Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrudayam

"మంచి పాట రాయాలని విపరీతమైన కసి, తెలుగు సినిమా పాటల పూదోటలో విరిసిన పారా వార రాకాశశి, పనిగా పాట మొదలెట్టి, పాట పని పట్టే దాకా విశ్రమించని రాకాసి - శ్రీ సీతారామశాస్త్రి. సి." పొగడ్తలతో మంచివన్నీ వాడడం అయిపోయాక, ఇంకా పొగడాల్సిన లక్షణాలుంటే, చెడ్డ వాటి నుంచి కొన్ని అప్పు తెచ్చుకుని మంచి లక్షణాలకి జోడిం చెయ్యడం అనాదిగా ఉన్న అలవాటే. పని రాక్షసుడు, భయంకరుడు, కవి నిరంకుశుడు - ఇత్యాదివి. నాదీ ఆ ప్రయత్నమే తప్ప, వేరే ఉద్దేశం లేదని నా మనవి.

శాస్త్రి గారింట్లో పెద్ద దిక్కు వాళ్ళమ్మ గారు. ఏ వేళలో అయినా ఆకలేస్తే అన్నం పెట్టే మొక్కు ఆయన శ్రీమతి, మా పిన్నిగారు. ఈ దిక్కు, మొక్కు లేకపోతే, చాలామంది దిక్కూ, మొక్కూ లేని వారై పోయేవారు ఈ పాటికి. ఇది నిజం. ఆయనిల్లు ఎప్పుడూ నిండుగా, 'హమ్ ఆప్కే హై కౌన్' సినిమాలో పెళ్లి సీనుల్లో ఫ్రేములాగా కళకళలాడుతూ ఉంటుంది. ఆ సినిమాని థియేటర్లో మూడుగంటలు చూస్తే బావుంటుంది. కానీ, జీవితాంతం ఆ సినిమాని అదే క్వాలిటీతో రోజూ నిర్మించాలంటే... పాటలో పదాల బరువు పెరిగినట్టు రెమ్యునరేషన్ లో నోట్ల బరువు రోజూ పెరగదు కదా...

అదే నాకాశ్చర్యం. అందుకే నా దృష్టిలో శాస్త్రిగారు పెద్ద హీరో. జీవితంలో పాటించవలసిన విలువల్ని కాచి, వడపోసి, తల్లిని, భార్యని, పిల్లల్ని సమన్వయ పరిచిన తీరు - సాహిత్యాన్ని అవగాహన చేసుకుని, సంగీత దర్శకుణ్ణి, గాయనీ గాయకుల్ని, వాయిద్య సహకారాన్ని కలుపుకున్న ఆయన పాటలాగే తీయగా, హాయిగా సాగిపోతోంది అచిరకాలంగా. పాటకి తప్ప ఇహ, పర విషయాలపైన ఆయన ఎంత ఎటాచ్డ్ గా ఉంటారో, అంతే డిచాడ్డ్. ఒక్క నిముషంలో అయిదారు నెలల ప్రేమని ఒక్కసారే చూపించేస్తారు. మరు నిమిషంలో అక్కడసలు లేనట్టే ఉంటారు. ఆయన సృజనాత్మకత శక్తికి ఈ వైచిత్రి కన్నా పెద్ద మెజర్ మెంట్ స్కేల్ ఏముంటుంది?

చెన్నైలో భైరవద్వీపం షూటింగ్...
సాయంత్రం బాలుగారి వాయిస్ మిక్సింగ్...
"ఘాటైన ప్రేమ ఘటన, దీటైన మేటి నటన,
అందంగా అమరిందిలే, ఇక ఆనందం మిగిలుంది లే..."

