Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekamber

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

ప్పుడున్న కాలేజి మంచిదే కదా! దీన్ని వదిలి అమెరికా వెళ్లడం దేనికి?

కిట్టుకి సందేహం.

"అమెరికా కాలేజి సీటు తేరగా రాదు. 'జీ.ఆర్.ఈ' ఇంకా 'టోఫెల్' అనే ఇంగ్లీష్ పరీక్ష రాయాలి. జీఆర్ఈ లో మంచి మార్కులు వస్తే స్కాలర్ షిప్ వస్తుంది. లేకుంటే చాలా కష్టపడాలి. అమెరికాలో చదివితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి" అని వివరణ ఇచ్చాడు కమలాకర్.

ఒక జోకు ఉండేది ఈ "ఎమ్ టెక్కు" స్టూడెంట్స్ కి.

ఎవరైనా అమెరికా పోతుంటే ఒకడు ప్రశ్నించేవాడు "వాడికి ఎయిడ్ (అంటే డబ్బు సహాయం లేదా స్కాలర్ షిప్) వచ్చిందా?" అని.

ఆ... దానికేముంది? అక్కడికి పోగానే వాడే తెచ్చుకుంటాడు... ఎయిడ్స్...

ఈ ఎమ్ టెక్ విద్యార్ధులు ఎయిడ్స్ గురించి చర్చించేవారు. ఎయిడ్స్ గురించి చర్చించడానికి కారణం ఉంది.

విద్యార్ధులంతా సరియైన వయసులో ఉన్నవాళ్లే! దరిదాపు అందరిలోనూ ఏదో వెధవ పని చేయాలనే కోరిక. కానీ మళ్లీ భయం. ఏదన్నా వెధవ పని చేస్తే, అది వికటించి ఎయిడ్స్ పాలైతే, జీవితమే దండగ! కాని మళ్లీ ఏదో వెధవ ఆలోచన. ఆ ఆలోచనల్ని చంపడం కోసమే ఈ చర్చ. "అరే బొంబాయిలో 30 శాతం ఎయిడ్స్ ఉందట... తెలుసా" "అవును... ఇంట్లో ఉండి గుట్టుగా సంసారం చేసుకునే ఆడవాళ్లకి కూడా ఎయిడ్స్ ఉందని చదివాను..."

"ఈ 30 శాతంలో వేశ్యలూ, మగవాళ్లు, సంసారం చేసుకునే ఆడవాళ్లూ ఉన్నారు"

సంసారం చేసుకునే ఆడవాళ్లకి ఎయిడ్స్ ఎలా వస్తుంది? రాకూడదు కదా? కిట్టుకి డౌట్.

ప్చ్... నీకు ఇంకా వివరంగా చెప్పాలా... అసహనంగా అరిచాడు కమలాకర్.

"ఈ మొగుడనే వెధవ ఎక్కడో ఏడుస్తాడు. తెచ్చి పెళ్లానికి అంటిస్తాడు"

ఓహో... నిజమే! కరక్టే...

ఈ భయాన్ని కలిగించే చర్చలు ముందు కాళ్లకి బంధంగా పనిచేసేవి. మనిషి తప్పు చేయకుండా కాపాడేది భయమే! అందుకే పెద్దలు అన్నారు భయము, భక్తి అని. రకరకాల ఆలోచనలు చుట్టుముట్టేవి కిట్టుని. సాయంత్రం ఆఫీసునుండి ఇంటికి వస్తుంటే పక్క ఫ్లాట్ లోని బార్లలో డాన్స్ చేసే అమ్మాయిలు మెరుపుల్లా ఎదురుపడేవారు. కొందరు గుర్తు పట్టి పలకరింపుగా నవ్వేవాళ్ళు. వాళ్ల మాటల్ని బట్టి వాళ్లలో తెలుగు వాళ్లున్నారని కనిపెట్టాడు కిట్టు. ఆలోచనల్ని పంచుకోవడానికి ఉన్నది కమలాకరే!

కమలా...

చెప్పు!

ఈ డ్యాన్స్ అమ్మాయిలతో సరదాగా మనం మాట్లాడవచ్చు కదా!

అందులో తెలుగువాళ్లు కూడా ఉన్నారు.

ఐతే ఏంటయ్యా...

వాళ్లతో మాట్లాడిన అవసరం నీకేముంది?

