Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అసతోమా సద్గమయ

asatomaa sadgamayaa

యట హోరుమని ప్రళయగర్జన చేస్తూ వర్షం కురుస్తూంటే నిశ్చలంగా, తదేకధ్యానంతో పేకాటలో నిమగ్నులై వున్నాం క్లబ్బులో. తపోభంగానికి అవతరించిన మేనకలాగా, బిలియర్డ్స్ రూంలోంచి ఊడిపడి సరాసరి మా టేబుల్ దగ్గిర కుర్చీలో కూలబడి "ఇంకా మూర్తిగాడు రాలేదురా?" అంటూ వో ఉరుం ఉరిమేడు పాపారావు.

ఎవరూ పలకకపోయేటప్పటికి "పావుగంటలో వస్తానని కారు తీసుకుపోయి గంటయింది. ఎక్కడ చచ్చేడో!" అంటూ గొంతు చించుకున్నాడు.
"ఈ వర్షంలో ఎక్కడ చచ్చినా చావొచ్చు" అన్నాడు ఆచారి. అసలు వాడి పేరే ఆల్ కౌంట్ ఆచారి. పైగా ఆరోజు చెయ్యి మరీ భస్మాసుర హస్తం లాగుంది.

"అయినా యింత అర్థరాత్రి కళ్లజోడు కోసం వెళ్లకపోతే యేం!" అన్నాడు సుబ్బారావు.

:కళ్లజోడేమిటి?" అన్నాడు పాపారావు విసుగ్గా ఆచారి పేకట్లోంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ...

:వాడి కళ్లజోడు నిన్న మధ్యాహ్నం బద్దలయిపోతే, కొత్తదానికి ఆర్డరిచ్చాడుట. ఇప్పుడు దాన్ని తెచ్చుకోడానికి పోయేడు" అన్నాడు రంగనాథం.

"కళ్లజోడున్నా వాడికి కళ్లు కనబడవు. ఎలా డ్రైవ్ చేస్తున్నాడో, ఏమిటో" అన్నాడు శంకరం కీడు శంకిస్తూ...

"వాడు చస్తే నాకేం! కారు పట్టుకుపోయి చచ్చేడు కదా!" వాపోయాడు పాపారావు.

"వాడికి డ్రైవింగ్ లైసెన్సు లేదు. ఏ పోలీసు చేతుల్లోనో యిరుక్కుని వుంటాడు. అసలంటూ బతిగుంటే కాస్త ఆలస్యంగా వాడే తిరిగొస్తాడు" అంటూ సముదాయించేడు పద్మనాభం.

"ఆ గుడ్డిపీనుగ డ్రైవ్ చేస్తాడని నాకేం తెలుసు! మీరెవరైనా కూడా తగులడ్డారేమోననుకున్నాను" గర్జించేడు పాపారావు.

"ఇంతలోనే ఇంత అర్థాంతరంగా వాడి చావు ముంచుకొస్తుందనుకున్నామా?" అన్నాడు రాంభద్రం, మూర్తి చావును స్థిరపరుస్తూ...

"బుదిధ్కర్మానుసారే! పిల్లికి బిచ్చం పెట్టని పాపారావు తన కొత్త కారివ్వడం, ఆ కారు ఏక్సిడెంట్లోనే మూర్తి చనిపోవడం... హు... ఇదంతా ఘటన..." అన్నాడు పద్మనాభం.

"వాడి కాలం తీరిపోయింది. వాడు చచ్చిపోయేడు. ఇంతవరకూ మనం ఏడ్చింది వాడి ఆత్మశాంతికి చాలు. పాపారావు బాబ్జి! పోయిన కారు, మూర్తీ ఎలాగూ పోయారు. కాస్సేపు మాతో పేకాడు. నీ ఆత్మకూడా శాంతిస్తుంది" అని నేను సలహా యిచ్చేను.

"సరే కానివ్వండి. ఇంతకంటే, చెడిపోయేదేముంది!" అన్నాడు పాపారావు విచారంగా, కుర్చీ టేబుల్ ముందుకు లాక్కుని ఆచారి పేకట్లోంచి మరో సిగరెట్ తీసి వెలిగిస్తూ.

నిజం చెప్పొద్దూ, అందరి మొహాలు ఒక్కసారి మతాబాల్లాగ వెలిగిపోయాయి. చాలాకాలంగా వీడిచేత పేకాడించి, డబ్బు లాక్కోవాలన్న మా అందరి కోరికా నేటికి ఫలించే అవసాశం చిక్కిందని. చచ్చి స్వర్గానున్నవాడి తల్లిదండ్రులు ఎంతో దూరదృష్టితో వాడికా పేరెట్టి వుంటారు. ఎప్పుడూ పుణ్యానికి ఆమడ దూరంలో వుంటూ సార్థకనాముడనిపించుకున్నాడు పాపారావు.

పాపారావంటే మా అందరికీ యింత ప్రత్యేకమైన అనురాగం ఎందుకయ్యా అంటే మొదటిది.... డబ్బెట్టి పేకాడనని భీష్మించడం... రెండోది... పేకాడుకుంటుంటే వెనక్కాల కూర్చుని వొద్దన్నా వినకుండా సలహాలివ్వడం, మూడోది... స్వంత డబ్బెట్టి సిగరెట్టు కొని కాలిస్తే అది దురలవాటైపోతుందన్న సద్బుద్ధితో నియమబద్దంగా ఇతరులనే పీడించి కాల్చడం, నాలుగోది... లక్షలు లక్షలు వ్యాపారంలో గడిస్తున్నా, దానధర్మాల సంగతటుంచి, కనీసం చేబదులుకైనా చెయ్యి విదల్చకపోవడం. ఇత్యాధి శతకోటి కారణాలున్నాయి.

