Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సెల‌వొస్తే.. అడ‌వుల్లోకి వెళ్లిపోతా - రెజీనా

interview with Regina

మ్మాయి కాస్త అందంగా ఉంది అని తెలియ‌గానే ఎక్క‌డున్నా స‌రే... దుర్భిణీ వేసి వెతికేసి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ని చేసేస్తారు మ‌న‌వాళ్లు. ఇక న‌ట‌న కూడా వ‌చ్చు, ఇలియానాకి కాస్త అటూ ఇటూగా ఉంటుందంటే ఇక ఊరుకొంటారా?? బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేస్తారు. రెజీనా విష‌యంలో అదే జ‌రుగుతోంది. చూడ‌గానే ఆక‌ట్టుకొనే రూపం రెజీనాది. న‌ట‌నకి కూడా వీర‌తాళ్లు వేయొచ్చ‌ని తొలి సినిమా రొటీన్ ల‌వ్‌స్టోరీతో నిరూపించుకొంది. ఆ సినిమా ఆడ‌క‌పోయినా.. రెజీనాకు బోలెడంత పేరొచ్చింది. కొత్త‌జంట‌లో సువ‌ర్ణ‌గా మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని కొల్ల‌గొట్టింది. క‌రెంట్‌, పిల్లా నువ్వులేనిజీవితం, రారా కృష్ణ‌య్య సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది రెజీనా. ''నా ప్ల‌స్సులూ, మైన‌స్‌లు నాకు బాగా తెలుసు. అందుకే విమ‌ర్శ‌ల‌నీ స్వీక‌రించ‌డానికి స‌దా సిద్ధంగా ఉంటా. ప్ర‌తి పాత్ర‌నీ నిచ్చెన మెట్టులా మార్చుకొని ముందుకు వెళ్ల‌డం నా ముందున్న ల‌క్ష్యం'' అంటోంది రెజీనా. ఆమెతో గో తెలుగు జ‌రిగిన సంభాష‌ణ ఇదీ...

* ఎలా సాగుతోంది సినీ ప్ర‌యాణం?
- చూస్తున్నారు క‌దా? బండి హ్యాపీగా వెళ్తోంది. కెమెరా ముందుకు వ‌చ్చిన రోజు నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ విరామం లేకుండా ప‌నిచేస్తున్నా. మంచి మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. చేసిన పాత్ర‌ల‌కు గుర్తింపు ల‌భిస్తోంది. చేతినిండా సినిమాలున్నాయి. ఇంకేం కావాలి?

* మ‌రి విజ‌యం?
- రొటీన్ ల‌వ్‌స్టోరీ మంచి సినిమానే. కాక‌పోతే క‌మ‌ర్షియ‌ల్‌గా సరిగా ఆడ‌లేదు. అయితే కొత్త‌జంట బాగానే ఉంది. మంచి వ‌సూళ్లు దక్కుతున్నాయి. సినిమా హిట్ అంటున్నారంతా. అయితే ఇంకొన్ని రోజులు ఆగితే అంతిమ ఫ‌లితం తెలుస్తుంది.

* మీ సినిమా రిపోర్ట్ మీకెలా తెలుస్తుంది?
- నేనే తెలుసుకొంటా. ఎందుకంటే నా సినిమా థియేట‌ర్లోనే చూస్తా. ప్రేక్ష‌కులు ఎలా స్పందిస్తున్నారు. ఏయే స‌న్నివేశాలు వాళ్ల‌కు న‌చ్చుతున్నాయి? ఎక్క‌డ బోర్ ఫీల‌వుతున్నారు? అనే విష‌యాల్ని ద‌గ్గ‌రుండి గ‌మ‌నిస్తా.

* మ‌రి కొత్త‌జంట చూశారా?
- ఓ... ఇప్ప‌టికి మూడు సార్లు చూశా.

* మిమ్మ‌ల్ని మీరు తెర‌పై చూసుకొంటే ఏమ‌నిపించింది?
- నాన‌ట‌న నాకెలాగూ న‌చ్చుతుంది. అయితే నాలో ఓ అల‌వాటు ఉంది. ఏదైనా స‌రే.. విమ‌ర్శ‌నాత్మ‌కంగా ఆలోచిస్తా. ఈ స‌న్నివేశం ఇలానే ఎందుకు చేశా? మ‌రోలా చేస్తే ఎలా ఉండేది? అంటూ న‌న్ను నేను స‌మీక్షించుకొంటా. కొత్త‌జంట‌లోనూ కొన్ని మైన‌స్‌లు క‌నిపించాయి. కొన్నిచోట్ల మోతాదుకు మించి ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చానేమో అనిపించింది. అది రాబోయే సినిమాల్లో త‌గ్గించుకొంటా.

* సాధార‌ణంగా సినీ తార‌లు విమ‌ర్శ‌ల్ని త‌ట్టుకోలేరు క‌దా?
- మన త‌ప్పొప్పుల్ని గ‌మ‌నించాల్సిందే. లేదంటే ముందుకు వెళ్ల‌లేం. నా వ‌ర‌కూ నా మైన‌స్‌లు నాకు తెలియాల‌నుకొంటా. అందుకే సినిమా విడుద‌లైన వెంట‌నే ఎలాంటి రివ్యూలు వ‌చ్చాయి? అని గ‌మ‌నించా. నా న‌ట‌న గురించి అంద‌రూ పాజిటీవ్‌గానే రాశారు.

* మీ సినిమాలు చూసి ఇంట్లోవాళ్లు ఏమంటుటారు?
- వాళ్ల‌కు ఎలాగూ న‌చ్చుతాయి క‌దా? కాక‌పోతే మా అమ్మ‌ని మెప్పించ‌డం చాలా క‌ష్టం. ఎంత బాగా చేసినా.. బాగుంది అంటుందంతే.

* కొత్త‌జంట‌కు సంబంధించి మీరు అందుకొన్న బెస్ట్ కాంప్లిమెంట్‌..?
- బ‌న్నీ నుంచే. ''నేను సాధార‌ణంగా ఎవ‌రినీ పొగ‌డ‌ను.. కానీ నిన్ను పొగడాల‌నిపిస్తోంది. అంత బాగా న‌టించావ్‌'' అన్నారు. చాలా హ్యాపీగా ఫీల‌య్యా.

* బ‌న్నీ త‌రువాతి సినిమాలో మీరే హీరోయిన‌ట‌..?
- నీతో క‌ల‌సి ఓ సినిమా చేయాల‌నివుంది అని బ‌న్నీ నాతో చెప్పారు. అయితే అదెప్పుడో నాకైతే తెలీదు.

* సినిమాల్లో స‌రే.. బ‌య‌ట ఎలా ఉంటారు?
- ఓ మామూలు అమ్మాయి ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో నేనూ అంతే. నాకు ఫ్రెండ్ బ్యాచ్ ఎక్కువ‌. వాళ్ల‌తో క‌ల‌సి అల్ల‌రి చేస్తా. వ‌రుస‌గా నాలుగు రోజులు షూటింగ్ లేక‌పోతే చుట్టుప‌క్క‌ల ఉన్న అడ‌వుల్లోకి వెళ్లిపోతా. నాకు జంతువులంటే చాలా ఇష్టం. వాటిని చూస్తూ గ‌డ‌ప‌డం ఇంకా ఇష్టం.

* వంట చేయ‌డం వ‌చ్చా?
- ఏదో నా మ‌ట్టుకు వండుకొంటా. మిగ‌తావాళ్లు తిన్నారంటే క‌ష్ట‌మే. కేక్ త‌యారీ వ‌చ్చు.

* ఎలాంటి వంట‌లు ఇష్ట‌ప‌డ‌తారు..?
- నేను శాఖాహారిని. అంత‌కు ముందు మాంసం తినేదాన్ని. కానీ కాలేజీ రోజుల్లో మానేశా. పేటా సంస్థ మాంసాహారుల‌పై రాసిన క‌థ న‌న్ను క‌దిలించింది. దాంతో.. అప్ప‌టి నుంచీ నాన్‌వెజ్ జోలికి వెళ్లలేదు.

* సినిమా ఎంపిక‌లో ఎలాంటి నియ‌మాలు పాటిస్తారు?
- నిజం చెప్పాలంటే.. నాకు అది న‌చ్చ‌లేదు, ఇది మార్చండి అని చెప్పేంత స్థాయిలో నేను లేను. వ‌చ్చిన పాత్ర‌ల్ని చేసుకొంటూ పోవాలంతే. అయితే అందులో మంచివే ఎంచుకోవాలి. ద‌ర్శ‌కుడు, నిర్మాణ సంస్థ నాకు చాలా ముఖ్యం.

* స్కిన్‌షోకి రెడీనేనా?
- సినిమా వృత్తిగా వ‌చ్చా. తెర‌పై ఉన్న‌ట్టే బ‌య‌టా క‌నిపిస్తానంటే కుద‌ర‌దు. బ‌ట‌య ఉన్న‌ట్టే తెర‌పై క‌నిపిస్తానంటే అస్స‌లు కుద‌ర‌దు. అవ‌స‌రం అనుకొంటే కొన్ని మిన‌హాయింపులు ఇవ్వొచ్చు గానీ, ప‌నిగ‌ట్టుకొని లిప్‌లాక్‌లు చేయ‌మంటే నావల్ల కాదు.

* తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. మ‌రి డ‌బ్బింగ్ చెప్పుకోరా?
- డ‌బ్బింగ్ చెప్ప‌డం ఓ క‌ళ‌. భాష వ‌స్తే స‌రిపోదు. పూర్తి సాధికారిక‌త కావాలి. అదొస్తే అప్పుడు చెప్తా.

* రెండో నాయిక‌గా న‌టించ‌డానికి రెడీయేనా?
- ప‌వ‌ర్‌లో న‌టిస్తున్నా క‌దా? పాత్ర న‌చ్చాలే గానీ, నా స్థానం ఏమిట‌న్న ప్ర‌శ్న లేదు.

* ఎలాంటి పాత్ర‌ల కోసం ఎదురుచూస్తున్నారు?
- రెజీనా చాలా మంచి న‌టి అని నిరూపించుకోగ‌లిన ఏ పాత్ర అయినా చేయ‌డానికి సిద్ధం.

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka