Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugadu inter fail ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్.

ajent ekambar

"వును ఉండక చస్తాయా! వద్దు మొర్రో అంటే గత పదేళ్ళనుండి ఈ పాడు కొంప వదలటం లేదు. అద్దె తక్కువ. ఇంతకంటే మంచి ఇంటికి వెళ్ళాలంటే దొరకద్దా? అంటూ కాలం నెట్టుకొస్తున్నాడు. నిక్షేపం లాంటి సొంత ఇల్లుంది. అక్కడే ఉందామంటే విన్నారా?! పాలెం లో ఉంది - తెల్లారగట్లే రావడం కష్టం అని ఇక్కడకు తెచ్చి కుదేసారు" కోపంగా అంటూ విసురుగా వంట గదిలోకి వెళ్ళిపోయింది పర్వతాలు.

"ఎందుకమ్మా! నాన్నగారేం చేసారు! ఎప్పట్నుండో ఉంటున్న ఇల్లు. బాగు చేయించాలంటే సొంతం కాదు కదా! పోనీ తిరిగి అందరం పాలెంలో మన పాత ఇంటికి వెళ్ళిపోదామా?" ఆనందంగా అడిగాడు ఏకాంబర్.

"ఉన్న ఊరు కన్నతల్లి ఒక్కటంటారు. అక్కడ మన ఇల్లు ఎలాగైనా సర్దుకోవచ్చు. బాగు చేసుకోవచ్చు. తోట ప్రక్కనుంది ఈ ఇల్లు. ప్రహారీ కట్టడానికి ఇంటి ఓనర్ కి చెయ్యి రావటం లేదు. అద్దె మాత్రం తగ్గదు కదా!" సొంతిల్లు అనేసరికి నవ్వుతూ వచ్చి అంది పర్వతాలు.

"ఇప్పుడు పాలెం పోయి ఎప్పుడో వదిలేసిన ఇంటిని మళ్ళీ బాగు చేయించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా' బెంగగా అన్నాడు పీతాంబరం.

"ఏం ఫర్లేదు నాన్నా! నా పేర ఇల్లు కట్టుకోవడానికి పాతిక లక్షల వరకూ అప్పు ఇస్తారట. ఇన్స్యూరెన్స్ ఆఫీసులో బ్రాంచి మేనేజరుగారు చెప్పారు. నా కమీషన్ ఆధారంగా అప్పు ఇస్తారట. తీసుకుందాం! పాలెంలోనే పాత ఇల్లు పడగొట్టి పెద్ద డూప్లెక్స్ కట్టుకుందాం! ఏమంటావమ్మా!" తల్లికేసి చూస్తూ అడిగాడు ఏకాంబర్.

"చాలా సంతోషం నాయనా! మాకంటే ఏడెనకాతల పెళ్ళయిన వాళ్ళంతా పెద్ద పెద్ద భవంతులు కట్టారు. ఇదిగో! మీ నాన్నగారి ఆదాయం గొర్రె తోకలా ఎప్పుడూ ఎదుగూ బొదుగూ ఉంటేనా. కోమటెంకమ్మ కొలువు అంటే ఇదే" నిష్టూరంగా అంది పర్వతాలు.

"ఎవరితోనో మనకెందుకమ్మా పోలిక. మనకి నచ్చినట్టు మనం కట్టుకుందాం! రేపే లోన్ పెడతాను. సరేనా!" స్థిరంగా అన్నాడు ఏకాంబర్.

"హమ్మయ్య! ఈ ఇంటి గొడవ వదిలిపోతుంది! అమ్మో! ఉదయం బాత్ రూమ్ కి వెళ్ళాలంటే ఎలా అమ్మా! అక్కడ పాము ఉందన్నారు నాన్న!" భోజనం చేస్తూ ఏకాంబర్ అన్న మాటలు వింటూ ఆనందంగా లేవబోయి పాము విషయం గుర్తొచ్చి మళ్లీ భయంగా కూర్చుంటూ అంది అలివేలుమంగ.

