Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugaadu - inter fail.. ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

ఇద్దరిలో ఒకడన్నాడు.

"ఏరా! నిజమేన? ఆటోలు తోలుకు బ్రతకండిరా అని ఈ ఆటోలు మీకిస్తే నాకే ఎగనామం పెట్టి మోసం చేద్దామనుకున్నార్రా?" కోపంగా  ఇద్దర్నీ  ఒకరి తర్వాత ఒకర్ని బలంగా తన్నాడు ఎమ్మెల్ల్యే అబద్ధాలరావు.

ఎమ్మెల్ల్యే అలా ఎగిరి తంతాడని ఊహించని ఆటో డ్రైవర్లు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఎగిరి పడ్డారు.

" ఈ ఆటోలు అమ్మేయడానికి వీళ్ళ దగ్గర్నుంచి జెరాక్స్ కాగితాలే కదరా!" ఆలోచిస్తూ అన్నాడు ఎమ్మెల్యే.

" ఇదిగోనయ్యా అక్కడ ఈళ్ళ దగ్గర లాక్కున్న కాగితాలు" అంటూ ఇద్దర్లో ఒకడు " సీ" బుక్స్ రికార్డు, ఇన్స్యూరెన్స్ పేపర్లు అన్నీ ఎమ్మెల్ల్యే చేతికిచ్చాడు.

అవి చూస్తూనే ఎమ్మెల్ల్యే అదిరిపడ్డాడు.

"అమ్మ నా కొడుకుల్లారా! దొంగ సీ బుక్ పుట్టిస్తార్రా? అరేయ్, ఈ నాకొడుకుల్ని బొక్కలిరగదియ్యండ్రా !" అంటూ పోర్తికోలో ఉన్న కుర్చీలో  కూర్చున్నాడు ఎమ్మెల్ల్యే మేడిపండు అబద్ధాలరావు.

అంతే!

ఎమ్మెల్ల్యే నోట ఆమాట రాగానే చుట్టూ రాక్షసుల్లా నిలబడ్డ రౌడీలు కబేళా మీద పడ్డ రాబందులకుమల్లే ఆ ఆటో డ్రైవర్లి మీదపడి ఇష్ట మొచ్చి నట్టు  కాళ్ళతో తంతూ, చేతుల్తో పిడిగుద్దులు గుద్దుతూ బంతాట ఆడుకున్నారు.

ఆటో డ్రైవర్లు ఇద్దరూ బట్టలు చిరిగి శరీరమంతా అక్కడక్కడా గీరుకుపోయి రక్తం చిందుతూ శవాల్లా పడిఉన్నారు.

"ఇక చాలు, వీళ్ళని ఆ బీచ్ దగ్గర పడేసి రండ్రా!" అన్నాడు గంభీరంగా ఎమ్మెల్ల్యే.

ఆ దృష్యం చూడలేక ఏకాంబర్ కి ముచ్చెమటలు పట్టాయి. గూండాయిజమంటే ఇలా ఉంటుందా అనుకున్నాడు. నూకరత్నమైతే ఆ దృశ్యం చూడలేక తల దించుకుని మౌనంగా ఉండిపోయింది.

ఆ ఆటో డ్రైవర్లిద్దర్నీ బీచ్ దగ్గర పడేసి వచ్చిన ఎమ్మెల్ల్యే గూండాలందరూ తిరిగి ఎవరి స్థానంలో వాళ్ళు మరబొమ్మల్లా వెళ్ళి నీబడి వేటకుక్కల్లా కాపలా కాస్తూ నిలబడ్డారు.

ఆటో వాళ్ళని లాకువచ్చిన ఇద్దరు రౌడీలు ఎమ్మెల్ల్యే దగ్గర చేతులు కట్టుకుని నిలబడి జరిగిందంతా చెప్తున్నారు." అయ్య! మన ఆటో డ్రైవర్ పి.యే. గారికి ఫోన్ చేసి చెప్పాడయ్యా!వీళ్ళిద్దరూ పది రోజులుగా ఇదే ప్లాన్ లో ఉన్నారట. ఈరోజు ఆటోలు తీసుకుని ఆర్టీవో ఆఫీసు కాడకు వెళ్ళడం చూసి పి.యే. గారికి ఫోన్ చేసాడట. ఆ వెంటనే మేమిద్దరం వెళ్ళాం. " ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు వినయంగా చెప్పారు.

