Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aadityahrudayam

సిరివెన్నెల పార్ట్ - 4

నిజానికి గత వారంతో సిరివెన్నెల గారి వ్యాసాలు ఆపి, తర్వాతవి మొదలు పెడదామనుకున్నాను. కానీ, ఈ కాలమ్ మొదలెట్టాక మొదటిసారి చదివిన వారందరూ కంటిన్యూ చేయమని డిమాండ్ చేసారు. అక్షయ పాత్రలాగా శాస్త్రి గారు పాతికవేలకు పైగా పాటలు రాసి, ఇంకా రాస్తూనే ఉండగా లేనిది, నేనాయన గురించి నాలుగక్షరాలు నాలుగో పార్ట్ గా పొడిగించి రాయలేనా అని పూనుకున్నాను.

శాస్త్రి గారూ! ఇది మీ ఎచీవ్ మెంట్. మీ గురుంచి రాస్తేనే, మీతో మాట్లాడినట్టు, మీ పాట విన్నట్టూ, మనసు 'తడి' మినట్టు మీ అభిమానులందరం భావిస్తున్నామంటే.. ఆ చంద్రుడి వెన్నెల భూమిని, శరీరాన్ని మాత్రమే తాకితే, మీ పాటల సిరివెన్నెల ఆ రెండూ దాటి శ్రోతల మనసుని కూడా తాకుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? హ్యాట్సాఫ్ గురువుగారూ! "దరి తరత్తాత్తతరి తరత్తాత్త తరితరిన దరి దరీనానినని ఊహూ..." అని రెండు సార్లు ట్యూన్ గా అని కళ్యాణి మాలిక్ (ఇప్పుడు పేరు మార్చుకున్నారు కళ్యాణి కోడూరి అని) శాస్త్రి గారికి ఇస్తూ ఇది ఒకే ఫ్రేజ్ లాగా ఉండాలండి, తత్కారం అర మాత్రం కూడా మారకూడదు అన్నారు.

'మనసు మాటవినదు' సినిమాకి. శాస్త్రి గారు ఆలోచిస్తుండగా, బైట నాతో, నేనిచ్చిన తత్కారం మారిస్తే చెడ్డ చిరాకొచ్చేస్తదండి నాకు - పాట అందం పోతుంది. అందుకే మాగ్జిమం నా పాటలన్నీ శాస్త్రి  గారే రాసేలా చూసుకుంటాను. ఆయనొక్కరే చాలెంజ్ గా తీసుకుని తత్కారంలోకి భావాలతో కూడిన అక్షరాలని దిగ్గొడతారు. ఈయన పాట రాస్తే రావణ హాయి అన్నారు. రావణుడంత భీభత్సమైన హాయి అని ఆయన కాయినింగ్. ఒక వేళ గురువుగారు కూడా ఫస్ట్ రెండు లైన్లు తత్కారం మారిస్తే పాటని లిరిక్ తో కాకుండా తత్కారంతోనే మొదలెడదాం వెరైటీగా అన్నారు. సరే నన్నాను. లోపలికి పిలిచారు శాస్త్రి గారు. తత్కారం అనమన్నారు కళ్యాణి గారిని. ఆయన రెండు సార్లు అనగానే "నువ్వు మరోసారి అను మరోసారి అను సరిగ, మది వినేలాగ అను ఊ..." అన్నారు. శాస్త్రి గారు అడిగారనుకుని మూడోసారి పాడేసారు కళ్యాణి - మళ్ళీ పాడారు శాస్త్రి గారు. నాకర్ధమైంది - నవ్వి, కళ్యాణి గారిని ఆపి శాస్త్రి గారిని కంటిన్యూ చేయనిచ్చాను. ఆ పల్లవి మాఇద్దరికీ విపరీతంగా నచ్చేసి పట్టుకుపోయి రికార్డ్ చేసేశాం.

"నువ్వు మరోసారి అను మరోసారి అను సరిగ మది వినేలాగ అను.. ఊ..
నువ్వు మరోసారి విను మరోసారి విను సరిగ మతి చెడేలాగా విను..ఊ..
మనసు తపన అదే తలపు అదే మొరవిని రారే త్వరగా
తమరి పలుకులివే వరసలివే కలబడిపోతే తప్పదుగా..."

ఇంకోపాట కూడా... అదే సినిమాలో..
"నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతినడుగు   
వేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనరు..
నేను నిజం నా ప్రేమ నిజం ఇది పిచ్చితనం అనకు
అన్నా 'మనసు మాటవినదు', విన్నా ఔను, కాదు అనదు..

ఎదలో నీ జ్ఞాపకం... చెరిపే వీల్లేదుగా..
మదిలో నీ సంతకం... కరిగే కలకాదుగా...
నువ్వూ, నేను రెండక్షరాలుగా..
మారాలిగా ప్రేమై ఇలాగ...
ప్రేమే అయినా, ఇకపైన కొత్తగా...
మన పేరుతో పిలిపించుకోగా.."

ఏ టీనేజ్ రొమాన్స్ నీ ఎలౌ చేయని మెచ్యుర్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఈ పాటలో వింటే, పాపం పిల్లల్ని ప్రేమించుకోనీ పర్వాలేదు అనుకుంటారు. భావంలో పటుత్వం అది - అదే శాస్త్రి గారి ఆయుధం. ఆయన పాటలు, పదాలు, కవితలు కొట్టేసిన వాళ్ళున్నారు. కానీ, ఆయన దారిలో ఆయన్ని కొట్టిన వాళ్ళేరి? ఆయనకి భయం లేకపోవడానికి కారణం ఆయనికి భావ దారిద్ర్యం లేకపోవడమే. అందుకే ఆయన నిర్భీతిని పొగరనుకుంటారు తెలీని వాళ్ళు , కొత్తగా పరిచయం అయిన వాళ్లు. నిగర్వి కానీ భయం లేదనుకుంటాం నాలా బాగా పరిచయం అయిన వాళ్లం.

ఆత్రేయ గారి తర్వాత మోడ్రన్ తెలుగు సినిమా పాట అ పరిస్థితి ఏంటని భాధపడే వాళ్లకి మాస్ పాటలే కాదు భావుకతతో కూడిన మంచి పాటలకి కూడా నేనే దిక్కు అని వేటూరి గారు నిరూపించుకున్నారు. ఆత్రేయ గారి మనసు భావాల్ని, మంచి సాహిత్యాన్ని సీతారామశాస్త్రి గారు తన బాణీగా ఎంచుకొని వేటూరి వారికి దీటుగా నిలబడ్డారు. వారి తర్వాత ధాటిగా నిలిచారు. 'తనన' అనే తత్కారం ఒక వాక్యం చివర వచ్చిందనుకోండి. చెలియ, సఖియ, కలవా, ఇలవా, పడక, గడప, వలపు, పిలుపు, గడియ, కిటికి ఇలా ఓ యాభై పదాలు రాసుకుని, ఇవన్నీ ఈ తత్కారానికి ఎవరికైనా ఫస్ట్ తట్టే పదాలు. ఇప్పుడు యాభై ఒకటవది కనిపెట్టాలి - అదే సీతారామశాస్త్రి, అనుకుని శాస్త్రి గారు ఆ పదాలేవీ వాడకుండా కొత్త థాట్ తో వస్తారు.

సహజంగా తట్టిన దానిని కాదని, ఆ స్థానంలో కొత్తది క్రియేట్  చేయడానికి పడే కష్టమూ, తాపత్రయమే మిగిలిన గీత రచయితల నుంచి శాస్త్రి గారిని యూనిక్ గా నిలబెడుతూ ఉంటుంది. నాకు చంద్రబోస్, వెన్నెల కంటి గారు, జొన్నవిత్తుల గారు, సుద్దాల అశోక్ తేజ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, భువన చంద్ర గారు, భాస్కర భట్ల గారు, రామ జోగయ్య శాస్త్రి గారు, అనంత శ్రీరామ్, కంచికొండ, పెద్దాడ మూర్తి, సాహితీ గారు, సిరాశ్రీ గారు, కేదారీనాథ్, గోపరాజు రాధాకృష్ణ గారు, వడ్డేపల్లి కృష్ణ గారు, కృష్ణ చైతన్య ఇంకా చాలామంది ముందు తరం, ఈ తరం పాటల రచయితలు పర్సనల్ గా బాగా తెలుసు. అందరూ శాస్త్రి గారిని అభిమానించే విషయం లో కచ్చితంగా ఏకాభిప్రాయంతో ఉంటారు. పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యమందే' అన్న ఆర్యోక్తి అక్షరాలా ఆచరణలో ఉన్నది సినిమా పరిశ్రమలో ఈ రచయితల మధ్యే.

ఈ మధ్య కాలంలో నటీనటులు కొంత వరకూ అవలంబిస్తున్నారు. ఆ స్నేహాన్ని. నిర్మాతలు, దర్శకులకి అస్సలు అలవడడం లేదని ఎందుకో...

నేను, ఎమ్మెస్ రాజు గారు శాస్త్రి గారి ఎదుట కూర్చున్నాం. 'ఆట' సినిమాలో టైటిల్ సాంగ్ ట్యూన్ వింటూ, శాస్త్రి గారు దీర్ఘాలోచన నుంచి బైటకొచ్చి, ఈ పల్లవి చూడబ్బాయ్... అని ఇచ్చారు.

"అల్లాదీన్ అద్భుత దీపం.." అని మొదలౌతుంది సాంగ్... పిల్లలకి కూడా పాడుకోడానికి తేలిగ్గా వుంటుంది... అన్నారు. కానీ, సాంగ్ స్టార్టింగ్ టూ లైన్స్ చాలా హై పిచ్ లో ఉన్నాయి కదండి... ఇంత తేలికైన పదాలు బాగోవు. ఆ రెండు లైన్లూ హెవీగా వుండేలా చూసి, మూడో లైన్ నుంచి లో పిచ్ లో ఉంటాయి కదా... ఈ లైన్ అక్కడ వాడదాం అన్నాను... శాస్త్రి గారు ఏమీ అనలేదు. కానీ, ఎమ్మెస్ రాజు గారికి కోపం వచ్చింది. పిచ్చి లాజిక్కులు తియ్యకు.. ఈ ఓపెనింగ్ ఎక్స్ ట్రార్డనరీగా ఉంది... ఫిక్స్ అయిపో అన్నారు.

నేనిది బాలేదనలేదు.. దీని ముందు ఇంకో రెండు లైన్లు కొంచెం గంభీరంగా ఉండాలన్నానండి... అంతే అన్నాను.. శాస్త్రి గారు ఏమీ మాట్లాడట్లేదు. నాకు టెన్షన్.. ఈ లోపల బైట హాల్లో త్రివిక్రమ్ ఏదో పనిమీద వచ్చారు.. ఎమ్మెస్ రాజు గారు అయన్ని లోపలికి పిలిచి ఈ పల్లవి బావుందా, ఇంకోలా స్టార్ట్ అవ్వాలా చెప్పండి అన్నారు. అల్లాడీన్ అద్భుత దీపం.. అనే సాంగ్ స్టార్టింగ్ చాలా కొత్తగా వుంది. పిల్లలు కూడా పాడుకుంటారు - అన్నారాయన.. వేరే విశేషాలు మట్లాడేసి వెళ్ళిపోయారు. ఎమ్మెస్ రాజు గారు నాకింకో లైను వద్దండి.. త్రివిక్రమ్, నేను ఓటేశాం. ఇదే ఫిక్సయి పోదాం.. ఏం  గురువు గారూ అన్నారు... నువ్వు, త్రివిక్రమ్, రైట్ అయి వుండచ్చు హనీ... కానీ, ఈ పాట తీసే డైరెక్టర్ కి  దీనికి సంబంధించి ఓ విజన్ ఉంటుంది.. దానికి ఈ పదాలు మ్యాచ్ అవ్వట్లేదని భావించి, అది చెప్పాడు. ఇదెలా ఉంటుంది చూడు నాన్నా.. అని పేపర్ ఇచ్చారు నాకు..

"జెండాపై కపిరాజుంటే.. రథమాపేదెవరంటా..." అని హైపిచ్ లో రెండు లైన్లు వచ్చి, లోపిచ్ లో మూడో లైన్ నుంచి అల్లాదీన్ అద్భుతదీపం.." అని కంటిన్యూ అవుతుంది. ఆ పాట అలాగే రికార్డు చేసేశాం. పవర్ కో, డబ్బుకో, సక్సెస్ కో ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పాట తీసే దర్శకుడి విజన్ ని పట్టుకోడానికి ట్రై చెయ్యడం - ఎంత అద్భుతమైన విషయం.. అలాంటి అద్భుతాలు ఇంచుమించు ప్రతీ పాటకీ చేస్తారు శాస్త్రి గారు.

ఆయన అదృష్టంతో పైకొచ్చిన వారు కాదు. మెదడుని కత్తిలా పదునుపెట్టి, శరీరాన్ని వజ్రంలా సానపెట్టి, సున్నితమైన భావజాలాన్ని కాపాడుకోడానికి భాషని డాలుగా పట్టుకొని శ్రోతల మానస సామ్రాజ్యాన్ని గెలవడానికి కదన రంగం లోకి దూకిన వీరసైనుకుడాయన. ఆ యుద్ధం ప్రతి పాటకీ చేస్తారు - గెలుస్తారు.. అలసిపోతారు. మరో గెలుపుతోనే సేదదీరుతారు.

"రవిగాననిచో కవిగాంచునెయ్యడన్" అన్నారు. రవి శరీరాన్ని మాత్రమే తాకుతాడు. కవి మనసుల్ని కూడా స్పృశిస్తాడు... అందుకే ఈ సూర్యుడి కంటే ఈ కవి చంద్రుడు - సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు - ఎప్పుడూ గొప్పవాడే...

(మళ్ళీ వారం మరిన్ని మంచి విశేషాలతో...)

 

  మీ
వి.ఎన్.ఆదిత్య


                                                                                                                                        

మరిన్ని సినిమా కబుర్లు
bacchan platinum function on may 17th