Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrudayam

గలంతా షూటింగ్ చేసి, ఆరింటికి ప్యాకప్ చెప్పి, గ్రీన్ పార్క్ లో సూట్ రూమ్ లో ఉన్న సీతారామశాస్త్రిగారి దగ్గిరకి వెళ్లాను. 2001 లో ఒక రోజు. లోపల రాసుకుంటున్నారు, ఫ్రంట్ రూమ్ లో వెయిట్ చేద్దాం అన్నాడు భీమ్ బాయ్. శాస్త్రిగారి తోడల్లుడి గారబ్బాయి, అసలు పేరు శ్రీను. ఈ శ్రీను గురించి ఏం పరిచయం చేయాలో తెలీట్లేదు, అతని గురించి ఒక్క ముక్కలో చెప్పండని నేనడిగితే, త్రివిక్రమ్ వెంటనే 'అతను మగాడు' అంతే. అన్నారు సరదాగా.

ఆ భీమ్ బాయ్ ఇప్పుడు అబ్బూరి రవి గారి అసిస్టెంట్ అయ్యి, తర్వాత స్వయంగా సీరియల్స్ కి మాటలు రాసేస్తూ బిజీ అయిపోయారు. సరే, శాస్త్రిగారి గురించి వెయిట్ చేస్తూ సోఫాలో నిద్రపోయాను అలాగే. ఓ రాత్రి వేళ రెండింటికి నన్ను లేపుతూ శాస్త్రిగారు, పడుకుంటే పాటెవరు రాస్తారు నాన్నా! అన్నారు. అందుకే కద గురువు గారూ మిమ్మల్ని పెట్టుకున్నాం - అని, అటు తిరిగి మళ్లీ పడుకొంటే నాకూ నిద్రొస్తుంది కదరా... సరే, లేచి మొహం కడుక్కుని రా. పాట వినిపిస్తాను అన్నారు. టక్కున లేచి, రెడీ అయ్యి పక్క గదిలోకి వెళ్లాను. దట్టంగా పొగ. మేఘాల్లో చంద్రుడి లాగ ఆ పొగ మధ్యలో శాస్త్రి గారు. అబ్బోసి... అంటూ మొదలుపెట్టి పాట వినిపించారు. అంతా బావుంది కానీ అబ్బోసి... కరెక్టే కాదండి. పల్లవి మారుద్దాం అన్నాను. నేనూ అదే అనుకున్నాను. కానీ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు గారు మూడు రోజులుగా ఇదే పదంతో పాట మొదలవ్వాలని గొడవ పెడుతున్నారు. పర్లేదండి - ఆయనకి నేను చెప్తాను. పల్లవి మారుద్దాం అన్నాను. ఏం చేస్తావ్ అనడిగారు. వేలెడంత లేని బుడతడు, ఓ పెద్ద నిర్మాతని ఎలా కన్విన్స్ చేస్తాడని కన్ సర్న్ తో కూడిన క్యూరియాసిటీ ఆయనది.

చిన్న పిల్లాడని చూసి పెద్దవాళ్లు ముద్దుగా అనే పదం 'అబ్బోసి' అండి. పిల్లలు వాడే పదం కాదు అది. నాకీ పాట పిల్లలు పాడే పాట. వాళ్లని ఆడిస్తూ పెద్దవాళ్లు పాడే పాట కాదు అన్నాను. రెండు చేతుల్తో నా మొహం దగ్గరకి తీసుకుని నెత్తి మీద ముద్దు పెట్టారు శాస్త్రి గారు. అదే అభిమానంతో చాలా విషయాల్లో అలాగే నెత్తి మీద అక్షింతలు కూడా వేశారాయన. ఆశీర్వదించినా, అక్షింతలేసినా, అభిమానించినా, గారం చేసినా, చిరాకు పడినా, శాస్త్రి గారి పాటల్లో సాహిత్యపు విలువల్లాగ ఆయనకి నాపైన అభిమానం అంగుళం కూడా మారదు. అది నా అదృష్టం.

అరగంటలో పల్లవి మార్చి ఇచ్చేశారు. ఏడు చరణాలతో. నాకు రెండే చరణాలు కావాలి గురువు గారూ... ఇన్నెందుకు రాశారు? అన్నాను. పాటలో విషయం ఉంది - రాస్తున్న కొద్దీ ఐడియాలు వచ్చాయి. నీకు విజువల్ గా ఏది కన్వీనియెంట్ గా ఉంటే అది ఏరుకో అన్నారు.

సినిమాలో పాటని ఓకే చేయాలంటే భారంతో పాటు విజువల్ గా కూడా అనువుగా ఉన్న లైన్లని ఓకే చెయ్యాలని అప్పుడే తెలిసింది నాకు. ఏడు చరణాల్లోంచి ఎనిమిది లైన్లు తీసుకుని రెండు చరణాలుగా రాశాను. పల్లవి అద్భుతంగా వచ్చింది. as it is గా ఓకే అనేశాను వినగానే. ఆ పాటే "తూనీగ... తూనీగ... ఎందాకా పరిగెడతావే రావే నా వంక..." ఓ సూపర్ డూపర్ హిట్ ని నావంక రమ్మని ఆహ్వానించినట్టనిపించింది నాకు.

అలాగే జరిగింది.

రేపట్నుంచి పాట షూటింగ్ అనగా, ఇవాళ సాయంత్రం పాట రికార్డింగ్. రాయడం ఇంకా పూర్తి కాలేదు. నాకు, ఎమ్మెస్ రాజు గారికి ఓకే. కానీ శాస్త్రి గారికే ఇంకా శాటిస్ఫాక్షన్ లేదు. అదే ఆయన దగ్గిరున్న విచిత్రం. ఏదో తాపత్రయ పడుతున్నారు. అదేంటో, ఎందుకో నాకు అర్ధం కావడం. ఓ పక్క నుంచి ఆర్ పీ రికార్డింగ్ స్టూడియో నుంచి ప్రతి పది నిమిషాలకీ ఓ ఫోను. అయిదు గంటలకి సింగర్ ఉష వచ్చారని చెప్తే, అయిదున్నరకి శాస్త్రి గారు సీరియస్ గా రెండు కాయితాలిచ్చి. ఓ పల్లవి సెలక్ట్ చేస్కో అన్నారు. ఓహో చరణాలు ఆల్రెడీ రాసిన వాటిలోంచి తీసుకోవాలన్న మాట. పాట మొత్తం అయిపోయినట్టే అనుకుంటూ పల్లవి చదివాను. "కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసీ ఒకసారే ఎదురయ్యే వరమే ప్రేమా... ప్రేమా..." అద్భుతంగా అనిపించింది. మేం ఓకే అనేశాక కూడా ఆయనెందుకు అంత పరితపించి మళ్లీ మళ్లీ రాశారో అర్ధం అయింది.

అబ్బాయ్... పల్లవి పాడేలోపు రెండు చరణాలు మళ్లీ రాసిస్తాను. పాత వాటిల్లోంచి తియ్యకు. చరణాలు కూడా అదే లెవల్లో ఉండాలి". రెండు వాక్యాల ముందు నాకర్థమైందనుకున్న విషయం ఇది వినగానే మళ్లీ అర్ధం కాలేదు. చెన్నైలో కంపోజింగ్... ఫ్లైట్ లో వెళ్తూ ఎమ్.ఎమ్. కీరవాణి గారికి కథ మొత్తం చెప్పాను. పాటల సందర్భం చెప్పాను. సెమి క్లాసిక్ టచ్ ఉండాలన్నారు. కచేరి పాటలు ఈ రోజుల్లో చూడరేమోనండి. పైగా పాట తర్వాత హీరోయిన్ ప్రైజ్ తీసుకుని హొటల్ కి వస్తోంటే ఛేజ్, ఫైట్ అన్నారు కదా! దాన్ని ఈ పాటలోనే పెట్టచ్చేమో చూడండి. దానివల్ల సాంగ్ జరుగుతున్నంత సేపూ హీరో డల్ గా చూస్తూ ఉండకుండా, హీరోయిన్ కోసం విలన్ ని తంతూ యాక్టివ్ గా ఉంటాడు అన్నారు. అద్భుతమైన సలహా - లీడ్ సీన్ నుంచి స్క్రీన్ ప్లే లో అక్కడికక్కడ సర్దేశాను. అప్పటికే పరుచూరి వెంకటేశ్వర రావు గారు పాట మొత్తం ఏకపక్షంగా స్టేజ్ సాగితే బావుండదని, హీరోయిన్ ఇంట్లో పక్షవాతం వచ్చిన తండ్రి కూతురి ప్రతిభకి ఆనందపడే సీన్ ఇంటర్ కట్ లో ఉంచాలని మరీ మరీ చెప్పారు. దానికి తోడు ఇప్పుడు కీరవాణి గారి సలహా వల్ల యాడ్ అయిన హీరో ఫైట్. ఈ సందర్భానికి శాస్త్రిగారు లిరికే రాశాకే ట్యూన్ చేస్తానని కీరవాణి గారు, ట్యూన్ కే పాట రాస్తానని శాస్త్రి గారు. చివరికి నాకు బుర్రలో బల్బ్ వెలిగి, శాస్త్రి గారి ముందు ఓ కాయితం పెట్టాను.

కృష్ణా! నిన్ను చేరింది
అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి
వెదురు తాను పొందింది...

అని రాసిచ్చాను. ఏంటిది? అన్నారు చిరాగ్గా. మీ ఇంట్లో నేను, భీమ్ బాయ్ ఓ సారి పుస్తకాలు సర్దుతుంటే, ఓ పుస్తకంలో బైట పడిన మీ కవిత. ఇదే ఈ సినిమాలో శ్రియ క్యారెక్టర్ కూడా. దీన్నే పాటగా ఇచ్చేయండి అన్నాను. దాన్ని మొదటి చరణం చేసి, "ఏ శ్వాసలో చేరితే..." రాసిచ్చారు. ఏ మస్తిష్కంలో మెరిస్తే ఓ భావం తెలుగక్షరాలతో మమేకమై, ఏ చేతి రాతతో కాగితం పై ప్రతిబింబించి, గాయనీ గాయకుల గొంతులో పరవశింపచేసే పాటగా మారి శ్రోతల చెవుల గవాక్షాల గుండా నేరుగా మనసుని హత్తుకుని, ఆ గాఢ పరిష్వంగంతో మెదడుకు కిక్కిస్తుందో - ఆ మస్తిష్కమే శ్రీ సిరి వెన్నెల. ఆ పాటే నా 'నేనున్నాను' లో "ఏ శ్వాసలో చేరితే..." రెండు పాటల పూర్వోత్తరానికే ఒక వారం స్థలం అయింది. శాస్త్రి గారితో నా అనుబంధం, ఆయన గురించి నా అభిప్రాయం, ఆ కుటుంబంలో నా సంబంధం వివరించడానికి మరో వారం కూడా తీసుకుంటాను.

అందాకా లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్...

 

మీ
వి.ఎన్. ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
amrutam taagaalanundaa?