Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugaadu

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ గాడి ప్రేమకథ

o college drop out gadi prema katha

    ''వద్దంటే ఎలా...... హండ్రెడ్‌ రుపీస్‌ బెట్‌..... కాదని నిరూపించండి'' ఎంకరేజ్‌ చేసిందామె.

 

    ''దూరం ఎలా ఒకటవుతుందండి? ఇండియాలో సూర్యుడు ఆరు గంటలకి ఉదయిస్తే అక్కడ డెట్రాయిట్‌లో సూర్యుడు అయిదింటికే ఆస్తమిస్తాడు. రెండూ ఒకటి ఎలా అవుతాయి?'' అడిగాడు.

 

    ఆమెను కన్‌ప్యూజ్‌ చేయటానికి ఏదో ఒకటి వాగేసాడు. ఆమె నిజం అనుకుంది. వందకాగితం అతడి చేతిలో వుంచింది. అప్పటికీ హోటల్‌ని సమీపిస్తున్నారు.

 

    ''మీకు జోకులంటే ఇష్టమా?'' చివరి ప్రశ్న అడిగింది.

 

    ''జీవితం అంటే ఇష్టం'' వెంటనే బదులిచ్చాడు.

 

    ''జీవితంలో జోకులేసుకుని నవ్వుకోవచ్చు కాని జీవితం ఒక జోక్‌లా కాకూడదు. దురదృష్టవశాత్తూ కొందరి జీవితాలు జోకుల్లా వీధిన పడిన నవ్వుల పాలవుతుంటాయి. ఎప్పుడూ ఇలా.............. మీలా.......... ఇంత స్వచ్చంగా, నిశ్చంతగా జీవించే జీవితం అంటే నాకు చాలా చాలా ఇష్టం''

 

    ఇద్దరూ హోటల్లో అడుగు పెట్టడంతో

 

    ఇక మాటలు ఆగిపోయాయి.

 

    స్టాఫ్‌తో కలిసి భోజనాలకి డైనింగ్‌ హాల్‌ వైపు నడిచారు.  

 

    ఒరిజినల్‌ క్యాండిడేట్‌ మిస్టర్‌ వినోద్‌ విశాఖపట్నం ఏర్‌పోర్ట్‌లో విమానం దిగేసరికి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయం.

 

    అతను ఫ్లైట్‌ దిగ్గానే సరాసరి ఆఫీస్‌కు వచ్చేసి వుంటే పరిస్థితి మరోవిధంగా వుండేదోమో. కాని ఇక్కడా అతను లేటే. ఏర్‌పోర్ట్‌నుండి టాక్సీలో ఒక హోటల్‌ చేరుకున్నాడు. రూం తీసుకుని రిలాక్స్‌యి, భోంచేసి తీరిగ్గా రెండున్నరకు రూంలాక్‌ చేసుకుని బయటికొచ్చి ఆటో ఎక్కాడు.

 

    ఇక్కడ అతనివూహకి అందని విషయం ఏమంటే తన పర్సు, సూట్‌కేస్‌పోయాయని మాత్రమే అనుకుంటున్నాడుగాని విశాఖపట్నం బ్రాంచిలో తన స్థానం కూడా పోగొట్టుకున్న సంగతి అతడికి తెలీదు. తన పేరుతో మరో వ్యక్తి ఒదిగి పోయాడని వూహించలేదతను. అందుకే అంత తీరిగ్గా బయలుదేరాడు.

 

    అతను ఎక్కిన ఆటో సన్‌ ఆటోమొబైల్‌ గేటుముందు ఆగేసరికే సరిగ్గా మూడు గంటలు, ఆటోలోనే లోనకొచ్చి ఆఫీసు ముందు ఆటో దిగి పంపించేసాడు.

 

    సరిగ్గా అప్పుడే

 

    ఏదో పనిమీద అటుగా వచ్చిన ఆఫీస్‌ప్యూన్‌ సింహాచలం వినోద్‌ని చూసి ఆగాడు. వినోద్‌ తనని సమీపించగానే పలకరించాడు ''ఎవరు కావాలి సార్‌ అంటూ.

 

    ''ఇక్కడ మేనేజరు మధుసూదనరావు గార్ని కలవాలి'' చెప్పాడు వినోద్‌.