"సరిసరి!ఆటో అద్దెలన్నీ రోజూ సక్రమంగా వసూలు చేస్తున్నారా?" గదమాయిస్తూ అడిగాడు ఎమ్మెల్యే." అయ్యో! రోజూ ఆటో బాడుగలన్నీ వసూలు చేసి పి.యే.గారికి అణా పైసలతో కట్టేస్తున్ నామయ్యా!" అన్నారిద్దరూ.

"సరే ఇక మీరు వెళ్ళండి" అన్నాడు ఎమ్మెల్ల్యే. వాళ్ళిద్దరూ తమతం స్థానాల్లోకి వెళ్ళి నిలబడ్డారు.ఎమ్మెల్ల్యే పోర్టికోలోనుంచి పి.ఏ. గదిలోకి వచ్చాడు.

"పి.యే గారూ ఇలాంటి దొంగవెధవలకి ఎలా అయ్యా ఆటోలు అద్దెకిచ్చావ్? నీకు బుద్ధుందా??" కోపంగా పి.యే.మీద విరుచుకు పడ్డాడు." లేదండయ్యా! మన ఆటో డ్రైవర్లలోనే ఎవరో వీళ్ళని తీసుకువచ్చి పని లేదు. ఆటో ఇస్తేతోలుకు బ్రతుకుతాడంటే కొత్త ఆటోలు తెప్పిచి ఇచ్చానయ్యా" నమ్రతగా అన్నాడు పి.యే.

ఎమ్మెల్ల్యే గదిలోకి రావడంతోటే ఏకాంబర్,నూకరత్నం గబాలున లేచి నిలబడ్డారు."మీరు అందరి దగ్గరా కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటే ఎంత డబ్బు కట్టాలో లెక్కేసి చెప్పండి మా పి.యే ఇస్తాడు తీసుకోండి.! రశీదులు రేపు సాయంత్రానికల్లా మా పి.యే చేతికి అప్పగించండి." అన్నాడు ఎమ్మెల్ల్యే.

" అలాగే సార్!" నమ్రతగా అన్నాడు ఏకాంబర్.

"పి.యే.గారూ ఇందాకల వచ్చాడే, అతనిచ్చిన డబ్బు ఆ సూట్ కేస్ లో ఉంది కదా! వీళ్ళని ఎంతో అడిగి ఇచ్చెయ్యండి! ఏజెంట్ గారితో వచ్చిన అమ్మాయికి ఆ సూట్ కేస్ బహుమతి గా ఇచ్చెయ్యండి." అంటూ ఏకాంబర్ కేసి, నూకరత్నం కేసి నవ్వుతూ చూసాడు ఎమ్మెల్ల్యే."

థేంక్సండీ!" వినయంగా అంది నూకరత్నం.

" ఉదయం నుండీ ఈయనతో పడిగాపులు పడి ఉన్నారు కదా! అందుకు..ఆ! ఏకాంబర్ గారూ రేపు రశీదులన్నీ తెచ్చి ఇవ్వడం మర్చిపోకండి. మీ పనంతా ఈరోజే కంప్లీట్ చేసుకోండి. ఆ రశీదులు చాలా ముఖ్యం. ఇంకం టాక్సు కోసం మా ఆడిటర్ గారు తెమ్మన్నారు. ఇవి కడితే ఏదో కొంత ట్యాక్స్ మిగులుద్దటటకదా  మీకు లాభం, మాకు లాభం  అందుకే మీరు అడగ్గానే మా పి.యే.గారుచెప్పింది గుర్తొచ్చి ఈల్లందరి పేర పాలసీలు కడుతున్నాను. నేను వెళ్ళాలి. పని కానివ్వండి." అంటూ ఎమ్మెల్ల్యే లోపలకు వెళ్ళిపోయారు.

బయట ఉన్న ఇద్దర్నీ పిలిచి సంతకాలు తీసుకున్నాడు ఏకాంబర్. ఇరవై మందికి నలభై పాలసీ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నాడు. వాటికి కావల్సినపేపర్లన్నీ తీసుకున్నాడు. బ్యాంకు పాస్ బుక్స్, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, అన్నీ తీసుకుని ఎమ్మెల్ల్యే గారింటికి కొద్ది దూరంలో ఉన్న జిరాక్స్ సెంటర్ కి వెళ్ళాడు ఏకాంబర్.

క్షణాల్లో జెరాక్స్ తీయించుకుని వచ్చేసాడు. ఎందుకైనా మంచిదని అన్ని కాపీలు నాలుగేసి జెరాక్స్ తీయించి తన దగ్గర భద్రపర్చుకున్నాడు.
ఇంటి దగ్గర ఉండిపోయిన ఇద్దరి గురించి పి.యే. ని అడిగాడు ఏకాంబర్.

" సార్ మిగతా ఇద్దరి సంగతి?"

" మీరు వెళ్తార? మా వాడ్ని ఒకడ్ని మీతో పంపిస్తాను. వీళ్ళందరి ఇళ్ళు ఒకే దగ్గర. కంచరపాలేం హైవే ప్రక్కన " వాంబే గృహాలు" ఉన్నాయి చూశారా, అందులోనే ఉంటున్నారు" చెప్పాడు పి.యే.

" ఓ, తెలుసు సార్!" ఆనందంగా అన్నాడు ఏకాంబర్." వాళ్ళిద్దరి దగ్గరా సంతకాలు తీసుకోండి. ఈ ఇరవైమందికి ఏడాదికి ఎంత ప్రీమియం కట్టాలో చెప్తే,  ఆ డబ్బు ఆ కొత్త సూట్ కేస్ తో సహా ఇచ్చేస్తాను " నవ్వుతూ అన్నాడు పి.యే.

" సుమారు పన్నెండు లక్షల వరకూ అవుతుంది సార్.! అన్ని రైడ్ లు జత చేసి కాలిక్యులేట్ చేయ్యాలి. మా డెవలప్ మెంట్ ఆఫీసరు  గారుంటే పని క్షణాల్లో అయ్యేది" నీళ్ళు నములుతూ అన్నాడు ఏకాంబర్.

ఓ పని చెయ్యండి సార్. పన్నెండు లక్షలూ ఇచ్చేస్తాను. మిగిలితే రశీదులతోబాటు తెచ్చివ్వండి. ఏమైనా కట్టాల్సివస్తే నాకు ఫోన్ చెయ్యండి. మావాడితో మీకు ఆ డబ్బు పంపిస్తాను." చెప్పాడు పి.యే.

" మీఇష్టం సార్. సార్, మరో విషయం. మన వాళ్ళందరికీ ఒకే ముద్దగా పది లక్షల రూపాయల పాలసీ కడితే మెడికల్ ప్రాబ్లం వస్తుందని రెండుగా చీల్చి అయిదేసి లక్షల చొప్పున రెండు పాలసీలు రాసాను పర్వాలేదు కదా" భయం భయం గా అడిగాడు ఏకాంబర్, పి.యే. ని."
గొప్పగా చెప్పారు. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఎన్ని రాళ్ళైతే ఏం సార్! ఎమ్మెల్ల్యే గారు చెప్పినట్టు పదిలక్షలయింది కదా!" అన్నాడు పి.యే. పకపకా నవ్వుతూ.

" థేంక్యూ సార్! మీరేమంటారోనని భయపడ్డాను." అన్నాడు ఏకాంబర్.

" ఉండండి! లోపల ఉన్న సూట్ కేస్ తెస్తాను" అంటూ వెళ్ళాడు పి.యే.

ఆనందంగా నూకరత్నం కేసి చూసాడు ఏకాంబర్.

" నిజంగా మెడికల్ ప్రాబ్లం అవుతుందా?" గుసగుసగా అంది నూకరత్నం.

"పది లక్షలు కాదు, పాతిక లక్షలున్నా ఆ ప్రాబ్లం రాదు. వీళ్ళంతా ముప్పై ఏళ్ళలోపు వాళ్ళే కదా! చిన్న అబద్ధం....తప్పదు కదా!" అన్నాడు ఏకాంబర్.

లోపలినుండి సూట్ కేస్ తో డబ్బు తెచ్చి ఏకాంబర్ ముందు పెట్టాడు పి.యే.

టీ పాయ్ మీద సూట్ కేస్ తెరిచి  లోపల ఉన్న నోట్ల కట్టలన్నీ ఏకాంబర్ కి చూపించి పన్నెండు లక్షలు లెక్క అప్పజెప్పాడు పి.యే." ఇక మేము వెళ్తాము సార్. మీవాడ్ని పంపిస్తే దార్లో మిగిలిన ఇద్దరి దగ్గరా సంతకాలు తీసుకుని ఆఫీసుకు వెళ్ళిపోతాం" చెప్పాడు ఏకాంబర్.  "అలాగే!" అంటూ బయట నిలబడ్డ ఒక అనుచరుడ్ని పిలిచి ఏకాంబర్ వాళ్ళతో పంపించాడు పి.యే.

" ఇదిగో, నా బైక్ మీద వెళ్ళి వీళ్ళకి మనవాళ్ళ ఇల్లు చూపించి వెంటనే వచ్చేయ్, అదును దొరికింది కదాని ఇంట్లో కూర్చోక" అంటూ మిగిలిన ఇద్దరి పేర్లూ చెప్పాడు పి.యే.

ఆ అనుచరుడు బైక్ మీద ముందు వెళ్తూంటే అతన్ని ఫాలో అయ్యారు ఏకాంబర్, నూకరత్నం లు. ఎమ్మెల్ల్యే ఇంటి దగ్గర బైక్ స్టార్ట్ చేసే ముందే డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల రాజేంద్రకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు ఏకాంబర్ ఆనందంగా. ఏకాంబర్ చెప్పింది వింటూనే ఎగిరి గంతేసి ' క్షణాల్లో గోపాలపట్నంలో ఉంటానూ అంటూ ఫోన్ పెట్టేసాడు రాజనాల  రాత్రి పది గంటలకి ఇల్లు చేరుకున్నాడు ఏకాంబర్.

ఇంట్లో అందరూ టీవీ ముందు కూర్చుని ఉన్నారు. వస్తూనే ఆకలిగా ఉందని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఏకాంబర్." ఏరా! నీ టార్గెట్ ఎంత వరకూ వచ్చింది?"  టీవీ ముందునుండి లేస్తూ అడిగింది ఏకాంబర్ తల్లి పర్వతాలు.

" అయిపోయిందమ్మా! ఒక్కరోజులో అద్భుతం జరిగినట్టు జరిగింది " ఆనందంగా అన్నాడు ఏకాంబర్."

నమ్మకంతో పనిచేస్తే ఏ పనన్నా తప్పకుండా సక్సెస్ అవుతుందిరా !" అంటూ తండ్రి పీతాంబర, కూడా టీవీ ముందు నుండి కొడుకు దగ్గరకు వస్తూ అన్నాడు.

" మీ ముగ్గురూ ఇంతవరకూ పడుకోలేదేం? ఎప్పుడూ నేను వచ్చే సరికి గాఢ నిద్రలో ఉండేవారు" అన్నాడు ఏకాంబర్.

"ఉదయం  నువ్వు ఆందోళనగా వెళ్ళడం చూసాం కదరా  టైం కూడా లేదు, టార్గెట్ కంప్లీట్ కాలేదన్నావు కదా! ఏం చేస్తున్నావో?!" ఎలా నీటార్గెట్ కంప్లీట్ అవుతుందోనని మాకూ ఆందోళన కలిగిందిరా." అంది తల్లి.

" నిజమేనమ్మా! ఈసారి నేను వెనకబడిపోతానేమోననే అనుకున్నాను. కానీ రత్నం ఉంది కదా! మంచి ఐడియా ఇచ్చింది. అంతే. నా కళ్ళను నేనే నమ్మలేనంతగా పాలసీలు దొరికాయి" సంతోషంగా అన్నాడు ఏకాంబర్.

" అదే అనుకున్నాన్రా, మన షాపుకొస్తావని ఎదురుచూసాను. నువ్వు రాకపోయేసరికి ఏదో పనిలో ఉన్నావనుకున్నాను. నేనూ నాకు బాగా తెలిసిన కష్టమర్లని   పాలసీ గురించి అడిగాను. కడతాను, మీ అబ్బాయిని నా దగ్గరకు పంపమన్నార్రా" కొడుక్కి ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటూ అన్నాడు తండ్రి పీతాంబరం.

