Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

.ajent ekambar

"ఏంలేదండీ! ఈ లేలేత వెలుగులో మీలో ఇంకా అప్పటి ఛాయలు కనిపిస్తూంటేనూ... చూడాలనిపించి చూస్తున్నాను" తనూ 'టీ' తాగడం పూర్తిచేసి గ్లాసు అరుగుమీద పడేసింది.

"ఎప్పటి ఛాయలు?" అయోమయంగా అడిగాడు పీతాంబరం.

"ఎప్పటివో... అదేంటీ? మీ బుగ్గ మీద ఆ నల్లటి మచ్చ!" అంటూ గబాలున లేచి దగ్గరకు వెళ్లి పీతాంబరం మీద ఒంగి చీర చెంగుతో బుగ్గని తుడుస్తున్నట్టు నటించి తన మొహాన్ని మొగుడి మొహానికి తాకించి సుతారంగా అతని బుగ్గల మీద తన పెదవులతో సృజించింది పర్వతాలు.

"చీర చెంగుతో తుడవడానికి మీద పడిపోవాలా?" అంటూ పెళ్లాన్ని రెండు చేతులతో పట్టుకుని నెట్టబోయిన పీతాంబరం చేతులు అనుకోకుండా ఆమె ఉదరాన్ని, ముడతలు పడ్డ నడుముని తాకేసరికి ఒక్కసారిగా చురుగ్గా పెళ్లాం కళ్లల్లొకి చూశాడు పీతాంబరం. శరీరం జలదరించినట్టయింది. ఫీజు పోయెముందు చురుగ్గా వెలిగిన బల్బులా అయిపోయింది పీతాంబరం వడలంతా.

ఇదింకా పిటపిటలాడుతూనే ఉంది. పెళ్ళయి ముప్పైఏళ్లు అయినా పట్టుసడలినట్టు లేదు. మనసులో కదలిన గిలిగింతల సవ్వడికి తట్టుకోలేకపోతూ అనుకున్నాడు పీతాంబరం.

"పర్వతాలూ! ఇవేళ నీలో ఎదో తేడా కనిపిస్తోందే!" నెమ్మదిగా, మత్తుగా అన్నాడు పీతాంబరం.
"మీ కళ్లే పాడైనట్టున్నాయి. కళ్లద్దాలు మార్చుకోలేకపోయారా?" చిన్నగా నవ్వుతూ అని మళ్లీ కింద అరుగు మీద కూర్చుంది పర్వతాలు.

"ముగ్గురు పిల్ల తల్లివైనా నీలో ఇంకా ఈ తుళ్లింతలేమిటే?" నవ్వుతూ అన్నాడు పీతాంబరం.
"మీ పెళ్లినాటి ముచ్చట్లు ఆపి పిల్లల పెళిళ్ల సంగతి ఆలోచించండి!" నవ్వుతూ అంది పర్వతాలు.
 
"పిల్లలేమిటి? ముందు అలమేలుమంగకి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాత మగపిల్లలు!" అన్నాడు పీతాంబరం.
"మీకు మతి చెడినట్టుంది. ముందు మగపిల్లల పెళ్లిళ్లయితే కట్నకానుకలు వస్తాయి. ఆ తర్వాత ఆడపిల్ల పెళ్లి ఎంతో ఘనంగా చెయ్యొచ్చు" భర్తకి నచ్చజెప్తూ అంది పర్వతాలు.

"నీవన్నది నిజమే! కానీ, పెళ్లయ్యాక పిల్లలు పెద్దాళ్లవుతారు. అప్పుడు ఇప్పటిలా నీ మాటా, నా మాటా వింటారన్న నమ్మకం వుందా? వచ్చే అమ్మాయిలు మంచివాళ్లయితే ఫరవాలేదు. కాకపోతే, అప్పుడు మన గతేంకాను? అదీ ఆలోచించాలి కదా!" అన్నాడు పీతాంబరం.

"అవినండీ మీరన్నదీ నిజమే!" ఆలోచనలో పడింది పర్వతాలు.
"ముందు అమ్మాయి పెళ్లి ఘనంగా చేద్దాం. అప్పుడు ఎవరూ ఆక్షేపించరు. ఆ తర్వాత మగపిల్లలిద్దరికీ తీరిగ్గా చేద్దాం. ఏమంటావు?" అడిగాడు.    
మీ ఇష్టమేనండీ! అదేదో తొందరగా చేస్తే బాగుంటుంది" అంది పర్వతాలు.

