Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మొదటి భాగం

First part

కానీ అది వాస్తవం. అందుకే గత వైభవ ఘనకీర్తిని నెమరు వేసుకుంటూ నేడు ఇలా చిన్నగా ఒదిగి పోయిందా అనిపించే కృష్ణా నదీ తీర రేవు పట్టణం ఈ అమరావతి. అమరనాధుడు కొలువై ఉన్న అమరాధామం.

ఉదయం పదకొండు గంటల సమయంలో గుంటూరు నుంచి వచ్చిన ఎర్రబస్సు వూరి మొదటే ఉన్న ఆర్.టి.సి. బస్టాండ్ బయటే రొడ్డు మీద ఆగింది.

" బస్టాండ్ లో దిగేవాళ్ళుంటే దిగిపొండి " అంటూ అరిచాడు కండక్టరు. చాలా మంది అక్కడే దిగిపోతున్నారు.

అటు తూళ్ళూరు వైపు వెళ్ళాలన్నా, ఇటు తాళ్ళూరు, సత్తెనపల్లి వైపు వెళ్ళాలన్నా ఇక్కడ బస్సు మారాలి. పక్కన బస్టాండులో చాలా మంది ప్రయాణీకులు బస్సుల రాకకోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు.

"అయ్యా కండక్టరు గారూ, ఈ బస్సు గుడి వరకూ వెళుతోందా,ఇక్కడే ఆగిపోతోందా?" అంటూ ఎవరో ఆడిగారు.

కండక్టరు  తల తిప్పి అటు చూశాడు. అలా ప్రశ్నించిన పెద్దమనిషి రెండు సీట్ల అవతల కూర్చున్నాడు. ఏభై సంవత్సరాలు దాటిన బ్రహ్మణోత్తముడు. నిండైన విగ్రహం, నుదుట విభూతి రేఖలు, చ్హాతీకి అడ్డంగా జంధ్యం పోగులు, పట్టుపంచి, భుజాన ఉత్తరీయం, షర్టు వేసుకోలేదు.భుజాన ఒక బర్మా సంచి. చేతిలో గుడ్డ సంచి, చంకన గొడుగు. చూడగానే నమస్కరించాలనిపించే వేద పండితునిలా ఉన్నాడు.  " మీరు గుడిదాక టిక్కెట్ తీసుకున్నారు గదా, అడిగాడు కండక్టరు. "అవున్నయానా" చెప్పాడాయన. "అయితే కూర్చోండి పంతులుగారూ. గుడికెళ్ళి వచ్చాకే బస్సు బస్టాండ్లోకి వేళుతుంది." అన్నాడు. అప్పటికి అక్కడ దిగాల్సినవాళ్ళు దిగిపోయారు. డోర్ మూసి "రైట్ రైట్ " అనరిచాడు కండక్టరు.

కాస్తంత ముందుకెళ్ళి డౌన్ లో దిగానే గీత గీచినట్టున్న రోడ్డు చివర అమరలింగేష్వరుని ఆలయగోపురం దర్శనమిచ్చింది. భక్తితో నమస్కరించుకున్నారు పంతులుగారు. చూస్తుండగానే బస్సు రాజగోపురం వద్దకు చేరుకుని రివర్స్ తీసుకుని ఆగింది. పంతులుగారితోపాటు మిగిలిన ప్రయాణీకులంతా బస్ దిగిపోయారు. అక్కడ వెయిట్ చేస్తున్న ప్రయాణీకులు కొందర్ని ఎక్కించుకుని తనదారిన వెళ్ళిపోయింది బస్సు.బస్సు దిగిన వారంతా ఈ ఊరివాళ్ళే కాబట్టి తలోపక్క చెదిరిపోయారు. పంతులుగారు మాత్రం దిక్కులు చూస్తూ అక్కడే నిలబడ్డారు.