"పాములా... అవి మనల్నేం చేస్తాయమ్మా! వాటి జోలికి వెళ్తేనే అవి మన మీదకు వస్తాయి... నువ్వెంత భయంగా ఉన్నావో... అవి కూడా మనం వాటిని ఎక్కడ చంపేస్తామోనని భయపడి పారిపోయి పుట్టల్లో దాక్కుంటాయి. ఎవరిని ఎవరూ ఏదీ అనకుండా ఎవరూ ఊరికే మన మీదకు రారమ్మా! పామైతే మనం భయపడతామని బుసలు కొడుతుంది దాన్ని మనం భయంతో చంపాలని ప్రయత్నిస్తే అది మన మీదకు వచ్చి కాటేయాలని చూస్తుంది. అంతే! నీకు అంతగా భయమైతే ఒంటరిగా వెళ్ళకు. నీతో అమ్మని తోడు తీసుకెళ్ళు" చెల్లికి ధైర్యం చెప్పాడు ఏకాంబర్.

"లేదురా! ఉదయాన్నే పెరట్లో బలిసిన పిచ్చి మొక్కలు, తుప్పలు నరికించేద్దాం! అంతవరకూ భయమే!" నెమ్మదిగా అన్నాడు ఏకాంబర్ తండ్రి పీతాంబరం.

"అలాగే నాన్నా! అలాగే బాత్ రూమ్ దగ్గర, పైన అటక మీద ఎలాంటి చెత్తా చెదారం పెట్టకండి! అవసరమైనవి ఉంచి మిగతావి బయట పారెయ్యండి. చెత్తా చెదారం ఎక్కడుంటే అక్కడ పురుగూ పుట్రా చేరుతాయి కదా!" అన్నాడు ఏకాంబర్.

"నువ్వు కాళ్ళు చేతులు కడుక్కు రారా చిన్నా! భోజనం చేద్దువుగాని' ఏకాంబరానికి డైనింగ్ టేబుల్ మీద కంచెం పెడుతూ అంది పర్వతాలు.

"అలాగే! ఇంతకీ పామెక్కడ కనిపించింది?" బాత్ రూమ్ కేసి వెళ్తూ ఆగి అడిగాడు ఏకాంబర్.

"మీ నాన్నగారికి ఇదిగో... ఎప్పుడో ఇచ్చావట కదా ఆ బోర్డు. ఆ బోర్డు కోసం బాత్ రూమ్ మీద ఉన్న అటక ఎక్కి సామాన్లు కెలికారట. అప్పుడే పాము బాత్ రూమ్ గోడ మీద నుండి ప్రాకుతూ పెరట్లో ఉన్న తుప్పలకేసి అలా తోటలోకి వెళ్ళిపోయిందంటున్నాడు" చెప్పింది పర్వతాలు.

"బాత్ రూమ్ దగ్గర" అంటూ క్షణం ఆగి "మీరూ రండి నాన్నా చూద్దాం" అంటూ తండ్రి చెయ్యి పట్టుకుని బాత్ రూమ్ వరకూ తోడు లాక్కుపోయాడు ఏకాంబర్.

అలివేలుమంగ గబగబా లేచి వెళ్లి పెరట్లో లైటు వేసింది. అటూ ఇటూ దిక్కులు చూస్తూ కొళాయి దగ్గర  చేతులూ కాళ్ళూ కడుక్కున్నాడు ఏకాంబర్.

తండ్రి కొడుకులు పెరట్లోకి వెళ్ళగానే తల్లీ కూతుళ్ళు కూడా వారి వెనుకే పెరట్లోకి వచ్చారు.

"ఏరా అన్నాయ్! నువ్వు నాకు భయపడొద్దని చెప్పి నువ్వెందుకురా అంత కంగారు పడుతున్నావ్!" ఎగతాళిగా అంది అలివేలుమంగ.

"భయం కాదే తల్లీ! జాగ్రత్త! పాము ఈ పరిసరాల్లో మళ్ళీ ఎక్కడన్నా తిరుగుతొందేమోనని చూస్తున్నా!" అంటూ చేతులు కడుక్కుని వచ్చేసాడు ఏకాంబర్.

నలుగురూ డైనింగ్ హాల్లో కూర్చుని కబుర్లాడుకుంటూ భోజనాలు కానిచ్చారు. ముందే భోజనం చేసేసిన అలివేలుమంగ తండ్రికి, అన్నకి కొసరి కొసరి వడ్డిస్తూంటే ఉదయం జరిగిన మీటింగ్ విశేషాలు మాట్లాడుకుంటూ ఆనందంగా ముగ్గురూ భోజనాలు ముగించారు.

తల్లితండ్రులతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నాడే గాని తండ్రి అటక మీద నుండి తీసిన బోర్డు కేసే పదే పదే చూస్తూ భోజనం చేయడం ముగించాడు ఏకాంబర్.

ఆ బోర్డు

ఏజెంటు ఏకాంబర్, సి.బి.ఐ 007, సీతమ్మ పేట, విశాఖపట్నం అని రాసి ఉంది. నల్లని బోర్డు మీద తెల్లటి అక్షరాలు మిలమిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి.

అయిదేళ్ళ తర్వాత మూల పడ్డ ఆ బోర్డు బయటకు తీసినందుకు సంతోషపడాలో... ఇన్నాళ్ళూ అటక మీద పడి ఉన్నందుకు బాధపడాలో అర్ధం కాలేదు ఏకాంబరానికి.

ఆ రోజు - ఆ బోర్డు విషయంలో తానెంత అవమానంతో కృంగిపోయాడు... ఎన్ని రోజులు పడి పడి ఏడ్చాడో గుర్తొచ్చేసరికి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.

చటుక్కున ఎవరికీ కనిపించకుండా తల దించుకున్నాడు ఏకాంబర్.

***

తెల్లారుతోందనగానే బ్యాగ్ భుజాన తగిలించుకుని బయలుదేరాడు ఏకాంబర్. అప్పటికే పీతాంబరం లేచి బయట పేపరు చదువుతూ కూర్చున్నాడు. రాత్రి పామును చూసిన దగ్గరనుండి అతనికి నిద్ర పట్టలేదు.

"నేను వెళ్తున్నాను నాన్నా! మీకు వీలైతే పాలెంలో ఉన్న మన ఇంటి కాగితాలు తీసి ఉంచండి" టిప్ టాప్ గా తయారయి వెళ్తూ అన్నాడు ఏకాంబర్.

"అలాగేరా! ఇదిగో! మన పెరట్లో తుప్పలు కొట్టిద్దామని తొందరగా లేచాను. గాంధీనగర్ లో ఉండే నాగలి అప్పారావుకి కబురు చెయ్యాలి" చెప్పాడు పీతాంబరం.

"అలాగే చెయ్యండి. పదే పదే ఆ పాము విషయమే గుర్తు పెట్టుకుని కంగారు పడకండి! అదేం చెయ్యదు. అమ్మా, చెల్లి భయపడితే అస్సలు పెరటి వైపే వెళ్ళరు" తండ్రికి ధైర్యం చెప్పి బైక్ బయటకు తీసి శుభ్రంగా తుడిచి స్టార్ట్ చేసాడు ఏకాంబర్.

"నువ్వు ఊరిమీద తిరగడానికి వెళ్తే ఆఫీసులో ఎవరుంటార్రా?" కుతూహలంగా అడిగాడు పీతాంబరం.

"నిన్న చూసారే! ఆ అమ్మాయి ఉంటుంది నాన్నా. ఇంకో ముగ్గుర్ని కూడా తీసుకోవాలి. వాళ్ళ కోసం వెదుకుతున్నాను. మనకు తెలిసిన వాళ్ళయితే బావుంటుంది." బైక్ మీద కూర్చుని ముందుకు ఉరికించబోతూ అన్నాడు

"సరేలే! నీకంతా తెలుసు కదా! జాగ్రత్త చిన్నా!" మొట్టమొదటి సారి చిన్న కొడుకుని అంత ఆప్యాయంగా పలకరించాడు పీతాంబరం. తాను ఇన్నాళ్ళూ వాడిని ఎంత చిన్న చూపు చూసాడో గుర్తొస్తుంటే బాధతో మెలికలు తిరిగిపోయాడు.

"మీరు మన ఇంటి డాక్యుమెంట్లు తీసి ఉంచండి. వస్తా" అంటూ బైక్ ని ఉరికించాడు ఏకాంబర్.

కొడుకులు ఇద్దరూ ప్రయోజకులయ్యారు. వాళ్ళని ఓ ఇంటి వాళ్ళని చెయ్యాలి. ఎదిగిన కూతురు ఇంట్లో తచ్చాడుతుండగా మగపిల్లల ఆలోచన రావటంలేదు. ముందు ఆడపిల్లకి మంచి సంబంధం చూసి ప్రయోజకుడైన కుర్రాడికిచ్చి పెళ్ళి చెయ్యాలి. ఆడపిల్లని అత్తవారింటికి సాగనంపాకే వీళ్ళిద్దరికీ పెళ్ళి సంబంధాలు చూడాలి.

పరిపరివిధాలా ఆలోచిస్తూ కూర్చున్నాడు పీతాంబరం.

"ఏమిటీ ఈవేళ ఇంత తొందరగా లేచిపోయారు? ఏమైనా విశేషమా?" నిద్ర కళ్ళు నులుముకుంటూ వీధి తలుపులు బార్లా తెరుచుకున్నాయని గుమ్మం దగ్గరకువచ్చిన పర్వతాలు భర్త పీతాంబరం గుమ్మంలో కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యంగా అడిగింది.

"నిద్ర పట్టలేదు. మంచం మీద దొర్లుతూ గడపలేక లేచాను. అప్పటికే మన చిన్నోడు తయారయిపోయి బయటకు వెళ్ళిపోతున్నాడు" సంతోషంగా అన్నాడు పీతాంబరం.

"ఈ రోజే చూసారా?! ఈ అయిదేళ్ళ నుండి వాడింతేగా! ఎందుకురా ఇంత పెందరాళే అని అడిగితే 'మనకోసం పాలసీదారులు ఇంట్లో కూర్చోరు కదమ్మా! వాళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్ళే లోపల మనమే తెల్లారగట్ల వెళ్ళి కలిస్తే వాళ్ళు సంతోషిస్తారు. మన పని కూడా పూర్తవుతుంది' అంటూ నాకే క్లాస్ తీసుకునేవాడు" మొగుడు ప్రక్కనే క్రింద అరుగు అంచు మీద కూర్చోబోతూ అంది పర్వతాలు.

"లేచావుగా! వేడి వేడి టీ పెట్టి తీసుకురావచ్చు కదా. నే ప్రక్కనే చతికిల పడితే 'టీ' ఎవరు పెడతారు?" పెళ్ళాం కేసి చూస్తూ పేపరు క్రింద పెట్టి అన్నాడు పీతాంబరం.

'క్షణం తీరిగ్గా కూర్చుంటే చూడలేరు కదా! ఇంతసేపు 'టీ' గుర్తు రాలేదులా ఉంది." విసుక్కుంటూ విసురుగా వంటగదిలోకి వెళ్ళింది పర్వతాలు.

స్టౌవ్ వెలిగించి 'టీ' పెట్టింది.

ఇంట్లో ఏవో మాటలు వినిపిస్తూంటే ఆ అలికిడికి గబాలున నిద్ర లేచింది. రాత్రంతా చిన్నోడు 'ఆఫీసు' హడావిడే కళ్ళల్లో సినిమా రీల్లా తిరుగుతూ ఉంది. నిద్ర పట్టకపోయినా హాయిగా ఆనందంగా మంచం మీద దొర్లుతూనే గడిపేసింది.

తెలివి వచ్చి చూస్తే వీధి గుమ్మం బార్లా తెరిచి ఉంది. దొంగలు గాని ఇంట్లో దూరారేమోనని ఎంతో కంగారుపడిపోయింది. వీధి గుమ్మం దగ్గరకొస్తే ఈయన పేపరు చదువుతూ కూర్చున్నాడు.

ఎప్పుడూ ఇంత పెందరాలే లేవలేదు. చిన్నోడు లేచి స్నానం చేసి బయలుదేరుతున్నప్పుడు లేవాలని ప్రయత్నిస్తే 'వాడే వద్దు వద్దు పడుకో అమ్మా' అంటూ తన మానాన తను తయారయి వెళ్ళిపోయేవాడు.

ఆలోచిస్తూ 'టీ' పెడుతోంది పర్వతాలు.

మనసంతా ఉల్లాసంగా వుంది. ఇద్దరు కొడుకులూ ప్రయోజకులయ్యారు. ఇక వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసెయ్యాలి. అన్నలిద్దరికీ పెళ్ళి చేసాక ఆఖరున కూతురికి పెళ్ళి చేస్తే ఎంతో సంబరంగా... అట్టహాసంగా చెయ్యొచ్చు. ఎప్పుడూ లేందీ ఆయనగారు ఖాళీగా వీధిగుమ్మంలో కూర్చున్నారు కదా! పిల్లలు పెళ్ళి విషయాలే చూచాయగా మాట్లాడవచ్చని కూర్చోబోయింది.

ఎప్పుడన్నా క్షణం విశ్రాంతి ఉండనిస్తాడా ఈయనగారు! ఖాళీగా కనిపిస్తే షాపులో పని పిల్లలకి పని చెప్పినట్టు చెప్తారు!

మనసులో సణుక్కుంటూ 'టీ' వడకట్టింది. రెండు గ్లాసుల్లో 'టీ' నిండుగా పోసి రెండు గ్లాసులూ రెండు చేతుల్తో పట్టుకుని వీధి గుమ్మం దగ్గరకు వచ్చింది పర్వతాలు.

వేడి వేడి టీ పొగ కక్కుతుంటే చూసి 'ఆబ' గా భార్య చేతిలో ఉన్న ఒక గ్లాసు గభాలున కుర్చీలోనుండి లేచి అందుకున్నాడు పీతాంబరం.

చెయ్యి కాలుతుంటే చీర చెంగుతో గ్లాసు పట్టుకుని నెమ్మదిగా సిప్ చేస్తూ వీధి అరుగు గుమ్మంమీద కూర్చుంది పర్వతాలు.

ఇంతలో వీధిలోనుండి ఎవరో అబ్బాయి వెళ్ళడం చూసాడు పీతాంబరం. గభాలున కుర్చీలోనుండి లేచి రోడ్డు మీదకు పరుగందుకున్నాడు. 'టీ' గ్లాసు ప్రక్కనే టక్కున పెట్టి పరిగెత్తాడు పీతాంబరం.

'ఈ మనిషికి ఇంత తొందరెందుకు?! ఆ కుర్రాడితో ఈయనకి పనేంటో?' టీ త్రాగుతూనే ఆలోచిస్తూ వాళ్ళిద్దరి కేసి చూస్తూ అనుకుంది పర్వతాలు.

ఆ అబ్బాయితో మాట్లాడి వెంటనే తిరిగి వచ్చేసాడు పీతాంబరం.

"ఆ కుర్రాడెవరండీ? అంత గాభరాగా పరిగెట్టారెందుకు?" అడిగింది.

"గాంధీనగర్ కుర్రాడు. నాగల అప్పారావుని రమ్మని కబురు చెప్పమని చెప్పాను" కుర్చీలో కూర్చుని 'టీ' తీసుకున్నాడు పీతాంబరం.

"అతనెవరు? ఆయనతో పనేంటండీ?" కుతూహలంగా అడిగింది పర్వతాలు.

"నీకన్నీ అనుమానాలే! పెరట్లో పిచ్చిమొక్కలు పీకిద్దామని. అలాగే పనిలో పనిగా బాత్ రూమ్ అటకమీద సామాన్లని దించేసి శుభ్రం చేయిద్దామని" చెప్పాడు పీతాంబరం.

"మీకెంత భయమండి! రాత్రి కనిపించిన పాము గురించేనా?" చిన్నగా నవ్వుతూ అంది పర్వతాలు.

"భయమే. కానీ, నా గురించి కాదు, మీ గురించి. నేను మరో గంటలో షాపుకని వెళ్ళిపోయి ఏ రాత్రికో వస్తాను. నువ్వూ, అమ్మాయి ఇంట్లోనే ఉంటారు. నీళ్ళని, బట్టలని, అంట్లని పొద్దస్తమానం మీరు ఆ పెరట్లోనే తిరుగుతుంటారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని నేనక్కడ మీకోసం ఆలోచిస్తూ భయం భయంగా గడపాలి. నిర్లక్ష్యం తగదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి" చెప్పాడు పీతాంబరం.

అలా అంటున్నప్పుడు పీతాంబరం గొంతులోనూ, కళ్ళల్లోనూ భార్యాపిల్లల మీద ప్రేమ ద్యోతకమయ్యేసరికి పర్వతాలు మనసులో ఆనందంతో పొంగిపోయింది.

ఎప్పుడూ పీనాసిగా ఆలోచించే మొగుడి మనసులో తన పట్ల, పిల్లల పట్ల ఉన్న అనురాగం గమనించేసరికి ఉప్పొంగిపోయింది. గబాలున వెళ్ళి మొగుడి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలనిపించింది. కానీ, అందుకు సిగ్గు అడ్డొచ్చింది. వయసు మీద పడ్డాక ఇలాంటి పిచ్చి ఊహలు తగునా అనుకుంది పర్వతాలు.

మనసులోనే ముసిముసిగా నవ్వుకుంటూ మొగుడి మొహంలోకి సూటిగా చూసింది పర్వతాలు. అదే సమయంలో పీతాంబరం కూడా పెళ్ళాంకేసి చూసాడు.

"అదేం అలా చూస్తున్నావ్?" టీ త్రాగడం ముగించి గ్లాసు క్రింద పెడుతూ అన్నాడు పీతాంబరం.

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్