"ఇదిగో! ఇవేళ మన పెరట్లో తుప్పలు కొట్టించాక షాపుకెళ్తాను. అక్కడనుండే పెద్దోడికి ఫోన్ చేసి విషయం చెప్తాను. చిన్నోడు సరేసరి. ఇద్దరికీ చెప్పి వాళ్లేమంటారో కూడా తెలుసుకుందాం" అన్నాడు పీతాంబరం.

"అలాగే చెయ్యండి! నేను వంట చేసుకోవాలి, పెరట్లోకెళ్లి అంట్లు తోముకోవాలి" అంటూ లేచి నిలబడింది పర్వతాలు.
అదే సమయంలో పెరట్లో నూతిగట్టు పక్క నుండి సరసరా పాక్కుంటూ నాగుపాము బుసలు కొడుతూ కప్ప వెంట పరుగులు పెడుతోంది.

విశాఖపట్నం సీతమ్మపేట ఇన్సూరెన్స్ ఆఫీసు.
     
సోమవారం కావడంతో మహా రద్దీగా వుంది ఇన్సూరెన్స్ ఆఫీసు. ముందురోజు సెలవు కావడంతో పాలసీ ప్రీమియం వాయిదాలు చెల్లించడానికి వచ్చినవారు, పాలసీల మీద అప్పుకోసం వచ్చినవారు, పాలసీదారులు చనిపోయి పాలసీ తాలూకా క్లైం సెటిల్మెంట్ కోసం తిరుగుతున్నవారు, ఏజెంట్లు, డెవలప్ మెంట్ ఆఫీసర్లతో అఫీసంతా హడావిడిగా వుంది.  

మేనేజర్ కేబిన్లో డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల రాజేంద్ర మేనేజర్ తో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఏజెంట్ల కోసం ఏర్పాటు చేసిన కేబిన్ నిండా కొత్త, పాత ఏజెంట్లంతా ఎవరి పనుల్లో వాళ్లున్నారు. దానికెదురుగానే డెవలప్ మెంట్ ఆఫీసర్ల రూం వుంది. అందులో ఆ బ్రాంచ్ లో వున్న డెవలప్ మెంట్ ఆఫీసర్లందరి పేరు మీద ఒక్కో టేబుల్, దానికెదురుగా కుర్చీలు వేసి వున్నాయి.
ఇన్సూరెన్స్ ఆఫీసు ప్రవేశ ద్వారం దగ్గర పెద్ద బోర్డు వుంది. అందులో ఆ నెలలో ఏ ఏజెంటు ఎంత ఇన్సూరెన్స్ వ్యాపారం చేశాడో టాప్ టెన్ ర్యాంక్ వరకు మాత్రమే రాసి ప్రదర్శనకు వుంచారు.

ఆ బోర్డులో మొదటగా ఏకాంబర్ పేరే కనిపిస్తోంది. దానికెదురుగా ఆ ఏజెంట్ డి.ఒ. పేరు కూడా రాశారు. ఆ నెలలో చేసిన పాలసీల వివరాలు రాశారు.

"సార్! ఈ ఏడాది మా ఏజెంట్ ఏకాంబర్ 'ఎం.డి.ఆర్.టి.' క్లబ్ లో చేరే అవకాశం వుంది సార్!" చాలా ఆనందంగా మేనేజర్ తో చెప్పాడు రాజేంద్ర.

"అవును. నిన్న కస్టమర్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం రోజున పాలసీ దారుల ఉత్సాహం చూస్తూంటే తెలిసిపోతోంది. ఖచ్చితంగా ఈ ఏడాది మీవాడు 'ఎం.డి.ఆర్.టి.' క్లబ్ కి అర్హత సాధిస్తాడు" మేనేజర్ కూడా ఆనందంగానే అన్నాడు.
 
"ఇలామీ ఏజెంట్లు మరొక్కరుంటే చాలు సార్! మన బ్రాంచ్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది" డి.ఒ. రాజనాల రాజేంద్ర.
"మన బ్రాంచ్ టార్గెట్ అంటారేంటి రాజేంద్రా? జోనల్లోనే మన బ్రాంచ్ టాప్ లోకి వెళ్లిపోతుంది. కానీ ఏకాంబర్ లాంటి మరో ఏజేంట్ దొరకడం ఆషామాషీ కాదు. మీ అదృష్టం, నా అదృష్టం, మన బ్రంచ్ అదృష్టం. బావుంటే దొరికినా దొరకొచ్చు" ఎదురుగా వున్న మానిటర్ లో ఆఫీసుకి వచ్చిన జి మెయిల్స్ చెక్ చేస్తూ అన్నాడు బ్రాంచ్ మేనేజర్.