అసలే వేసవికాలమెండలు మాడిపోతున్నాయి. నది దాటడం కోసం కొందరు గుడి పక్కనే ఉన్న రేవు లోకి పోతున్నారు. నదిమీద ఎక్కడనుంచో లాంచీ ఇంజను శబ్దం వినిపిస్తోంది. చంకలో గొడుగు తీసి ఎండ మీద పడకుండా గొడుగు వేసుకొని చుట్టూ చూసాడాయన.కిందటిసారి వచ్చినప్పటికీ ఇప్పటికీ గుడి పరిసరాల్లో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. దలైలామా వచ్చి బౌద్ధ మహాసభలు నిర్వహించాక అమరావతి లోక ప్రసిద్ధమైంది. యాత్రికుల సందడి కనిపిస్తోంది. కాని తనకి కావలసిన మనిషి జాడమాత్రం లేదు. ఎదురుగా సోడా బంకు వద్దకు వెళ్ళి సోడా తాగాడు.

"అయ్యా ఇక్కడ శంకుశాస్త్రి గారి ఇల్లెక్కడో కాస్త చెబుతారా?" సోడా డబ్బులిస్తూ బంకులోని వ్యక్తిని అడిగాడు. "ఏమిటి పంతులుగారూ, ఊరికి కొత్తా...?"పలకరించాడు అతను.

"అవునయ్యా , నన్ను రామశాస్త్రులు అంటారు. మాది ఏలూరు పట్టణం. శంకుశాస్త్రి మా మేనల్లుడు."

"నాకిక్కడ చాలామంది శాస్త్రులు తెలుసుకాని, శంకుశాస్త్రి అని ఎవరూ లేరండి. ఆ పేరెప్పుడూ వినలేదు. బహుశ ధరణికోటలో వున్నారేమో అటు వెళ్ళి చూడండి.

"ఆ వూరు ఇక్కడికి ఎంత దూరం నాయనా?"

"అయ్యో సామీ..అమరావతి ఇంతకు ముందెన్నడూ రాలేదా మీరు?"

"ఎప్పుడో మహాశివరాత్రికి వచ్చానయ్యా. దర్శనం చేసుకొని వెళ్ళిపోయాను. వూరు పెద్దగా తెలీదు. మా శంకుశాస్త్రి సంవత్సరం క్రితం ఇక్కడ ఏదో గుడిలో అర్చకుడిగా వచ్చి ఉన్నాడు. పూజలు, వ్రతాలు చేయించడంలో దిట్ట. గుడిదగ్గర ఎవరినడిగినా చెప్తారన్నాడు."

"ఏ గుడి దగ్గర?"

"అదే మర్చిపోయాను. ఇంతకీ ధరణికోట అన్నావ్, ఎక్కడ వుంది?"

"భలేవారండీ. ఎక్కడో ఏమిటీ ? అదీ ఇక్కడే ఉంది. ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాద్ లు ఎలా జంట నగరాలో, అలాగే ఇక్కడ అమరావతి, ధరణికోటలు రెండూ జంట ఊళ్ళన్న మాట. అలా మల్లాది రోడ్ లో కొంత దూరం వెళితే అమరావతి పోలిస్ స్టేషన్ కనపడుతుంది. ఆ స్టేషన్ ఇవతలి వరకూ అమరావతి. దాటితే ధరణికోట...."

"అలాగా...ఇంతకీ మాశంకుశాస్త్రి..."

" ఓ పని చేయండి. మీరు. గోపురం ముందు రోడ్లో కొంచెం డౌన్లోకి వెళ్ళండి. అక్కడ సాయిబాబా గుడి వస్తుంది. గుడి పక్కనే ధ్యానముద్రలో కూర్చున్న ఆంజనేయస్వామి  ఎత్తయిన విగ్రహం చూడదగింది. అక్కడ పూజారుంటాడు. ఆయన్ని అడిగితే మీ శంకుశాస్త్రి అడ్రస్ దొరుకుతుంది." అన్నాడు బంకులోని వ్యక్తి.

"మంచి మాట చెప్పావు నాయనా. నీకు శుభం కలుగుతుంది." అంటూ సాయిబాబా గుడికి బయలుదేరాడు రామశాస్త్రులు. నాలుగడుగులు వేశాడో లేదో...  ఇంతలో స్కూటర్ శబ్దం వినిపించింది.

ఆ వెనకే ' మామాయ్యా' అంటూ పిలుపు కూడా వినిపించింది. తిరిగి చూసిన రామశత్రులు గారికి మేనల్లుడు శంకుశాస్త్రి స్కూటర్ మీద సమీపిస్తూ కనిపించాడు.

"భలే వాడివి మామయ్యా. నీకోసం నేను అక్కడ బస్టాండులో ఎదురు చూస్తున్నాను. నువ్విక్కడ బస్ దిగావా..? ఆ బస్ లో గోపురం దగ్గరకు వచ్చేసుంటావని ఇటు రావడం మంచిదయింది" అన్నాడు పక్కన స్కూటర్ ఆపుతూ శంకుశాస్త్రి.

సమయానికి మేనల్లుడ్ని  చూడగానే రామశాస్త్రులు ముఖం లో ఆనందం తొంగి చూసింది. "బాగుంది శంకు. నువ్వు అక్కడ ఎదురు చూస్తుంటావని కలగన్నానా? సరాసరి గుడి వద్దకు వచ్చేశాను. అవునూ, నీపేరు అడిగితే తెలీదంటాడేమిట్రా ఆ సోడా బంకు వాడు?" అండిగాడు.

"శంకు శాస్త్రి అంటే మరీ పాతకాలం పేరులా ఉందని, నేనే కొంచుం మార్చి యస్.శాస్త్రి అని మార్చుకున్నాను."

"ఏడ్చినట్టుంది. వెధవ మార్పు నువ్వూనూ.. పాతకాలం అంటే అంత చులకన పనికిరాదురా. లక్షణంగా శంకుశాస్త్రి అంటేనే బాగుంటుంది."

"మామయ్యా కాలంతో పాటు మనమూ మారాలి..."

"నోర్ముయ్,  కాలం మారలేదు. మనమే మారిపోతున్నాం..."

"ప్లీజ్ మామయ్యా క్లాస్ తీసుకోవద్దు. భోజనం టైమవుతోంది. స్కూటర్ ఎక్కు ఇంటికి వెళదాం."

పెద్దగా నిట్టూర్చి తన ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ శంకుశాస్త్రి వెనకాల కూర్చున్నాడు రామశాస్త్రులు. స్కూటర్ని ఇంటి దిశగా పోనిచ్చాడు శంకుశాస్త్రి.

"ఇప్పుదు చెప్పరా అబ్బాయి.. రేపు జరగబోయే సీతారాముల కళ్యాణమహోత్సవం రామనవమికి నన్ను ప్రత్యేకించి రమ్మని ఫోన్ చేశావ్. ఇంతకీ చూస్తే వూళ్ళో రామచంద్రుల వారి గుడి ఎక్కడుందో కనబడలేదు." బ్రేవ్ మని త్రేంచి వీధి అరుగు మీదకు వస్తూ మేనల్లుడు శంకుశాస్త్రిని అడిగాడు రామశాస్త్రులు.

అంతక్రితం మేనమామ, మేనళ్ళుల్లు ఇద్దరూ  భోజనాలు ముగించారు. భార్య, ఇద్దరు పిల్లలతో అమరావతిలో అర్చకుడిగా వుంటున్న శంకుశాస్త్రికి మంచి పేరు వుంది. భార్య గుణవతి, అన్యోన్య దాంపత్యం. రాక రాక వచ్చిన రామశస్త్రుల్ని ఎంతో మర్యాదగా చూసుకున్నారు. అరుగు మీద వేసిన చాప మీద దిళ్ళను ఆనుకుని విశ్రాంతిగా కూర్చున్నారు ఇద్దరూ.

"మామయ్యా!నిన్ను పిలిపించింది ఈ ఊరి ఉత్సవాలకు కాదు. రేపు ఉదయమే నది దాటి, ఆవలి తీరంలో ఉన్న మున్నలూరు అనే గ్రామం వెళ్ళాలి మనం. అక్కడ చక్కని రామాలయం ఉంది" వక్క పలుకు నోట్లో వేసుకుంటూ చెప్పాడు శంకు శాస్త్రి.

ఆశ్చర్యంగా చూశాడు రామశాస్త్రులు, అంత క్రితమే ముద్దపప్పు, చారెడు నేతితో బాటుగా గుంటూరు జిల్లా స్పెషల్ పండుమిరప పచ్చడితో కలిపి తిన్న భోజనం మరోసారి త్రేంపు రప్పించిందాయనకు. "మున్నలూరా...ఎక్కడుందా ఊరు?" త్రేంచిన తరువాత అడిగాడు.

"ఇక్కడే మామయ్యా ! అమరావతికి తిన్నగా అవతలే ఉంది. ఊరికి కుడి పక్కగా కృష్ణానది వుండగా, ఎగువనుంచి దక్షిణంగా వస్తున్న మున్నేరు అనే ఉపనది అక్కడ కృష్ణలో కలుస్తుంది. ఈ రెండింటి సంగమ ప్రదేశం మూల మీదనే ఉందీ వూరు. కొన్ని దశాబ్దాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారు కట్టించిన సంగమేశ్వరాలాయం మున్నలూరు ఒడ్డుకే ఉంటే, ఇటు అమరావతి ఒడ్డున ఆమరలింగేశ్వరుని ఆలయం ఉందన్న మాట !

మున్నలూరు చుట్టూ సుమారు రెండువేల ఎకరాల సుక్షేత్రమైన వరి పండే మాగాణి భూములున్నాయి. అప్పట్లో డా. కె.ఎల్. రావు గారు కట్టించిన పంపింగ్ స్కీం మూలంగా ప్రధానంగా మున్నలూరుతోపాటు మోగలూరు, కునికినపాడు మొదలైన గ్రామాలకు చెందిన పొలాలు సాగవుతున్నాయి.

నువ్వు చెబుతుంటావే, మన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పల్లెటూళ్ళలో కూడ పట్నం వాసన వేస్తోంది. చూద్దామంటే దుక్కిటెద్దులు కంపించటం లేదు. మన గ్రామీణ కళలు అడుగంటిపోతున్నాయి అని. అవి నువ్వు చూడాలంటే మున్నలూరు వెళ్ళాల్సిందే. మన గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో చెక్కుచెదరలేదు." అంటూ వివరించాడు శంకుశాస్త్రి.

ఈ విషయాలు రామశాస్త్రుల్ని నిజంగానే ఆశ్చర్యపరిచాయి. "నువ్వు చెప్పిందే నిజమైతే, ఈ ఊరు చూడాల్సిందేరా అల్లుడూ. కాని దయ, జాలి, దానగుణం లాంటి సుగుణాలు లేకపోతే ఏ వూరైనా నిరర్దకమే. మరి నువ్వు చెప్పిన ఊళ్ళో..."

"మంచివాళ్ళున్న చోట దేవతల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మామయ్యా. అందుకే ఆయా వూళ్ళు సుభిక్షంగా ఉంటాయి. మున్నలూరు వాసులు చాలా మంచి వారు. దాతృత్వం గలవారు. ముఖ్యంగా ఆ ఊళ్ళో తలమానికంగా చెప్పుకోదగిన వారు నిమ్మగడ్డ అన్నపూర్ణేశ్వరి దేవి గారు. ఆవిడ నిజంగా కాశీ అన్నపూర్ణ అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ వారిది ఉమ్మడి కుటుంబం అంటే నమ్ముతావా?"

"నమ్మను. అస్సలు నమ్మను..పల్లె పట్టులో కూడా ఇలా పెళ్ళవగానే అలా వేరుపడిపోతున్న కొడుకులున్న ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలా...? ఆ వైభవం నా చిన్నప్పుడు చూసా.. అంటే కాలంతోపాటు మనుషులూ వేగంగా మారిపోతున్నరు. స్వార్థం పెరిగిపోతోంది. డబ్బుముందు అత్మీయతలు, అనుబంధాలూ, తీసి రాజంటున్నాయి. చిన్నకుటుంబం అనే కొత్త రోజులు వచ్చాయి. ఎక్కడో నూటికో, కోటికో ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఉండవచ్చు కాని, మన రాష్ట్రంలో   ఉన్నాయంటే నమ్మకం లేదు."