ఇది ఫెయిర్ చేస్తూ, మిగిలింది లే నా సర్, మిగిలుంది లే నా సర్... అని అడిగాను. మిగిలింది లే రెగ్యులర్ ఎక్స్ ప్రెషన్. జానపదం కాబట్టి మిగిలుంది లే సౌండ్ కొత్తగా ఉంటుంది, పైగా ఫ్యూచర్ లో మిగిలి ఉంది అన్న సెన్స్ క్యారీ అవుతుంది అన్నారు. అలాగే ఫెయిర్ చేసి రికార్డింగ్ థియేటర్ కి వెళ్లాను. బాలుగారు పాట పాడారు. మిగిలిందిలే అనే పాడేశారు. బైటకొచ్చాక మాధవపెద్ది సురేష్ గారికి పాట కాయితాలిచ్చి, ఎవరండీ అసిస్టెంట్ డైరెక్టర్ మిగిలింది లే కూడా అక్షర దోషాలతో రాస్తే వాడు తెలుగు దర్శకుడెలా అవుతాడు? సింగీతం గారిలాంటి మహానుభావుల దగ్గర పని చెయ్యడమే అదృష్టం. అది నిలబెట్టుకోవాలంటే భాష, సాహిత్యాల మీద ఎంత అవగాహన ఉండాలి? నేను బిత్తరపోయాను. కాఫీ తాగి, చరణాలు పాడడానికి లోపలికెళ్ళారు. సురేష్ గారికి చెప్పాను. ఆయన టాక్ బ్యాక్ లో బాలుగారికి చెప్పబోయారు. ఆయన మధ్యలోనే కట్ చేస్తూ శాస్త్రి గారు ఇక్కడుంటే నమ్మేవాణ్ని. వాడేదో అఫెండ్ అయ్యి, ఇక్కడ లేనాయన మీద తోస్తున్నాడు - చరణం కంటిన్యూ... అయినా, మిగిలింది లే అంటేనే ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్ టెన్స్ అన్నిటికీ అప్లికబుల్. అన్నారు. మళ్లీ దెబ్బతిన్నాను. మొదటి పాట రికార్డింగ్. చాలా చాలా అభిమానించే గాయకుడు. ఇంప్రెషన్ మాత్రం చాలా నీచంగా పడింది నామీద. దీన్ని ఈ పాట అయ్యేలోపే చెరిపెయ్యాలి. లేకపోతే జీవితాంతం కుమిలిపోతాను. ఎలా? శాస్త్రి గారిని ఇక్కడికి పిలిపించలేను. నా గురించి స్వంత డబ్బా కొట్టుకోలేను. సింపుల్ గా, బాలు గారికి నా గురించి తెలియాలి. నాకూ భాష, సాహిత్యం వచ్చని, ఆయననుకున్న తప్పు మేం తెలిసే చేశామని, ఆయనంటే నాకు పిచ్చి ఇష్టమని తెలియాలి. గబగబా పేపర్ మీద రాసాను.

కీర్తి, యశములందు "బాల" లెప్పటికీ
విద్యలోన పెద్ద "బాల" శిక్ష
పేరులోన గలదు, "బాల" శబ్దము మీకు
సార్ధకమ్ము నొసగ సుబ్రహ్మణ్య!

ఇది ఏ గణమో, ఏ పద్యమో, అసలు వ్యాకరణ సూత్రాల ప్రకారం తప్పో, ఒప్పో చెక్ చేస్కోడానికి అప్పుడు, మా నాన్నగారితో క్షణాల్లో సంప్రదించడానికి మొబైల్ కూడా కనిపెట్టబడలేదు. అయినా, నాభావం, బాధ అన్నీ తెలుస్తాయని, బాలూ గారు కారెక్కుతుంటే చేతికిచ్చేశాను. ఆయన చదివారో, చదివి అవతల పారేశారో నాకీ రోజు వరకు తెలీదు కానీ, ఈ మధ్య 'పాడుతా తీయగా' ప్రోగ్రామ్ లో ఓ పార్టిసిపెంట్ "ఏ శ్వాసలో చేరితే..." పాట బాగా పాడినపుడు బాలుగారు కీరవాణి గారిని, శ్రీ శాస్త్రి గారినీ ప్రశంశిస్తూ, ఆ పాట ఓకే చేసిన దర్శకుడిగా నన్నూ ప్రస్తావించి, నాక్కూడా చప్పట్లు కొట్టించారు.

అదీ శాస్త్రి గారి పాటే, ఇదీ శాస్త్రి గారి పాటే... నన్ను ఎంతలా ప్రభావితం చేశారో చూశారా... ఇదేముంది... ఇంతకన్నా గొప్ప సంఘటనలు మరికొన్ని శాస్త్రి గురించి చెప్పాల్సినవి ఉన్నాయి నా హృదయంలో... అప్పటి దాకా స్టే ట్యూన్డ్...

 

మీ
వి.ఎన్. ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
burrakatha shooting