Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

విశ్వవిఖ్యాత చిత్రకారుడు, రచయిత, తత్వవేత్త - శ్రీ సంజీవదేవ్ గారు - టీవీయస్. శాస్త్రి

vishwavikhyatha chitrakarudu, rachayitha, tatvavetta - shree sanjeevadev gaaru

డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ గారు(జూలై 03,1924 --ఆగష్టు 25, 1999) ప్రముఖ చిత్రకారుడు, తత్వవేత్త, రచయిత, కవి. తన స్వీయ చరిత్రను 'తెగిన జ్ఞాపకాలు' పేరిట రచించారు. తెలుగు 'ఆత్మకథల' గ్రంధాలలో దీనికొక విశిష్టస్థానం ఉంది. మంగళగిరి, తెనాలికి మధ్యనగల తుమ్మపూడి అనే కుగ్రామంలో, 03-07-1924న ఈయన  జన్మించారు. బాల్యంలోనే ఇల్లువదలి దేశ సంచారం చేసారు. 20 ఏళ్ళ వయసులోపే హిమాలయాలతో సహా ఉత్తర భారతదేశాన్నిఅంతా తిరిగారు. చాలా భాషలను నేర్చుకున్నారు. ఎస్పరాంటో అనే కృత్రిమ అంతర్జాతీయ భాషలో కూడా ఈయనకు ప్రవేశం, ప్రావీణ్యం ఉంది. లక్నోలో శ్రీ అసిత్ కుమార్ హాల్దార్ వద్ద చిత్రలేఖనం అభ్యసించారు. వీరి కలం స్నేహం అపరమితమైనది. సమకాలీనపు ప్రపంచ మేధావుల అందరితోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. అమెరికాలోని ఆల్డస్ హక్సులీ నుండి అమెరికాలోనే స్థిరపడిన భారతీయ చిత్రకారుడు శ్రీ దామెర్ల రామారావు గార్ల వరకు వారి మిత్రమండలి సువిశాలమైంది. జిడ్డు కృష్ణమూర్తి నుండి బుచ్చిబాబు, గోపీచంద్ ల వరకు వారితో ఆయనకు ప్రత్యక్ష పరిచయాలు, పరోక్ష సంబంధాలు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ నుండి బెర్ట్రాండ్ రస్సెల్ వరకు, రవీంద్రనాథ్ ఠాగూర్ నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి వరకు అధ్యయనం చేయటమేకాక వారితో ఇతనికి మంచి మైత్రి కూడా ఉంది. వీరు నివసించే తుమ్మపూడి గ్రామానికి దేశవిదేశాల నుండి కళాకారులు, సాహిత్యోపాసకలు వారికోసం వచ్చేవారు.సంజీవదేవ్ గారి వల్ల తెలుగుప్రాంతం గౌరవం పెరిగిందని ఆ ప్రాంతం ప్రజలు అనేవారు. మానవతావాది అయిన సంజీవదేవ్ గారికి ఏ ప్రాంతమూ పరాయిది కాదు. వసుధైక కుటుంబ సిద్ధాంతాన్నినమ్మి, దాన్ని ఆచరణలో పెట్టారు. ఈయన, 25-08-1999న మరణించారు. వీరి పేరుమీద 1999 లో ఆయన సన్నిహితులు, స్నేహితులు, 'సంజీవదేవ్ అవార్డు'ను నెలకొల్పారు. దీన్ని తత్వ, కళా, సాహిత్యరంగాల్లో కృషిచేసిన వారికి ఇస్తున్నారు.

వీరి రచనలు, చిత్రాలు - 'తెగిన జ్ఞాపకాలు' అనే గ్రంధం వీరి రచనల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. రసరేఖలు,దీప్తిధార, రూపారూపాలు, సమీక్షారేఖలు, బయోసింఫనీ... లాంటి విశేష ప్రాచుర్యం పొందిన మరికొన్ని గ్రంధాలు.

హాస్యం, వేదాంతం - లలితకళారాధనలో ప్రవీణులైన సంజీవదేవ్ గారి హాస్యం కూడా లలితంగా ఉంటుంది. చాలారోజుల క్రితం, సంజీవదేవ్ గారింట్లో దొంగలు పడి, ఆరోజుల్లో పదివేల రూపాయల విలువగల నగలు, పట్టు చీరెలు, మరికొన్ని విలువైన వస్తువులను దోచుకొని వెళ్ళారు. పరామర్శ చేద్దామని వెళ్ళిన వారితో - "ఫర్వాలేదు, నిజానికి మనకేమీ నష్టం లేదు, దీని వల్ల." అని చెప్పేవారు, చిరునవ్వు చెదరకుండా. అదేమిటండీ అలా అంటారని ఆశ్చర్యపడిన "అవునండీ! వారు తీసుకొని వెళ్ళింది నగలనే కదా! తిరిగి మనం వాటిని చేయిస్తే కదా, మనకు నష్టం వచ్చేది. లేకపొతే, నష్టమేముంది?" అని వాదించేవారు. ఈ వార్త తెలియగానే, సంజీవదేవ్ గారి మిత్రులైన చలంగారు అరుణాచలం నుండి ఒక ఉత్తరం వ్రాసారు. "దొంగలు పడ్డారా? మీరు చారుదత్తుడులాగా దొంగలు వేసిన కన్నం దగ్గర కూచొని వారి హస్తకౌశలాన్ని మెచ్చుకోవటం లేదుకదా! ఏమేమి పోయాయి? నగానట్రా అయితే ఫర్వాలేదు. మీ దగ్గరున్న విలువైన పుస్తకాలు, ఉత్తరాలు, చిత్రాలు, భద్రంగా ఉన్నాయా? ..." ఇలా సాగింది ఆ పరామర్శ లేఖ. కేవలం మాటల్లో, వ్రాతలలో గాక నిజజీవితంలో కూడా వేదాంతులుగా ప్రవర్తించిన వారి జీవిత సరళి ఇలాగే ఉంటుంది.

రచనా శైలి - ఆయన భాష, వ్రాసే విధానం సరళంగా, విభిన్నంగా ఉంటుంది. మంచి భావుకత గల రచయిత, కవి కూడా ఆయన. శ్రీ వేగుంట మోహన్ ప్రసాద్ గారు వ్రాసిన 'చితి-చింత' అనే వచన కవితా కావ్యానికి సంజీవదేవ్ గారు వ్రాసిన 'స్పందన'(ముందుమాట) ఎలా ఉందో క్లుప్తంగా ఈ క్రిందనే తెలియచేస్తాను. -

'వ'కు దీర్ఘమిస్తే 'వా','క'కు 'యా'వత్తు ఇస్తే 'క్య', 'క్య'కు సున్నా పెడితే'క్యం'- వాక్యం. 'క'కు దీర్ఘమిస్తే 'కా', 'వ'కు 'యా'వత్తు ఇస్తే, 'వ్య', 'వ్య'కు సున్నా పెడితే 'వ్యం'-కావ్యం. వాక్యంలోని అక్షరాలూ, కావ్యంలోని అక్షరాలూ ఒకటే. అక్షరాల స్థానంలోనే మార్పు. వాక్యం అన్నదానిని త్రిప్పితే కావ్యం అవుతుంది. త్రిప్పటం అంటే వాక్యాన్ని రసాత్మకం చేయటం. అప్పుడే 'వాక్యం రసాత్మకం కావ్యం'. అన్ని వాక్యాలూ కావ్యాలు కావు. కానీ, అన్ని కావ్యాలూ వాక్యాలే! రసాత్మకమైన వాక్యాలు మాత్రమే కావ్యాలు. వాక్యాన్ని రసాత్మకంగా రచించిన వ్యక్తి కవి, ఆ రచించబడ్డది కవిత. కవిత పద్య రూపంలో ఉండాలా, వచన రూపంలో ఉండాలా అన్న ప్రశ్నయే లేదు. అందులోని వాక్యాలు రసాత్మకంగా ఉంటే, అది పద్య రూపంలో ఉన్నా, వచన రూపంలో ఉన్నా కవితయే. రసాత్మకంకాని పద్యం కవిత కాదు, అది కేవలం ఛందోబద్ద వాక్య నిర్మాణం మాత్రమే అవుతుంది. రసాత్మకం అయిన వచనం కవిత అవుతుంది." చూసారుగా ఆయన పరిశీలనాత్మక దృష్టిని!
 

ఈ 'రససిద్ధుడు' తెలుగువాడు కావటం, తెలుగువారి అదృష్టం. వారికి నా స్మృత్యంజలి!

 

మరిన్ని శీర్షికలు
devaadaayam ledu... dhaivaadheename