Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

క్కసారిగా కరతాళద్వనులతో హాలు ప్రతిధ్వనించింది.

ఒకరిద్దరు అడిగిన ప్రశ్నలకు నోటికొచ్చిన ఏవో సమాధానాలు చెప్పి తప్పించుకున్నాడు త్రివిక్రమ్‌.

ఇక ఆ పూటకు గండం గడిచినట్టే.

స్టాఫ్‌ కరతాళద్వనుల మధ్యన

డయాస్‌ దిగొచ్చి వరేణ్య పక్కన తన సీట్లో కూర్చున్నాడు త్రివిక్రమ్‌. తను డయాస్‌మీద మాట్లాడుతున్నప్పుడు కాని, దిగి వస్తున్నప్పుడుగాని ఆమె చూపులు తనను వెంటాడుతూనే వుండటం గమనించి ఇబ్బందిగా ఫీలయ్యాడు త్రివిక్రమ్‌.

ఆ చూపులకు అర్ధం ఏమిటి? ఆరాధనా....!  లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైటా... తనమీద కోతలరాయుడని డౌటా...

''అసలు ఆవిడగారి ఉద్దేశం ఏమిటి? ఇంత సైలంట్‌గా తనను అబ్జర్వ్‌ చేస్తోంది. అయినా తనేమిటి? ఏ ఆడపిల్ల గురించి ఆలోచించని తను ఇప్పుడు ఈ అమ్మాయి కోసం ఇంతగా ఆలోచిస్తున్నాడు? తోటి ఎంప్లాయిస్‌లో తనూ ఒక ఎంప్లాయీ ఆమె. ఏమిటి స్పెషాలిటీ? ఎందుకింతగా తనను డిస్ట్రబ్‌ చేస్తోంది? ఆలోచిస్తూనే వున్నాడతను.

కాన్ఫరెన్స్‌ మరో గంట కొనసాగింది.

స్టాఫ్‌ కొంతమంది మాట్లాడారు.

వారి స్పీచ్‌లో సూచనలకన్నా త్రివిక్రమ్‌ని పొగడ్డమే కన్పించింది. అతను ప్రతిపాదించిన పంచసూత్రం పథకం గురించి ఒకటే పొగడ్డం.

అసలు ఆటోమొబైల్‌ ఫీల్డ్‌ గురించి ఎ బి సి డిలు కూడా తెలీని తను తప్పించుకోడానికి ఏదో వాగేశాడు. అద్బుతమైన పథకం అని వీళ్ళంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అదే ఆశ్చర్యం.

వరేణ్య సాదారణ యువతికాదు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌. కాబట్టి ఆమెనుంచి తనకు అభ్యంతరాలు రావచ్చని డౌటు పడ్డాడు. సీనియర్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ప్రసాద్‌ డయాస్‌ ఎక్కి తనను, తన పంచసూత్రాలను పొగిడాడు. కాబట్టి తనెందుకులే అనుకుందో ఏమోగాని ఆవిడ మాత్రం సీట్లోంచి లేవలేదు.

ఆమె పక్కన కూర్చుంటే అదే థ్రిల్‌గా వుంది అతడికి, మాట్లాడే వాళ్ళకన్నా, సైలంట్‌గా వుండేవాళ్ళే ఎక్కువ ప్రమాదం అంటారు పెద్దలు, ఈమె సాధారణ యువతిలా లేదు ఇదేదో తన పీకలకమీదికితెచ్చే ఆలోచనలోనే వున్నట్టుంది. వేరే సీట్‌లోకి మారిపోతే ఎలా వుంటుందాని రెండు మూడుసార్లు ఆలోచించి కూడా అపని చేయలేకపోయాడు.

సరిగ్గా ఒంటిగంటకి ఉదయం కాన్ఫరెన్స్‌ ముగిసింది.

అంతా భోజనాలకు లేచారు.

***

జీవితం చాలా విచిత్రమైంది.

అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. మళ్ళీ మళ్ళీ రాదు జీవితంలో ఎదగాలని పైకి రావాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది. కాని అందరికీ అది సాధ్యంకాదు. అవకాశం రాక అవస్థపడేవాళ్ళు కొందరయితే, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక చేజార్చుకుని దిగాలు పడేవాళ్ళు కొందరు.

