Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - రేసు గుర్రం

movie review Race Gurram

చిత్రం: రేసు గుర్రం
తారాగణం: అల్లు అర్జున్, శృతి హాసన్, శ్యాం, సుహాసిని, బ్రహ్మానందం, ఆలి, రఘు బాబు తదితరులు
కూర్పు: గౌతం రాజు
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
సంగీతం: ఎస్ ఎస్ తమన్
నిర్మాత: నల్లమలుపు బుజ్జి
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
విడుదల తేదీ: 11 ఏప్రిల్ 2014

ఆధ్యంతం ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపగలిగే నటనా ప్రతిభగల అల్లు అర్జున్, అందాల తార శృతి హాసన్ ఈ రోజు రేసుగుర్రం చిత్రంతో ముందుకొచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథా కమామిషు ఎలా ఉన్నాయో చూద్దాం.

క్లుప్తంగా చెప్పాలంటే:
రాం (శ్యాం), లక్కీ (అల్లు అర్జున్) అన్నదమ్ములు. ఒకడు పద్ధతులకి కట్టుబడి నడుచుకోవడానికి అలవాటు పడితే, ఒకడు తనదైన శైలిలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అలవాటు పడినవాడు. వీరిద్దరికీ ఒక విషయం లో వైరం వస్తుంది. ఆ వైరానికి కారణం ఏమిటి? చివరకు ఏమి జరుగుతుంది అనేది తక్కిన కథ.

మొత్తంగా చెప్పాలంటే:
కథలో కొంచెం 'తడాఖా' పోలికలు కనపడడం వల్ల కొత్తదనం లేకపోయినా కథనంతో కట్టిపడేసిన చిత్రం ఇది. మాస్ ప్రేక్షకులకి కావల్సిన అన్ని అంశాలు ఇందులో జొప్పించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అల్లు అర్జున్ నటన, శృతి హాసన్ అందం, బ్రహ్మానందం కామెడీ, ప్రకాష్ రాజ్ పాత్ర ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. సుహాసిని మొదలైన మిగిలిన తారాగణం కూడా తమ తమ పాత్రలకు బాగానే న్యాయం చేసారు.

మొదటి సగం కాస్త హాస్యం, కాస్త రొమాన్స్ తో సాగితే ద్వితీయార్ధం ప్రారంభం కొంచెం కథనం సీరియస్ గా మారుతుంది. కానీ కాసేపటికే మళ్లీ హాస్యం బాట పట్టి ప్రేక్షకులకి ఊరటనిస్తుంది.

ఏ సినిమాకైనా చివరి అరగంట కీలకం. ఈ విషయాన్ని సరిగ్గా పట్టుకున్న సురేందర్ రెడ్డి ఆఖరి 20 నిమిషాల్లో బ్రహ్మానందం చేత నవ్వులు పూయించారు. తమన్ సంగీతం, పరమహంస చాయాగ్రహణం ఇలా అన్ని అంశాల్లోను ఈ సినిమా ఒక స్థాయిని అందుకుని ఉంది. వేలెత్తి చూపడానికి కథ తప్ప వేరే విషయాలేవీ లేవు.

ఈ వేసవిలో కుటుంబ సభ్యులతో చల్లగా చూడదగ్గ చిత్రం ఈ 'రేసు గుర్రం'.

ఒక్క ముక్కలో చెప్పాలంటే: చూసేయండి

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Surender Reddy