నేను పేకముక్కలు పంచేను. అందరూ ఉత్సాహంగా ముక్కలు అందుకున్నారు. బిక్కుబిక్కుమంటూ పాపారావు కూడా తీసుకున్నాడు. ముక్కలొకసారి సద్దుకు చూసుకొని ఆచారి పేకట్లోంచి సిగరెట్ తీసి సాలోచనగా అంటిస్తూంటే, ఆచారి "అలవాటు లేనప్పుడు అలాగ సిగరెట్ మీద సిగరెట్ కాలిస్తే టి.బి. వస్తుంది" అని బెదిరించి "జై పరమేశ్వరా" అంటూ రంగంలోకి దిగి పేకలోంచి ముక్కలాగి చూసీ చూడగానే తేలుకుట్టినట్టు "ఛీ" అయి పారేశాడు. పాపారావు ఆ ముక్కను అందుకుని కళ్లకద్దుకుని ముక్కలటు సద్ది యిటు సద్ది "డీల్ షో" చేశాడు. తర్వాత ఆచారిగాడెంత మొత్తుకుంటే ఏం లాభం? అందరం వెర్రి మొహాలేసుకుని ఆల్ కౌంట్ లిచ్చేం.

చూస్తూండగానే కౌండ్ తిరక్కుండా మరో డీల్ షో కొట్టేడు పాపారావు. మాలో సగం మందికి కళ్లనీళ్ల పర్యంతం వొచ్చాయి. భగవంతుడు ఎంత నిర్దయుడు! ఇలాంటి కటిక రాక్షసుడికా డీల్ షోలు! ఆచారి సంగతి తల్చుకుంటుంటేనే గుండె తరుక్కుపోతోంది. రోజూ ముక్తసరిగా ఒకటో, రెండో బ్యాంకులు పోవడంతో సరిపెట్టుకుంటుంటే ఇప్పటికే నాలుగు బ్యాంకులు పోయాయి. వాడి ధైర్య సాహసాలకీ, సహనానికీ మెచ్చయినా భగవంతుడు పాపారావు చేత ముచ్చటకి కనీసం ఒక్కటంటే ఒక్క ఆల్ కౌంటయినా యిప్పించకపోతాడా అని అనుకుంటూంటే ఆచారి వేసిన ముక్కతోటే ఠకీమని ముచ్చటగా మూడో డీల్ షో కొట్టేడు పాపారావు. వణికే చేతుల్తో అందరూ పాయింట్లు లెక్క పెడుతుండగా పాపారావు నీరసంగా ఆచారి పేకట్లోంచి సిగరెట్టు తీసి అంటించబోతూంటే ఆచారి వాడి చెయ్యి పట్టుకుని "కేన్సరొచ్చి ఛస్తావు" అంటూ మనసారా శపించేడు.

మొహంలో శాంతం తొణికిసలాడుతూండగా భక్తపోతన ఫక్కీలో "నాయినా ఆచారీ, తనువులు అశాశ్వతం" అంటూ చిరునవ్వుతో సిగరెట్టు వెలిగించాడు పాపారావు.

"ఒరేయ్ పాపారావూ... ఇలాగ మా సిగరెట్లు పీల్చేసి, మా డబ్బు కాల్చేసి, మా హృదయాల్ని చీల్చేసిన ఈ ఘోరానికి భగవంతుడు కూడా క్షమించడు" అని బెదిరించాడు ఆచారి.

"పాపాహం, పాపోహం! నా పాపానికి నిష్కృతి లేదు. ఇంక ఈ వెధవ పేకాట మానేస్తాను. సిగరెట్టు ముట్టను" అంటూ పశ్చాత్తాపంతో డబ్బులి జాగ్రత్తగా లెక్కపెట్టుకుని జేబులో వెసుకొని లేచాడు.

దీనికి సాయం, అదే సమయానికి మూర్తిగాడు ప్రత్యక్షమై కారు తాళాలు పాపారావు చేతుల్లో పెడుతూ "పెట్రోలు లేదని చెప్పొద్దూ! రెండు ఫర్లాంగులైనా దాటకుండా పెట్రోలైపోయింది. పది రూపాయలిచ్చి కారును తోయించాను. ఐదు లీటర్ల పెట్రోలు కొట్టించేను" అన్నాడు.

"సంతోషం. కృతజ్ఞుడణ్ణి" మనసులోనే మూర్తిని దీవిస్తూ.

"ఏభై రూపాయలయింది. ఇలా పడెయ్యి" అన్నాడు మూర్తి.

"మంచిపని చేయడమే మన ధర్మం. ప్రతిఫలాపేక్ష వుండకూడదు. అదే నిష్కాను కర్మంటే" అంటూ తన దివ్య సందేశాన్నందిస్తూ మమ్మల్నందర్నీ శిలలుగా మార్చి అదృశ్యమయ్యేడు పాపారావు.

సారధి స్పర్శతో మాలో చైతన్యం కలిగింది. బోయ్ తెచ్చిన టీ తాగేక స్పృహవొచ్చింది. సారధి లక్షాధికారయినప్పటికీ, పెద్దమనిషి, బుద్దిమంతుడూనూ... వచ్చినప్పుడల్లా స్టేటెక్స్ ప్రెస్ సిగరెట్ టిన్ తో ఠీవిగా మా టేబుల్ ముందర కూర్చ్వుని మోతాదుగా ఒకటో, రెండో బ్యాంకులు పంచి పెట్టేసి దర్జాగా వెళ్లిపోతూంటాడు. మొత్తమ్మీద దేవతలాంటి మనిషి. జరిగిందంగా విని ఇలాంటి ఘోరానికి ఒడిగట్టిన పాపారావు వొచ్చే జన్మలో.... అయి పుడతాడని చెప్పి మమ్మల్ని వోదార్చాడు.

"వొచ్చే జన్మవరకూ ఆగవల్సిందే! ఈ జన్మలో వాడు నాశనమయ్యే అదృష్టం మాకు దక్కదంటావు!" అన్నాడు ఆచారి దుఖం ప్రహిస్తుండగా.

