Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ajent ekaambar

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ ఎ స్ పాస్

kittugaadu

గిరిధర్ నువ్వు ఫ్లూట్ తో సపోర్ట్ చెయ్ అన్నాడు.


అత్తరు సాయిబో రారా..


అందాల మారాజో రారా..


అత్తరు సాయిబు ఒత్తాడని


ఉత్తరమేసాను..


చింతల పల్లి లాకులకాడ


చిక్కడిపోయిందే


అత్తరు సాయిబో రారా


అందాల మారాజో రారా..


అందరు మొగుళ్ళు గుళ్ళోకెళ్ళి పళ్ళికిలిత్తుంటే


ణ్నామొగుడు గుళ్ళోకెళ్ళి పళ్ళికిలించాడో..


అత్తరు సాయిబో రారా


అందాల మారాజో రారా..


అదేంటి మామ


కుందేసి కొడితే కుంకుమ రాలిందీ


నా జోలికి రాకు


బంగారు మామ చలి జరమొత్తాదీ


అత్తరు సాయిబో రారా..


నా అందాల మారాజో రారా...


కమలాకర్ పడీ పడీ నవ్వడం మొదలుపెట్టాడు. కిట్టు నీలో ఇంత టాలెంట్ ఉందా.. నాకు తెలియదే అన్నాడు కమలాకర్.


గిరిధర్ నాలో నిఒద్రిస్తున్న తట్టి లేపాడు అన్నాడు కిట్టు. గిరిధర్ కిట్టుని పొగడ్తలతో ముంచెత్తాడు.


ఈలోపు గిర్ధర్ ఒక మూలన దుమ్ము పట్టిన గిటార్ తీశాడు.


ఇదెవరిది? అన్నాడు. ఇంకెవరిదీ, మన కిట్టూదే.


బొంబాయి రాగానే మైకేల్ జాక్సన్ అయిపోదామని అయిదు వందలు పెట్టి కొన్నాడు. కోచింగ్ కూడా జాయిన్ అయ్యాడు. రూం లో కర్ణకఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్నాడు కమలాకర్.


గిరిధర్ గిటార్ తీగెల్ని కదిలించి నెమ్మదిగా ఒక తెలుగు పాట వచ్చేలా వాయించాడు.


అహా..అద్భుతం..అన్నాడు కిట్టు. సరే నువ్వు కోచింగ్ జాయిన్ అయ్యావు కదా ఎంత నేర్చుకున్నావో చూపించు.. అన్నాడు గిరిధర్. కిట్టు గిటార్ అయితే కొన్నాడు కానీ , దాని ఎలా వాయించాలో మచ్చుకి కూడా తెలియదు.


దాన్ని నిలువగా నేల మీద పెట్టాడు. బాసింపట్టు వేసుకుని కాళ్ళమధ్యకు వచ్చేలా పట్టుకున్నాడు.
ఇదిద్ సన్నాసుల దగ్గర ఉండే ఒంటి తీగ తంబుర అనుకోండి అన్నాడు.


టింగ్ టింగ్ మంటూ మధ్యలో ఉన్న తీగని వేలితో మీటుతూ మొదలెట్టాడు.


టింగ్ టింగ్...


టింగ్ టింగ్...ఇల్లు నాదంటావు...


డబ్బు నాదంటావు...


టింగ్ టింగ్...


నీ ఇల్లు ఎక్కడే సిలకా


టింగ్ టింగ్...


మేడ నాదంటావు...


మిద్దె నాదంటావు


టింగ్ టింగ్...


మూడు నాళ్ళ జీవితం సిలకా...


కమలాకర్ గిరిధర్ లు పడీ పడీ నవ్వుతున్నారు.


గిటార్ ను ఇంత గొప్పగా వాడిన వాళ్ళని ఇంత వరకు జీవితం లో చూడలేదు. అసలు ఈ గిటార్ జన్మ ధన్యమై పోయింది. అన్నాడు గిరిధర్.
గిరిధర్ కు మిమిక్రి కళ కూడా తెలుసు. ఫ్రెండ్స్ ఎవరన్నా ఏదన్నా మాట్లాడినా,  వాళ్ళలాగే మాట్లాడగలడు. కిట్టు మళ్ళీమళ్ళీ అడిగి గిరిధర్ తో మిమిక్రి చేయించి ఆనందించేవాడు.


గిరిధర్, కిట్టులు ఆప్త మిత్రులైపోయారు.


గిరిధర్ ఎప్పుడు బొంబాయి వచ్చినా పొద్దున ఎక్కడ తిరిగినా సాయంత్రానికి కిట్టు రూం కి వచ్చితీరేవాడు.


కిట్టు తంబుర గానం ఒక స్టాండర్డ్ ఐటం అయిపోయింది.


తంబుర గానం అని అనౌన్స్ చేసి మరీ కిట్టుతో పాడించేవాడు.


రాధా కృష్ణ గారితో మాట్లాడిన తర్వాత కిట్టుకి సివిల్స్ మీద ఆసక్తి పెరిగింది. అదే ఆలోచించడం మొదలుపెట్టాడు. బస్సులో వెళ్ళేటప్పుడు, బస్సుకోసం వెయిట్ చేసేటప్పుడు, ఆఫీస్ లంచ్ సమయం లోనూ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చదవడానికి ప్రయత్నిస్తున్నాడు.టైంస్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ తెప్పించడం మొదలుపెట్టాడు. ఆఫీసులో ఇలస్ట్రేటెడ్ వీక్లీ, ఫ్రంట్ లైన్, ఇండియా టుడే, మొదలైన మాగజైన్లకు డబ్బు కట్టమంటే ససేమిరా కట్టనన్నవాడు ఇప్పుడు డబ్బులు కట్టి మరీ చదవడం మొదలుపెట్టాడు.

 

ఎన్ సీ ఈ ఆర్ టీ వాళ్ళ పాఠ్య పుస్తకాలుఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు సంపాదించాడు. ఇంటికొచ్చి, వంట చేసుకుని, తినేటప్పటికి రాత్రి తొమ్మిది ఐపోయేది. రాత్రి పన్నెండు వరకు బాల్కనీలో కూర్చొని చదివేవాడు. అఫీసుకి వెళ్ళడం, రావడం, వంట, ఇలాంటి పనులతో బాగా అలసిపోయేవాడు.


రాత్రి పన్నెండు వరకు చదివిన తర్వాత కనులు మూతపడిపోయేవి. మళ్ళీ పొద్దున్న ఎనిమిది గంటలకల్లా ఆఫీసుకి తయారైపోయెవాడు.
కిట్టులోని మార్పుని గమనించాడు కమలాకర్.


అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కిట్టుకి పదేపదే రాధాకృష్ణ గురించి చెప్పేవాడు.


రాధా, నేను మెట్రో చెప్పుల షాపుకి వెళ్ళాము....మెట్రో షాపు చాలా పెద్దది.


షాపు ఓనరు రాధాకృష్ణ విజిటింగ్ కార్డు చూడగానే లేచి వచ్చి, ఆయనకి కావాల్సిన చెప్పులిప్పించి, డబ్బులు తీసుకోనంటే రాధాకృష్ణ బలవంతంగా ఓనర్ చేతిలో డబ్బులు కుక్కి గబగబా వచ్చేసాడు. రాధాకృష్ణకి బొంబాయిలో పెద్దపెద్దవాళ్ళు ఆడే ' దాండియా ' లో ఆహ్వానమిచ్చారు..దాంట్లోకి అల్లాటప్పగాళ్ళని రానివ్వరు. ఇలాంటి వాస్తవ విషయాలను కిట్టుకి చెప్పేవాడు.


కిట్టుకి పట్టుదల పెరగడానికి దోహదం చేశాడు కమలాకర్.


కమలా....నాకు తోడుగా నువ్వు కూడా అప్లై చెయ్యి సివిల్ కి అన్నాడు కిట్టు.


ఓకే..ఇద్దరం అప్లై చేసి పడేద్దాం అన్నాడు కమలాకర్.


ఐతే, కిట్టుకి ప్రాణ సంకటమైన విషయం ఒకటుంది.


ఈ మ్యాగజైన్లు, పుస్తకాలు అన్నీ ఇంగ్లిష్ లోనే ఉన్న్నాయి. ఒక్క పేరాలో కనీసం పది పదిహేను పదాలు అర్థం కావు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ, ఫ్రంట్ లైన్, ఇండియాటుడే ల్లోని ఇంగ్లిష్ పదాలు, వాడే భాష, అర్థమై చావట్లేదు. ఈ బచ్చా నాకొడుకుల కోసం రాసిన ఎన్ సీ ఈ ఆర్ టీ పుస్తకాల్ని అర్థం చేసుకోవడం కోసం తల ప్రాణం తోకకి వస్తుంది. ఎలా..?


ఎవరో చెప్పారు.?


శంకర నారాయణ తెలుగు ఇంగ్లీషు డిక్సనరీ పేరు.


నువ్వెం చదివినా ఆ పేరాలోని అర్థం కాని పదాలు ఒక పుస్తకంలో రాసుకో తర్వాత శంకర నారాయణ డిక్షనరీలో వెతుక్కో.
సలహా బాగానే ఉంది.


రాసుకోవడం మొదలెట్టాడు కిట్టు. కొంత ధైర్యం వచ్చింది. కానీ, రోజురోజుకీ రాసుకునే పదాలు పెరిగిపోతున్నాయి. భారం పెరిగిపోతుంది.పదాలని ఎలా పలకాలో తెలియడం లేదు. ఉదాహరణకి డ్రైవర్ ని 'షాఫర్ ' అంటారు. దాని స్పెల్లింగ్ ప్రకారం మనకి తెలిసినట్లుగా చదివితే  ' చాఫ్యూర్ ' అంటారు. కరెక్ట్ గా పలకాలి.


' ఆక్స్ ఫోర్డ్ ' వారి లెర్నింగ్ డిక్షనరీ కొనమని ఇంకొకరు సలహా ఇచ్చారు.


నూట యాభై రూపాయలు....గోవిందా!


కొత్త చొక్కా గోవిందా!


అది కూడా కొనుక్కుని దగ్గర పెట్టుకున్నాడు. అందులో కొన్ని సన్జలు ఇస్తారు.


ఈ సన్జల్ని గుర్తు పెట్టుకుని ఆ ప్రకారం పలకాలి.అదే విధంగా పైకి పలుకుతూ చదివేవాడు. గొంతు బొంగురు పోయేది.


ఈ ఇంగ్లిష్ నేర్చుకోవడం పెద్ద పనైపోయింది థూ..దీనెమ్మ ..ఇదో ఇంగిలీషు...ఎంగిలి బాస నాకెందుకొచ్చింది...? తెలుగులో రాసుకుంటా,  రాధాకృష్ణగారు చెప్పారు. భాష ముఖ్యం కాదు,జ్ఞానం ముఖ్యమని...తెలుగు భాషలో పరీక్ష రాసి పాసైన మహానుభావులున్నారని.మళ్ళీ ఒక సారి రాధాకృష్ణగారిని కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నాడు కిట్టు. మీరు  ఇంగ్లీషులో పరీక్ష రాస్తేనే తేలిక తెలుగులోనే కష్టం అన్నాడు ఆయన.
ఈయనేంట్రా బాబూ షాకులిస్తున్నాడు అనుకున్నాడు కిట్టు.


కిట్టు మనసులో భావం చదివినట్లుగా అన్నారు రాధాకృష్ణ.


మీకిది కొంచెం షాకింగ్ గా ఉండవచ్చు. ఎందుకంటే చదవాల్సిన పుస్తకాలు ఎక్కువగా ఇంగ్లిష్ లోనే ఉన్నాయి. తెలుగు అకాడమీ ఉంది. కానీ దానికి సరిపడినంత ఫండ్స్ లేవు. ఎక్స్ పర్ట్లు లేరు. తెలుగు అకాడమీ తనకు చేతనైనంత వరకు తెలుగు పాఠ్య పుస్తకాలు ప్రచురిస్తుంది. కానీ ఇంకా చాలా గ్రంధాలు తెలుగులో వెలుగులోకి రాలేదు. అన్నీ రావాలంటే చాలాకాలం పడుతుంది అందుకోసం తెలుగులో రాసే విద్యార్థులు ఇంగ్లిష్ పుస్తకాలు చదివి వాటిని అర్థం చేసుకుని, తెలుగులోకి మార్చుకుని నోట్సు రాసుకోవాలి. అంటే డబుల్ పని అన్నమాట. మీరు ఓపిక తెచ్చుకుని చేస్తే మంచిదే. అని తేల్చేసారు.


ఓర్నాయనో తెలుగులో చదివి రాయడమంటే తేలికనుకున్నాను..ఇంత కష్టమా...అని నోరెళ్ళబెట్టాడు కిట్టు.

మతం మత్తుమందు లాంటిది అన్నాట్ట కార్ల్ మార్క్.


మతం మత్తుమందో కాదో తెలియదు గానీ


సివిల్స్ పిచ్చి మాత్రం మత్తు మందుతో సమానం.


ఎవరికైనా తమ కుమార్తె గానీ, కుమారుడుగానీ, సరిగ్గా చదవడం లేదనిపిస్తే ఈ మత్తుమందు ఇంజక్షన్ ఇస్తే చాలు.


ఈ పిచ్చిలో పడ్డవాడికి పగలు, రాత్రి తేడా తెలియదు.


షోకుల మీద ఆసక్తి పోతుంది.


మెరుపుతీగెల్లాంటి అమ్మాయిల వైపు చూడడు.


రాత్రింబవళ్ళు వాడి మెదడులో గిరగిరా తిరిగేది ఒకటే మంత్రం సివిల్స్.


ప్రిలింస్ సాధించడమే కష్ట్మైన పనంట.


తర్వాత మెయిన్స్ అంత కష్టం కాదట.


మెయిన్స్ పాసయిన వాడొకడు పర్సనాలిటీ టెస్ట్లో ఫెయిలయ్యాడంట.


మళ్ళీ తరవాతి సంవత్సరం ప్రిలింస్ లో దొబ్బేడంట!


 మెయిన్ స్ట్రీం అనే చిన్న మాగజైన్ చదవాలంట.!


హిందూ పేపర్ రోజూ చదవాలంట.!


' ఇకనామికి అండ్ పొలిటికల్ వీక్లీ ' చదవాలంట! హిస్టరీ ప్రశ్నలు ఎదుర్కోవాలంటే ఎ.ఎల్ భాసాం గారి పుస్తకం , రిజ్వి గారి బిపిన్ చంద్ర గారి పుస్తకం, డి.డి. కొశాంచి గారి పుస్తకం, రొమిలా థాపర్ గారి పుస్తకం, ( ఆమెని ఆడాళ్ళలోకే మగాడు, మగాళ్ళలోకె మొనగాడు అంటారట.) త్రీ ఆథర్స్ అంటే ముగ్గురు రచయితలు కలిసి రాసిన పుస్తకం.


ఇవిగాక ఎన్ సీ ఈ ఆర్ టీ పుస్తకాలు చదవాలంట. ఇవన్నీ పూర్తిగా చదివితేనేగానీ ప్రిలింస్ లో హిస్టరీ ప్రశ్నలు ఎదుర్కోలేమంట.
హిస్టరీ తీసుకుని మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా


ప్రిలింస్ లోని హిస్టరీ ప్రశ్నలకు కళ్ళు తేలేస్తారంట.!


జాగ్రఫీ కోసం, ' గోచెంగ్ లియాంగ్ ' అనే ఆయన  రాసిన రంగు రంగుల బొమ్మలతో కూడిన పుస్తకం, ఎన్సీ ఈ ఆర్ టీ పుస్తకాలు, టాటా మెక్ గ్రా హిల్ వారి గైడ్, స్పెక్ట్రం గైడ్, ఆక్స్ ఫోర్డ్ వారి అట్లాసు చదవాలంట.


మనోరమ ఇయర్ బుక్ చదవాలంట!


భారత రాజకీయం అర్థం చేసుకోవడం కోసం డి.డి బసు, ఎం వీ. పైలీ సుభాష్ కాశ్యప్,పి.ఎల్.పైలీ గార్లు రాసిన పుస్తకాలు చదవాలంట.
దత్తా మరియు సుందరం గార్లు రాసిన పుస్తకం చదవాలంట. ఎన్. సీ ఈ ఆర్ టీ వాళ్ళ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ పుస్తకాలు చదవాలంట. అలాగే యోజన, కురుక్షేత్ర పత్రికలు చదవాలంట. ఇంకా ఒక పెద్ద పేరా ఇచ్చి, దాంట్లోంచి అడిగే ప్రశ్నలు రాయాలంట.
దీనెమ్మ,...తొమ్మిది, పదో తరగతుల్లో అలాంటివి ఎన్ని రాయలేదు..?
నేను తేలిగ్గా రాసి పడేస్తాను. అనుకున్నాడు కిట్టు.


రెండు మాటలు చెప్తారంట !


'నవ్వినవాడు గాడిద!'


"సోముగాడు నవ్వాడూ అని.


ఈ రెండు మాటల్నుంచి మనమొక మాట చెప్పలంట.


చెప్పేదేముంది?


గాడిద గుడ్డు.!


సోముగాడు గాడిద '


ఏహ్... నాకొచ్చులేవహె..అనుకునేవాడు కిట్టు.


' పి ' గాడు, క్యూ గాడు, ఆర్ గాడు, ఎస్ గాడు, టీ గాడు వరుసగా కూర్చున్నా.


ఇలా బుర్ర తినేట్టు ఆడి మధ్యలో ఈణ్ణి, ఈడి మధ్యలో ఆణ్ణి కూర్చోబెట్టి చివరకు ఎవడెక్కడ ఉన్నాడో అడుగుతారంట. !
బుర్ర గోక్కునే విషయమేగానీ ఆ ' పి ' గాడి, ' క్యు ' గాడి ఇలా ఇచ్చిన వాళ్ళందరి తలకాయలని సున్నాలుగా చుట్టి సున్నా మధ్యలో వాళ్ళ పేర్లు రాసి బొమ్మలుగా గీసుకుంటే ఇది కూడా పెద్ద కష్టం కాదు అనుకున్నాడు . చిన్నప్పుడు వేసుకున్న పొడుపు కథలకీ, ఈ ప్రశ్నలకీ పెద్ద తేడా లేదు.


పిల్లికి ముందు రెండు పిల్లులు.


పిల్లికి వెనక రెండు పిల్లులు.


పిల్లికి పిల్లికి మధ్య ఒక పిల్లి


మొత్తం పిల్లులెన్ని?

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college drop out gadi prema katha