Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vishwavikhyatha chitrakarudu, rachayitha, tatvavetta - shree sanjeevadev gaaru

ఈ సంచికలో >> శీర్షికలు >>

దేవాదాయం లేదు.. దైవాధీనమే - విఎస్ఎన్. మూర్తి

devaadaayam ledu... dhaivaadheename

కాశీ గురించి రాయడం ప్రారంభించిన తరువాత స్పందన బాగానే వచ్చింది. అయితే చాలా మంది కాశీని లౌకిక దృష్టితో చూడకూడదన్నట్లు అభిప్రాయం వెలిబుచ్చారు. నా బాధ అంతా, కాశీలో ఫైవ్ స్టార్ సదుపాయాల గురించి కాదు.

అసలు అక్కడి జనాలకు ఆ ఊరి మీద, అక్కడికి వస్తున్న లక్షలాది మంది జనం మీద గౌరవం వుండాలి. వుండి వుంటే, తమ తమ స్వార్థాన్ని కొంతయినా విడనాడి ఊరును మరింత అందంగా చేసుకునేవారు. లేదా అక్కడి పాలకులు, జనాలకు నచ్చచెప్పి, ఆలయం చుట్టూ ప్రాంగణాన్ని మరింత వెడల్పు చేసేవారు.

చిత్రమేమిటంటే, ఇప్పుడు కాశీలో ఇన్ని ఘాట్ లు వున్నాయి.. అన్ని ఘాట్ లు వున్నాయి అంటున్నారు. పడవలో చూసి వస్తున్నారు. నిజానికి ఈ ఘాట్ ల్లో ఏ ఒక్కటీ ప్రభుత్వాలు నిర్మించలేదు. ఆలయ కమిటీ అనేది వుందేమో తెలియదు. అది నిర్మించలేదు. వివిధ ప్రాంతాల రాజులు, కాశీ క్షేత్రంలో తమ తమ విడిది గృహాలుగా ఘాట్ లను నిర్మించుకున్నట్లు కనిపిస్తుంది. గంగ తీరాన వాళ్లు చిన్నపాటి కోటలు, అందులోంచి గంగలో స్నానం చేసేందుకు ప్రయివేటు ఘాట్ లు నిర్మించుకున్నట్లు అనిపించింది. వ్యాసకాశీ చూస్తే ఇది స్పష్టమవుతుంది. రాజుగారి కోట, అందులో నుంచి గంగ ఒడ్డుకు మార్గం. అక్కడ ఆయన ప్రయివేటు శివాలయాలు.

ఇదే తీరు మిగిలిన ఘాట్ లవి కూడా. పోనీ ఘాట్ లను వాడుతున్నారు బాగానే వుంది. నాటి రాజులు నిర్మించిన భవంతులను కాపాడాలి కదా లేదా, వాటిని పురావస్తు శాఖకు అప్పగించాలి. ఒక్క కాశీరాజు భవంతి విషయంలోనే ఆ జాగ్రత్త వుంది. మిగిలిన భవంతులన్నీ ప్రయివేటు లాడ్జిలుగా మారిపోయాయి. ఎవరు ఎప్పుడు లీజులకు ఇచ్చారో, ఒప్పందాలేమిటో మనకు తెలియదు కానీ, గంగను చూస్తూ వుండడం అన్న బలహీనతను ఆ లాడ్జిలు సొమ్ము చేసుకుంటున్నాయి. నాటి రాజుల లోగిళ్లు, నేటి పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా మారాయి. నాకు మన దేవాదాయ శాఖ మీద కాస్త దురభిప్రాయం వుంది. దేవుడి క్రేజ్ ను ఆదాయంగా మార్చుకుంటుంది. అంతే తప్ప భక్తుల బాధలు పట్టించుకోదు. రికమెండేషన్లు, ప్రజా ప్రతినిధులు, డబ్బు చేసిన వారికి మాత్రం స్వాగత సత్కారాలు, రాజగోపుర మర్యాదలు చేస్తుంది అని.

కానీ కాశీ వెళ్లి వచ్చిన తరువాత ఓ కొత్త అభిప్రాయం నెలకొంది. మన దేవాదాయ శాఖ ఇన్ని అవకతవకలు చేస్తున్నా, ఆలయాల్లో కాస్త పాలనా యంత్రాంగం అన్నది వుండేలా చూస్తోంది అనిపించింది. కాశీ, గయ, అలహాబాద్ ల్లో మూడు చోట్లు దేవాదాయ పాలనా వ్యవహారం కలికంలోకి కూడా కానరాలేదు. కాశీలో అడుగడుగునా సైన్యం పహారా. ఎక్కడ టెర్రరిస్టులు దాడి చేస్తారో అని మంచిదే. మరి అలాంటి ఇరుకు సందుల్లో, వందలాది దుకాణాల నడుమ ఆలయం వుంటే సంరక్షణ ఎలా వుంటుంది అన్న ఆలోచన ఎందుకు రావడం లేదో? పోనీ ఆ సంగతి వదిలేస్తే, లోపల ఆలయ అధికారులు వగైరా వంటి వ్యవహారాలు కాన రాలేదు. స్థానికంగా తెలుసున్న వారు,. ఆలయంతో పరిచయం వున్నావారు వుంటే నేరుగా వెళ్లి అభిషేకాలు. లేకుంటే, ఓ నమస్కారం పెట్టి రావడం. అది కూడా తోపులాట నడుమ.

దేవాదాయ శాఖ నియంత్రణ వుంటే కొంతయినా బాగుండును అని తొలిసారి అనిపించింది. అదే తరహా అభిప్రాయం గయలో విష్ణుపాద క్షేత్రానికి వెళ్లినపుడు కూడా కలిగింది. ఆలయ ప్రాంగణంలో ఎవరికి తోచిన చోట వారు కూర్చునిపోయి, పితృకార్యాలు చేసేయడమే. దానికి ఓ అడ్డు ఆపు లేదు. ఎవరికి తోచిన చోట వారు అలా చటుక్కున కూర్చునిపోవడమే. పూజ అనంతరం అవన్నీ అలా ఎక్కడ పడితే అక్కడ అలా పడి వుండడమే. నిర్దేశించిన ఆవరణ చాలక పోయి వుండొచ్చు అని అనుకుందాం. మరి పెరుగుతన్నభక్తుల రద్దీకి, కార్యక్రమాలకు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ఆలయ అధికారులదే కదా.

కాశీ ఆలయంలోకి వెళ్లడానికి రెండు మూడు గేట్లు వున్నాయి. ఎవరి సరుకులు సరంజామాలు, గేటు ప్రారంభలోనే వదిలేయాలి. అందుకోసం ఎక్కడబడితే అక్కడ ప్రయివేటు లాకర్లు. ప్రభుత్వం లేదా ఆలయం తరపున ఒక్కటి కనిపిస్తే ఒట్టు. అదే గయలో బౌద్ధాలయం వద్ద మాత్రం చక్కగా రిజిస్టర్ నిర్వహిస్తూ, లాకర్లు ఏర్పాటు చేసారు. చాలా చక్కగా వుంది అక్కడ ఏర్పాటు. మరి ఆ తరహా ఏర్పాటు ఇక్కడ ఎందుకు చేయలేకపోయినట్లు? సరే ఆ గేట్ గుండా లోపలికి వెళ్లిన వారు మళ్లీ ఆ గేటు దగ్గరకు వస్తేనే ఈ సరకులు తీసుకునేందుకు వీలవుతుంది. కానీ లోపలకు వెళ్లిన తరువాత అక్కడున్న పోలీసు లేదా మిలటరీ మనిషి దయాదాక్షిణ్యం పై ఆదారపడి వుంటుంది అలా రావడం. ఇలా కాదు అలా అంటే అలాగే పోవాల్సిందే. అక్కడ ప్రదిక్షణం, అప్రదక్షిణం అన్నదే కానరాదు. ప్రధాన ఆలయం లో మిగిలిన మూర్తులను, అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా జనాల్ని ఓ పద్దతిలోనడిపించడం అన్నది అస్సలు కనిపించదు.

(హారతి సిత్రాలు వచ్చేవారం)

మరిన్ని శీర్షికలు
Book Review - neeti rangula chitram