"వచ్చేజన్మంటే జ్ఞాపకమొచ్చింది, ఆ జపాన్ గర్ల్ శుక్రవారం భద్రాపూర్ కి వస్తోంది" అన్నాడు మూర్తి.

"ఏ జపాన్? ఏ గర్ల్?" అడిగాడు రాంభద్రం.

"మొన్ననా మధ్య పేపర్లో చదవలేదూ! పేరు సీన్యా. టోకియో నుంచి వస్తోంది. ఆ అమ్మాయికిప్పుడు పదకొండేళ్లు, పన్నెండేళ్ల క్రితం భద్రాపూర్ కరణంగారి భార్య కారు ఏక్సిడెంట్ లో చనిపోయిందిట. ఆవిడే యిప్పుడు సీన్యాగా పుట్టిందిట. ఈ మధ్యనే పూర్వ జన్మస్మృతి వొచ్చి భద్రాపూర్ నీ, ఆ కరణంగారినీ, వాళ్ల చుట్టాల్నీ పన్నెండేళ్ల క్రితం ఎలావుంటే అలాగే కళ్లకి కట్టినట్టు వర్ణించిందిట. ఇప్పుడు ఆ అమ్మాయితో టోక్యో నుంచీ, ఢిల్లీ నుంచీ కూడా సైంటిస్టులొస్తున్నారు. నేను బయల్దేరి వెడుతున్నాను" అన్నాడు మూర్తి.

"భద్రాపూర్ అంటే...?"

"భెంగళూరుకో డెబ్బై మైళ్లుట" విశదీకరించాడు మూర్తి.

"పోదామంటే అందరం పోదాం పదండి, నా పెద్దకారు తీసుకొస్తాను" అన్నాడు సారధి.

"దార్లోనే కనక సాయిబాబాగారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎల్లుండి తెల్లారగట్ట బయల్దేరదాం" ముహూర్తం నిర్ణయించేడు మూర్తి.
మేమందరం ఇలా వూరెళ్లదల్చుకున్నామని, మెటర్నిటీ హోంలో వున్న మా ఆవిడకి చెప్పేను. నేను ఈ పరిస్థితుల్లో యిల్లు విడిచిపెడితే ఆ నాలుగు రోజుల్లోనూ సంభవించడానికి అవకాశముండే మా ఆవిడకి పురుడూ, మా అబ్బాయికి రోగం తిరగబెట్టడం, మా తమ్ముడికి ఉద్యోగం పోవడం, మా బవమరిదికి ట్రాన్స్ ఫర్ జరగడం, మా చెల్లెలికి పెళ్లివారు రావడం, మా వంటవాడు దాసీదాంతో లేచిపోవడం మొదలయిన తొంభయ్యేడు ప్రమాదాలు ఏకరవు పెట్టింది. వెళ్లనని మాట యిచ్చేను గానీ, మనసులో వెళ్లేందుకే నిశ్చయించుకున్నాను. వైర్ లెస్స్ మెసేజ్ అందినట్టుంది... మా అబ్బాయి కూడా రాత్రి నా పక్కలో పడుకుని వూరెళ్లొద్దని ఒకటే రాగం... వెళ్లననీ, ఆడినమాట తప్పని హరిశ్చంద్రుడంతవాణ్ణనీ అబద్దమాడి వాణ్ణి జోకొట్టేను.

ఆశ్రమంలో వాతవరణం అంతా ప్రశాంతంగా వుంది. చుట్టూ వున్న ఆవరణలో దట్టంగా పెరిగిన మామిడి, వేప, నేరేడు, యూకలిప్టస్ చెట్లున్నాయి. వాటి నీడలో వేలాదిమంది కూర్చుని వున్నారు. నిశ్శబ్దంగా కొందరు పుస్తకాలు చదువుకుంటున్నారు. కొందరు వేదాంత చర్చల్లోనూ, కొందరు స్వామి మహిమలను గుర్తించిన సంభాషణల్లోనూ నిమగ్నులై వున్నారు. ఆశ్రమం మధ్యలో నాలుగెకరాల మేర పూలతోట వుంది. వాటికి భక్తులు బిందెలతో నీళ్లు పోస్తున్నారు. పూలతోట మధ్య వున్న భవనమే ప్రశాంతి నిలయం. అందులోనే బాబా వుంటారు.

మాకదే ఆశ్రమం చూడడం మొదటిసారి. తోటలో వో చెట్టుకింద చేరేం. చల్లగా, హాయిగా వుంది. నడుం వాల్చేం. సాయంత్రం నాలుగు గంటలయింది. ఒక్కొక్కళ్లే లేచి మందిరంవైపు వెడుతున్నారు. మాకో వలంటీరుతో పరిచయమయింది. ఆయనో డాక్టరు. సారధి స్నేహితుడి తమ్ముడట. ఆయనే సారధిని ఆనవాలు పట్టి పలకరించాడు. స్వామి మహిమలను గురించి మాకు చాలా విషయాలు చెప్పాడు. తరచూ ఆశ్రమానికి వచ్చి పది పదిహేను రోజులుండి అక్కడ భక్తులకు చేయగలిగిన వైద్య సహాయం ఏమయినా వుంటే చేసి, స్వామి దర్శనం చేసుకుని వెడుతూ వుంటాడుట...

"మాకేమయినా మీ పలుకుబడితో ప్రత్యేక దర్శనం యిప్పించగలరా?" అంటూ అడిగేడు మూర్తి.

"ఇక్కడలాంటి రికమండేషన్లు లేవు. ఎవళ్లదృష్టం వాళ్లది. స్వామి బయట కొచ్చేటప్పటికి అందరూ బారులు తీరి కూర్చుంటారు. అందులో స్వామే స్వయంగా కొందరిని ఏరి వాళ్లకి ప్రత్యేక దర్శనమిస్తారు. ఇన్ని వేలమందిలోనూ రోజూ అలాంటి అదృష్టం ఏ డెబ్బయి, ఎనభై మందికో కలుగుతుంది" అన్నాడతను ఎన్నో తన అనుభవాల్ని కూడా చెప్పి.

:బాబా పిలిస్తే, మనకేమయినా కోరికలూ, సందేహాలూ వుంటే అడగొచ్చునా?" అడిగాను నేను.

"మీకలాంటి శ్రమ వుండదు. మీ మనస్సులో వున్న వాటికన్నిటికీ వారే సమాధానాలిచ్చేస్తారు" అన్నాడతను.

"నాకీ ఆల్ కౌంట్ శాపం పోయేలాగ రక్షకేకడగాలని వుంది" అన్నాడు ఆచారి.

"ఈ జపాన్ గర్ల్ సంగతికేంగానీ, నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పమని అడుగుతాను" అన్నాను నేను.

"మన కెవళ్లకవకాశమొచ్చినా పాపారావు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. ఆ కీలకమేమిటో తెలుసుకోవడం అమనందరికీ అవసరం" సలహా యిచ్చేడు రాంభద్రం.

మేమందరం వో వరసగా కూర్చున్నాం. అందరి దృష్టీ వరండాలో వున్న తలుపుమీదే వుంది. అనిర్వచనీయమైన పవిత్రత యేదో పరిమళంలాగా ఆ వాతావరణంలో సమ్మిళితమై వుంది. ఆ ప్రశాంత నిశ్శబ్దతలో భక్తి విశ్వాసాలా పదధ్వని స్పష్టంగా వినబడుతోంది.
నెమ్మదిగా తలుపులు తెరచుకున్నాయి. ఎదురుగుండా బాబా అందం, ఆనందం, శాంతం, ప్రేమ అనే పదార్థాలతో పోతబోసి బ్రహ్మ సృష్టించిన ఆ మూర్తి, అడుగులో అడుగేసుకుంటూ అందరి మధ్యనా నడుస్తూంటే, అందరూ పాద నమస్కారాలు చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు చేతులు జోడించానో నాకే తెలీదు. మావాళ్లూ అదే తన్మయావస్థలో వుండటం చూసి, ఏదో ప్రబలమైన దివ్యశక్తి ఆధీనంలో వున్నామని గ్రహించేను.

బాబా మధ్య మధ్య కొందరిని వేలుతో చూపెడుతున్నారు. వాళ్లు లేచి వరండాలొ కూర్చుంటున్నారు. వాళ్లకే ప్రత్యేక దర్శనమన్నమాట. అప్పుడే వో పాతికమందిని ఏరేరు. అందులో వికలాంగులూ, దరిద్రులూ, ఐశ్వర్యవంతులూ, వయోవృద్ధులూ, యువతీయువకులూ, సనాతనులూ, అధునాతనులూ అందరూ వున్నారు. మా వరసలోకి పాదాలు మళ్లగానే నా గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలెట్టాయి. ఎటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసా లేకుండా ఏదో వినోదం కోసం వచ్చినవాళ్లం. దూరంగా నిలబడి వో నమస్కారం చేసి వెళ్లిపోక అక్కడ చతికిలబడ్డాం. తీరా నన్ను పిలిచి ఈ పేకాటా, సిగరెట్లూ మొదలైనవి మానేసి ఏ భజనో, పూజో చేసుకోమని ఆదేశిస్తే, పదిమందిలోనూ నా బ్రతుకేంగాను! ఏమిటో చూసి చూసి యిలాంటి యిరుకులో పడ్డాను అనుకుని ఏదో పదిమందితో పాటు పాదనమస్కారం చేసుకునే భాగ్యంతో సరిపెట్టి ఎటువంటి ప్రత్యేకమైన అనుగ్రహం నామీద ఆయన చూపెట్టకుండా వుండాలని శతకోటి దేవతలకి ఆ క్షణంలో అనంతకోటి ప్రార్థనలు చేశాను. పాదాలు నా దగ్గరకొచ్చిన కొద్దీ నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. వొచ్చేయి, ఆగేయి. విధి బలీయం. నా శిరస్సు మీద స్వామి దివ్యహస్తం క్షణం నిలిచింది. లేచేను. వరండా మీదకు వెళ్లమన్నాడు వలంటీరు. మా వాళ్లందరూ నాకేసి జాలిగా "పాపం! ఇక వీడు మనకి దక్కడు" అన్నభావంతో చూస్తున్నారు. విధి నిర్ణయానికి తలవొగ్గి వరండా మీదకు నడిచేను.

నా వంతు రాగానే భయంగా లోపలికెళ్లేను. బాబా ముఖంలోకి చూడగానే భయం పోయింది. వెయ్యి తల్లుల ప్రేమను మాటల్లో నింపుతూ భుజాలు నిమురుతూ "నువ్వు రావడం చాలా సంతోషం బంగారూ. జనన మరణాల గురించి ఆలోచించడమే ఆధ్యాత్మిక జిజ్ఞాసకు ప్రథమ సోపానం. ఇప్పుడా జపాన్ బాలిక పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో బయలుదేరారు మీరంతా. అజ్ఞాతంగా మిమ్మల్ని వేధించే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది మంచి సదవకాశం. అయితే, పూర్వజన్మ వున్నట్లు మీకు నమ్మకం కలిగిన తర్వాత మీ ప్రవర్తనలో రావల్సిన పరివర్తనను గురించి ఆలోచించేరా?" అన్నారు మందహాసంతో స్వామి. 

"నా పూర్వజన్మను గురించి తెలుసుకోవాలని వుంది స్వామీ" అన్నాను ధైర్యం చేసి.

"ఉన్న ఈ సంసార జంఝాటం చాలకనా నీ పూర్వజన్మ బంధువులతో ఇప్పుడు సంపర్కం!" అన్నారు మృదువుగా.

"నా పూర్వజన్మ విశేషాలను తెలుసుకుని, జీవుల జన్మాంతర సంబంధాల్ని లోకమంతా చాటుతాను. నేనో పత్రికా సంపాదకుణ్ణి" అన్నాను.

