Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugadu inter fail ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

లోపల ఉన్న మిగతా కౌంటర్లను ఇన్స్యూరెన్స్ అధికారులు ప్రారంభించారు. రెండు కౌంటర్లలో ఒకటి పాలసీలు తీసుకునేది, రెండోది నగదు కట్టించుకునేది. ఆ ప్రక్కన పొడవుగా ఉన్న కౌంటర్ పాలసీదారులు కూర్చుని వివరాలు తెలుసుకోవడానికి, పాలసీ దరఖాస్తులు, ఫిర్యాదుల దరఖాస్తులు నింపడానికి వీలుగా ఏర్పాటు చేసారు.

రెండు కౌంటర్లలోనూ ఒక దాంట్లో నూకరత్నం, రెండో దాంట్లో ఏకాంబరం చెల్లెలు కూర్చున్నారు.

ఏకాంబర్ పిలవగానే ఎంతో ఆనందంగా వచ్చిన కస్టమర్లంతా ఒకరు మీద ఒకరు పోటీ పడి వరుస పెట్టి పాలసీలు కడతామని కౌంటర్ చుట్టూ మూగేసారు.

ఏకాంబర్ ఒక్కడూ వాళ్ళకి పాలసీల వివరాలు చెప్పలేక పోయేసరికి ఇన్స్యూరెన్స్ అధికారులు కూడా ఆ కౌంటర్ లో కూర్చుని పాలసీదారులకు ఎలాంటి పాలసీ కావాలో వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి దరఖాస్తు ఫారం నింపించారు.

ఏకాంబరాన్ని ఏజెంటుగా నియమించిన ఇన్స్యూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల రాజేంద్ర తన బ్యాగ్ లో తెచ్చిన దరఖాస్తు ఫారాలన్నీ అక్కడ కౌంటర్ నిండా పరిచాడు. తనూ ఒక కుర్చీలో కూర్చొని పాలసీ దరఖాస్తులు నింపి ఎవరి వయసుకు తగ్గట్టు వారికి వారు ఎంత ప్రీమియం కట్టాలో వాయిదాల వారీగా విడమర్చి చెప్తున్నాడు.

ఏకాంబరం మధ్యమధ్యలో కౌంటర్ దగ్గరనుండి లేచి కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన వాళ్ళందర్నీ పలకరిస్తూ ఆఫీసు గురించి చెప్తున్నాడు.

ఆ హడావిడి అంతా ఓ అరగంట పాటు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని చూసాడు ఎమ్మెల్యే మేడిపండు అబద్ధాలరావు. తనకి వేరే చోట కూడా ఇలా ప్రారంభోత్సవమే ఉందంటూ ఏకాంబరానికి చెప్పి ఇక తను బయలుదేరుతానని కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. ఆయన అలా కదిలీ కదలగానే ఆయన వెంట వచ్చిన మందిమాగదులందరూ హడావిడిగా ఆయన చుట్టూ ఈగల్లా మూగేసారు...

"చాలా థేంక్స్ సార్! పిలవగానే నా మీద అభిమానంతో వచ్చినందుకు" ఎమ్మెల్యేకి షేక్ హేండ్ ఇస్తూ అన్నాడు ఏకాంబర్.

"భలేవాడివయ్యా! నా నియోజకవర్గంలో కార్యక్రమానికి నేను రాక మరెవరు వస్తారు. ఇది నా సామ్రాజ్యం. ఏదైనా ప్రారంభించాలన్నా, పాడు చెయ్యాలన్నా నా చెయ్యే పడాల" అంటూ పకపకా నవ్వాడు ఎమ్మెల్యే.

"ధన్యవాదాలు సార్! మీ మేలు మర్చిపోలేను" రెండు చేతుల్తో నమస్కరిస్తూ అన్నాడు ఏకాంబర్.

అప్పటికే ఏకాంబర్ తండ్రి తల్లి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతున్నారని తెలిసి అక్కడకు వచ్చారు. వారు కూడా ఎమ్మెల్యే గారికి నమస్కరించి ధన్యవాదాలు తెలిపారు.

"మంచి చురుకైన కొడుకుని కన్నారండి! బాగా పైకొచ్చే లక్షణాలున్నాయి మీ వాడిలో" అంటూ మీసం మెలివేస్తూ "ఇక వస్తానయ్యా!" అంటూ కారిడార్ లోకి నడిచాడు ఎమ్మెల్యే.

అతనికి బాడీగార్డులుగా వచ్చిన గన్ మెన్లు, ఎమ్మెల్యే అనుచరులు అతని చుట్టూ వలయాకారంలో మూగి ఎవరూ అతని మీద పడకుండా కాపలా కాస్తూ తీసుకువెళ్ళారు.

అనుచరులంతా వీధి రౌడీల్లా కండలు తిరిగిన శరీరాల్తో ఎనుబోతుల్లా ఉన్నారు. ఎవరినీ 'ఎమ్మెల్యే' దరి చేరనివ్వటంలేదు వాళ్ళు.

ఎమ్మెల్యే వెళ్ళగానే అక్కడ వాతావరణం అంతా తుఫాన్ వెలిసిపోయినట్టూ అనిపించింది.

మధ్యాహ్నం రెండు గంటల వరకూ కస్టమర్లు వస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే వెళ్ళిన అరగంటకే ఇన్స్యూరెన్స్ అధికారులు కూడా వెళ్ళిపోయారు.

ఏకాంబర్ మిత్రులు, ఇన్స్యూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల రాజేంద్ర, ఏకాంబర్ అమ్మానాన్నలు చెల్లెలు అలివేలుమంగ, నూకరత్నం మిగిలారు.

అప్పటికి దాదాపు రెండొందల పాలసీలు వరకూ కట్టించారు. ఆ పాలసీల దొంతర చూస్తూనే ఏకాంబరానికి ఆనందం కట్టాలు తెంచుకుంది. ఇన్స్యూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాలకైతే మతిపోయింది.

'తను ఉద్యోగంలో చేరిన తర్వాత ఇలాంటి అద్భుతమైన 'మోటివేషన్ కేంపైన్' ఎక్కడా చూడలేదు. కనీ వినీ ఎరుగలేదు. ఎంతైనా ఏకాంబర్ ఉండాల్సిన వాడే' మనసులోనే ఉప్పొంగిపోయాడు రాజనాల.

మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడికే రప్పించాడు ఏకాంబర్. ముందురోజే వందమంది వరకూ ఉంటారన్న అంచనాతో కేటరింగ్ వాళ్ళకి భోజనాలు ఆర్డర్ ఇచ్చాడు.

వాళ్ళు భోజనాలు తెచ్చి సర్దుకు కూర్చున్నారు.

రెండు గంటలకి అందరూ భోజనాలు చేసాకే తల్లితండ్రుల్ని, చెల్లాయి అలివేలుమంగని తీసుకుని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు ఏకాంబరం.

ఎందుకూ పనికిరాడనుకున్న చిన్న కొడుకు ప్రయోజకుడై పదిమందిలోనూ అదీ స్థానిక ఎమ్మెల్యే దృష్టిలో ఎంతో ఉన్నతుడిగా గుర్తింపు పొందేసరికి ఏకాంబర్ తండ్రి పీతాంబరం లోలోనే తెగ మురిసిపోయాడు. తల్లి పర్వతాలు ఆనందం పట్టలేకపోయింది.

ప్రారంభోత్సవం జరుగుతున్నంత వరకూ ఓ మూలన కూర్చున్న ఏకాంబర్ తల్లి పర్వతాలు అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్న కొడుకును చూస్తూ మహదానందపడిపోయింది. పీతాంబరం సరేసరి.

అందర్లోకి పొడవుగా జెండా కొయ్యలా కనిపిస్తూ అక్కడ అంతా తానై తిరుగుతున్న ఏకాంబరాన్ని చూస్తున్న పీతాంబరం "ఊరు మీద బలాదూర్ గా తిరుగుతున్నాడని ఆడిపోసుకున్నాడు గాని ఊరందర్నీ తన చుట్టూ తిప్పుకుంటున్నాడనుకోలేదు ఇన్నాళ్ళు' అని మనసులోనే మననం చేసుకుంటూ మురిసిపోయాడు.

ఇద్దరికీ ఇంటికి వెళ్ళాలని లేదు. కానీ కొడుకే దెబ్బలాడి ఇక మీరు ఇంటికి వెళ్ళిపొండని చెప్పేసరికి కూతుర్ని తీసుకుని ముగ్గురూ ఆటోలో సింహాచలం బయలుదేరారు.

సాయంత్రం వరకూ మిత్రులందర్నీ తనతో ఉండమని చీకటి పడుతుందనగా నూకరత్నాన్ని ఇంటికి వెళ్ళిపోవలసినదిగా చెప్పి పంపేసాడు ఏకాంబర్.

ఆ రోజు వచ్చిన డబ్బంతా పేరు పేరునా ఎవరు ఎంత ఇన్స్యూరెన్స్ కట్టింది ఓ జాబితా రాసి ఏకాంబర్ చేతికి ఇవ్వబోయింది నూకరత్నం.

"మీ దగ్గరే ఉంచండి. ఉదయాన్నే మనం ఇన్స్యూరెన్స్ ఆఫీసుకి వెళ్ళి అందరి పేరునా ఈ డబ్బుకట్టేయ్యాలి, పాలసీలు అన్నీ ఈ వారంలో పూర్తి వివరాలతో నింపి రాజనాల సార్ చేతికి ఇద్దాం" మిత్రులతో మాట్లాడుతూ అన్నాడు ఏకాంబర్.

"అమ్మో! ఇంత డబ్బా! నా దగ్గర వద్దు. మీ దగ్గరే ఉంచండి" భయంగా అంది నూకరత్నం.

"అది డబ్బని ఎవరన్నారు. కాగితాలే అనుకోండి. మీది నాది కాదు కదా! కస్టమర్ల డబ్బు. మనకి తెల్లకాగితాల క్రిందే లెక్క... మీ దగ్గర ఉంచండి భయంలేదు" నూకరత్నం కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"అవునండి. ఈ చిన్న బాధ్యత మోయలేకపోతే రేపు మీరే సొంతంగా ప్రాంచైజీలు తీసుకుని ఎలా నడుపుతారు" డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల చిన్నగా నవ్వుతూ అన్నాడు.

ఆ మాటతో అందరూ ఏకీభవిస్తూ నూకరత్నానికి ధైర్యం చెప్తూ పాలసీదారులు కట్టిన సొమ్మంతా ఒక బ్యాగ్ లో పెట్టి ఆమె చేతికి ఇచ్చారు.

అందరూ అంతలా చెప్పేసరికి మరిక మారు మాట్లాడలేకపోయింది నూకరత్నం.

కానీ, మనసులో భయం భయంగానే ఉంది. చంద్రనగర్ లో తాముంటున్న ప్రాంతమంతా రైల్వే ట్రాక్ ప్రక్కనే ఉంది. అక్కడంతా తమలా ఏ ఆధారంలేని ఆస్తిపాస్తుల్లేని బీదా బిక్కీ ఉంటున్నారు. అందులో చాలామంది సినిమాహాళ్ళ దగ్గర బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునేవాళ్ళు, రోడ్ల మీద తినుబండారాలు అమ్ముకునేవాళ్ళు, కూలీనాలీ చేసుకు బ్రతికే వాళ్ళు అందరూ.

'ఈ బ్యాగ్ తో ఇలా తను ఒంటరిగా ఇంటికెళ్తున్నప్పుడు చూసి మీద పడి లాక్కుంటే?! మగ దిక్కులేని ఆడ కుటుంబం కదా అని ఇంటి మీదకొచ్చి లూటీ చేస్తే... అమ్మో!'

నూకరత్నం అందరి మాట విని బ్యాగ్ చేత పట్టుకుని ఇంటికి బయలుదేరిందే గాని భయం భయంగా గుండెలు అదిమి పట్టుకుని చేతిలో బ్యాగ్ గుండెలకు అదుముకుని మెయిన్ రోడ్ లో నడుస్తోంది.

రోడ్డంతా రద్దీగా ఉంది, వచ్చేపోయే వాహనాల రణగొణ ధ్వనులు. బిక్కుబిక్కుమంటూ జనాలందర్నీ తప్పించుకుంటూ రోడ్డు వారగా నడుస్తోంది నూకరత్నం.

గోపాలపట్నం రైల్వేస్టేషన్ బ్రిడ్జీపై నుండి నడుచుకుంటూ అవతలకు చేరాలి. నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ బ్రిడ్జీ దాటితే అవతల చంద్రనగర్.

ఇంతలో ఏదో బైక్ హారన్ చెవి దగ్గరే బిగ్గరగా వినిపించేసరికి ఉలిక్కిపడింది నూకరత్నం.

ఉలిక్కిపడి కేష్ బ్యాగ్ ను మరింత బలంగా గుండెలకు అదుముకుంది. బైక్ తో ఎవరో తనని గుద్దేసాడేమోనన్నంత కంగారుపడిపోయింది నూకరత్నం.

"మేడమ్! కంగారుగా ఉందా?! నేనే!" బైక్ నేరుగా వచ్చి నూకరత్నానికి రాసుకుంటూ ఆగింది.

బైక్ తనని రాసుకుంటూ వచ్చేసరికి ఉలిక్కిపడి చటుక్కున ప్రక్కకు తప్పుకుంది నూకరత్నం. ఆగీ ఆగగానే ఎవరో తననే పిలిచినట్లనిపించి భయంగానే తల ఎత్తి బైక్ వైపు చూసింది నూకరత్నం.

'హమ్మయ్య!' అనుకుంటూ గుండెల్నిండా ఊపిరి పీల్చుకుంది. బైక్ మీద కూర్చుని తననే చూస్తూ చిన్నగా నవ్వుతున్న వ్యక్తిని కళ్ళార్పకుండా చూసి అంతవరకూ తనని పట్టి పిండేసిన భయాన్ని పటాపంచలయ్యేలా మనసులోనుండి తరిమేసింది.

"మీరా!... నా వెనుకే నీడలా వెంటాడుతూ వచ్చారా??" అతని కళ్ళల్లోకి చూస్తూ అంది నూకరత్నం.

"అదేమీలేదు ఒంటరిగా ఇంటికెళ్లగలవా? లేదా అని డౌట్ వచ్చి వచ్చాను" అన్నాడతను.

"ఏం! ఈ డబ్బుతో ఇలా ఎటైనా పారిపోతాననుకున్నారా?" కొంటెగా అతని కళ్ళల్లోకి చూస్తూ అంది నూకరత్నం.

"అలా అనుకుంటే అంత డబ్బు మీ చేతికివ్వను కదా!"

"మరి, ఏమనుకున్నారు?!"

"నా మనిషే అని నమ్మకంతో" ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అన్నాడు అతను.

"ఓయ్! ఇది రోడ్డనుకున్నావా? పార్క్ అనుకున్నావా? ట్రాఫిక్ కి అడ్డంగా బైక్ ఆపి ఆ అమ్మాయితో ఉప్పర్ మీటింగ్ ఏమిటి?" ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి లాఠీతో అతని వీపు మీద రెండు దెబ్బలు తగిలీ తగలకుండా కొడుతూ అన్నాడు.

"రండి నూకరత్నం. బైక్ ఎక్కండి! మిమ్మల్ని ఇంటి దగ్గర దించేస్తాను" నూకరత్నాన్ని గాభరా పెడుతూ అన్నాడు ఏకాంబర్.

కానిస్టేబుల్ అలా అనేసరికి నూకరత్నం కూడా గజగజా వణికిపోతూ గభాలున ఏకాంబర్ వెనుక బైక్ మీదకు ఎక్కి కూర్చుంది.

బైక్ ని ముందుకు నడిపించాడు ఏకాంబర్.

"ఆ కానిస్టేబుల్ బెదిరించేసరికి జడుసుకున్నారా?" ఏకాంబర్ వెనుక నెమ్మదిగా అతని మీద వాలుతూ అంది నూకరత్నం.

"మనదే కదా తప్పు. రోడ్డు మీదే అలా బైక్ తో నిలబడి హస్కు కొట్టకూడదు కదా!" అన్నాడు ఏకాంబర్.

"నిజమే. నాకూ భయమేసింది" అంది నూకరత్నం.

"మీరు ఒంటరిగా ఈ బ్యాగ్ తో నడిచి వెళ్ళడం సేఫ్ కాదని వచ్చాను" బైక్ నడుపుతూ అన్నాడు ఏకాంబర్.

"నిజమే కానీ, నడిచి వస్తే రైల్వే బ్రిడ్జి దాటితే చంద్రనగరే కదా! ఆ దారే దగ్గర కదా! ఇలా బైక్ మీదంటే ఇదిగో ఇలా చుట్టూరా తిరిగి మూడు కిలోమీటర్లు పైనే వెళ్ళాలి. ఎందుకింత శ్రమ" అంది నూకరత్నం.

"నడిచి... హారిబుల్! బైక్ అలవాటయ్యాక కాలు కదిపి రెండడుగులు వెయ్యాలంటే... అమ్మో! టైమ్ వేస్ట్ కదా!" బైక్ ని కొత్తపాలెం దార్లోకి మళ్ళిస్తూ అన్నాడు ఏకాంబర్.

"మీరంతా బిజీ బిజినెస్ మేన్ లు కదా సార్!" అంది నూకరత్నం.

"ఈ రోజు మన ఆఫీస్ ఓపెనింగ్ ఎలా జరిగింది?" నెమ్మదిగా ఆనందంగా అడిగాడు ఏకాంబర్.

"అయ్యో! మీరక్కడ లేరా సార్?" ఆశ్చర్యంగా నటిస్తూ అంది.

"జోక్ లు ఆపి చెప్పండి. బాగా జరిగింది కదూ?!" మురిసిపోతూ అన్నాడు ఏకాంబర్.

"బాగానా... అదిరిపోయింది. అంతమంది వస్తారనుకోలేదు. మీరు పిలిచారు గాని, పిలిచినా ఎమ్మెల్యేగారు వస్తారా అనుకున్నాను. కానీ, ఆయన... ఆయన మందీ మార్బలంతో బాగానే టైమ్ కి వచ్చారు." సంతోషంగా అంది నూకరత్నం.

"ఇప్పటికైనా నా మీద మీకు నమ్మకం కలిగింది కదా!" అడిగాడు ఏకాంబర్.

"నమ్మకంతోనే కదా సార్ మీ వెంట పడింది. రేపట్నుండీ మీ ఆఫీసుకు రమ్మంటారా!" తెలివిగా అడిగింది రత్నం.

"ఈ రోజే మొదటి అడుగు పెట్టి మళ్ళీ రావాలా అంటారేమిటి?! రెండో అడుగు వెయ్యరా?!" అన్నాడు ఏకాంబర్.

"మీరు నాతో ఎన్ని 'అడుగులు' వేయిస్తారో చూస్తా కదా! మీమీద భరోసాతో నిన్ననే షాపులో చెప్పేసాను. పని మానేస్తున్నానని" అంది నూకరత్నం.

"అలా అంటే ఆయనేమన్నాడు?" నవ్వుతూ అడిగాడు ఏకాంబర్.

"మీరు ముందే చెప్పేసారట కదా! నన్ను మీ 'సర్వీస్ సెంటర్'లో గుమస్తాగా జాయిన్ చేసుకుంటాను మీరు ఒప్పుకుంటే అని అడిగారట కదా!" ఆశ్చర్యంగా అంది నూకరత్నం.

"ఆయనకి నేనంటే ఎంతో నమ్మకం. అభిమానం. అలాంటప్పుడు ఆయనతో నిజం చెప్పకుండా దొంగతనంగా మిమ్మల్ని నా దగ్గర జాయిన్ చేసుకోవడం సంస్కారం కాదు కదా! అందుకే మీతో మాట్లాడక ముందే బట్టలషాపు ఓనర్ గారితోనే మాట్లాడి ఆయన కూడా సంతోషంగా ఒప్పుకోబట్టే మీకు నా దగ్గర ఆఫర్ ఇచ్చాను" విడమర్చి చెప్పాడు ఏకాంబర్.

ఏకాంబర్ అలా అనేసరికి ఒక్కసారే నూకరత్నం మనసు చిన్నబోయింది.

"ఆయన ఒప్పుకోకపోతే...?!" కొంచెం బాధగా అంది నూకరత్నం.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college drop out gadi prema katha