Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

బ‌న్నీ నాకు దేవుడిచ్చిన త‌మ్ముడు - కిక్ శ్యామ్‌

Interview with Kick Shaam

తెలుగులో ఎంతోమంది ఉద్దండులైన న‌టులుండ‌గా... ప‌రాయిభాష నుంచి ప్ర‌తినాయ‌కుల్ని, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌నూ తెచ్చుకొంటారెందుకు...?  అనేది చాలామంది ప్ర‌శ్న‌. కానీ కిక్ శ్యామ్‌లాంటి న‌టులుంటే... ప‌క్క‌రాష్ట్రం నుంచేంటి..?? ఎక్క‌డి నుంచైనా స‌రే తెచ్చేసుకోవాల‌నిపిస్తుంటుంది. కిక్ సినిమా చూడండి. ర‌వితేజ త‌ర‌వాత అన్ని మార్కులు తెచ్చుకొంది అత‌నే. రేసుగుర్రం చూడండి. బ‌న్నీ త‌ర‌వాత సెకండ్ ప్లేస్ త‌న‌కి ఇవ్వాల్సిందే. హీరోల‌కు పోటీగా న‌టిస్తాడు.. అలాగ‌ని డామినేట్ చేయ‌డు. అంత‌కంటే గొప్ప ల‌క్ష‌ణం ఏం కావాలి??  కిక్‌, రేసుగుర్రం సినిమాల్లో పోలీస్ పాత్ర‌ల్లోనే క‌నిపించాడు... శ్యామ్‌. అయితే ఆ పాత్ర‌ల్లో వైవిధ్యం చూపించ‌గ‌లిగాడు. త‌మిళ న‌టుడైనా.. మ‌న‌వాడే అనుకొనేంత‌లా క‌లిసిపోయాడు. ఇప్పుడు కిక్ శ్యామ్ ముందు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో శ్యామ్‌తో గో తెలుగు ముఖాముఖి.

* రేసుగుర్రం విజ‌యాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
- చెన్నైలోని ఓ థియేట‌ర్లో  రెండుసార్లు ఈ సినిమా చూశా. ప్రేక్ష‌కుల స్పంద‌న చూస్తుంటే... థ్రిల్లింగ్‌గా అనిపించింది. మ‌న శ్యామ్‌.. మ‌న శ్యామ్‌.. అంటూ గ‌ర్వంగా మాట్లాడుకొంటుంటే చాలా ఆనందంమేసింది. ఇదో గొప్ప అనుభ‌వం.

* సురేంద‌ర్‌రెడ్డితో బాగా ట్యూన్ అయిన‌ట్టున్నారు..?
- అదంతా నా అదృష్టం. కిక్‌తో నాకు తెలుగు సినీ జీవితాన్నిచ్చాడు సురేంద‌ర్‌. అత‌ను నాకు అన్న‌య్య‌లాంటివాడు. ఇప్పుడు మ‌ళ్లీ.. ఇంత మంచి పాత్ర‌తో నా కెరీర్‌కు బూస్ట‌ప్ ఇచ్చాడు. అత‌న్ని ఇంకేమి అడ‌గాలి..??  త‌నేం చెబితే అది చేస్తా. నా కెరీర్ మొత్తం అత‌ని చేతుల్లో పెట్టేసేంత భ‌రోసా ఇచ్చాడు. థ్యాంక్స్ త‌ప్ప మ‌రేం చెప్ప‌లేను.

* మ‌రి కిక్ 2లో ఉన్నారా?
- ఏమో... ఆ సంగ‌తి నాకు తెలీదు. సురేంద‌ర్‌రెడ్డి అడిగితే.. త‌మిళంలో చేస్తున్న సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టేసి వ‌చ్చేస్తా. అంతే.

* బ‌న్నీతో న‌టించ‌డం ఎలా అనిపించింది?
- బ‌న్నీ చాలా సూప‌ర్‌.. అంతే కాదు, డేంజ‌ర‌స్ కూడా. నిజం... అత‌నో ప్ర‌మాద‌క‌ర‌మైన న‌టుడు. సెట్లో ఉన్నంత సేపూ తుఫానే. ఒకే డైలాగును నాలుగైదు ర‌కాలుగా ప‌లుకుతాడు. కెమెరా ముందు ఏ డిక్ష‌న్‌తో డైలాగ్ ఉచ్చ‌రిస్తాడో చెప్ప‌డం క‌ష్టం. మ‌నం కాచుకొని కూర్చోవాలి. అత‌ని ఎన‌ర్జీ అందుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు.  బ‌న్నీ చాలా స్పోర్టివ్‌. ఓ సీన్‌లో చెంప‌దెబ్బ‌కొట్టాలి. ష‌ర్ట్ ప‌ట్టుకొని గ‌ట్టిగా గుంజాలి. నేను కాస్త ఇబ్బంది ప‌డ్డా. `మ‌నం సినిమా కోసం చేస్తున్నాం. సినిమా బాగా రావాలంటే.. ఇవ‌న్నీ త‌ప్ప‌వు. మ‌న‌సులో ఏం పెట్టుకోకు..` అని నన్ను ప్రోత్స‌హించాడు. ఆ సీన్ త‌ర‌వాత సారీ చెప్పా. కానీ.. త‌ను మాత్రం లైట్‌గా తీసుకొన్నాడు.