నువ్వేమన్నా బార్ ఓనర్ వా.

వాళ్లపని వాళ్లది...

నీపని నీది...

వాళ్లతో మనకేంది?

అది కాదు కమలా సరదాగా ఫ్రెండ్ షిప్ చేయవచ్చు కదా?

చెయ్యవయ్యా... ఫ్రెండ్ షిప్ చెయ్యి... వాళ్లతో వెళ్లి డ్యాన్స్ కూడా చెయ్యి... ఎవడొద్దన్నాడు?

వెళ్లు... కోపంగా అన్నాడు కమలాకర్.

కమలాకర్ కోప్పడటానికి కారణం... ఏమిటంటే ఈ చర్చ ఎక్కువగా కొనసాగితే తానెక్కడ మారిపోతానో అనే భయం... అసలు అలాంటి చర్చని కట్ చేసి పారేస్తే ఏ గోలా ఉండదు....

బొంబాయి అనగానే ఎక్కువ మందికి వెంటనే తట్టేది రెడ్ లైట్ ఏరియా.

అచ్చ తెలుగులో చెప్పాలంటే "సానికొంపలు"

ఎప్పుడైనా లోకల్ ట్రైన్ గొడవ వద్దనుకున్నప్పుడు ఉదయం 8 గంటలకి తొమ్మిదో నెంబర్ బస్సు ఎక్కేవాడు కిట్టు. ఈ తొమ్మిదో నెంబర్ బస్సు ఎక్కితే "టూరిస్ట్" బస్సు ఎక్కినట్టే.

ఎవరైనా బొంబాయికి కొత్తగా వచ్చి, బొంబాయి చూపించమని అడిగితే ఈ తొమ్మిదో నెంబర్ బస్సులో పై అంతస్తులో కూర్చోబెడితే చాలు. బొంబాయి దర్శనం పూర్తిగా అయినట్లే.

ఈ బస్సు రెడ్ లైట్ ఏరియా మీదుగా దరిదాపు బొంబాయి అంతా తిప్పి, తొమ్మిదిన్నరకి చర్చిగేటులో దింపుతుంది. ఈ రెడ్ లైట్ ఏరియా వచ్చినప్పుడు బస్సులోంచి బయటకు చూసేవాడు కిట్టు.

"బాల్కనీలో నిలబడి, చెరిగిన జుట్టుతో పళ్లు తోముకునే ఆడవాళ్లు, మాసిన బట్టలు, సరిగ్గా ఒంటిమీద ఉన్నాయా లేదా అన్నట్లుంటే వస్త్రాలు, అపరిశుభ్రమైన వీధులు, రోడ్ల మీదే స్నానాలు చేసే మగవాళ్లు కొందరు, కళ్లకు కట్టినట్లు కన్పించే బీదరికం...

ఒక రకమైన జుగుప్స కలిగించేటట్లుగా కనబడేవి"

కిట్టుకి ఒళ్లు గగుర్పొడిచేది.

ఇదా! రెడ్ లైట్ ఏరియా?

ఇది పెద్ద ఫేమస్సా?

ఓరి దేవుడా!

వాళ్లని చూస్తుంటే బాధ, దయ కలుగుతుంది.....

ఏం బాధలురా దేవుడా అనుకునే వాడు కిట్టు.

*****

ఒక రోజు యధావిధిగా ఆరవ అంతస్తులోని క్యాంటీన్ లో మధ్యాహ్న భోజనం ముగించుకుని, గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చాడు కిట్టు.

కొంతమంది తెలుగువాళ్లు వేరేవేరే డిపార్ట్ మెంట్ల లో పనిచేసేవాళ్లు కిట్టుకి అప్పటికే పరిచయమయ్యారు.

వాళ్లతో బాతా ఖానీ కొడుతూ సిగరెట్ వెలిగించాడు కిట్టు.

ఆ రోజు కమలాకర్ లేడు. సెలవు పెట్టి "కావలి" కి వెళ్లాడు.

ఈ లోపు గడ్డం, పెంచుకొని భూతద్దాలు పెట్టుకున్న ఒకతను కిట్టుకి దగ్గరగా వచ్చాడు.

అగ్గిపెట్టె ఇస్తారా అని తెలుగులో అడిగి తీసుకుని సిగరెట్ వెలిగించాడు.

తెలుగు వాడని తెలియగానే అక్కడున్న వాళ్ళందరూ అతన్ని పరిచయం చేసుకున్నారు.

నా పేరు రాధాకృష్ణ.

ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్... మొన్ననే జాయిన్ అయ్యాను అన్నాడతను. అందరూ కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత ఎవరి డ్యూటీలకు వాళ్లు వెళ్లారు. పదిరోజుల తర్వాత కమలాకర్ వచ్చాడు.

ఈ వెధవ... (బూతు) టెంప్టేషన్లు ఎందుకు మనకు అని, పెళ్లి సంబంధం ఖాయం చేసుకొని వచ్చానని చెప్పాడు.

*****

ఏదీ ఫోటో తెచ్చావా నీకు కాబోయే భార్యది అన్నాడు కిట్టు.

జేబులో ఉన్న ఫోటోను తీసి ఇచ్చాడు కమలాకర్.

ఫోటో చూసి, సింపుల్ గా చాలా బాగుంది అన్నాడు కిట్టు.

నా మెంటాలిటీకి సింపుల్ గా ఉన్న అమ్మాయే సరిపోతుంది.

హంగు, ఆర్భాటాలు నాకు ఇష్టం ఉండదు అన్నాడు కమలాకర్.

యధావిధిగా లంచ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లి, మిగిలిన తెలుగువాళ్లను కలిసి, మిత్రులిద్దరూ సిగరెట్ వెలిగించారు.

కాసేపటికి గడ్డం, భూతద్దాలతను వచ్చాడు. కిట్టు ఆ గడ్డపతన్ని కమలాకర్ కి పరిచయం చేసాడు.  ఈయన రాధాకృష్ణ. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ అని. 'నా పేరు కమలాకర్', అని చెప్పడం మానేసి అతని వైపు తేరిపార చూస్తున్నాడు కమలాకర్. ఈలోపు గడ్డపాయన ఏం కమలాకర్ ఎలా ఉన్నావు?

బొంబాయికి వచ్చి ఎంతకాలమైంది? అన్నాడు.

కమలాకర్ ఓహ్!! అని పెద్దగా అరిచి, నువ్వెప్పుడొచ్చావ్ రాధా బొంబాయికి అన్నాడు వెంటనే.

కమలాకర్ వెంటనే కిట్టుకి చెప్పాడు. రాధాకృష్ణ, నేను ఒకటే క్యాంపస్ రాధా 'డాక్టర్' చదువుతుండేవాడు.

నేను ఇంజనీరింగ్ చదువుతుండేవాడిని. మేమిద్దరం మంచి స్నేహితులం.. అని.

ఈ భూతద్దాలాయన 'డాక్టర్' చదవడమేమిటి? ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేయడం ఏంటి? అనుకున్నాడు కిట్టు.

కాసేపటి కబుర్ల తర్వాత ఎప్పుడన్నా తీరుబడిగా ఉంటే మా డిపార్ట్ మెంట్ కి రండి... అని చెప్పి రాధాకృష్ణ వెళ్లిపోయాడు.

మరుసటి రోజు కమలాకర్, కిట్టులు అదే బిల్డింగ్ లో ఉన్న పదకొండో అంతస్థుకి వెళ్లారు. వరుసగా రూములున్నాయి. ప్రతీ రూము దగ్గర పేర్లున్నాయి. రాధాకృష్ణ అని రాసి ఉన్న గదిలోకి వెళ్లబోతే తెల్లని డ్రస్ లో ఉన్న ఫ్యూన్ అడ్డుపడ్డాడు. మీ పేర్లు రాసివ్వండి సార్ కిస్తాను. ఆయన రమ్మంటే వెళ్లవచ్చు అన్నాడు.

పేర్లు లోపలికి వెళ్లగానే ఆయనే లేచి వచ్చి, తలుపుతీసి లోపలకు తీసుకువెళ్లాడు.

ఆ... ఏంటి కమలాకర్... ఏమిటి విశేషాలు?

అంటూనే కమలాకర్, రాధాకృష్ణ వాళ్ల క్యాంపస్ విశేషాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

కిట్టు ఆ రూముని పరిశీలిస్తున్నాడు.

ఒక పెద్ద టేబుల్, దానికి ఎదురుగా ఎవరైనా వస్తే కూర్చోవడానికి కుర్చీలు వేసి ఉన్నాయి. రాధాకృష్ణ కూర్చున్నది దర్జాగా కనబడుతున్న రివాల్వింగ్ చైర్. రూము ఒక మాదిరిగా పెద్దగానే ఉంది.

