లఁ
జెవి దార్చి విని చీమ చిటుకన్న నొకసారి / సెలవి వెంపరలాడుఁ జిట్టలెల్లఁ
జప్పరించు వెదుళ్ళు సట లుబ్బ దంష్ట్రాగ్ని / చొంగపైఁ బడి చుంయి  చుంయి మనగ
చండ్రనిప్పులువోలెఁ దీండ్రించు కనుమించు / లెసఁగ నొండొంటిపై నెక్కఁబాఱు

వెట్టదినముల మడుఁగుల మట్టి కలఁప
బుడబుడధ్వనివెడలు బుద్బుదములందుఁ
జిలుపచిలుపని నేతుల జిడ్డు దేఱు
నేమి చెప్పుదుఁ గ్రొవ్విన యేకలములు

ఆ అడవిపందులు తీటతో మోటుగా వీపులను రుద్దుకుంటే పెద్దపెద్ద మానులు కూలుతున్నాయ్, చీమ చిటుక్కుమంటే చెవులు నిక్కించి విని, పిట్టలను మట్టగిస్తాయ్, ముళ్ళ జూలు ఉబ్బేట్లు నిలువునా పెరిగిన వెదుళ్ళను చప్పరిస్తుంటే చండ్రనిప్పుల్లాంటి కోరలమీద నుండి చొంగ కారి వెదుళ్ళమీద పడి( వెదుళ్ళను చప్పరిస్తున్నప్పుడు నిప్పుల్లాంటి కోరలమీద చొంగ పడి) చుయ్యి చుయ్యిమంటున్నది, తీపరమెక్కి ఒకదానిమీదికి ఒకటి ఎక్కడానికి చూస్తయ్, పగళ్ళు మడుగులలో దూకి మడుగులను కదుపుతుంటే బుడబుడమని బుడగలు తేలి బురదజిడ్డు తేలుతున్నది, కొవ్వు పట్టిన ఆ అడవిపందుల గురించి ఏం చెప్పను దొరా! ఇక..

బల మిఁక నేమి చెప్ప? విను పండు వెదు ళ్ళవలీల మోర త్రో
పులఁ బడఁ జొప్ప వంచుకొను పోలిక వంచి తదగ్రధాన్యముల్
సెలవుల ఫేన ముట్టిపడ జిట్టల తోడనె చప్పరించు న
ప్పొలము వరాహపోతములు భూవర! తొండము లేని యేనుగుల్!

వాటి బలం గురించి ఏం చెప్పాలి? విను దొరా! పండు వెదుళ్ళను ముట్టెలతో త్రోసి పడేసి, చొప్పగడ్డిపరకలను వంచినట్టు వంచి, వాటి కొసలను వాటిమీద ఉన్న పిట్టలతో సహా దవడలనుండి నురగ వచ్చేట్లు చప్పరించి పారేస్తయ్, ఆ పొలంలో అడవిపందులు ఒక్కమాటలో చెప్పాలంటే తొండాల్లేని ఏనుగులే!

పొడిచిన కైదువునకుఁ జము
రిడఁగా వల దగ్గిగాక యించుక యిడినన్
జెడుగఱ్ఱల గ్రుచ్చిన నం
జుఁడు మంటలఁ దగిలి నెయ్యి జొటజొట వడయున్

బాకుతో పొడిచి చంపిన తర్వాత నూనెతో తుడిచే పనే లేదు, కొద్దిగా నిప్పు సెగ తగిలితే చాలు, కర్రలకు గుచ్చి వ్రేలాడదీసి, మంటలకు తగిలిస్తే చాలు, వాటి కొవ్వు ఇట్టే కరిగి, నేయి జొటజొట కారిపోతుంది!

వలదు కుక్కల విడువంగ వలవ దేయ
నడచి మొలపిడి యమ్మునఁ బొడువవచ్చుఁ
బంకము గొరిజ దిగఁబడఁ బఱవలేవు
మన్ను లివ్వేళ రేగటి మన్నులందు

ఆ బంకమన్నులో తిరుగుతున్న మనుబోతులను, అడవి దున్నలను వేట కుక్కలను ఉసి గొలిపి చంపాల్సిన అవసరమే లేదు, తీరిగ్గా నడిచి దగ్గరికెళ్ళి మొలలోనున్న పిడిబాకుతో పొడిచి చంపెయ్యవచ్చు, ఈ కుండపోత వర్షానికి ఆ రేగటి నేలలో గిట్టలు దిగబడి, ఉరకలేవు అవి!

పొడ చెదరి బోద చఱచిన
యొడళ్ళతో నాల్గు రెండు నొకటియుఁ బ్రంగల్
వెడలిన కొమ్ముల బరువున
నడు గిడఁగా లేవు బలిసి యందలి దుప్పుల్

కళ్ళు చెదిరి, ఒళ్ళు బలిసి, ఒక్కొక్క కొమ్ముకు రెండు, నాలుగు పంగలుగా మొలిచిన కొమ్ముల బరువుకు ఒంటిబలుపు తోడై ఆ బురద రేగడి చిత్తడి నేలల్లో అడుగులేయడమే కష్టంగా ఉంటుంది అక్కడి దుప్పులకు, తేలిగ్గా వేటాడవచ్చు!

చలము లొదవ ముళ్ళు గల మ్రాఁకుదీములఁ
గెరలి తాఁకి కొమ్ము లురులఁ దగిలి
వాని లేవ నీడ్చి కానకే కొనిపోవుఁ
బోతరించి యిఱ్ఱిపోతు లచట

కసిగా ముళ్ళ తీగలను, లతలను ముట్టడించి, మట్టగించి అవి కొమ్ములకు చుట్టుకుపోయి, వాటిని వదిలించుకోలేక అలాగే ఈడ్చుకుపోతాయి అక్కడి మదమెక్కిన మగజింకలు.

కట్టియఁ జేకొని డేగం
బట్టి యుబుసుపోకఁ బొలము మట్టినఁ జాలున్
దొట్టిన క్రొవ్వులు గలయవి
చె ట్టడిచిన జేటెఁ డేమి చెప్పన్ బులుగుల్

ఉబుసుపోక, ఉత్తిగే అలా ఒక కర్ర పట్టుకుని, వేట గ్రద్దను పట్టుకుని, పొలంలోకి వెళ్తే చాలు, బలిసి కొవ్వు పట్టిన పక్షులు చెట్టుకు ఒక చేటెడు వెళ్తాయి, అలా గుంపులు గుంపులుగా మాంచి పిట్టలున్నై! ఎన్నెన్ని రకాల జంతువులు, పక్షులు! ఇప్పుడు ఎంత తేలిక వేటాడడం! కనుక దొరా వేటకు రండి అని ఆ ఎరుకల రాజు స్వరోచిని కోరాడు. వేటాడడంలో మక్కువగలవాడు, మాంచి వేటగాడు ఐన స్వరోచి 'మృగములను' మట్టుబెట్టడానికి, 'పిట్టలను' పట్టడానికి బయల్దేరాడు!

 

(ఇంకా ఉంది)

మరిన్ని శీర్షికలు
weekly horoscope April 11 - April 17