ప్రస్తుతం వినోద్‌ పరిస్థితి అదే.

ఎంతో ఉత్సాహంగా విశాఖపట్నం బయలుదేరాడు. చివరకు పర్సు పోగొట్టుకుని, సూట్‌కేస్‌ పొగొట్టుకొని ఏంచేయాలో తెలీక రాత్రి మందుకొట్టి పడుకుని, మరునాడు ఉదయం వచ్చి దిగాలుగా తన బాస్‌ముందు నిలబడ్డాడు. అంతా విని ఆశ్చర్యంగా చూసాడాయన.

''వెరీబ్యాడ్‌...... వెరీబ్యాడ్‌'' అంటూ తల విదిలించాడు.

ఆయన ఎవరోకాడు.

సుధాకర్‌ నాయుడు.

ఆయన అసాధారణ వ్యక్తి, సన్‌ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి, కంపెనీ ఛైర్మన్‌, ఆరడుగుల ఆజానుబాహుడు, వ్యాపారంలో తల పండిన వ్యక్తి.

''ఎందుకిలా జరిగింది?''  సూటిగా ముఖంలోకి చూస్తూ విస్మయంగా ప్రశ్నించాడు.

''చదువుకున్నావ్‌, ఫారెన్‌ రిటర్న్‌డ్‌వి, తెలివైన వాడివి, దొంగలు దోచుకున్నారంటే బ్యాడ్‌ టైం అనుకునేవాడ్ని, కాని నువ్వు చేతులారా పారేసుకొని వచ్చావంటే నమ్మలేకపోతున్నాను. నిన్ను చూసి నవ్వాలో, తిట్టాలో కూడా అర్ధంగావటంలేదు'' అన్నాడు సీరియస్‌గా.

''పర్సు కోసం రైలుదిగటం పొరబాటయింది సర్‌. పర్స్‌ దొరకలేదు. సూట్‌కేస్‌ రైల్లో వెళ్ళిపోయింది....'' తన తప్పులేదని సమర్దించుకోబోయాడు వినోద్‌.

ఆయన మరింత సీరియస్‌గా చూసాడు.

''షటప్‌..... సింప్లీ ఐసే షటప్‌. ఫారెన్‌లో చదువుకున్నావ్‌, తెలివైనవాడివి, ఏం లాభం? కంగారు... నీకు చాలాసార్లు చెప్పాను. ప్రతి చిన్న విషయానికీ కంగారు, హడావిడి పనికిరాదన్నాను. నువ్వు మారలేదు. ఈ రోజుల్లో చదువురాని వాడు కూడా బోలెడు లగేజీలతో హేపీగా ప్రయాణాలు చేసేస్తున్నాడు. సింపుల్‌గా రిజర్వ్‌కోచ్‌ ఎక్కి కూర్చోటం నీకు చేతకాలేదు. షేమ్‌ టు యు.''

''సారీ సర్‌.''

''డోన్ట్‌సే సారీ... ఇది కేవలం స్వయంకృతం, నీ అజాగ్రత్త, పైగా నిన్న సాయంకాలం జరిగితే ఇప్పుడు వచ్చి రిపోర్ట్‌ చేస్తున్నావ్‌. కనీసం రైలు వెళ్ళిపోగానే అయినా పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వాలనిగాని, రైల్వే అధారిటీస్‌కి పరిస్థితి రిపోర్ట్‌ చేయాలనిగాని అన్పించలేదా?''

''అందువల్ల ప్రయోజనం వుంటుందనిపించలేదు సర్‌. సూట్‌కేస్‌ దొరికినవాడు పై స్టేషన్‌లో ఎక్కడో దిగిపోతాడుగాని, జర్నీ కంటిన్యూ చేయడుగదా.''

''షిట్‌!'' అంటూ నుదురు రుద్దుకున్నాడు సుధాకర్‌ నాయుడు.

పరమచికాగ్గాను, విసుగ్గాను చూసాడు.

''చదువు మనిషికి సంస్కారంనేర్పితే, వివేకం తెలివితేటలు నేర్పుతుంది అంటారు. ఈ రెండోదే నీకు కొంచెం తక్కువని నాకు డౌటుగా వుంది నిన్ను ఎందుకు విశాఖబ్రాంచ్‌కి వెళ్ళమన్నానో తెలుసా? నువ్వు బాగా చదువుకున్నవాడివి. ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో ఫారెన్‌ డిగ్రీలున్నవాడివి. ఏ వ్యసనాలు లేని మంచివాడివి. ఈ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీస్‌ని నీలాంటివాడి చేతిలో పెడితే మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశపడుతున్నాను.

అందుకే

మా అంతస్తుకు తూగని వాడివయినా, నా కూతురు వరేణ్యను నీకు యిచ్చి పెళ్ళి చేయాలని ఆశిస్తున్నాను. బట్‌.... నా కూతురు ఇష్టపడితేనే.

అందుకే నీకు వరేణ్యతో పరిచయంకోసం, అలాగే కంపెనీ పనిమీద కలిపి నిన్ను విశాఖ బ్రాంచ్‌కి వెళ్ళిరమ్మన్నాను. నువ్వేమిట్రా అంటే పర్సు,  సూట్‌కేస్‌ పోగొట్టుకొని వచ్చావ్‌, నిన్నేమనాలి?

ఫోన్‌లో వరేణ్యకి క్లియర్‌గా చెప్పాను వినోద్‌ వస్తున్నాడు. అతన్ని పరిశీలించు. అతను నాకు నచ్చాడు, నీక్కూడా నచ్చితే మీ ఇద్దరికి పెళ్ళిచేస్తాను అన్నాను.

అలాగే మేనేజరు మధుసూదనరావుకి ఫోన్‌చేసి నీ రాక గురించి చెప్పాను.

స్వాగత సత్కారాలతో నీకోసం వాళ్ళక్కడ ఎదురుచూస్తుంటారు. నువ్వుమాత్రం యిక్కడే వున్నావ్‌. వెరీ బ్యాడ్‌ వెరీ బ్యాడ్‌'' అంటూ ముఖం వాచేలా చీవాట్లు పెట్టాడాయన.

పాపం వినోద్‌

అతడికి ఏడుపు ఒక్కటే తక్కువ

కాసేపు మౌనం తర్వాత తిరిగి తనే సలహా యిచ్చాడు సుధాకర్‌ నాయుడు.

''ఓ.కే. అయిందేదో అయింది. పదిగంటలకి ఇక్కడినుంచి విశాఖకి ఫ్లయిట్‌ వుంది. నేను మేనేజర్‌కి ఫోన్‌చేసి చెప్తాను. టికెట్‌ కలక్ట్‌చేసుకుని ఏర్‌పోర్ట్‌కి వెళ్ళిపో. ఈసారయినా కంగారుపడకుండా నిదానంగా ప్రయాణం చెయ్యి. నేను నైట్‌కి ఫోన్‌ చేస్తాను. మరోసారిలా వెనక్కి వస్తే మాత్రం క్షమించను. వెళ్ళిరా'' అన్నాడు.

''థ్యాంక్యూసర్‌. ఈసారి జాగ్రత్తగా వెళతాను. వస్తానుసార్‌''అంటూ వదిలిందే చాలన్నట్లు అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోయాడు వినోద్‌.

అంతవరకూ వీళ్ళ సంభాషణ వింటూనే వుంది సుధాకర్‌ నాయుడిభార్య బాగ్యవతి. వినోద్‌ వెళ్ళిపోగానే ఆవిడ ముసిముసిగా నవ్వుతూ వచ్చి భర్త ఎదురుగా కూర్చుంది.

''మన వరేణ్య అసలే తిక్కపిల్ల. మీ తెలివితేటలన్నీ పుణికిపుచ్చుకుంది. ఈ కుర్రాడు మన పిల్లకు నచ్చుతాడంటే నాకు నమ్మకం కలగటం లేదు'' అంది.

''నా తెలివితేటలే నా కూతురికి వచ్చుంటే, ఈ కుర్రాడు నాకు నచ్చాడుగాబట్టి నా కూతురికీ నచ్చాలిగదా, నువ్వెందుకు నచ్చడంటున్నావ్‌?''