"చూద్దాం సార్!...  ఈ ఏకాంబరాన్ని ఏజెంటుని చేయడానికి నేనెన్ని తిప్పలు పడ్డానో ఆ భగవంతుడికే తెలుసు" అన్నాడు రాజేంద్ర.
"ఎన్ని తిప్పలు పడ్డా ఇప్పుడు ఆ ఒక్కడి వల్ల మీరు టాప్ లో వున్నారు. డి.ఒ.ల్లో నంబర్ వన్ గా మీరు, డివిజనల్ లెవెల్లో మన బ్రాంచ్ టాప్ గేర్లో వున్నాయి కదా సార్!" చిన్నగా నవ్వుతూ అన్నాడు బ్రాంచ్ మేనేజర్.
"సార్! నిన్న చాలామంది పాలసీలు కట్టారు సార్! ఇప్పటివరకూ ఆ పాలసీలు, వాటి తాలూకా ప్రీమియం డబ్బు పట్టుకుని ఏకాంబర్ ఇంకా రాలేదు సార్! ఎందుకు లేటయిందో నాకు అర్థం కావడం లేదు" ఆలోచిస్తూ అన్నాడు  రాజనాల రాజేంద్ర.
"ఎస్! నిజమే కదా! అప్పుడే పదకొండు గంటలు దాటిపోతోందే! ఓసారి ఫోన్ చేసి చూడండి!" ఎదురుగా వున్న గోడగడియారానికేసి చూస్తూ అన్నాడు బ్రాంచ్ మేనేజర్.
"అలాగే సార్! నేను ఏకాంబర్ కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఈ టైంకి, ఈరోజు ఎండాడలో కొత్తగా రిక్రూట్ చేసిన ఏజెంట్ దగ్గర వుండాలి. ఆ కుర్రాడు ఎవో రెండు కాల్స్ వున్నాయి, వాళ్ళింటికి వెళ్లాలన్నాడు. పాపం! నెలో, రెండు నెలలో ఆ కుర్రాడికి పాలసీలు చేయించడం దగ్గరుండి నేర్పించాలి. కస్టమర్ తో ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇవ్వాలన్నాడు డి.ఒ.
ఇలా ఒక్కొక్కరికీ తర్ఫీదులిచ్చే బదులు మీ కింద పని చేస్తున్న ఏజెంట్లందరికీ ఏ స్టార్ హోటల్లోనో విందు ఏర్పాటు చేసి రోజంతా క్లాసులు పెట్టొచ్చు కదా రాజేంద్రగారూ!" అన్నాడు బ్రాంచ్ మేనేజర్.

"పాతవాళ్లందరికీ చేశాం కదా సార్!" అన్నాడు డి.ఒ.
"కొత్తవాళ్ల సంగతంటున్నాను" అన్నాడాయన.

"పాత, కొత్త అందరూ కలసి వందమంది పైనే వుంటారు సార్! హోటల్లో బిల్లు చాలా అయిపోతోందని ఆలోచిస్తున్నాము" సాలోచనగా అన్నాడు డి.ఒ. రాజనాల.

"బావుంది. వాళ్లు చేసిన వ్యాపారం మీద లాభం, ఆదాయం కావాలి మీకు. వాళ్ల కోసం ఖర్చంటే భయం మీకు. వాళ్లుంటేనేగా మీరుండేది? వాళ్లు బాగా తర్ఫీదు పొంది, బాగా పాలసీలు తెస్తే మీకు దానిమీద ఇన్సెంటివ్ కూడా వస్తుంది. మీ భవిష్యత్తే వాళ్లు కదా రాజేంద్రగారూ! మీ ఆలోచనే తప్పు" డి.ఒ. రాజనాల రాజేంద్ర మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు బ్రాంచ్ మేనేజర్.
"నేను వేరే ఆలోచనతో అన్నాను సార్! ఆ ఖర్చులో సగం మీరు మన బ్రాంచ్ నుండి ఇప్పిస్తే బావుంటుందనీ..." నసుగుతూ అన్నాడు డి.ఒ. రాజేంద్ర.

"అంతేనా! మీటింగ్ ఏర్పాటు చేయండి. నేను ఎంత ఇవ్వాలో చెప్పండి. డివిజనల్ ఆఫీసుకి రాసి ఆర్డర్ తెప్పిస్తాను. మీకే కాదు, మీ డెవలప్ మెంట్ ఆఫీసర్లందరికీ ఆ ఆర్డర్ ఉపయోగమే కదా!" అన్నాడతను.

