Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sri Tripuraneni Gopichand

ఈ సంచికలో >> శీర్షికలు >>

పుస్తక సమీక్ష: టార్గెట్ 8 (నవల) - సిరాశ్రీ

target 8
 
 
పుస్తకం: టార్గెట్ 8 (నవల)
రచన: ఎంబీయస్ ప్రసాద్ 
వెల: 60/-
లభించు చోటు: విశాలాంధ్ర, కినిగె (http://kinige.com/book/Target+8)
 
వేలాది సినిమాలు, వందలాది టీవీ సీరియళ్లు చూసేసిన నేపధ్యం ఉన్న ఇప్పటి పాఠకులని నవల ద్వారా రంజింపజేయడమంటే కష్టసాధ్యమైన పని. ఏదో నవల అట్ట బాగుందనో, టైటిల్ బాగుందనో, ఎవరో చెప్పారనో ఓపిక చేసుకుని మొదటి నాలుగు పేజీలు తిప్పే పాఠకుడు ఏ మాత్రం పట్టు కుదరకపోయినా పక్కన పరేస్తాడు. దృశ్య మాధ్యమాలు అవసరానికి మించిన వినోద కార్యక్రమాలు ప్రసారం చేస్తుంటే ఇక నవలలు చదివే ఓపిక, తీరిక ఎక్కడిది అనుకునే ఈ రోజుల్లో కూడా అడపాదడపా పాఠకులని వశపరుచుకునే నవలలు వస్తున్నాయి. అలా వచ్చిన నవలే ఈ "టార్గెట్ 8". నవలకి సినిమాకన్నా లైఫ్ ఎక్కువ. అలాగే మౌత్ పుబ్లిసిటీకి కూడా టైం ఎక్కువ పడుతుంది. ఈ నవల వచ్చి ఐదేళ్లయ్యింది. నవలా ప్రియుల్లో పాపులర్ అయింది. ఇంకా అవుతోంది. 
 
ఇక విషయంలోకి వెళ్దాం. 
 
కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం- ఈ ఆరింటికి మనిషిలో నేరప్రవృత్తిని ప్రేరేపించే శక్తి ఉంటుంది. వాటి తీవ్రతనిబట్టి నేరాల తీవ్రత కూడా పెరుగుతుంది. మనిషి పతనానికి దారి తీసే ఈ ఆరూ ఒక ఎత్తైతే తాగుడు లాంటి వ్యసనం మరో ఎత్తు. ఈ థియరీ చుట్టూ కథ నడుస్తుంది. వినడానికి సింగిల్ లైన్ లో సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తున్నా ఇది ఒక కాంప్లెక్స్ థ్రిల్లర్. 
 
అమర్ ఒక సినిమా రచయిత. తాగుడు అతని వ్యసనం. అతని భార్య కామోన్మాది. బలరామయ్య సొంత స్టూడియో ఉన్న ఒక సీనియర్ సినిమా నిర్మాత. మరింత ఎదగాలని ఇతనికొక ఆశ. నాగభూషణం మరో నిర్మాత. ఇతనికి బలరామయ్య పట్ల అసూయ. మరో పాత్ర దేవకి. మదంతో కూడిన క్రోధం ఈమె సొంతం. కథలో కేంద్ర బిందువు ఈమె. ఇక గోవర్ధనం. ఇతడిది అవసరంతో కూడిన లోభం. ఈ పాత్రల చుట్టూ సాగే ఉత్కంఠభరితమైన కథ ఈ టార్గెట్8. చుట్టూ ఉన్న సమాజాన్ని అసాధారణ కోణాల్లోంచి చూసే పరిస్థితులు రావడమో, లేక విస్తృతమైన ప్రపంచ కథా నవలా సాహిత్యాన్ని చదివిన నేపధ్యమో లేకపోతే ఇంత ఉత్కంఠభరితమైన నవల రాయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇందులోని పాత్రల సైకాలజీని అద్భుతంగా పండించారు రచయిత ఎంబీయస్ ప్రసాద్. ఈయన ఇక్కడ ఎంచుకున్న ఏ స్త్రీ పాత్రలోనూ బేలతనం కనబడదు. జాణతనం, మొండితనం, ధీరగుణం తప్ప! అందరూ రొటీన్ గా చూసే ప్రపంచం కాకుండా..వేశ్యా వాటికలు, మాదక ద్రవ్యాల విక్రేతలు, విశృంఖల శృంగారం మొదలైనవి ఆశ్చర్యపరిచే  విధంగా చిత్రీకరించారు. 
 
సినిమా నేపధ్యమున్న కథ కావడం, అడుగడునా సస్పెన్స్ వెన్నంటి ఉండడం, స్త్రీ పాత్రల స్వభావాలు తీవ్రస్థాయిలో ఉండడం, అనేకమైన మలుపులు, ఏ పాత్రని నమ్మాలో ఏ పాత్రని విలన్ అనుకోవాలో తెలియని సన్నివేశాలు...ఇలా అనేక అంశాలు పాఠకులను గోళ్లు కొరుక్కుంటూ చదివేలా చేస్తుంది. అప్పటిదాకా ఆపకుండా చదుతున్న వారికి ఇంకొక్క పేజీ చదివి ఆపుదాం అనుకునే లోపు కథలో మలుపో, ఊహించని సన్నివేశమో వచ్చి పాఠకుడిని ముందుకు తోస్తాయి. 
 
ప్రమాదం ఎటునుంచైనా రావొచ్చు. ప్రమాదకరమైన ఆలోచనలు మనతో ఉన్న మనుషుల్లోనే పుట్టి మనల్ని కబళించొచ్చు. ఒకడు ఇంకొకడిని కొట్టడానికి ఒక ఆయుధాన్ని ఎంచుకుంటాడు. కానీ ఆ కొట్టే క్రమంలో ఆయుధానికి నొప్పి కలుగుతుందేమో అని ఎవడు ఆలోచిస్తాడు. ఈ నవలలో ఒకడికి అమర్ ఆయుధం, మరొకడికి దేవకి ఆయుధం. 
 
ఇంతకు మించి చెప్పడం భావ్యం కాదు. నవల చదివి ఆస్వాదించండి. 
 
దీనిని సినిమాగా తీయడం కష్టం. న్యాయం జరగదు కూడా. టీవీ సీరియల్ గా తీస్తే సూపర్ హిట్ అవుతుంది. ఆ రోజు రావాలనుకుంటున్నాను. 
 
 
మరిన్ని శీర్షికలు
duradrustapu dongalu