ఆవిడ తడుముకోకుండా వెంటనే బదులిచ్చింది.

''ఎందుకంటే.... వరేణ్యలో మీ తెలివితేటలతోబాటు నా తెలివితేటలు కూడా కలిసివున్నాయి. అందువల్ల'' అంటూ.

ఇద్దరూ నవ్వుకున్నారు.

***

కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న స్టాఫ్‌ అందరికీ

అక్కడికి సమీపంలోనే వున్న స్టార్‌ హోటల్లో భోజనాలకు ఏర్పాటు చేసాడు మధుసూదనరావు.

ఆఫీస్‌నుంచి ఆ హోటలో వాకింగ్‌ బయలుదేరారు.

మధుసూదనరావు పక్కనే అడుగులువేస్తున్నాడు త్రివిక్రమ్‌.

అతడికి సమీపంలో ముగ్గురు యువకులతో కలిసి నడిచి వస్తూ తననే ఓరకంట గమనిస్తోంది వరేణ్య.

ఆమె చూపులనుంచి తప్పించుకోడానికి ఏంచేస్తే బాగుంటుందాని ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్‌.

అతడి బెదురుచూపులకు ముచ్చటపడి  టీజ్‌ చేయాలనిపించింది వరేణ్యకి. ఆమె మధుసూదనరావు పక్కకొచ్చింది. ఆమె రావటం గమనించి తను వెనక్కి తగ్గాడు త్రివిక్రమ్‌. కావాలని తనూ స్లో అయింది వరేణ్య. ఈలోపల ఇద్దర్నీ దాటి మిగిలిన వాళ్ళంతా ముందుకెళ్ళి పోయారు.

త్రివిక్రమ్‌ ఆగిపోయాడు.

అతడి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి సీరియస్‌గా చూస్తోందామె.

వెనక్కు తిరిగి పారిపోతే ఎలా వుంటుందాని ఆలోచించాడు త్రివిక్రమ్‌. తను వినోద్‌ కాదని ఆమె పసిగట్టిందేమో ''పిశాచి ఏదన్నా గుర్తుకొస్తోందా?'' చిరుకోపంతో ఆమె దబాయించింది.

''ఛఛ. మిమ్మల్ని చూసాక వేరే పిశాచాన్ని చూడాలనిపించదు మేడం?''

''ఆ.....''

''టంగ్‌ స్లిప్పయిందని గ్రహించి కంగారుపడ్డాడు''. పిశాచాల కన్నా పడుచుపిల్లలంటే నాకు భయం ఎక్కువ మేడం'' అన్నాడు.

''ఐసీ...... ఎందుకంత భయం?

''ఎందుకంటే..... అంజనీ పుత్రుడు మా గురువుగారు కదండి.''

''వాడెవడు?''

''వాయునందనుడండీ..........అర్జునుడి రధంపైన జండాలో ఎగురుతాడే..

''ఓ...... ఆంజనేయుడు....... మీకు ఏదీ సూటిగా చెప్పే అలవాటులేదా? మంచి గురువుగారినే ఎంచుకున్నారు ఇంకా?

''వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేడం''

''వెళ్ళనీ...... హోటల్‌కేగా, మీ సంగతి చెప్పండి.''

''అయ్యె.............. మీరేదో నన్ను అనుమానిస్తున్నట్టున్నారు.''

''ప్చ్‌......... అనుమానం కాదు. ఇంట్రస్ట్‌. మీ గురించి తెలుసుకోవాలని''

''నాకు తెలీక అడుగుతాను. వేస్ట్‌ క్యాండెట్‌ గురించి ఏం తెలుసుకుంటారు మేడం?''

''ఆఁ?''

కళ్ళు పెద్దవిచేసి ముఖం చిట్లిస్తూ

ఆమె చూసిన చూపులకి నవ్వొచ్చేసింది త్రివిక్రమ్‌కి. అలాగే తన టంగ్‌ స్లిప్‌ అయిందనీ అర్ధమైంది. వెంటనే తేరుకుంటూ.

''ఐమీన్‌............. తెలుసుకోవటం వేస్టని నా ఉద్దేశం. చూడండి మేడం...''   

''నా పేరు వరేణ్య. అలాగే పిలవండి మేడం అంటూ నన్ను మేడ ఎక్కించి మాట్లాడితే నాకు నచ్చదు.''

''మీకు నచ్చినా, నచ్చకపోయినా నాలుగు రోజులుండి వెళ్ళిపోయేవాడ్ని నన్నెందుకు మేడం ఇబ్బందిపెడతారు? పదండి నడుస్తూ మాట్లాడుకుందాం'' అంటూ ఇక తప్పదని ఆమెతోబాటు హోటల్‌ దిశగా నడక ఆరంభించాడు.

''అంటే........... ఇక్కడ ఆఫీసుపనులు కాగానే వెళ్ళిపోదామనా?'' అనుమానంగా అడిగింది.

''అంతేగా, క్రికెట్‌ మేచ్‌ చూడగానే మధుర వెళ్ళిపోతాను. ఈ సూత్రానికి మనమధ్య ఎందుకొచ్చిన గొడవ....''

''మధుర........ అక్కడికెందుకు?''

''ఎందుకంటే.... చెప్పాగదండి. మా గురువుగారు హనుమంతుడు. నా ఆదర్శ దైవం శ్రీకృష్ణుడు. అవసరానికి అబద్దాలు చెప్పడంలో తప్పు లేదని చాటిన పరమాత్మ. ఆయన పుట్టిన మధుర పవిత్రక్షేత్రం. అందుకే చూసిరావాలని ఆశ.''

నిజానికి అతను మధుర అనటంలో ఉద్దేశం మేచ్‌ చూడగానే జైలుకు వెళ్ళిపోతానని, కాని పాపం అమ్మాయికి ఈ విషయం అర్ధంకాలేదు.

''భలే విచిత్రంగా మాట్లాడతారే'' అంటూ టక్కున నవ్వేసింది వరేణ్య.

''మీరు నవ్వితే చాలా అందంగా వుంటారు.''

''నవ్వకపోతే?''

''అందంగా వుంటారు.''

మరోసారి నవ్వేసిందామె.

''మాటల గారడీ అంటే ఏమిటో మీ దగ్గరే నేర్చుకోవాలి. ఇంతకీ మీరు క్రికెట్‌ అభిమానా?'' నవ్వుకొంటూ అడిగింది.

''యస్‌..... అసలు ఇక్కడ క్రికెట్‌మేచ్‌ లేకపోతే వైజాగ్‌ వచ్చే వాడ్నేకాను.''

వరేణ్య ఆలోచనలో పడింది.

ఏమిటి ఇతని ధోరణి?

డాడీ ఫోన్‌చేసి చెప్పిన మాటలకి

ఇప్పుడితని క్యారెక్టరుకి ఎక్కడా లింకు కలవటం లేదనిపిస్తోంది. వినోద్‌ వస్తున్నాడు గమనించు. నీకు నచ్చితే పెళ్ళిచేస్తాను అని చెప్పారు డాడి. కాని ఇతనేమో తను హనుమంతుడి శిష్యుడ్ని అంటాడు. క్రికెట్‌ చూడాలంటాడు. మధుర వెళతానంటాడు. ఏమిటిదంతా?

డాడీ సెలక్షన్‌లో రాంగ్‌ వుండదు.

ఆయన చెప్పింది కరక్టే

ఫస్ట్‌ సైట్‌లోనే తనను అట్రాక్ట్‌ చేసిన వ్యక్తి వినోద్‌, తను పలకరిస్తేనే పులకరించిపోయే యువకులున్నారు. తన చేయి అందుకోవాలని తపిస్తున్న వాళ్ళున్నారు. అటువంటి తను ఇంత సోషల్‌గా మూవ్‌ అవుతున్నా ఇతను టచ్‌మినాట్‌లా దూరంగా వుండిపోతానంటున్నాడు. ఏమిటి కారణం?

ఇతని కళ్ళకు తను అందంగా కన్పించలేదా?

ఒక వేళ డాడీ ఉద్దేశం ఇతనికి తెలీదేమో. ఇంకా చెప్పాలంటే, తను బాస్‌కూతురన్న విషయమే ఇతనికి తెలీదని డౌటుగా వుంది. ఒకవేళ తెలిసినా తెలీనట్టు నాటకం ఆడుతున్నాడా.... ఓ.కె. నాటకమే అయితే ఈ నాటకాన్నితనూ కంటిన్యూ చేస్తుంది.

''మీరు క్రికెట్‌ చూడరా?'' అడిగాడు.

ఇద్దరూ పక్క పక్కన నడుస్తున్నారు. అప్పుడప్పుడూ భుజాలు రాసుకుంటున్నాయి. తను ఎడంగా జరుగుతున్నాడు. తిరిగి ఆమె దగ్గరగా వస్తోంది. ఏదో ఒకటి మాట్లాడించాలనే ఉద్దేశంలో ప్రశ్నించాడు.

''చూడను'' వెంటనే చెప్పింది.

''ఐమీన్‌ ఒంటరిగా చూడను. మీరు ఒ.కే. అంటే మీతో స్టేడియంకు వచ్చి మీ పక్కన కూర్చుని చూస్తాను'' అంది తిరిగి,

''సారీ! అది మాత్రం వీలుకాదు.''   

''మీరు అబద్దాలు చెప్తారా?''

''అప్పుడప్పుడూ నిజాలు చెప్పను.''

''రెంటికీ తేడా ఏముంది?

''బోలెడు వుంది. నిజం నిజమే.... అబద్దం అబద్దమే. నిజం అబద్దం కాలేదు. అబద్దం నిజంకాలేదు. నేను నిజాలు చెప్పనన్నానుగాని అబద్దాలు చెప్తాను అనలేదు''.

''వెయిట్‌ వెయిట్‌........... ఆమ్మో నాకు బుర్ర తిరుగుతున్నట్టుంది. ఇన్ని కబుర్లు ఎక్కడ నేర్చుకున్నారు మీరు. డెట్రాయిట్‌లోనా? చికాగోలోనా?''

''డౌటే వద్దు మేడం. ఇండియాలోనే''

''ఇండియానుంచి డెట్రాయిడ్‌ ఎంత దూరమో అక్కడినుంచి ఇండియా కూడా అంతేదూరం అంటాను. మీరేమంటారు?''

''రాంగ్‌ అంటాను దూరం ఒకటి కాదంటాను.''

''నోనో.. ఆ వూరికి ఈ వూరు ఎంత దూరమో ఈ వూరికి ఆ వూరు అంతేదూరం అని సామెత వుంది. దూరం ఒకటి కాదని చెప్పలేరు.'''

''చెప్పగలను..... బెట్‌ వేసుకుందామా?''

''ఓ.కే... బెట్‌...... పందెం ఎంత?

ఎంతో వెంటనే చెప్పలేకపోయాడు త్రివిక్రమ్‌. కారణం అంతరాత్మ ఎదురుతిరగటమే. బెట్‌ అనగానే చటుక్కున సీన్‌లోకి వచ్చేసి వెక్కిరించింది.

''యూ..... పూల్‌. ఇడియట్‌..... చిల్లర పందాల జోలికి పోవద్దని చిలక్కి చెప్పినట్టు చెప్తున్నా వినవా? నీ బుద్ది పోనిచ్చుకోవా? చివరకు చేతులారా నిన్ను నువ్వే బయటపెట్టుకుని తన్నులు తినేవరకు తెచ్చుకునేలా వున్నావ్‌. తర్వాత నీ యిష్టం నీ నిజస్వరూపం బయటపెట్టాలని ఆ పిల్ల తెలివిగా ఉచ్చు బిగిస్తోంది. పిచ్చుకలా చిక్కుబడిపోతావ్‌ జాగ్రత్త'' అంటూ వార్నింగిచ్చింది.

ఈసారి ఎందుకో అంతరాత్మ ప్రభోదాన్ని మన్నించాలనిపించింది. అందుకే అయిష్టంగా తలవూపాడు.

''పందెం వద్దులెండి'' అన్నాడు.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugadu inter fail ias pass