"థాంక్యూ సార్... థాంక్యూ. ఈ మీటింగ్లోనే నా టీంలో బాగా ఇన్సూరెన్స్ బిజినెస్ తెస్తున్న టాప్ పదిమందినీ ఎంపిక చేసి వారికి షీల్డులూ, సత్కారాలు ఏర్పాటు చేస్తాను సార్! దీనివల్ల మిగతావాళ్లు కూడా స్ఫూర్తి పొందుతారు" ఆనందంగా అన్నాడు డి.ఒ. రాజనాల రాజేంద్ర.

"ఎస్! గుడ్ ఐడియా... అలాగే కానివ్వండి. ముందు ఈరోజు ఏకాంబర్ కి కాల్ చేసి అతను నిన్న చేయించిన పాలసీలన్నీ రసీదులు రాయించండి. ఆ పాలసీలన్నీ ఈ నెలలో ఫుల్ ఫిల్ అయ్యేటట్టు చూడండి" అన్నాడు బ్రాంచ్ మేనేజర్.

"అలాగే సార్! వస్తా సార్!" అంటూ మేనేజర్ కాబిన్ లో నుండి వెలుపలికి వచ్చాడు డెవెలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల రాజేంద్ర.
'వెధవ! ఇంతవరకూ ఎక్కడికి వెళ్లాడో... చేతినిండా అన్ని పాలసీలు వుంచుకుని వూరిమీద ఎక్కడ తిరుగుతున్నాడో... ఎంత వ్యాపారం చేసినా ఇంకా యావ చావదు వాడికి. ఉదయం లేస్తే యాతన. ఫోన్ చేస్తే ఇదిగో ఈ కస్టమర్ దగ్గరున్నాను, అదిగో ఆ కస్టమర్ ని కలవాలి అంటాడు ' విసుక్కుంటూ ఏకాంబర్ కి కాల్ చేశాడు డి.ఒ. రాజనాల.

రింగ్ అవుతోంది గానీ, అవతల నుండి రెస్పాన్స్ లేదు. రెండు, మూడుసార్లు కాల్ చేశాడు. అవతల ఏకాంబర్ ఫోన్ లిఫ్ట్   చేయకపోయినా విసుగనిపించడం లేదు. మంచి రింగ్ టోన్ వినిపిస్తోంది. పాట ఎంతో ఉత్తేజంగా వుంది. వింటున్నకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట.

'మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది. ఎదిగినకొద్దీ ఒదగమనే అర్థమందులో వుంది...'

'ఎంత అద్భుతంగా వుందీ పాట... విన్నవాళ్లు ఉత్తేజితులు కావడం ఖాయం' మనసులోనే అనుకున్నాడు డి.ఒ. రాజనాల రాజేంద్ర.

ఉదయాన్నే బయల్దేరి నగరం నలుమూలల్లో వున్న ఆరోజు కలవాల్సిన కస్టమర్లందరినీ కలసి వచ్చాడు ఏకాంబర్.
ప్రీమియం వాయిదాలతో పాటు కస్టమర్ల సమస్యలను తెలుసుకుని వారి దగ్గర లిఖితపూర్వక అభ్యర్థనల్ని తీసుకుని పదకొండు గంటలకు గోపాలపట్నం చేరుకున్నాడు.

అప్పటికే ఆఫీసు తెరచి కూర్చుని వుంది నూకారత్నం. ఆమెతోపాటు ఓ నడివయసు స్త్రీ కూడా సహాయకారిగా వుంది. కార్యాలయం ప్రారంభోత్సవంలాడే ఆ అపార్టుమెంట్ కిందే వుంటున్న వాచ్ మెన్ భార్యను ఆఫీస్ అసిస్టెంటుగా పనిచేయమని అడిగాడు ఏకాంబర్. ఆమె అంగీకరించడంతో ఉదయాన్నే ఏడుగంటలకే ఆఫీసు తెరచి తుడవడం, అన్నీ ఎక్కడివక్కడ సర్దడం, మంచినీళ్లు తెచ్చి ఫిల్టర్లో పోయడం వగైరాలన్నీ ఆమెకు అప్పగించాడు ఏకాంబర్.

ఏకాంబర్ వెళ్లేసరికి నూకారత్నం, ఆమె పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కంప్యూటర్ వున్నా ఏంచేయాలో నూకారత్నానికి తెలీదు. ఇంకా ఏ పని చేయాలో అర్థంకాక ఉదయాన్నే వచ్చి కూర్చుంది.