" మీరూ ఇంకా భోజనం చెయ్యలేదా ?" తండ్రి తన ఎదురుగా కూర్చోవడంతో ఆశ్చర్యంగా అడిగాడు ఏకాంబర్." లేదురా, నువ్వు వస్తే కలిసి భోంచేస్తానని టీవీ ముందు కూర్చున్నారు. " తల్లి పర్వతాలు అంది.

ఎప్పుడూ లేంది తండ్రి తనకోసం ఆలోచించడం ఏకాంబరానికి ఆనందం కలిగించింది. తను వచ్చేవరకూ భోజనం కూడా చెయ్యకుండా తండ్రి ఎదురు చూస్తున్నాడని   తల్లి చెప్పగానే మనసంతా ఉప్పొంగిపోయింది. అదీగాకుండా షాపుకొచ్చిన కష్టమర్స్ ని తన కోసం, తన టార్గెట్ కంప్లీట్ చేయడం కోసం తండ్రి నోరు విడిచి పాలసీ అడిగాననేసరికి ఆనందం పట్టలేకపోయాడు.

" థేంక్స్ నాన్నా! నాకోసం పాలసీ కూడా అడిగారు." అంటూండగానే ఏకాంబర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. గబుక్కున నీళ్ళు తుడుచికున్నాడు.

" మేము కాకపోతే నీకోసం ఇంకెవరు ఆలోచిస్తార్రా? భోజనం చెయ్యి నాన్నా!"కొడుకు తల ప్రేమగా నిమురుతూ అంది తల్లి పర్వతాలు." నువ్వు బాగుంటే మేము బావున్నట్టే కదరా! నీ ఆనందమే మా ఆనందం. ఉదయం నువ్వంత ఆందోళనగా కనిపించడం నేనెప్పుడూ చూడలేదు. షాపులో ఉన్నానేగానీ నీగురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఒక కష్టమర్ వచ్చాడు. అడిగాను. అంతే!  ఇందులో గొప్పతనం ఏముంది? పర్వతాలూ..ఆ చారు ఇలా అందుకో!" కంచంలో పప్పు అన్నం కలుపుకుంటూ అన్నాడు పీతాంబరం.

" మీ తండ్రీ కొడుకుల ముచ్చట్లు ఆపి ముందు భోజనాలు చెయ్యండి" ముసిముసిగా నవ్వుతూ అంది తల్లి పర్వతాలు.

" అమ్మా నాకు నిద్రొస్తోంది. టీవీ కట్టేస్తున్నాను. " అంటూ అంతవరకూ టీవీ ముందు కూర్చున్న మంగ టీవీ కట్టేసి వెళ్ళిపోయింది." అలాగే! వెనక స్విచ్ కూడా ఆపేసి వెళ్ళు" డైనింగ్ టేబుల్ దగ్గర నుండే అరిచింది పర్వతాలు." అవునంట! మీరు షాపు దగ్గరకు రమ్మన్నారట కదా,  ఎందుకు నాన్న?" భోజనం చేస్తూ అడిగాడు ఏకాంబర్.

"అదేరా! మన ఇంటి గురించి" అన్నాడు పీతాంబర్.

" అదా, మనం అన్నీ సబ్ మిట్ చేసాక రెండు మూడు నెలలకు మా హెడ్డాఫీసు నుండి ఆర్డర్ వస్తుందట నాన్నా! ఈలోగా మనం ఇల్లు పడగొట్టి చదును చేయించాలి." అన్నాడు ఏకాంబర్.

" మీ ఇద్దరూ ఇంటి గురించే ఆలోచిస్తున్నారు గానీ ఇంట్లో ఆడ పిల్ల ఉంది, దాన్నో ఇంటిదాన్ని చెయ్యాలని చూడరా?" కోపంగా అంది పర్వతాలు. " సంబంధాలు చూస్తున్నాం కదా కుదరనీ" అన్నాడు పీతాంబరం.

" మంచి సంబంధం చూడండి నాన్న! కట్న కానుకలకి వెనుకాడకండి! ఇల్లు కట్టడం ఆపేసైనా ముందు చెల్లెలి పెళ్ళి ఘనంగా చేద్దాం" అన్నాడు ఏకాంబర్.

" మానాయనే! చూడండి..చిన్నోడికున్నంత బాధ్యత కూడా మీకు లేదు" మొగుడి మీద విరుచుకుపడుతూ అంది పర్వతాలు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్