 

    ''లాభం లేదండి, మీరు ఇప్పుడు వెళ్ళిపోయి రేపు ఉదయం రావటం మంచిది'' అంటూ సలహా యిచ్చాడు సింహాచలం.

 

    ''ఇప్పుడు కలవటం కుదరదా?''

 

    ''కుదరదు సార్‌ అదేగా చెప్తున్నాను. సార్‌ పైన ముఖ్యమైన స్టాఫ్‌తో కాన్ఫరెన్స్‌లో వున్నారు. పైగా మా హైదరాబాద్‌ మెయిన్‌బ్రాంచ్‌ నుంచి వినోద్‌సార్‌ వచ్చున్నారు...''

 

    ''వినోద్‌...........'' షాక్‌తింటూ అన్నాడు.

 

    ''అవును సార్‌. ఆటోమొబైల్‌ ఇంజనీరు వినోద్‌సార్‌ అట. వాళ్ళంతా కాన్ఫరెన్స్‌లో బిజీగా వున్నారు. ఎవరినీ చూడనని, పంపించవద్దని మేనేజరుసార్‌ ఆర్డర్‌. వెళ్ళండి.....వెళ్ళండి. రేపు కలవండి'' అంటూ మెట్లెక్కటానికి వెనుతిరిగాడు సింహాచలం.

 

    తాను మెట్ల నుంచి దబ్బున జారిపోతున్నట్లుగా. ఉలిక్కిపడ్డాడు వినోద్‌.

 

    విశాఖలో అడుగుపెట్టగానే ఇంతపెద్ద షాక్‌ తగులుతుందని అతను కొంచెం కూడా వూహించలేదు.

 

    తను ఇక్కడే వున్నాడు.

 

    తన పేరుతో లోన మరొకడా!

 

    ఇదెలా సాధ్యం?

 

    ఒక వేళ ఈ ప్యూన్‌గాడు పొరబాటు పడలేదు గదా!

 

    ''హలో......... వ్యూన్‌ భాయ్‌... ఆగాగు'' అంటూ కంగారుగా మెట్ల వెంట పరుగెత్తి ప్యూన్‌ని ఆపేసాడు. వాడు ముఖం చిట్లించి విసుగ్గా చూసాడు.

 

    ''ఏమిటి సార్‌ మీ బాధ, చెప్పాగా ఈరోజు మీరు మేనేజరుసార్‌ని కలవలేరని ఇంకా ఏమిటి?'' అనడిగాడు. వినోద్‌.

 

    ''లోపల ఉన్నది నిజంగా వినోదేనా?''

 

    ప్యూన్‌ వెటకారంగా నవ్వాడు.

 

    ''భలేవారే సార్‌. నిజం వినోద్‌ ఒకరు, నకిలీ వినోద్‌ ఒకరు ఇద్దరు వుంటారా ఏంటి? డౌట్‌వద్దు. ఇంతక్రితమే స్టార్‌ హోటల్లో లంచ్‌ చేసివచ్చి, తిరిగి కాన్ఫరెన్స్‌లో కూర్చున్నారు. మీరుపిచ్చి ప్రశ్నలువేసి నా బుర్ర తినొద్దు. వెళ్ళిరండి'' అన్నాడు. అంటూనే తన దారిన మెయిన్‌ డోర్‌ వైపు అడుగులు సారించాడతను.

 

    ఈసారి వాడ్ని ఆపలేదు వినోద్‌.

 

    అతడ్ని అనుసరిస్తూ ''వన్‌మోర్‌ క్వశ్చన్‌. లాస్ట్‌ క్వశ్చన్‌ ప్లీజ్‌.... వరేణ్య............. మేడం వరేణ్య లోపలున్నారా?'' అనడిగాడు. 

   

    ప్యూను సింహాచలం ఆశ్చర్యం మరోమెట్టు పైకిపోయింది. ఆగి తిరిగి చూసాడు'' మీకు మా ఆఫీసు గురించి చాలా తెలిసినట్టుందే! హలో సార్‌.... అమ్మాయిగారు ఆ వినోద్‌సార్‌ వెంట వున్నారు. ఆమెను కూడా మీరు కలవలేరు. కాన్ఫరెన్స్‌లోవున్న ఎవరినీ మీరు ఈరోజు కలవలేరు. సరేనా, ఇక వెళ్ళిరండిబాబూ. మాకు అవతల చాలా పనులున్నాయి'' అంటూ మరోమాటకి అవకాశం ఇవ్వకుండా గ్లాస్‌డోర్‌ నెట్టుకొని ఆఫీస్‌లోకి వెళ్ళిపోయాడు ప్యూన్‌ సింహాచలం.

 

    ఆ ఆఫీస్‌ డోరు తనకు శాశ్వతంగా మూసుకుపోయినట్లు ఫీలవుతూ నేలకు పాతిన కొయ్యలా కాస్సేపు అక్కడే నిలబడిపోయాడు వినోద్‌.

 

    తనమీద తనకే అసహ్యం వేస్తోంది అతడికి.

 

    కోపంతో పెదాలు అదురుతున్నాయి. గుప్పిళ్ళు బిగుసుకుంటున్నాయి. వస్తున్న కోపానికి లోనకువెళ్ళి ఆ డూప్లికేట్‌ వినోద్‌ ఎవడోగాని వాడ్ని నాలుగు పీకి అందరిముందు వాడిచేతే నిజం చెప్పించాలని వుంది.

 

    కాని లోనకు ఎంటర్‌ కావటానికి ధైర్యం చాల్లేదు. ఎందుకంటే తను వినోద్‌ అని నిరూపించుకోవటానికి తగిన ఆధారాలేవీ తనవద్ద లేవు. వాడు నకిలీ అని చెప్పి మెడపట్టి బయటికి గెంటించేస్తాడు. ఈ సమస్య తీరాలంటే సుధాకర్‌ నాయుడుగారు ఇక్కడికి రావాలి.

 

    ఆయనకు ఫోన్‌చేసి పరిస్థితి చెప్తే

    ఇంకేమన్నా వుందా?

    ఇప్పటికే ఆయన ముందు తన పరువులు పోయాయి. ఈ విషయం తెలిస్తే తనను మరీ పనికిరానివాడి కింద తీసిపడేసే ప్రమాదం వుంది. అసలీ నకిలీ వినోద్‌గాడు ఎవడని...? వీడెవడో పెద్ద ఫోర్‌ట్వంటీలా ఉన్నాడే. సూట్‌కేస్‌లో దొరికినవాటితో తృప్తిపడకుండా సరాసరి వచ్చి తన పోస్ట్‌కే ఎసరు పెట్టాడు రాస్కెల్‌.

 

    ఎక్కవసేపు అక్కడే వుండటం మంచిదికాదని నీరసంగా వెనుతిరిగాడు వినోద్‌. షాక్‌నుంచి కొంచెం కొంచెంగా తేరుకుంటూ గేటుదాటి బయటికొచ్చాడు. కాని అక్కడినుంచి వెంటనే వెళ్ళిపోబుద్ది కాలేదు.

 

    గేటు ఎదురుగా రోడ్‌ అవతల వుంది ఒక సాధారణ ఇరానీ హోటల్‌ అందులోకి వెళ్ళి కార్నర్‌ సీట్‌లో కూర్చుని టీ ఆర్డర్‌ చేసాడు. అక్కడినుంచి చూస్తే గేటుతోబాటు ఆఫీసు బిల్డింగ్‌ స్పష్టంగా కన్పిస్తోంది.

 

    ''హలో సార్‌...... అమ్మాయిగారు కూడా ఆ వినోద్‌సార్‌ వెంటే వున్నారు. ......'' ప్యూను మాటలు చెవుల్లో మారుమోగాయి.

    ''షిట్‌!'' అంటూ నుదురు రుద్దుకున్నాడు.

 

    నిజానికి వరేణ్యను ప్రత్యక్షంగా ఇంతవరకూ చూడలేదు. బట్‌ ఆమె ఫోటో చూసాడు. చక్కటి అందం తనకి ఈడు జోడు. అంతేనా? వరేణ్య బిటెక్‌ ఎంబిఎ క్వాలిఫికేషన్‌. సుధాకర్‌ నాయుడుగారి కోట్ల ఆస్తులకి ఏకైక వారసురాలు.

 

    ఆమె తన భార్య అయితే తనంత అదృష్టవంతుడు ఎవడూ వుండరకున్నాడు. కాని ఆ అదృష్టం ఇప్పుడు ఎంతవరకూ నిలుస్తుందో అర్ధం  కావటంటేదు.

 

    ఆ డూప్లికేట్‌ వినోద్‌నే అసలు వినోద్‌ అనుకుని, వాడితో లవ్‌లో పడిపోతే తన పరిస్థితి ఏమిటి? సుధాకర్‌ నాయుడుగారు వరేణ్యకి ఫోన్‌లో విషయం చెప్పేసారు. ఆ విషయం స్వయంగా ఆయనే స్వయంగా తనతో చెప్పాడు. తండ్రిమీది గౌరవంతో వరేణ్య ఆ మోసగాడ్ని వరిస్తే ఆ తర్వాత నిజం తెలిసి వాడ్ని వదిలేసి తనను చేరుకుంటుందా.............?

 

    ఆలోచిస్తే ఈ విషయం ముందు ముందు చాలా సమస్య అయ్యే అవకాశం కన్పిస్తోంది. ఏం చేయాలి?

 

    వినోద్‌ ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే పొగలు గక్కుతున్న వేడి వేడి చాయ్‌ను కప్పు, సాసర్‌లోతెచ్చి అతని ముందు వుంచాడు బాయ్‌.

 

    ''హలో.... మాట'' అంటూ అతడ్ని పిలిచాడు వినోద్‌.

 

    ''ఏమిటిసాబ్‌, చెప్పండి?'' అడిగాడా బాయ్‌.

 

    ''ఏంలేదు. చిన్న డౌట్‌ నేనిక్కడవున్నాను....... నా పేరుతో మరో చోట మరొకడు నాలా చలామణి అయిపోగలడా?'' కుతూహలంగా అడిగాడు వాడ్ని.

 

    ''మీరు రచయితలా?'' వెంటనే అడిగాడు వాడు.

 

    ''అదేమిటి?''

 

    ''అంతేసార్‌. మీకీ డౌట్‌ ఎందుకొచ్చిందోగాని సాధారణంగా కథలురాసే వాళ్ళకే యిలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. మీరు చెప్పింది కథల్లోను, సినిమాల్లోనూ జరగొచ్చుసార్‌. నిజజీవితంలో జరిగే ఛాన్సేలేదు'' కట్టె విరిచినట్టు తన అభిప్రాయం చెప్పి వెళ్ళిపోయాడతను.

 

    ''జరుగుతోందిరా.... నా పేరుతో అక్కడ ఆఫీసులో ఒకడు కూర్చున్నాడురా నాయనో'' అంటూ పెద్దగా అరవాలనిపించింది. కాని అరవలేకపోయాడు.

 

    టీ తాగుతూ మరోసారి ఆలోచనల్లో పూర్తిగా కూరుకుపోయాడు వినోద్‌. 

 

   అంటే.... లోకంలో ఎక్కడా జరగని విధంగా... లోక విరుద్దంగా ఇంత డేరింగ్‌గా... డ్యాషింగ్‌గా..... తన సూట్‌కేస్‌ కొట్టేసిందేగాక, తనలా విశాఖబ్రాంచిలో పాగవేసి, అందర్నీ నమ్మించి నటిస్తున్నాడంటే వీడెవడో ఖచ్చితంగా ఆసాధారణ వ్యక్తి అయివుండాలి.

    వాడు ఎవడో చూడాలి.

 

    వాడు ఇంకా ఏమాసించి తనలా నటిస్తున్నాడో తెలుసుకోవాలి. వరేణ్యకి వీడికి మధ్య ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. ఇదేమి తెలుసుకోకుండా తను ఎంటరయితే లాభంకన్నా నష్టం ఎక్కువ.

 

    అంతేకాదు

    ఈ విషయాన్ని వెంటనే బాస్‌ సుధాకర్‌ నాయుడుగారికి రిపోర్ట్‌ చేయటం కూడా మంచిదికాదు. మరోసారి ఆయన ముందు దోషిలా నిలబడాల్సివస్తే తట్టుకోలేడు.

 

    ఈ సమస్య ఇక్కడే పరిష్కరించేమార్గం చూడాలి.

    ఇంతకీ

 

    తన పర్సు, సూట్‌కేసు రెండూ ఒకడికే దొరికాయా, లేక అది ఒకడికి, ఇది ఒకడికి దొరికాయా? వాళ్ళిద్దరిలో ఇక్కడున్న వినోద్‌ ఎవడు? ఎక్కడ వుంటున్నాడు?

 

    తీవ్రంగా ఆలోచిస్తూనే  వున్నాడు. వరసగా టీలు తాగుతూనే వున్నాడు. అందినట్టే వుంది చేజార్చుకున్న అవకాశం గురించి అతడికి చాలా బాధగా వుంది.

 

    అందుకే ఆ డూప్లికేట్‌ వినోద్‌ని చూడాలని, వరేణ్యని చూడాలని పట్టుదలగా అక్కడే కూర్చున్నాడు.

 

    సరిగ్గా మూడున్నర గంటల ప్రాంతంలో ఆఫీసులోంచి కొంతమంది బయటకు వస్తూ కన్పించారు.

 

    అసలు సమస్య విశాఖ బ్రాంచ్‌లో పనిచేస్తున్న వాళ్ళలో ఒక్కడు కూడా తనకు తెలీకపోవటం. అంచేత ఎవరెవరో తనకు తెలీదు.

    అటే చూస్తున్న వినోద్‌ ఉలికిపడ్డాడు.

 

    లేచి నిలబడి కళ్ళు నులుముకుని చూసాడు.

    బయటకొచ్చిన గుంపులో కొందరు లేడీస్‌, కొందరు జంట్స్‌ వున్నారు. వరేణ్యంను వెంటనే గుర్తించాడు. కాని అతను ఉలిక్కిపడ్డానికి కారణం ఆమె కాదు.

 

    ఆమెకు పక్కగా నిలబడిన యువకుడు.

    అతని వంటిమీది డ్రసూ............... అది తనదే......... ఇండియా వచ్చేటప్పుడు డెట్రాయిట్‌లో తీసుకున్న డ్రస్సూ.......అతను..... అతన్ని ఎక్కడో చూసినట్టుంది.

 

    అదే......... వాడా!...........  నమ్మలేనట్టు తనలో తను ఉద్వేగంతో గొణుకున్నాడు వినోద్‌.

 

    త్రివిక్రమ్‌ని  గుర్తించటంలో అతను పొరపాటు పడలేదు. చెట్ల తోపులో గుద్దుకుని తామిద్దరూ గొడవపడ్డారు. అప్పుడు జైలు డ్రస్‌లో వున్నాడు.

 

    ఆ వెంటనే సికింద్రాబాద్‌ స్టేషన్‌ సమీపంలో హోటల్లో రెండోసారి తగిలాడు. అప్పటికి జైలు డ్రస్సుపోయి మామూలు డ్రస్‌లో వున్నాడు. అంతేనా.... యస్‌.

 

    మూడోసారి... యస్‌.

 

    తను పర్సుకోసం కంగారుగా రైలు దిగుతూ మరోసారి అతన్ని మరోసారి గుద్దుకున్నాడు. పైగా ఫూల్‌....... ఇడియట్‌'' అని తనే వాడ్ని తిట్టి టెలిఫోన్‌బూత్‌ వైపు పరుగెత్తాడు.

 

    కాని చివరికి అయ్యా బాబోయ్‌.....

 

    చివరికి వాడు తననే ఫూల్‌ని చేసి

    వచ్చి ఇక్కడ సెటిలయిపోయాడు.

    వీడెవడోగాని ఖచ్చితంగా దేవాంతకుడై వుండాలి.

    కడుపుమంటతో త్రివిక్రమ్‌నే చూస్తున్నాడు వినోద్‌.

    ఆఫీస్‌ స్టాఫ్‌ కారువరకు వచ్చి అతడికి షేక్‌హాండిస్తున్నారు. అతను కార్లో కూర్చున్నాడు. మరోపక్కనుంచి వరేణ్య అదే కారు ఎక్కి కూర్చోవటం చూసి పళ్ళు పటపట కొరికాడు వినోద్‌.

 

    ఆ కారు బయలుదేరి వెళ్ళిపోయింది.

 

    గేటుదాటి ఎడంపక్కగా విమానంలా దూసుకుపోతున్న ఆ కారును చూసి భారంగా నిట్టూర్చాడు వినోద్‌. అదే కారులో తను వరేణ్య పక్కన కూర్చొని వెళ్ళాల్సింది. వాడెవడో ఆ ఛాన్స్‌ తన్నుకుపోయాడు. వాడు  ఎక్కడ స్టే చేసాడో ముందు తెలుసుకోవాలి. ఇవాళకి అది సాధ్యంకాదు అనుకుంటూ నీరసంగా లేచి తాగిన టీలన్నిటికి లెక్కకట్టి, డబ్బులిచ్చేసి వీధిలోకి వచ్చాడు.

 

    అటుగా వచ్చిన ఆటో ఎక్కి కూర్చున్నాడు.

    ఆటో వేగంగా కదిలింది.

    ''ఏమిటి ముఖం మాడ్చుకు కూర్చున్నావ్‌?''

 

    త్రివిక్రమ్‌ని పలకరించింది వరేణ్య.

 

    కారు మెత్తగా సిటీ వీధుల్లో పరుగుతీస్తోంది.

 

    ''అదేం లేదు'' అన్నాడు సింపుల్‌గా నవ్వేస్తూ.

 

    ''అలసటా......?''

 

    ''పోనీ అలాగే అనుకో''

 

    ఈ ఒక్కరోజు పరిచయంలోనే యిద్దరూ బహువచనం నుంచి ఏకవచనంలోకి వచ్చేసారు.

 

    ''నేనలా అనుకోవటంలేదు'' అంది వరేణ్య

 

    ''మరి?''

    'నన్ను డ్రాప్‌చేసి వెళ్ళమన్నందుకు కోపం వచ్చిందేమోనని.... డౌటు.''

 

    ''బాగుంది. ఇది కంపెనీ కారు, నాకెందుక్కోపం? కాన్ఫరెన్స్‌మీద నీ అభిప్రాయం ఏమిటి?''

 

    ''చాలా బాగా జరిగింది ముఖ్యంగా నీ స్పీచ్‌. సూచనలు సలహాలు, సూపర్‌ బట్‌. నీ పంచసూత్రంలో కొన్ని అమలు చేయాలంటే మేనేజర్‌కు సాధ్యంకాదు బాస్‌ పర్మిషన్‌ కావాలి.''

 

    ''బాస్‌ ఎవరు?''

 

    ''ఇదేమరి... నాకు మండుద్ది ఈ మతిమరుపు ఏమిటి? సుధాకర్‌నాయుడుగారినే మర్చిపోయావా?''

 

    ''యస్‌ యస్‌..... '' అంటూ నుదురు రుద్దుకున్నాడు. మనసులో మాత్రం 'వీడొకడు నా ప్రాణం తీయటానికి'' అంటూ సణుక్కున్నాడు.

 

    ''చూడు మిస్‌ వరేణ్యా! ఈ బ్రాంచి అభివృధ్ధికి ఏంచేస్తే బాగుంటుందో తగిన సూచనలు, సలహాలు ఇవ్వటంకోసమే నేనిక్కడికొచ్చాను. అమలుచేయటం, చేయకపోవటం మీ బాధ్యత.

 

    మెయిన్‌ బ్రాంచ్‌తోబాటు అన్ని బ్రాంచ్‌లకు ఈ పంచసూత్ర పథకాన్ని అమలుచేస్తే బాగుంటుందని సూచించాను. మేనేజరు మధుసూదనరావు, బాస్‌తో మాట్లాడతాడు. సో.... మనం టెంక్షన్‌పడటం అనవసరం కదూ? నేనిప్పుడు ఆలోచించేది రెండ్రోజుల్లో జరగున్న క్రికెట్‌ మేచ్‌ గురించి, నా అభిమాన క్రికెట్‌ తారల గురించి, మేచ్‌ చూడగానే మధుర వెళ్ళిపోతాను'' అన్నాడు.

 

    ''క్రికెట్‌ చూడ్డానికి రావద్దన్నావుగా, ఓ.కె. మధురకి నీతో నేను వస్తాను'' అంది వరేణ్య.

 

    ''ఆమ్మో........ నన్ను వదులు దేవీ! మధురకు నా వెంట ఎవర్నీ రానివ్వను, నేనొక్కడినే వెళ్ళాల్సిన ఊరు అది....'' అన్నాడు కంగారుగా త్రివిక్రమ్‌.

 

    మధుర అంటే నిజంగానే అది ఒక వూరనుకుంటోంది వరేణ్య. అంతేగాని శ్రీకృష్ణ జన్మస్థానమయిన మధురానగరం..... అది జైలు అని ఆమె వూహకందని విషయం.

 

    ''ఓ.కె... ఓ.కె..... అంతగా ఇష్టంలేనప్పుడు నేనురానులే, కానీ రేపు మాత్రం నువ్వు నాతో రావాలి'' అంది రిలాక్స్‌గా సీట్‌కి జేరబడుతూ,

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్