"గుడ్! ఉదయాన్నే వచ్చేశారా? క్యాష్ బ్యాగ్ తెచ్చేశారు కదా!" ఆఫీసంతా కలయతిరిగి అడిగాడు ఏకాంబర్.
"తెచ్చేశాను. అంత డబ్బు పట్టుకుని రాత్రంతా మా అమ్మా, చెల్లాయీ, నేనూ నిద్రపోకుండా కాపలా కాశామండీ బాబూ!"
చిన్నగా నవ్వి ఫూరుకున్నాడు ఏకాంబర్.
"మీరు బయల్దేరండి. సీతంపేట ఆఫీసుకి వెళ్లి ఈ డబ్బు కట్టి వచ్చేద్దాం!" నూకారత్నంతో అన్నాడు ఏకాంబర్.
"నేనెందుకు సార్! ఇక్కడ వుంటాను" అంది నూకారత్నం.
"రెండుకోజులు పోతే ఆఫీసు బిజీ అవుతుంది కదా! అప్పుడు మీరు నాతో వస్తానన్నా రానివ్వను. ఇప్పుడు మీకు కొంత మార్కెటింగ్ అవగాహన కూడా అవుతుందని రమ్మంటున్నాను" నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

"అయితే నేను రెడీ. పదండి" హుషారుగా లేస్తూ అంది నూకరత్నం.
 
"అమ్మా నువ్వు ఆఫీసు చూస్తూండు. నీకు పనేమైనా వుంటే తలుపులకు తాళాలు వేసుకుని వెళ్లు. కిందే వుంటావుగా, ఎవరొచ్చినా నీకు తెలుస్తుంది" అన్నాడు ఆమెతో ఏకాంబర్.   

"అలాగే బాబూ!" ఎంతో వినయంగా తలవూపింది ఆమె.
"రండి నూకరత్నం"  అని నూకరత్నాన్ని పిలుస్తూనే బయటకు నడిచాడు ఏకాంబర్.

"అంబర్ సార్! ఈ  బ్యాగ్ తేవాలా?" కేష్ బ్యాగ్  చూపిస్తూ అడిగింది నూకరత్నం.  

ఆ మాటకు నూకరత్నం కేసి ఆశ్ఛర్యంగా   చూస్తూ నవ్వుతూనే అన్నాడు.

"మరి వెళ్తున్నది ఎందుకండీ! మీకు ముందే చెప్పాను. ప్రతిక్షణం  చాలా అలర్ట్ గా వుండాలి ఈ ఫీల్డ్ లో. మనం కనురెప్ప కదిపితే చాలు ప్రక్కవాడు మనల్ని దాటేస్తాడు. మనల్ని తొక్కేసి ముందుకు పరిగెడతాడు.మనవాళ్ళు అనుకున్న కస్టమర్లనే ఎత్తుకుపోతాడు. రండి1 వెళ్ళి ఆ బ్యాగ్ పట్టుకురండి" అంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాడు ఏకాంబర్.
కేష్  బ్యాగ్ తగిలించుకుని ఏకాంబర్ వెంటే అడుగులు వేస్తూ లిఫ్ట్  దగ్గరకు చేరుకుంది.

"మీరన్న ఒక్క ముక్క కూడా అర్ధంకాలేదు. కేష్  బ్యాగ్ పట్టుకురండి అన్నది మాత్రం అర్ధమైంది" లిఫ్ట్ లో ఏకాంబర్ ప్రక్కనే నిలబడి అంది నూకరత్నం.

"అర్ధమౌతుంది. ముందు ముందు అంతా మీకే తెలుస్తుంది. ఇది పోటీ ఫీల్డ్ పరుగుల పందెంకైనా స్టార్ట్ చెప్తారు. టైం ఇస్తారు. ఇక్కడ అలాంటిదేమి  ఉండదు. మనకు మనమే పోటీ అనుకుని పరిగెట్టాలి. మనలో ఎవరికి ఎవరూ పందెం కట్టరు.మనమే పందెం పుంజులా పోటీ పడాలి.రండి"  లిఫ్ట్ ఆగగానే ముందుకు సాగిపోతూ బైక్ దగ్గరకు వెళ్ళాడు ఏకాంబర్.
బైక్ స్టార్ట్ చేసి నూకరత్నం కేసి చూసాడు ఏకాంబర్.   
     

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugaadu