Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
book review - navvutaddalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆర్టిఫిషియాలిటీ - భమిడిపాటి ఫణిబాబు

Artificiality

ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఈ ఆర్టిఫిషియాలిటీ యే.  కూరల మార్కెట్ కి వెళ్తే, కూరలూ, పళ్ళూ నవనవలాడుతూ కనిపిస్తాయి. అవేమీ స్వతసిధ్ధంగా  పండిన పళ్ళంటారా, కాదు.. మనల్నందరినీ మభ్యపెట్టి, లేనిదేదో ఉన్నట్టుగా కనిపింపచేయడానికి,  పచ్చి కాయలకే అవేవో కెమికల్స్ చేర్చి, మనల్ని నమ్మిస్తారు. చూడ్డానికి బాగున్నాయి కదా అని తీరా కొనుక్కుని ఇంటికి తీసికెళ్తే వాటి అసలు రంగు బయటపడుతూంటుంది. పైగా ఆ కెమికల్స్ ధర్మమా అని లేనిపోని రోగాలొకటీ. ఈ రోజుల్లో కల్తీ లేని సరుకు దొరకాలంటే ఎంతో పుణ్యం చేసికునుండాలి. ఇదివరకటి రోజుల్లో మరీ ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదు పరిస్థితి. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఏమిటంటే, ప్రతీదానికీ ‘స్పీడ్..’ . వ్యాపారం చేసేవాడు రాత్రికి రాత్రే తను పెట్టిన పెట్టుబడంతా సంపాదించేశాయాలని అనుకుంటాడు. సంపాదనతో ఊరుకుంటాడా పోనీ అనుకుంటే,కనీసం ఓ అయిదారు రెట్లయినా లాభం సంపాదించకపోతే వాడికి నిద్ర పట్టదాయె. మన రాజకీయనాయకులని చూడండి, వాళ్ళు ఎన్నికల్లో పెట్టిన ఖర్చంతా, ఒకటికి పదింతలు అధికారంలో ఉన్న అయిదేళ్ళలోనూ సంపాదించేయాలి.   ప్రతీవాడూ దేశసేవ చేసేవాడే.

అయినా మనం మాట్టాడుకునేది మన జీవితాల్లో నరనరాన్నా పాతుకుపోయిన కృత్రిమత్వాన్ని గురించి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ రంగమే. మనం నవ్వేనవ్వు గురించే చూద్దాం. మనసారా, నాభినుంచీ నవ్వి ఎన్నాళ్ళైందంటారు? అసలు అలాటి వాతావరణమే కనిపించదు. ఆరోగ్యానికి అవేవో “లాఫింగ్ క్లబ్బులు “ ట. ఎక్కడో విదేశాల్లో ఉన్నాయని మనవాళ్ళూ మొదలెట్టారు. ఏదో స్వతసిధ్ధంగా నవ్వితే ఏమో కానీ, ఇలా “బలవంతపు” నవ్వులతో ఆరోగ్యాలేం బాగుపడతాయీ, దవడలు నొప్పెట్టడం తప్ప? సాయంత్రం వేళల్లో చూస్తూంటాం, ఏ పార్కులోనో ఓ పదిపదిహేనుమంది చక్రాకారంలో నిలబడి.. “ హ..హా..హ్హా..” అంటూ పొలికేకలు పెడుతూంటారు. ఎందుకు అలా అరుస్తున్నారో ఛస్తే అర్ధం అవదు. ఒక్కోక్కప్పుడు వీళ్ళ హాహాకారాలకి , పార్కులకి వచ్చిన పసిపిల్లలు దడుసుకున్న సంఘటనలు కూడా కనిపిస్తూంటాయి. ఇంకో చిత్రం ఏమిటంటే ఈ లాఫింగ్ క్లబ్బు సభ్యుల విన్యాసాలు చూసి, మనసారా నవ్వుకున్నవాళ్ళ ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉండడం. ఏ కారణం లేకుండా ఉత్తిపుణ్యాన్న నవ్వడం నిషిధ్ధ కర్మల్లోకి వస్తుందని పురాణాల్లో చెప్పారంటారు,  పైగా అక్కడకి వచ్చేవారిలో చాలామంది వయసులో పెద్దవారే. ఇలా పబ్లిక్కుగానే నవ్వుకోనఖ్ఖర్లేదు, ఏదో ఓ ఆరోగ్యకరమైన జోక్ చదివికూడా హాయిగా నవ్వుకోవచ్చు.  అసలు మనిషికి ఓ sense of humour  అనేదే ఉండాలికానీ, జీవితంలో దేన్నైనా light గానే తీసికుంటాడు. ఊరికే అయినదానికీ, కానిదానికీ టెన్షన్లు పెట్టికుంటేనే కదా ఆరోగ్యాలు పాడయ్యేది . ఇంట్లో భార్యమీదా, పిల్లలమీదా కోపంతెచ్చుకుని, అల్లరి చేసేసి, ఆ లాఫింగ్ క్లబ్బుకి వెళ్ళి, లేని నవ్వు తెప్పించుకోడంకూడా  ఓ ఆర్టిఫిషియాలిటీ లోకే వస్తుందిగా.

  పెళ్ళిళ్ళల్లో వధూవరులతో వచ్చిన అతిథులందరూ ఫొటోలకి దిగుతారే అక్కడ అందరి మొహాలమీదా కనిపించే నవ్వుందే అది నూటికి నూరుపాళ్ళూ ఆర్టిఫిషియలే. ఈరోజుల్లో ఎక్కడ చూసినా క్యూ లొకటీ. బస్సుకి క్యూ, ట్రైన్ రిజర్వేషన్ కి క్యూ,బ్యాంకులకి వెళ్తే అక్కడ క్యూ, మాల్స్ లో బిల్లింగు దగ్గర క్యూ.. చివరకి ఆ క్యూ వ్యవహారం  రిసెప్షన్లలో పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురికీ బహుమతులు అందచేసి ఆ తరువాత, ఊరికి కల్యాణమండపం మరీ దూరంలో లేకపోతే పెళ్ళి ముహూర్తానికి కూడా హాజరయి,ఆ మూడుముళ్ళూ పడ్డతరువాత, అక్షితలు వేయడానికి కూడా క్యూయే. ఇంతంత హైరాణ పడి, ఫొటోకి దిగినప్పుడు మొహంమీద మనసారా నవ్వొచ్చిందంటే ఎవడైనా నమ్ముతాడంటారా? అలాగే ఆ వధూవరులూనూ, ఏదో ఓ గొడవ వదిలిపోతుందని మొహం మీద ఎక్కడలేని నవ్వూ పులుముకోవడం.

పెళ్ళిళ్లకిముందుకూడా ఓ తతంగం ఉందిగా, సంబంధాలు కుదుర్చుకోవడం--- ఇదివరకటి రోజుల్లోలాగ కాదుగా,  ఆ రోజుల్లో ఉండే “పెళ్ళిళ్ళ పేరయ్య” ల స్థానంలో వచ్చిన “ మ్యారేజ్ బ్యూరోలు” కదా,  తల్లితండ్రులు ఏదో రెండుమూడు బ్యూరోలవాళ్ళకి తమ కూతురుదో, కొడుకుదో ఓ ఫొటో ఇవ్వడం, ఆ ఫొటో చూసుకుని నచ్చితే ముందుకు  వెళ్ళడం. ఇంక ఆ ఫొటో అంటారా , స్పెషల్ గా పెళ్ళిచూపులకోసం తీసిన ఫొటో. ఏదో అమ్మాయిలకే ప్రత్యేకం అనుకోనఖ్ఖర్లేదు, అబ్బాయిలు కూడా అంతే. అక్కడితో ఆగుతుందా, పెళ్ళిరోజుకి ఊళ్ళో ఉండే ఏ ప్రసిధ్ధ బ్యూటీషియన్నో పిలిపించి, పెళ్ళికూతురితో సహా పెళ్ళికి వచ్చిన చుట్టాలక్కూడా face lift  చేయించుకోవడం. పోనీ అక్కడితో అయిందా అంటే, వంటి మీద ఉండే నగల్లో ఏది బంగారందో, ఏది గిల్టుదో తెలిసికోవడం , మనల్ని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడిక్కూడా తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే, కృత్రిమత్వం లేని సందర్భం కనిపించడం చాలా అరుదు.

అంతదాకాఎందుకూ, అకస్మాత్తుగా మార్కెట్ లో ధరలు ఆకాశానికి వెళ్ళిపోతాయి, అక్కడ కూడా artificial shortage సృష్టించడంవల్లనే. అసలు సిసలైన, కృత్రిమత్వం లేనిది అంటూ ఉందీ అంటే, పసిపిల్లల నవ్వొకటీ, అమ్మ   తన బిడ్డకు ఇచ్చే పాలు మాత్రమే. ప్రపంచంలో మిగిలినవి అన్నీ కూడా ఎప్పుడో అప్పుడు కల్తీకి గురి అయినవే అనడంలో సందేహం ఉంటుందనుకోను.

మరిన్ని శీర్షికలు
duradrustapu dongalu