Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
o college drop out gadi prema katha

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

agent ekamber

"లేదు లేదు ఆయన అలాంటివారు కాదు. మంచి మనిషి. ఒప్పుకుంటారని తెలిసే ముందు చెప్పాను" అన్నాడు ఏకాంబర్.

ఎందుకో తెలీదు బాధనిపించింది నూకరత్నానికి. తన మీద అభిమానంతో ప్రేమతో తనని తన ఆఫీసులో జాయిన్ చేసుకున్నాడనుకుంది. తమ బట్టల షాపు ఓనర్ గారు చెప్పాక, ఒప్పుకున్నాకనే కదా తనని ఆయన ఆఫీసులో పని చేయమని అడిగాడు?! తన అవసరం ఉందనే తనని జాయిన్ చేసుకుంటున్నాడు నిజమే కదా!

ఏకాంబర్ వెనుక కూర్చున్న నూకరత్నం ఉన్నట్టుండి ఒద్దికగా కూర్చుని మౌనంగా ఉండిపోయేసరికి ఉలిక్కిపడ్డాడు ఏకాంబర్.

నూకరత్నం ఎందుకో బాధపడుతోందని గ్రహించాడు. ఆమె మీద ప్రేమతో కాకుండా తన ఆఫీసులో పని చేయడానికి చదువుకున్న అమ్మాయి అవసరమయ్యే తనని జాయిన్ చేసుకున్నాడని అనుకుంటోందని కనిపెట్టేసాడు ఏకాంబర్.

"ఇలా మా ఇంటికి వెళ్దామా?!" ఉన్నట్టుండి అన్నాడు ఏకాంబర్.

"ఎందుకూ?" ఉలిక్కిపడి అడిగింది నూకరత్నం.

"అమ్మా నాన్న నిన్ను తీసుకురమ్మన్నారు" అబద్ధం చెప్పాడు ఏకాంబర్.

"ఎందుకూ?" మళ్ళీ అదిరిపడి అడిగింది.

"ఎందుకూ? తప్ప 'అలాగే' అనలేవా?" అడిగాడు ఏకాంబర్.

"ఎలా అనగలను?!"

"ఏం? ఎందుకనలేవు?"

"మళ్ళీ మా ఇంటి దగ్గర దించేస్తారా?"

"రేపు ఉదయమే వద్దాం"

"అమ్మో! అమ్మకు చెప్పకుండా ఈ రాత్రంతా మీ ఇంట్లో ఎలా ఉండగలను?" ఆశ్చర్యంగా అంది నూకరత్నం.

"అవును కదా? మీ ఓనర్ కి తెలీకుండా నేను నిన్ను మా ఆఫీసులో జాయిన్ చేసుకుంటే ఇన్నేళ్ళు మా పరిచయం, స్నేహం ఏమౌతుంది? నువ్వు కూడా మీ ఓనర్ కి చెప్పకుండా పని మానెయ్యలేదు కదా? ఇది అంతే!" తనకి బట్టల షాపు ఓనర్ కి గల అవినాభావ సంబంధం గురించి చెప్పి మా ఇద్దరి మధ్యా ఎలాంటి దాపరికాలు ఉండకూడదని అందుకే నీ గురించి ముందే ఆయనకి చెప్పి ఆయన అనుమతి తీసుకున్నానని నూకరత్నానికి నచ్చచెప్పాడు ఏకాంబర్.

"మీరు మాటకారులు సార్! ఎవర్నైనా మాటలతోనే బురిడీ కొట్టించగలరు" చిన్నగా నవ్వుతూ అంది నూకరత్నం.

"నిజమే కదా! ఇంతదూరం ఆలోచించలేదు తను. తన వలన ఎన్నో ఏళ్లుగా వాళ్ళ మధ్య ఉన్న సత్సంబంధాలు చెడిపోకూడదు కదా!" అని మనసులోనే అనుకుంది నూకరత్నం.

"మిమ్మల్ని బురిడీ కొట్టించలేకపోతున్నాను కదా" తెలివిగా అన్నాడు ఏకాంబర్.

"మీ మాటల్లో పడబట్టే కదా సార్! ఈ బ్యాగ్ బరువు మోస్తున్నాను" మరింత తెలివిగా అంది నూకరత్నం.

"అవును కదా!" అంటూండగానే చంద్రనగర్ లోకి బైకు చేరుకుంది.

"మీ ఇల్లెక్కడో...?!" బైక్ ని చంద్రనగర్ బ్రిడ్జీ దగ్గర ఆపి అడిగాడు.

"ఇంటి దగ్గరకి తీసుకెళ్ళి ఆపుతారా. వద్దు. మా ఏరియాలో ఉన్నవాళ్ళు నోళ్ళు నొక్కుకుంటారు. అమ్మ మనసు బాధ పడుతుంది. ఆ వీధి చివర ఆపెయ్యండి. అక్కడ నుండి మా ఇల్లు దగ్గరే!" అంది నూకరత్నం.

"అలాగే!" క్షణాల్లో బైక్ ని ఆ వీధి చివరకు చేర్చాడు ఏకాంబర్.

బైక్ దిగి ఇంటికి వెళ్ళబోతూ సడన్ గా ఆగి అంది నూకరత్నం.

"ఈ బ్యాగ్ మీతో పట్టుకువెళ్ళొచ్చు కదా!" వెనక్కి తిరిగి అంది నూకరత్నం.

"ఉండనివ్వండి! అందులో సుమారు మూడు లక్షల చిల్లరేగా ఉంది. ఫరవాలేదు. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీసుకు వచ్చెయ్యండి." అంటూ బైక్ ని గిర్రున వెనక్కి తిప్పి రయ్ మని ముందుకురికించి క్షణాల్లో అక్కడనుండి కనుమరుగయ్యాడు ఏకాంబర్.

'అమ్మో! మూడు లక్షలే!' అనుకుంటూ బ్యాగ్ ని గుండెలకు హత్తుకుని భయం భయంగా ఇంటికేసి అడుగులు వేసింది నూకరత్నం.

ఎదురుగా పాన్ షాపు దగ్గర నలుగురు కుర్రాళ్ళు పాన్ పరాగ్ నములుతూ బ్యాగ్ తో నడిచి వస్తున్న నూకరత్నాన్నే చూస్తూ ముందుకు అడుగులు వేసారు.

వాళ్ళు తన వైపే రావడం గమనించిన నూకరత్నం గుండెలు జారిపోయాయి. 'కొంపదీసి ఈ బ్యాగ్ లో మూడు లక్షల రూపాయలు ఉన్నాయని ఏకాంబర్ సార్ అన్నప్పుడు వీళ్ళు వినేసారా?!' మనసులోనే అనుకుని భయంతో బిగుసుకు పోయింది నూకరత్నం.

***

"ఏమండీ! భోజనం పెట్టనా?" వంటగదిలో నుండే అరిచింది పర్వతాలు. ఆ రోజు ఆదివారం కావడంతో పనేమీ తోచక వీధి వరండాలో కూర్చుని పేపరు తిరగేస్తున్నాడు పీతాంబరం.

పేపరు చదువుతున్నాడే గాని ఉదయం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం అతని మదిలో మెదులుతూనే ఉంది.

"ఎందుకూ కొరగానివాడనుకున్నాడు! ఎంతమందికి తల్లో నాలుకయ్యాడో?! చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. పెద్దోడే బాగా చదువుకొని 'కంప్యూటర్ ఇంజనీర్' గా ఉద్యోగం చేస్తూ నాలుగురాళ్లు సంపాదిస్తున్నాడు వీడు ఎందుకూ పనికిరాకుండా పోయాడనుకున్నాడు ఇన్నాళ్ళు'

ఆరేళ్ళయి ఉద్యోగం చేస్తున్నా ఎప్పుడూ జీతం చాలటం లేదు ఖర్చయిపోతుందనే అంటున్నాడు పెద్దోడు. తనే నోరు జారి ఈ నెల దుకాణంలో బేరాలు సరిగ్గా లేవురా అంటే పాతికవేలో ముఫ్ఫై వేలో తన ఖాతాలో వేస్తున్నాడు. అంతే కానీ, నెలనెలా నాకింత జీతం వస్తోంది నాన్నా! ఇదిగో! ఇది మిగిలింది. మీ దగ్గరుంచండని ఏనాడూ తనకి పంపించలేదు.

చిన్నోడు - ?!

తనకంతా ఆశ్చర్యంగా ఉంది. ఇంటర్ చదవడానికి ఎన్ని యాతనలు పడ్డాడు. అలాంటివాడు. ఈ రోజు... నగరంలో ఉన్న ప్రముఖలందరికీ పరిచయస్థుడయ్యాడు. పదిమందిలో ఒకడిగా పేరు తెచ్చుకుంటున్నాడు?

"ఏమండోయ్! ఆకలి లేదా? భోజనానికి రారా?" వంటగదిలో నుండి వీధిలో కూర్చున్న మొగుడు దగ్గరకు వచ్చి అతని చేతిలో ఉన్న న్యూస్ పేపరు గభాలున లాక్కుని అంది పర్వతాలు.

"ఆకలెయ్యటం లేదే పర్వతం! ఉదయం నుండి ఆనందంతో నా గుండె నిండిపోయింది. ఎందుకో ఆకలే దరి చేరటంలేదు" భార్యకేసి చూసి తృప్తిగా అన్నాడు పీతాంబరం.

"మీకు ఆకలెయ్యకపోతే, చిన్న పిల్ల దానికి ఆకలెయ్యదా? రండి ముగ్గురం కబుర్లాడుకుంటూ తినేద్దాం" పీతాంబరం చెయ్యి పట్టి లేపుతూ అంది పర్వతాలు.

"ఉండవే! చిన్నోడు కూడా వస్తాడు కదా! మనం వచ్చేసాక అక్కడ విశేషాలు ఏమిటో కనుక్కుని అందరం కలిసి తిందాం" కొడుకు కోసం రోడ్డుకేసి చూస్తూ అన్నాడు పీతాంబరం.

"కొడుకు మీద ప్రేమ ఉన్నపళంగా ఇంతలా పెరిగిపోయిందేమిటో? ఈ అయిదేళ్ళుగా వాడెప్పుడు ఇంటికి టైమ్ కి వచ్చాడండి? పనీ పాటు లేకుండా తిరిగినప్పుడే నయం. టైమ్ కి భోజనానికి టంఛన్ గా హాజరయ్యేవాడు. ఇన్స్యూరెన్స్ ఏజెంట్ అయ్యాక ఎప్పుడొస్తున్నాడో... ఎప్పుడు వెళ్తున్నాడో నాకే తెలియడంలేదండి ఏ అపరాత్రికో వస్తాడు. వాడే వడ్డించుకుని తిని పడుకుంటాడు. ఉదయం మనం అందరం లేవకముందే స్నానం చేసి పారిపోతాడు. పోనీ ఆదివారాలన్నా దొరుకుతాడంటే స్నేహితులు... సరదాలు... ఈ రోజే నిండుగా మన కళ్ళముందు కనిపించాడు" బాధగా అంది పర్వతాలు.

"ఊరుకో అమ్మా! చిన్నన్న అలా కష్టపడబట్టే కదా నీకూ నాకూ కష్టం లేకుండా ఇంటి నిండా ఇన్ని సామాన్లను తెచ్చి పడేశాడు." ఇంట్లో నుండి వీధిలోకి వస్తూ ఏడుస్తున్న తల్లిని బుదిరిస్తూ అంది అలివేలుమంగ.

"నిజమేలేవే తల్లీ! పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నంటాడు. పెద్దోడు ఇంటికోసం ఒక్కటంటే ఒక్క వస్తువు కొన్నాడా? చిన్నోడే నయం. చూడు. పైసా ఖర్చు పెట్టకుండా ఇంటినిండా సామాన్లు ఎలా సర్దేసాడో" ఆనందంగా కల్లొత్తుకుంటూ అంది పర్వతాలు.

"కొనకుండానా?! ఎవరిస్తారే!" ఆశ్చర్యంగా పెళ్ళాంకేసి చూస్తూ అన్నాడు పీతాంబరం.

"మీకు ఏది పట్టిందిలెండి? ఎన్నిసార్లు చెప్పాను మీకు, ఫ్రిజ్ ఓసారి, వాషింగ్ మెషిన్ ఓసారి, ఏసి ఓసారి, వాడు వాడుతున్న బైక్ ఓసారి ఇలా ఇంట్లో వున్న ప్రతీ వస్తువూ వాడు చేస్తున్న ఇన్స్యూరెన్స్ కంపెనీలో అందరికంటే ఎక్కువ పాలసీలు చేసినందుకు బహుమతులుగా వచ్చాయని. నమ్మారా?" చేతులు త్రిప్పుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది పర్వతాలు.

తల్లి వెంట అలివేలు మంగ కూడా వెళ్ళిపోయేసరికి పీతాంబరం కూడా పెళ్ళాన్ని పిలుస్తూ వెనకే వెళ్ళాడు.

"నిజంగా నిజమేనంటావా? కమీషన్ కి కమీషన్, ఇలా బహుమతులకు బహుమతులు ఇచ్చేస్తారంటే నాకు నమ్మబుద్ధి కావటంలేదు పర్వతాలు" ఇంట్లోకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అన్నాడు.

"మిమ్మల్ని ఎవరు నమ్మమన్నారు! మానెయ్యండి! ఇన్నాళ్ళయింది మీరెప్పుడన్నా వాటి గురించి ఆలోచించారా? ఎప్పుడో మన పెళ్లయినప్పటి మిక్సీ పాడైంది కొత్తది కొనండి అంటే దాన్నే ముఫ్ఫై మూడుసార్లు బాగు చేయించి తెస్తున్నారు" మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంది పర్వతాలు.

"అమ్మా! నాకు ఆకలేస్తోందే! అన్నం పెడుతూ నాన్న మీద అరవొచ్చుకదమ్మా!" డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అంది అలివేలుమంగ.

"నిజమేలేవే! చిన్నప్పట్నుండీ చిన్నోడ్ని నేను నమ్మలేదు. ఎప్పుడూ ప్రేమగా అక్కున చేర్చుకోలేదు. బలాదూర్ గా తిరిగి పాడైపోతున్నాడనే బాధపడేవాడ్ని గాని ఒక్క క్షణం కూడా వాడి కోణంలో ఆలోచించలేకపోయాను." అంటూ ఛటుక్కున డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి ఏదో గుర్తొచ్చినవాడిలా పెరట్లోకి పరుగందుకున్నాడు పీతాంబరం.

"భోజనం పెడుతూంటే కంచం ముందు నుండి లేచి అలా పరుగులెడతారేమిటండీ!" కంగారుగా వెళ్తున్న మొగుడికేసి ఆశ్చర్యంగా చూస్తూ అంది పర్వతాలు.

"ఉండవే! పెరట్లో బాత్ రూం అటక మీద మన చిన్నోడు ఇచ్చిన బోర్డు ఒకటి పడేశాను. అది గుర్తుకు వచ్చి..." అంటూ బాత్ రూం దగ్గరకు పరుగందుకున్నాడు పీతాంబరం.

"బావుంది! మీ పిచ్చి! భోజనం చేసాకో, రేపు ఉదయమో చూడొచ్చు కదా! ఇంత రాత్రివేళ దాంతో మీకు పనేంటో...?" అరుస్తూ అంది పర్వతాలు.

"మీరు భోజనం చెయ్యండి. నేను వస్తాను" అంటూ ప్రక్కనే ఉన్న స్టూల్ పైకెక్కి బాత్ రూం అటక పైన ఉన్న చెత్త సామాన్లన్నీ కెలికి కెలికి వెదికాడు ఏకాంబర్.

"మీ నాన్నకి ఏదొచ్చినా పట్టలేం. రాత్రీ పగలూ చూడరు. లేడికి లేచిందే ప్రయాణం అంటారు ఇందుకే" సణుక్కుంటూ కూతురికి అన్నం వడ్డించింది పర్వతాలు.

అటక మీద చేతికందేంత దూరంలోనే ఏకాంబర్ ఇచ్చిన బోర్డు కనిపించేసరికి మునివేళ్ళ మీద నిలబడి ఆ బోర్డును తీసాడు పీతాంబరం.

ఆ బోర్డు నిండా దుమ్మూ ధూళీ పేరుకుపోయి బూజు పట్టి ఉంది. బోర్డు పట్టుకుని బల్ల మీద నుంచి క్రిందకు దిగాడు పీతాంబరం. ఇంతలో సరసరా పాకుతూ అటక మీద నుండి గోడవారగా ప్రాకుతూ పెద్ద పాము పీతాంబరం ప్రక్కనుండే పరుగుపరుగున పారిపోయింది.

అది చూస్తూనే పీతాంబరం భయంతో జడుసుకుని బిర్రబిగుసుకుపోయి గోడకి అతుక్కుపోయాడు. ఏమాత్రం అలికిడి అయినా వెళ్ళిపోతున్న పాము వెనక్కి తిరిగి వస్తుందేమోనని బెదిరిపోయాడు.

అంతే! అక్కడనుండి ఎలా వచ్చాడో తెలీదు. శరీరమంతా చెమటలు పట్టేయడంతో భయం భయంగా హాల్లోకి పరిగెట్టుకు వచ్చాడు పీతాంబరం.

భర్త అలా పరిగెట్టుకు వచ్చేసరికి పర్వతాలు అయోమయంగా చూస్తుండిపోయింది.

"ఏమైందండి! ఎందుకంత కంగారుగా వచ్చారు?" ఆందోళనగా అడిగింది పర్వతాలు.

"పాము... పాము... పెరట్లో బాత్ రూమ్ దగ్గర పామును చూసాను" గుండె అరచేత్తో పట్టుకుని అన్నాడు పీతాంబరం.

"పామా?! బాత్ రూమ్ దగ్గరా...?!"

"అవును! ఇదిగో! ఈ బోర్డు కోసం వెళ్ళాను కదా అప్పుడు నా ముందు నుండే బాత్ రూమ్ గోడ మీద నుండి ప్రాకుతూ పెరట్లో ఉన్న తుప్పల్లోకి పారిపోయింది" ఆగాగి చెప్పాడు పీతాంబరం.

తండ్రి అలా భయం భయంగా పామును చూశానని చెప్పేసరికి భోజనం చేస్తున్న అలివేలుమంగ భయంతో బిగుసుకుపోతూ వింటూ ఉండిపోయింది.

"అమ్మో! తెల్లారగట్లే బాత్ రూమ్ కి ఎలా వెళ్లను" భయంగా అంది అలివేలుమంగ.

"ఛ! ఊరుకోవే. పాము ఎప్పుడో పెరట్లో నుండి బయట తోటలోకి పారిపోయిందట కదా! భయమెందుకు" అంది పర్వతాలు. కూతురికి అలా చెప్పిందే గాని ఆమెకి కూడా మనసులో ఏదో ప్రక్క భయం పీకుతూనే ఉంది.

ఇంతలో ఏకాంబర్ బైక్ శబ్ధం వినిపించింది. బైక్ ఇంజన్ ఆగినట్లనిపించింది. ఇంట్లో ఉన్న ముగ్గురూ ఒక్కసారే వీధిలోకి తొంగి చూసారు.

"చిన్నన్నయ్య వచ్చాడు" గట్టిగా అరిచింది అలివేలుమంగ.

ఇంట్లోకి వస్తూనే తల్లి తండ్రి భయం భయంగా ఏదో మాట్లాడుకోవడం వింటూనే నేరుగా డైనింగ్ హాల్లోకి వచ్చాడు ఏకాంబరం.

"ఏమైందమ్మా! ఎందుకలా ఉన్నారు?" జడుసుకున్నట్టున్న తండ్రి వాలకం చూసి అడిగాడు ఏకాంబర్.

"ఏం లేదురా! మన పెరట్లో మీ నాన్నగారు పామును చూసారట. ఇదిగో! భయంతో వణికిపోతున్నారు" నువ్వు రాకపోయినా నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది పర్వతాలు.

"ఓస్ అంతేనా! ఇల్లన్నాక మనుషులు, అడవన్నాక జంతువులు, తుప్పలున్నాక పాములు, పురుగులు ఉండక మరేంటి ఉంటాయి నాన్నా" జోక్ పేలుస్తున్నట్టు అన్నాడు ఏకాంబర్.

"నిజంగానే చూసాన్రా! ఒట్టు!" మళ్ళీ భయంగా అన్నాడు పీతాంబరం.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugadu inter fail ias pass