* కిక్‌, రేసుగుర్రం సినిమాల్లో పోలీస్ పాత్ర‌లే వేశారు. వైవిధ్యం ఎలా చూపించ‌గ‌లిగారు..?
- ఆ వైవిధ్యం నాలో లేదు. ఆ పాత్ర‌ల్లో ఉంది. కిక్‌లో నా పాత్ర వేవ్‌లెంగ్త్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. సీరియ‌స్ నెస్ త‌ప్ప ఇంకోటి క‌నిపించ‌దు. రేసుగుర్రం అలా కాదు. కామెడీ, సెంటిమెంట్‌.... కాస్త రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నాద‌మ్ముల మ‌ధ్య టామ్ అండ్ జ‌ర్రీలాంటి వార్ ఉంటుంది. నేను ప్ర‌త్యేకంగా చేసిందొక్క‌టే.. ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గా. దాదాపు ఎనిమిది కిలోలు తగ్గించా. బ‌న్నీకి అన్న‌య్య‌గా క‌నిపించాలంటే.. కాస్త‌యినా స్మార్ట్‌గా ఉండాలి క‌దా..?

* మీ నిజ జీవితంలోనూ త‌మ్ముడితో ఇలాగే గొడ‌వ పెట్టుకొంటుంటారా?
- నాకు ఇద్ద‌రు అన్న‌య్య‌లు. త‌మ్ముడు లేడే.. అని బాధ‌ప‌డేవాడ్ని. కానీ.. బ‌న్నీ ఆ లోటు తీర్చేశాడు. త‌ను నాకు దేవుడిచ్చిన త‌మ్ముడు.

* కిక్ - రేసుగుర్రం.. ఇందులో మీ మ‌న‌సుకి న‌చ్చిన పాత్ర‌...?
- రేసుగ‌ర్రంలో నేను చేసిన రామ్ పాత్ర‌. నా కెరీర్‌లోనే ఇది బెస్ట్‌.

* పోలీస్ దుస్తులు మీకు బాగా న‌ప్పిన‌ట్టున్నాయి?
- ఆ యూనిఫామ్‌లో ఓ మ్యాజిక్ ఉంది. అది వేసుకోగానే.. ఠీవీ వ‌చ్చేస్తుంది. కానీ ఒక్క‌టి మాత్రం చెప్పాలి. ఇంకొంత కాలం పోలీస్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటా. ఎందుకంటే ప్ర‌తీసారీ న‌న్ను యూనిఫామ్‌లోనే చూస్తే ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్టే ప్ర‌మాదం ఉంది.

* తెలుగులో హీరోగా చేయ‌మ‌ని ఎవ‌రైనా అడుగుతున్నారా?
- అడిగారు. కానీ నేనే ఒప్పుకోవ‌డం లేదు. ఎందుకంటే త‌మిళంలో హీరోగా చేస్తున్నా క‌దా.??  ఇక్క‌డ మాత్రం వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లే ఎంచుకొంటా.

* ప్ర‌తినాయ‌కుడిగా న‌టించ‌మంటే..?
- త‌ప్ప‌కుండా చేస్తా. కానీ... ఆ పాత్ర‌లో ద‌మ్ముండాలి. 100 % క్రూర‌త్వం ప్ర‌ద‌ర్శించాలి. చివ‌ర్లో మంచివాడైపోయే పాత్ర‌లైతే నాకొద్దు. ఖాకీ  సినిమాలో అజ‌య్‌దేవ‌గ‌ణ్ పోషించిన పాత్ర‌లాంటిది వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా.

* తెలుగు భాష ఇబ్బందిగా అనిపించ‌డం లేదా?
- చాలా చాలా ఇబ్బంది ప‌డుతున్నా. తెలుగు భాష నేర్చుకోవ‌డం క‌ష్టం. ఐదు సినిమాలు చేశా. ఇంకా నా తెలుగు మెరుగు ప‌డ‌లేదు. ఎవ‌రైనా మాట్లాడితే అర్థం చేసుకొంటా. తిరిగి తెలుగులో మాట్లాడ‌లేను. త్వ‌ర‌లోనే తెలుగు నేర్చుకొంటా.

* కొత్త‌గా ఒప్పుకొన్న సినిమాలు..?
- రేసుగుర్రం త‌ర‌వాత నా ఫోన్ మోగుతూనే ఉంది. అయితే... ఒక్క సినిమాకీ క‌మిట్ కాలేదు. ప్ర‌స్తుతం ఈ సినిమా విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇందులోంచి తేరుకొన్న త‌ర‌వాత కొత్త సినిమాలు ఒప్పుకొంటా.

* ఒకే.. ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka