Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kopam vaste... evadiki uddarimputa?

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

sahitee vanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిషమనుసంభవము

(గతసంచిక తరువాయి)

అనుటయు మృగయాకౌతుక
మునఁ జిత్తము చెంగలింప భూధర శృంగం
బుననుండి డిగ్గి నగరికి
ననిమిషకాంతాకుమారుఁ డరిగి రయమునన్

వేటాడడంలో నేర్పరి, మక్కువగలిగినవాడు ఐన స్వరోచికి ఆ ఎరుకలదొర చెప్పిన మాటలను విని వేటమీదికి మనసు పోయింది. వెంటనే ఆ కొండమీదినుండి దిగి వేగముగా తన నగరానికి వెళ్ళాడు. వెళ్లి, తన పెంపుడు డేగలను, జాగిలాలను పరిశీలించి 'దీనిని నువ్వు ..దీనిని నువ్వు ' తీసుకుని, మీరు సన్నద్ధులు కండి, మనం వేటకు బయల్దేరుతున్నాము అని తన అనుచరులను పురమాయించి,

పచ్చని హురుముంజి పనివాగె పక్కెర / పారసిపల్లంబు పట్టమయము
రాణ నొప్పారు పైఠాణంబు సింగిణి / తళుకు లకోరీల తరకసంబు
మిహి పసిండి పరుంజు మొహదా కెలంకున / ఠావు గుజ్జురిసేఁత కేవడంబు
డాకెలంకున సిరాజీ కరాచురకత్తి / కుఱఁగటఁ గ్రొవ్వాఁడి గోరకల పొది

పీలికుంచె తలాటంబుఁ బేరొజంబు
మణుల మొగముట్టు వన్నిసాహిణి యొకండు
కర్త యెదుటికిఁ గొనివచ్చె గంధవాహ
బాంధవంబైన యొక మహా సైంధవంబు

పచ్చపచ్చని, ఎర్రెర్రని జీరలు గల ముత్యాలతో కూర్చిన కవచాన్ని,పర్షియన్ విచ్చుకత్తిని, పఠాన్ల నుండి తెప్పించుకున్న ధనుస్సును, తళతళలాడే అమ్ములపొదిని, బంగారు పిడిబాకు ఒకప్రక్కన, గూర్జరదేశపు డాలు, ఇంకొక ప్రక్కన నడుముకు చక్కని చురకత్తిని, పదునైన బల్లెములపొదిని సిద్ధము చేసుకుని వేటకు బయలుదేరాడు స్వరోచి. పికిలిపిట్టల ఈకలతో చేసిన తలకుచ్చు, కల్లమణులతో కూర్చిన ముఖపట్టాను అలంకరించిన గుర్రాన్ని, గాలితో సమానంగా పరుగెత్తగలిగిన ఒక మేలుజాతి పెద్ద గుర్రాన్ని రౌతు ఒకడు తెచ్చి ఎదురుగా నిలబెట్టాడు.

తెచ్చుటయు నిచ్చ మెచ్చి మ
రుచ్చటుల కురంగ రయ నిరోధి స్యద గ
ర్వోఛ్ఛం బగు నత్తేజి సు
హ్రుచ్చక్రం బలర వేగ నెక్కి వెడలినన్

దేవతల గుర్రాల వేగాన్ని అధిగమించి వెళ్ళగలిగే ఆ ఉత్తమాశ్వాన్ని చూసి మెచ్చుకుని, దానిని అధిరోహించి,తన అనుయాయులు, శ్రేయోభిలాషులు కళకళలాడుతూ వెన్నంటి రాగా వెంటనే వేగంగా బయల్దేరాడు స్వరోచి.

జడలు మలంచి చొళ్ళెముగ సన్నఁపు బాగ లడంగఁ జుట్టి చ
ల్లడములు పూని మీఁదఁ బదిలంబుగఁ గట్టిన మట్టికాసెలం
బిడియము లంట దోఁపి పృథు భీషణబాహుల సాళువంబుల
న్దడవి కెరల్చుచుం జనిరి నాథునిమ్రోల నృపాలనందనుల్

చక్కగా జుత్తును సవరించి, దువ్వుకుని, పట్టుతలపాగాలు ధరించి, మోకాళ్ళ దాకా ఉండే లాగులవంటివి తొడుక్కుని పైన కావిరంగువస్త్రాలను కాసెపోసి కట్టి, ఆ కొసలు 'సిగ్గుకు తగిలేదాకా' లోపలికి దోపి, (బిడియము లంట దోఁపి..ఎంత చిలిపి ప్రయోగమో గమనించాలి!) మద్దిచెట్ల వంటి బాహువులను చరుస్తూ ఎగసిపడుతూ అతని ముందుకొచ్చారు అతని మిత్రులైన రాజకుమారులు.

ఇవి కఠపాశంబు లింత దుస్సిన మీఁదఁ / బడి దిశాకరినైన గెడపఁ జాలు
నివి మింటఁ బరచు పక్షీంద్రుఁ  జూపిన నీడ / బడి వాలునందాక బరవజాలు
నివి గాలి గనిన మూకవరాహదనుజేంద్రు / నైన జుట్టెంటిలో నాఁగఁజాలు
నివి కాటు కొల్పిన వృద్ధ కూర్మమువీఁపుఁ / జిప్పైన నెరచికై చింపఁజాలు

ననఁగ ఘర్ఘర గళగర్త జనిత భూరి
భూభ్రు దురుబిల భరిత భౌభౌ భయంక
రార్భటీ దీర్ఘ దిగ్భిత్తు లగుచుఁ  జలఁగె
సరిపెణలఁ బట్టి తెచ్చిన జాగిలములు

ఇవి మెడలకున్న బంధనాలు కొద్దిగా వదులైతే చాలు, అమాంతం మీదబడి దిగ్గజాన్నైనా తుదముట్టించగలవు, ఇవి ఆకాశంలో ఎగిరే పక్షీంద్రుడిని (గరుత్మంతుడిని!) చూపించి వదిలితే చాలు, ఆ నీడను పట్టుకుని ఆ పక్షి నేలన వాలేదాకా పరిగెత్తి పట్టుకోగలవు, ఇవి గాలి వాసన చూస్తే చాలు రాక్షసునివంటి వరాహాన్నైనా వెంటబడి, అంతమొందించగలవు, ఇవి ఉసిగొలిపి వదిలితే చాలు, ఆది కూర్మపు వీపు డిప్పనైనా పీలికలు పీలికలుగా చింపేయ గలవు అనిపించేంత భయంకరమైన జాగిలాలను బంగారు గొలుసులతో కట్టినవాటిని తీసుకొచ్చారు. వాటి గరగర ధ్వనులు, భౌభౌమనే అరుపులు కొండగుహలలో ప్రతిధ్వనించి దిక్కులను పిక్కటిల్లేట్లు చేస్తున్నాయి.

పులియఁడు బూచిగాఁ డసురపోతులరా జనుమంతిగాఁడు చెం
గలువ సివంగి భైరవుఁడు గత్తెర సంపఁగి వెండిగుండు మ
ల్లెలగుది వాయువేగి చిటిలింగఁడు సాళ్వఁడు వత్సనాభి ఏ
కలములమిత్తి గబ్బి యనఁగాఁ గలవాని గ్రహించి యుద్ధతిన్

ఆ వేట జాగిలాల అద్భుత వర్ణన మాత్రమే కాదు, వాటి పేర్లను కూడా ఇచ్చాడు చమత్కారంగా పెద్దన. మహారాజులు వేటకు వెళ్ళేప్పుడు వెంట ఉండే ఆర్భాటంలో వేటజాగిలాలు, డేగలు ప్రథాన భాగాలు. అందునా శ్రీకృష్ణ దేవరాయ చక్రవర్తి అంతటి సకలకళా వల్లభుడికి ఇంకా ఎందులో కొరత ఉంటుంది, ఆయనకు నిత్యసహచరుడై మసలిన పెద్దన రాయలవారి వేట జాగిలాలను అక్షరాలలో చిత్రీకరించాడు యిక్కడ, బహుశా ఈ పేర్లు గల జాగిలాలు రాయలు పెంచిఉన్నా ఆశ్చర్యము లేదు. లేదంటే కనీసం ఈ పేర్లున్న జాగిలాలను ఇతర మంత్రులు, సర్దార్లు మొదలైన వారిదగ్గర అక్కడక్కడ చూసిఉంటాడు పెద్దన!

పులియడు, బూచిగాడు, అసురపోతులరాజు, అనుమంతిగాడు, చెంగలువ, సివంగి, భైరవుడు, కత్తెర, సంపంగి, వెండిగుండు, మల్లెలగుది, వాయువేగి, చిటిలింగడు, సాళ్వడు, వత్సనాభి, ఏకలములమిత్తి, గబ్బి అనే పదిహేడు వేటకుక్కలను బంగారు గొలుసులతో కట్టిఉన్నవాటిని పట్టుకొచ్చారు.
 

(ఇంకా ఉంది)

మరిన్ని శీర్షికలు
bhayandolana