"నీ తరంకాదు. నీ మాటల్ని ఎవరూ నమ్మరు. నిన్ను కూడా ఆ జపాన్ గర్ల్ లాగే వింత జంతువుగా చూస్తారు. నీ ముక్కు, చెవులు, మెదడుని సైంటిస్టులు పరీక్ష చేస్తానంటారు."

"సహేతుకంగా, నిదర్శనాలతో రుజువు చేస్తాను."

"ఇదివరకూ చేశారు. ప్రయోజనం లేదు. అసలు కారణం వాళ్లకి నమ్మకం లేకపోవడం. కాదు, నమ్ముతున్నామని ఒప్పుకునే ధైర్యం లేక, నమ్మకుండా వుండే అవకాశం ఎప్పటికైనా లభిస్తుందేమోనన్న భ్రమచేత"

"పోనీ నా అనుభవం కోసమైనా, నా కోర్కె తీర్చలేరా?"

"అది నువ్వనుకున్నంత సులభం కాదు. మహాజ్ఞానులు కూడా సులభంగా తాళజాలని అనుభవం. పూర్వజన్మస్మృతి లేకపోవడమనేది భగవంతుడు మానవునికిచ్చిన వరం. కాళ్లూ, చేతులూ, ముక్కూ, చెవులూ, కళ్లూ, మేధస్సూ మొదలయిన అవయవాలతో అద్భుతమైన శరీరాన్ని ప్రసాదించిన భగవంతుడికి మానవుడికి జ్ఞాపకశక్తి ఎంతవరకు అవసరమో తెలుసు" అన్నారు స్వామి నా భుజాల్ని పట్టుకుని ప్రేమతో వూపుతూ.

"మరి, ఆ జపాన్ గర్ల్ కెలా వొచ్చిందా పూర్వజన్మ స్మృతి?"

"పూర్వజన్మలో సంస్కారం నొక్క తీవ్రమైన ప్రభావంవల్ల"

"పూర్వజన్మ సుకృతం వల్ల స్వామి దర్శనం, అనుగ్రహం లభించేయి. కష్టమో, నష్టమో నకై నేను కోరుకుంటున్నాను. నాకు పూర్వజన్మ స్మృతిని ప్రసాదించండి" అన్నాను ప్రాధేయపూర్వకంగా.

"కోరికోరి జీవితంలో సుఖశాంతులకు దూరమవుతానంటున్నావు"

"పోనీ కనీసం క్రిందటి జన్మలో నేనేవర్నో చెప్పండి స్వామీ"

"సరే విను. రహస్యంగా వుంచుకో. ఎల్లుండి రాత్రి, అంటే శుక్రవారం రాత్రి ఏ యింట్లో వుంటావో అదే క్రిందటి జన్మలో నువ్వు పుట్టి పెరిగిన యిల్లు. క్రిందటి జన్మలో నీ మొదటి భార్య పేరు లక్ష్మి. ఆమే నీ మీద మమకారంతో చనిపోయి ఈ జన్మలో నీకు అన్నగా పుట్టి నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు..."

"ఈ మధ్యనే చనిపోయాడు స్వామీ"

"అవును. అతనే నీకు మళ్లీ కుమర్తెగా పుట్టబోతున్నాడు. ఎల్లుండి నువ్వు నీకు నలభయ్యో యేట నీకు విషం పెట్టి చంపిన నీ రెండో భార్యను కూడా చూస్తావు. అప్పట్లో మీ కుటుంబానికి గర్భశత్రువయిన రాఘవులు చావుని నీ కళ్లతో నువ్వే చూస్తావు. ఈ జన్మలో ఆ రాఘవులు పేరు రాజా. మరింక క్షేమంగా వెళ్లిరా" అంటూ దీవించి పంపించేరు.

పుచ్చుకున్నది వరమో, శాపమో అర్థంకాని అయోమయ స్థితిలో బయటపడ్డాను. నన్ను ఎక్కడికి వెళ్లమన్నదీ, ఎప్పుడు బయలుదేరమన్నదీ చెప్పకుండా వెల్లి రమ్మన్నారు. మావాళ్లందరూ నన్ను చుట్టుముట్టి ఆశ్రమంలో దూరంగా తీసుకుపోయి ప్రశ్నలవర్షం కురిపించేరు. పేకాటకి పనికొచ్చే వరం పుచ్చుకున్నావా అని ఒకడూ, పాపారావు మరణ రహస్యం తెలిసిందా అని మరొకడూ ఇలా రకరకాల ప్రశ్నలతో వేధించారు. నేను నోరు విప్పలేదు. దేనికి సాయం నా తిరుగు ప్రయాణం గురించి నిర్ధారణ చేసుకోలేదు. దానాదీనా "వైకుంఠానికి మన వూరి మీదుగా వెడుతూంటే వుత్తరం రాయి. కనబడి పలకరిస్తాం. నువ్వు తిరిగొచ్చేక చచ్చినా నీతో పేకాడం, ఏమయినా యిదే మా శ్రద్ధాంజలి" అంటూ నా హోల్డాల్ బయటికి గిరవటెట్టి వాళ్లు వెళ్లిపోయారు.

ఆ రాత్రి ఆశ్రమంలోనే గడిపేను. ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తనం అయ్యేక నా సమస్యను గురించి ఆలోచిస్తూ ప్రార్థనా మందిరం నుంచి తిరిగి వొస్తూంటే నిన్నటి వలంటీరు ఎదురయ్యేడు. "ఎల్లుండి రాత్రి ఏ యింట్లో వుంటావో ఆ యింట్లో వో అపూర్వ సంఘటన జరుగుతుంది వెళ్లిరా అన్నారు. స్వామి మరి ఎక్కడికి వెళ్లవలసిందీ చెప్పలేదు" అన్నాను.

"ఇంకా దీన్ని గురించి మీరాలోలించవల్సిందేమీ లేదు. స్వామి వెళ్లి రమ్మంటే వెంటనే వెళ్లడమే కర్తవ్యం. ఇప్పుడైనా వెంటనీ బయల్దేరండి" అని ఆయన సలహా యిచ్చేడు.

బెంగళూరెళ్లి అక్కణ్ణుంచి బస్ మీద భద్రాపూర్ వెళ్లి మనవాళ్లను కలుసుకుని ఆ జపాన్ గర్ల్ సంగతి తెలుసుకోవచ్చునన్న ఉద్దేశంతో, రైలుకందిస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన బస్ ఎక్కేను. స్టేషనులో కాలెట్టగానే రైలు వెళ్లిపోయిందన్న శుభవార్త ఎదురయింది. సరాసరి బెంగళూరుకేదయినా టేక్సీ దొరుకుతుందేమోనని ప్రయత్నించాను. విఫలమయింది. గత్యంతరం లేక అంచీల మెద్నైనా వెడదామని హిందూపూర్ వరకూ వెలుతున్న లారీ ఎక్కేను. డ్రైవరు బహు బుద్ధిమంతుడు. అయితే యేం! లారీ మహా పెంకిఘటం. పదేసి మైళ్లకోసారి పేచీ పెట్టడం, తర్వాత రాజీ పడడంతో అలా అలా రాత్రికి హిందూపూర్ కి చేరుకున్నాను.

బెంగళూరులో సమ్మెలూ, గొడవలూ గందరగోళంగా వుందని తాత్కాలికంతా రవాణా రద్దు చెయ్యడంవల్ల ఆ రాత్రి హిందూపూర్లోనే గడిపేను. మర్నాడు ఆ వూళ్లో వున్న మా పత్రిక స్టాకిస్టు వొ ప్రయివేటు కారులో మధ్యాహ్నానికి బెంగళూరుకి చేర్చేడు. కానీ, ఏం లాభం! కొందరు దేశభక్తులైన యువకులు వో టేక్సీ డ్రైవరు ముసుగు పెట్టుకుని పడుకుని వుండగా తల అనుకుని పొరపాటున కాళ్లవైపు పెట్రోలు పోసి అంటించేరుట. దానికి వాడు రెచ్చిపోయి టేక్సీలన్నిటినీ సమ్మెలోకి దింపేడుట. ఇంత చిన్న విషయంలో అంత రాద్ధాంతం చేస్తే యిక మనం రాజకీయంగా ఎలా పురోగమిస్తాం!

ఒకచోట యూనివారంలో వున్న కండక్టర్ని ముచ్చటపడి బాలికలు పచ్చడి కింద తన్నేరుట. అక్కడ బాలురు లేకపోవడంవల్ల బాలికలు కలగజేసుకోవల్సివచ్చిందనీ, ఉద్యమం అన్న తర్వాత ఇలాంటి పట్టింపులు తప్పు తప్పని నాయకులు ఎంత చెప్పినా వినకుండా బస్సు సారధులందరూ సమ్మెట!

భావి పౌరులైన విద్యార్థులై వచ్చిన వాటిని మచ్చుకొకటి చొప్పున పుచ్చుకుని మిగిలిన ఫలహారాలు "రిలే హంగర్ స్ట్రైకర్స్"కి సకాలంలో అందించాలన్న సత్సంకల్పంతో కార్యరంగంలో నిమగ్నులై వుండగా, ప్రజల కళ్లముందరే హోటల్ ప్రొప్రైటర్ తిరగబడ్డాడంటే ఇంతకంటే అరాచకం ఏముంది? దీని మూలాన్ని హోటళ్ల సమ్మెట! ఇదంతా చూసి "జగమే మాయా" పాట పాడుకుంటూ అలా బెంగళూరు రోడ్డంట ఫేడవుట్ అయిపోదామనిపించింది.

ఇంతలోకే వో లారీ డ్రైవరు నా భుజం తట్టి "కష్టసుఖాలు కావడి కుండలు. భయపడకండి. నేను సాయంత్రం లోడ్ వేసుకువస్తాను. మిమ్మల్ని భద్రాపూర్ లో దింపుతాను. ఫ్రంట్ సీటు ప్రత్యేకంగా మీకే రిజర్వ్ చేస్తాను. జస్ట్ వో చిన్న వంద రూపాయలనోటు నా మొహాన్న పారేయ్యండి" అంటూ సవినయంగా అభయహస్తమిచ్చేడు. సరేనన్నాను. అతని పేరు ప్రహ్లాదుట. మనిషి కాస్త తండ్రి పోలికేమో... హిరణ్యకశిపుడిలాగున్నాడు. ఆడినమాట తప్పకుండా సాయంత్రం ఆరింటికి లారీ తీసుగొచ్చేడు. ఎక్కి కూర్చున్నాను.

డ్రైవర్ కూనిదీర్ఘాలు తీస్తూ, సిగరెట్లు కాలుస్తూ ఊరు దాటగానే స్పీడెక్కించాడు. డ్రయివరు తాలూకు ప్రొహిబిషన్ పరిమళం వల్లనయితే యేం, సిగరెట్టు పొగ తాలూకు మేఘాలవల్లనయితేనేం, మధ్య మధ్య ఎదురయ్యే కార్లలైట్లు మొహమ్మీద కమ్మడం వల్లనయితేయేం, రోడ్ మలుపుల్లో టైర్లు చేసే ప్రణవనాదం వల్లనయితేయేం, మొదట్లో దార్లో రోడ్ పక్కనున్న చెట్లూ, కల్వర్టులూ ట్విస్టు డాన్స్ చేసినట్టు కనబడింది. స్పీడెక్కించాక అంతరిక్షయానమంటే ఏమిటో తెలిసింది. మొత్తమ్మీద భూమ్మీద ప్రయాణం చెయ్యడం లేదని గ్రహించి భగవంతుడిమీద భారం వేసి కళ్లు మూసుకుని పంచాక్షరీ మంత్రాన్ని ప్రారంభించేను. మరి, కైలాసం ఎప్పుడు చేరేమో తెలీదు గానీ, హరహరమంటూ గంగలోకి దొర్లిపోడం చూచాయగా గుర్తుంది.