"మున్నలూరు వస్తే నమ్మి తీరతావ్ మామయ్యా! రేపు నువ్వే చూస్తావ్ గా.!"

"నువ్వు చెప్పిందే నిజమైతే, ఆ కుటుంబాన్ని తప్పకుండా చూడాలిరా. ఇంతకీ ఆ అన్నపూర్ణేశ్వరమ్మ గారి వివరాలేమిటి?"

"సీతారాములని, రాధాకృష్ణులనీ, శివపార్వతులనీ ఇలా భార్యాభర్తల పేర్లు కలవడం చాలా అరుదైన విషయం కానీ, కాశీ విశ్వేశ్వరయ్య అన్నపూర్ణేశ్వమ్మ జంట పేర్లు కూడా చక్కగా కలిసిన దంపతులు. వారిది మున్నలూరు. వ్యవసాయ కుటుంబం. ఉన్న పదెకరాలు పండించుకుంటూ అన్యోన్యంగా ఉండేవారు. ఈ దంపతులకి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు. రెండో కొడుకు గోపాల్. మూడోది కూతురు. ఆవిడ పేరు భ్రమరాంబ. దురదృష్టం ఏమంటే, పిల్లలు చిన్నవాళ్ళుగా ఉండగానే పాపం అన్నపూర్ణేశ్వరి దేవి గారికి భర్త వియోగం సంభవించింది. కాశీ విశ్వేశ్వరయ్య గారు కాలం చేశారు. అయినా ఆమె అధైర్యపడక పిల్లలకోసం గుండె నిబ్బరం చేసుకొని జీవన పోరటం సాగించారు. స్వయంగా తమ వ్యవసాయాన్ని చూసుకుంటూ, పాడి పశువుల్ని అభివృద్ధి చేసుకుని, రాత్రి పగలు కష్టపడి, పిల్లల్ని పెద్దవాళ్ళను చేసారు. పెద్ద చదువులు చదివించారు. పదెకరాల మాగాణికి పాతిక ఎకరాలు చేశారు. ఏభై పాడి పశువులు, పదిమంది జీతగాళ్ళు. వూళ్ళో పెద్దరికం ఆవిడదే. ఆవిడ మాట కాస్త కటువుగా ఉంటుందిగానీ మనసు వెన్న. నీతి నిజాయితీలకు పెద్దపీట వేస్తుంది. ఖచ్చితంగా మాట్లాడుతుంది కాబట్టి కొందరు ఆవిడను గయ్యాళి అని ఆడిపోసుకుంటారు. ఆ గయ్యాళితనం లోనూ ఎంతో మంచితనం ఉంది. ఆకలి అని ఎవరు వచ్చినా అన్నం పెడుతుంది. ముఖ్యంగా మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు అంటె ఆవిడకు ఎంతో ఇష్టం. అంతరించిపోతున్న మన గ్రామీణ కళల గురించి చెప్పి బాధ పడుతుంది. " అంటూ చెప్పడం ఆపి, నాలుగు వక్క పలుకులు తిరిగి నోట్లో వేసుకున్నాడు శంకుశాస్త్రి.

చాలా ఆసక్తిగా వింటున్నారు రామశాస్త్రులు గారు.

"నువ్వు ఇంతగా చెప్తుంటే ఆ మహాతల్లిని ఓసారి చూడాలని వుందిరా అబ్బాయ్..ఇంతేన ఇంకేమైనా విశేషాలున్నాయా??" అంటూ కుతూహలంగా అడిగాడు.

"అప్పుడేన..ఇంకా చాలా ఉన్నాయి మామయ్యా !" అంటూ తిరిగి చెప్పడం ఆరంభించాడు శంకుశాస్త్రి.

( ...తరువాయి భాగం వచ్చేవారం)

మరిన్ని సీరియల్స్
First part