టేబుల్ మీద ఫైళ్ళు ఉన్నాయి.

ఒక పక్కన సోఫా, రెండు సోఫా చైర్లు, మధ్యలో టీ పాయ్, బెల్లు కొట్టగానే టీ తెచ్చే ప్యూను.

తను పనిచేసే ప్రదేశం గుర్తుకు వచ్చింది కిట్టుకి.

పెద్దహాల్, వరుసగా బుల్లి ఇంజనీర్లకి టేబుల్స్, కుర్చీలు, చేరిన కొత్తలో కుర్చీ లేదని ఎక్కడో ఒక చోట కూర్చోవడం, ఈ బుల్లి ఇంజనీర్ల వరసకి ఎదురుగా వీళ్లకి బాసులయిన అసిస్టెంట్ ఇంజనీర్లు, వాళ్ల టేబుల్స్, కుర్చీలు, హాలుకవతల ఈ బుల్లి ఇంజనీర్లకి అసిస్టెంట్ ఇంజనీర్లకి, బాసులైన ఇంజనీర్లకి రెండు సామాన్యమైన రూములు.

తలుపు తెరుచుకున్న శబ్ధంతో ఈ లోకంలోకి వచ్చాడు కిట్టు.

ప్యూను వచ్చి ఒక చీటీ రాధాకృష్ణకి ఇచ్చి అక్కడే నిలబడ్డాడు.

ఆ చీటీవైపు సీరియస్ గా చూసి "కాసేపు వెయిట్ చెయ్యమను" అన్నాడు రాధాకృష్ణ.

"ఎవరో కలవడానికి వచ్చినట్లున్నారు. మేం తర్వాత వస్తాంలే రాధా" అన్నాడు కమలాకర్.

రాధాకృష్ణ చాలా మృదువుగా నవ్వి, ఫరవాలేదు కూర్చోండి,

"డింపుల్ కపాడియా" వచ్చింది, ఆమెని చూసి, మా ఫ్యూను కంగారు పడ్డాడు. నా ఆఫీసు పనిలో భాగంగా నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళని తప్పకుండా కలుస్తాను. చాలాకాలం తర్వాత కలిసిన మిత్రుడితో రెండు నిమిషాలు మాట్లాడాలి కదా? అన్నాడు రాధాకృష్ణ.

కిట్టుకి కళ్ళు బైర్లుకమ్మాయి.

సినిమా హీరోయిన్ డింపుల్ కపాడియా!!

రాధాకృష్ణని కలవడానికి వచ్చిందా?

ఆమెని తర్వాత చూస్తాడా? సినిమా వాళ్లను తెరమీద చూడడానికి, చేతిలో 60 పైసలు పట్టుకుని, మండుటెండలో మ్యాట్నీకి పెద్ద లైనులో తోసుకుంటూ నిలబడి, దేవుడా దేవుడా టిక్కెట్లు దొరికేట్టుచేయి అనుకున్న రోజులు గుర్తుకొచ్చాయి.

ఇదొక్క విషయం కిట్టుకి జ్ఞాపకం వచ్చింది వెంటనే.

ఈ బుల్లి ఇంజనీర్లు నలుగురు అమితాబ్ బచ్చన్ ఇల్లు సర్వే చేయడానికి కొలిచే టేపులు, చైన్లు పట్టుకువెళ్లి, రోజంతా సర్వే చేశారంట. ఇక సాయంత్రం వెళ్ళేటప్పుడు ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ని చూద్దామని అనుకున్నారట. ఏదో పనిమీద వెళ్లారు. లేటుగా వస్తారని చెప్పారంట వీళ్లకి. ఐదారు గంటల వెయిటింగ్ తరువాత ఆయన బయట నుండి రాగానే దర్శనం చేసుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారంట.

అబ్బ! అమితాబ్ బచ్చన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన చేతులా ఇవి! అని మిగతావాళ్లు వీళ్లని తెగపొగిడారట.

అటువంటిది... ఆమె వెయిట్ చెయ్యాలా, రాధాకృష్ణని చూడడానికి?

ఇంతలో కమలాకర్ కిట్టుని కదిపాడు.

బయటకు రాగానే అడిగాడు కిట్టు.

రాధాకృష్ణ ఉండేది ఎక్కడ?

"వాళ్లకో కాలనీ ఉంది. చక్కటి ఇల్లు. కాలనీ వాళ్లకి స్పెషల్ బస్సు. కాలనీ నుండి పొద్దున్నే బయలుదేరుతుంది.

తిరిగి సాయంత్రానికి ఇంటికి తీసుకెళ్తుంది" చెప్పాడు కమలాకర్.

"బొంబాయి రాగానే క్వార్టర్ ఇచ్చారా?"

కిట్టు బుర్రలో ఆలోచనలు సుడి తిరిగాయి.

బొంబాయి రాగానే క్వార్టర్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు కిట్టు. క్వార్టర్ ఇచ్చేవాడు ఢిల్లీలో ఉంటాడట. ఈ దరఖాస్తు ఢిల్లీకి వెళ్తుందట. బొంబాయిలో కొన్ని లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. రకరకాల డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. క్వార్టర్లు మాత్రం సరిపడేటన్నిలేవు. అప్లై చేసుకున్నావుగా... అన్ని డిపార్ట్ మెంట్ల వారందరి అప్లికేషన్లు చూసి, ఆ వరుస క్రమంలో నీకూ ఇస్తారు. ఒక పదేళ్లు పట్టవచ్చు అన్నారు.

అటువంటిది రాగానే క్వార్టర్స్ ఇచ్చారా?

పైగా "స్పెషల్ బస్సా!?"

ఉదయాన్నే లేచి, పడుతూ లేస్తూ బస్సెక్కి, రేపు చేయించుకున్నంత పర్యాయం జరిగి, నలిగిపోయి ఆఫీసుకు చేరుకోవాలి కిట్టు. కిట్టు ఒక్కడే కాదు బొంబాయిలోని సగటు ఉద్యోగుల అందరి పరిస్థితీ ఇదే! కిట్టుని కమ్ముకున్న మబ్బు తెరలు కొద్దికొద్దిగా తొలగిపోతున్నాయి.

ఏదో సాధించేసానని అనుకుంటున్నాడు.

కానీ ఏదో ఉంది.

ఏమిటది?

ఏం చెయ్యాలి?

*****

నిద్రపోదామని పడుకున్నాడు గానీ, నిద్రరావడం లేదు కిట్టుకి.

ఆ రోజు జరిగినదంతా కళ్లముందు పదేపదే సినిమా రీళ్లలా గిరగిరా తిరుగుతున్నాయి.

కమలా... కమలా...

ఏంది కిట్టూ... నీకు నిద్రరాకపోతే పోయే... నా నిద్ర పాడు చెయ్యకు....

ఈ రాధాకృష్ణ గారి ఉద్యోగం ఏమిటి?

రాధాది అసిస్టెంట్ కమీషనర్ ర్యాంకు... చాలా పెద్ద ఉద్యోగం

అంత పెద్ద ఉద్యోగంలో ఉండి, అతి సామాన్యుడిలా, తనే వచ్చి పరిచయం చేసుకుని, చిన్న ఉద్యోగస్థులమని తెలిసినా, పట్టించుకోకుండా, మనతో మాట్లాడుతూ, కబుర్లు చెబుతూ, సిగరెట్ తాగుతూ, మనం వెళ్లగానే తనే తలుపు తీసి ఆహ్వానించడం... నిజంగా చాలా గొప్ప విషయం...

ఆయనకి లేనిపోని భేషజాలు లేవు. చిన్నా పెద్దా అందరితో కలిసిపోతాడు.

చాలా మంచి మనిషి. స్నేహితులంటే ప్రాణం, వాళ్లకెంతయినా సహాయం చేస్తాడు. సున్నిత మనస్తత్వం, మృదుభాషి, మితభాషి... అంతెందుకు వాళ్ళింట్లో పెంపుడు పిల్లి చచ్చిపోతే ఇంట్లో వాళ్ళందరూ వారం రోజుల పాటు తిండి తిప్పలు మానేసి, బాధపడ్డారు.

ఇంకా చాలా ఉంది చెప్పాలంటే, ఇంక పడుకో... అన్నాడు కమలాకర్.

సరే సరే... కానీ రేపొకసారి లంచ్ టైమ్ లో ఆయన్ని కలవాలి అన్నాడు కిట్టు.

ఓకే... ఓకే... అన్నాడు కమలాకర్.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్