ముక్కుకు ఘాటయిన వాసన తగలగానే మెలకువొచ్చి కళ్లు తెరిచాను. వరండా మీద లాగుంది... మంచం మీద పడుకుని వున్నాను. తలవొంచి కిటికీలోంచి హాల్లోకి చూశాను. గుమ్మమ్మీద గోడకి పెద్ద ఫోటో వుంది. నలభైయేళ్లుండి వుంటాయి. మంచి స్ఫురద్రూపి, బొద్దు మీసాలు, ఉంగరాల జుట్టుతోనూ మంచి ఠీవీగా కూర్చుని వున్న విగ్రహం తాలూకు ఫోటోకేసి హరికేన్ లాంతరు వెలుగులో చూస్తే ఎక్కడో చూసిన మొహంలాగ కనబడింది. "తెలివొచ్చిందా బాబూ" అన్న పలకరింపు విని ఉలిక్కిపడి తల ఎత్తి పక్కకి చూశాను. పడక కుర్చీమీద వో ఘటోత్కచుడు సావుకాశంగా చుట్ట కాలుస్తున్నాడు. "అమ్మా! ఈయనకి తెలివొచ్చింది. కొంచెం పాలు పట్రా" అంటూ గర్జించింది పడక్కుర్చీ.
నడుం వొంగిన డెబ్బయేళ్ల ముసలావిడ వో కంచు గ్లాసుతో వేడివేడి పాలు అందించింది.

నెమ్మదిగా లేచి అందుకున్నాను. "ఎంత గండం గడచింది బాబూ! పై నుంచి సిమెంటు బస్తాలు మీద పడలేదు" అన్నాడు లారీ డ్రయివరు. ఇలాంటి గండ పరంపరలు నిత్యం గడవడం, భక్త ప్రహ్లాదుడిలాగా వీడికి పరిపాటి అనుకుంటాను. "శుక్రవారం పూట మంచి వర్జంలో బయలుదేరేరు, మరీ" అంది ఆ ముసలావిడ సాగతీసుకుంటూ.

"శుక్రవారం" అన్నమాట వినగానే స్వామి చెప్పిన మాటలు జ్ఞాపకమొచ్చి వున్నుమీద తన్నినట్లయ్యి పక్కమీద నుంచి లేచి కూర్చుని పాలు గబగబా గాతేసి అందరి మొహాల్నీ కలయచూశాను.

"ఖంగారు పడకండి. లారీ బురదలో యిరుక్కోవడంవల్ల పక్కకి ఒరిగింది. మీరు కునికిపాట్లు పడుతున్నట్లున్నారు. తలుపు గడియ సరిగ్గా లేదేమో, తెరుచుకు బయటికి దొర్లిపడ్డారు. మరేమీ ప్రమాదం లేదు. స్థిమితపడ్డాక కాస్త బట్టలు మార్చుకోండి" మరో చుట్ట వెలిగించేడు పడక్కుర్చీలో ఆకారం. వీడే క్రిందటి జన్మలో నా పెద్దభార్య కొడుకనే ఆలోచన రాగానే వొళ్లు చల్లభడినంత పనయింది. సుమరు ఓ అరవై యేళ్లుంటాయి. మంచి ఒడ్డూ పొడుగూ, పెద్ద బొజ్జా... మనిషి పర్వతంలాగున్నాడు.

"ఇవిగో వేణ్నీళ్లు. కాళ్లూ చేతులూ మొహం కడుక్కోండి" వో రాగివిందు, చెంబు అక్కడ పెట్టిన ఆ ముసలమ్మ మొహంలోకి పరీక్షగా చూశాను. ఈవిడే క్రిందటి జన్మలో నాకు విషం పెట్టి చంపిన నా రెండో భార్యన్నమాట. డెబ్బయేళ్లుంటాయి. నడుం కొంచెం వొంగింది. ఆ మాట తీరిలోనూ, ఆ కళ్లలోనూ అధికారం తొణికిసలాడుతోంది. ఇంకా కర్మ పరిపక్వం కాకపోవడం మూలాన్ని లాగుంది... మృత్యువుతో పోరాడే దేహదారుడ్యం మిగిలి వుంది.

ఆ ఫోటోకేసి మళ్లీ పరకాయించి చూసి క్రిందటి జన్మలో నాకున్న ఠీవికి మురిసిపోయాను. ఇలాంటి నాకు ఈ ముసలిది విషం పెట్టి చంపిందంటే ఆశ్చర్యమేసింది. ఈ విషయం తెలుసుకుందామన్న కుతూహలంతో నెమ్మదిగా లేచి కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కుని బట్టలు మార్చుకున్నాను.

"ఈ రాత్రికిక్కడే విశ్రాంతి తీసుకోండి. ఉదయాన్నే భద్రాపూర్ బస్ మీద వెడుదురుగానీ..." అన్నాడు మా క్రిం.జ.కొడుకు. వయస్సులో పెద్దవాడు కాబట్టి కృతజ్ఞతతో నమస్కరించి "మీకు చాలా శ్రమ ఇస్తున్నాను" అన్నాను.

"ఎంతమాట! మీలాంటి పెద్దవాళ్లు మా యింటికి రమ్మంటే మాత్రం వస్తారా! దైవికంగా యిలా వచ్చేరు"

"మీరు స్వంత వ్యవసాయం నడిపిస్తున్నారా?" అడిగేను. అతను నిర్లిప్తంగా నవ్వి "ముప్పై అయిదు సంవత్సరాలుగా నేను చేసే ముఖ్యమైన పనులేమిటంటే భొంచెయ్యడం, పడక్కుర్చీలో పడుకోవడం, చుట్ట కాల్చడం" అన్నాడు.

"జరుగుబాటుంటే అంతకంటే ఏం కావాలి! చేతికందొచ్చిన పిల్లలకి సంసార బాధ్యతల్ని అప్పగించేసి వుంటారు" అన్నాను.

"అదంతా వో కథ నాయినా! వాడికి సంసారం లేదు, చట్టుబండలూ లేదు. వాడూ, నేనూ చావలేక బతుకుతున్నాం" అంది నా క్రిం.జ.రెండో భార్య, వో పళ్లెంలో గారెలూ, ఆవడలూ పట్టుకొచ్చి అందిస్తూ...

"ఇప్పుడివన్నీ తినలేనమ్మా..." అన్నాను.

"మా యింటికి అతిథులు వచ్చి ముప్పైయేళ్లయింది. ఈరోజు మా నాన్నగారి తద్దినం. అందుకే ఈపాటి ఫలహారం యిచ్చే భాగ్యానికైనా నోచుకున్నాం" అన్నాడు.

వెన్నెలలో షికారుగా వెళ్లి కాలవగట్టున కూర్చున్నాను. నాకూడా ఆ వూరి రైతొకను సాయం వచ్చేడు. వ్యవసాయం, రాజకీయాలు, ఎలక్షన్ల మీద సింహావలోకనం అయిన తర్వాత ఈ కుటుంబం గురించి అడిగేను.

"ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం బాబూ, ఇప్పుడు చితికిపోయింది. దీనికంతటికీ కారణం ఆ ముసిల్దేనంటారు. ఈవిడ పెనిమిటి చల్లని మారాజని సెప్పుకునేవారు. మొదటి భార్య పోతే యీవిణ్ణి చేసుకున్నాడు. ఇప్పుడున్న కరణంగారి తండ్రి రాఘవులని వుండేవారు. ఆయనే ఈ సంబండం ఈయనకి అంటగట్టేడంట"

"ఈవిడకి పిల్లలు లేరా?"

"పెళ్లయిన రెండేళ్లకే ఆయన పోయేడు. ఈ సవితి కొడుకొకడు మిగిలేడు"

"పాపం!"

"పాపం, పుణ్యం దేవుడికెరుక! ఆయన చావును గురించే రకరకాల పుకార్లున్నాయి"

"ఏమని?"

"ఏ రోగం లేకుండా అర్థాంతరంగా పోయాడటండీ... రాఘవులు, యీవిడ కలసి ఆయనకి యిషం పెట్టేరంటారు"

"రాఘవులుకీ, యీవిడకీ బంధుత్వం వుందా?"

"అసలు దూరం సుట్టరికమేదో వుందట. ఆయన పోయిన తర్వాత ఈవిణ్ణీ, సవితి కొడుకునీ ఆ రాఘవులే సేరదీసి యింట్లో పెట్టుకున్నాడంట. తర్వాత ఆస్తంతా కాజేసి బయటికి గెంటేసేడంట"

"మరి, ఈ కొడుకేం చదువుకోలేదా?"

"తండ్రి పోయాక మందెట్టి సంపేద్దారని సూసేరంట. బగమంతుడి దయవల్ల బతికేడు. కానండీ, పాతిగేల్లోచ్చేవరకూ మతిలేక యెర్రిబాగులాడిలా తిరిగేవొడంట. రాఘవులు పోయేక ఈ కరణంగారు ఈళ్లకింత అదరపు సూబెట్టి ఇంటికి పంపించేసేరు. ఏదో తిండిగింజలకీ, జరుగుబాటుకీ లోటు లేదు."

"మరిప్పుడు సవితి కొడుకుతోనే వుంటోందే!"

"రాఘవులు ఆస్తంతా కాజేసింతర్వాత బుద్ధొచ్చి పిచ్చి కుర్రోణ్ణి ఆదరించింది. తర్వాత మందూ, మాకూ ఇప్పించి దగ్గిరెట్టుకుంది. ఈయన దగ్గరుండకపోతే ఎక్కడుంటాదండీ! ఊళోవాళ్లు ఆవిణ్ణి చూస్తే స్నానం చేసి మరీ అన్నం ముడతారు"

మేమిలా మాట్లాడుకుంటూ వుండగా ఏదో లారీ స్పీడుగావొచ్చి వెనకనుంచి రాసుకుపోయింది. నేను ముందుకు పడ్డాను.

"నాన్నా... నాన్నా... నిద్దట్లో పలవరిస్తున్నావు" అంటూ మా అబ్బాయి లేపేడు. మైగాడ్! ఎంత తమాషా అయిన కల!

"ఏదో లారీ చప్పుడు..." అంటూనే వున్నాను. ఇంకా లారీ చప్పుడు స్పష్టంగా వినబడుతూంటే, అది కల కాదన్న భ్రమలో.

"అవును. మన యింటిముందే ఆగినట్టుంది" అన్నాడు మావాడు. బయట ఏదో మాట సందడి వినబడితే తలుపు తీసుకుని డాబా మీదనుంచి కిందకి చూశాను. కాళ్లు గిలగిలా తన్నుకు పడివున్న కుక్క కనబడింది.

"ఏం జరిగింది?" అడిగేను డ్రైవర్ని.

"ఏదో కుంటికుక్క బాబూ. లాభంలేదు. చచ్చిపోయింది" అన్నాడు డ్రైవరు పెదవి విరుస్తూ.

"నాన్నా అది 'రాజా', పక్కవీధిలో కుక్క" అన్నాడు మా అబ్బాయి జాలిగా.

ఇంతలో టెలిఫోన్ మోగితే వెళ్లి రిసీవర్ ఎత్తగానే హాస్పిటల్ నుంచి మా బావ గొంతు వినబడింది. "బావా కంగ్రాట్యులేషన్స్! ఆడపిల్ల పుట్టింది. అంటే యింట్లో లక్ష్మి వెలిసింది."
 

మరిన్ని కథలు
pity joginatham