Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మనసా కవ్వించకే నన్నిలా

Manasa Kavvinchake Nannila

 య ధావిధిగా ఆరోజు ఆఫీసు నుంచి వస్తూ పాల పాకెట్, బ్రెడ్ ప్యాకెట్ కొన్నాను. రాత్రి పూట ఎప్పుడైనా ఆకలేస్తే తినడానికి ఉపయోగపడుతుందని ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ని రిజర్వు లో ఉంచుకుంటాను. ఆఫీసు లో హెక్టిక్ వర్క్ లోడ్. దాంతో తల నొప్పి తీవ్రం గా ఉంది. ఆఫీసు క్యాబ్ లో  ఇంటివరకు వచ్చేద్దామని అనుకున్నాను కానీ బ్రెడ్ అయిపోయిందని గుర్తొచ్చింది. ఇంటికి దగ్గరలో ని ఒక కిరాణా షాపు దగ్గర ఆగి వీటిని కొని నడచుకుంటూ ఇంటికి వస్తున్నాను.

తీవ్రమైన తలనొప్పి. కళ్ళు లాగేస్తున్నాయి. ఇంటికి వెళ్లి తాళం తీసి లోపలికి వెళ్లి ఏదైనా పెట్టుకుని తినాలి. రాత్రికి భోజనం సిద్దం చెయ్యాలి. నాది తెల్లవారుజామున ప్రారంభమయ్యే షిఫ్ట్. మా ఆయనది సాయంత్రం  ప్రారంభమయ్యే షిఫ్ట్. అప్పుడప్పుడు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే మధ్యాహ్నమే వెళ్ళిపోతారు ఆఫీసుకి. మళ్ళీ నేను ఆఫీసు కి తిరిగి వెళ్ళిపోయాక వస్తారు. ఇలా నెలలో ఎక్కువసార్లు జరుగుతుంది.

కొన్ని సార్లయితే మేమిద్దరం ఒకరినొకరు చూసుకుని కనీసం వారం రోజులవుతుంది. వీకెండ్ లో నే మేమిద్దరం ఒకరితో ఒకరం గడిపే సమయం. పెళ్ళయి ఏడాది కావస్తున్న నాకు మాత్రం నేనేదో హాస్టల్ లో ఉంటున్నట్టు అనిపిస్తుంది.

ఉదయాన్నే ఆఫీసు కి వెళ్ళడం, సాయంత్రం ఏ అయిదింటికో ఇంటికి రావడం, ఎంతో కొంత నోట్లో పడేసుకోవడం. ఒక గంట నిద్రపోవడం. రాత్రే ఉదయం కి కూడా భోజనం సిద్దం చెయ్యడం. మళ్ళీ ఉదయాన్నే నాలుగున్నరకి నిద్రలేచి ఫ్రిడ్జ్ లో పెట్టిన అన్నం సాంబార్ నా బాక్స్ లో సర్దుకోవడం. ఆయనకి టిఫిన్ ఏర్పాటు చేసి డైనింగ్ టేబుల్ వద్ద పెట్టడం.ఇది నా బోరింగ్ దినచర్య.

ఒక్కొక్కసారి నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చినప్పుడు మా అయన అప్పుడే ఆఫీసు కి బయలుదేరడానికి తయారవుతూ కనిపిస్తారు. అలసట మూలంగా కనీసం అయన ఏం తింటున్నారో పట్టించుకునే ఓపిక ఉండదు. ఇంటికి రాగానే బెడ్ పైన వాలిపోతాను. పాపం ఆయనెంత ఇబ్బంది పడుతున్నారో అని బాధ.

ఇలా గడిచిపోతున్నాయి రోజులు. లైఫ్ ఈజ్ బోరింగ్. వెరీ వెరీ బోరింగ్.

ఆయనకి నా చేత్తో ఇస్త్రీ చేసిన బట్టలు ఆఫీసు కి వెళ్తుండగా నేను అందివ్వాలి. ప్రేమగా ఆయనకి నచ్చిన వంటకాలు అన్నీ సిద్ధం చెయ్యాలి. భోజనం వడ్డించాలి. నా చేత్తో ఆయనకి తినిపించాలి. ఇది నా కల.

ఎప్పుడూ మనకి కనిపించే పిచ్చుక ఇప్పుడు అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేరిపోతున్నట్టు, ఒకప్పుడు సాధారణంగా ఇంట్లో భార్య నిర్వర్తించే భాద్యతలు ఇప్పుడు నాకు ఒక తీరని కలలా అనిపిస్తున్నాయి.

ఈ కల తీరేదెప్పుడో.

ఒకవైపు తలనొప్పి, ఒకవైపు ఆలోచనలతో చాలా సేపు నిద్రపట్టలేదు. సగం చదివిన "రివల్యూషన్ 2020" బుక్ మిగతా సగం చదవడం ప్రారంభించాను. బుక్ చదువుతూ ఎప్పుడు నిద్రపోయానో కానీ అలాగే మెల్లగా నిద్రలోకి జారిపోయాను.

***

పాపం పిచ్చిది, ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర లేస్తుంది. చాలా కష్టపడుతోంది. వర్క్ లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల దానికి సహాయం చెయ్యలేకపోతున్నాను.

కనీసం దాని పని భారం కొంచెం తగ్గించడానికి పనిమనిషి కోసం ప్రయత్నించినా ఇక్కడ ఎవరూ దొరకలేదు. దొరికినా పట్టు మని వారం రోజు లు కూడా వరసగా రారు. మధ్యాహ్నం ఎప్పుడో నిద్ర లేవడం వండి పెట్టినవి కొంచెం తినటం, రెడీ అవడం, ఆఫీసు కి బయలుదేరడం. మళ్ళీ ఎప్పుడో ఇది ఆఫీసు కి వెళ్ళిపోయిన తరువాత ఇంటికి రావడం. ఇది నా దినచర్య. దాని మొహాన్ని దగ్గరగా తీసుకుని  నుదుటన ముద్దు పెట్టుకుని ఎన్ని రోజులయిందో. ఇంటికి రాగానే భార్యకి కాసిన్ని మల్లె పూలు తీసుకొచ్చి వేడివేడిగా వండిపెట్టిన భోజనం ఇద్దరం ఒకరి కొకరు తినిపించుకుంటూ హాయిగా గడిపేదేప్పుడో. ఈ షిఫ్ట్ ల మూలంగా సాధారణ భార్యాభర్తలు అనుభవించే చిన్ని చిన్ని సుఖాలు మాకు అందని ద్రాక్షల లాగా అనిపిస్తున్నాయి.

ఒకరితో ఒకరు ఫోన్లలోనే మాట్లాడుకుంటున్నాం. మనసారా మేమిద్దరం కలిసి ఒకరితో ఒకరం హాయిగా గడిపెదేప్పుడో.

***

ఆ రోజు శనివారం. అంజలి నిద్ర పోతూ ఉండుంటుంది. ఆఫీసు ముగించుకుని ఉదయం ఏడు గంటలకు ఇంటికి చేరాను. డిస్టర్బ్ చెయ్యడమెందుకని నా దగ్గర ఉన్న తాళం చెవితో ఇంట్లోకి వచ్చాను. అంజలి ఇంకా నిద్రపోతూనే ఉంది. నేను చక చకా ఫ్రెష్ అప్ అయి, అంజలి కోసం ఏదైనా టిఫిన్ సిద్దం చేద్దాం అని వంటింట్లోకి వెళ్ళాను. వంటిల్లు నీటిగా సిద్ధం చేసి ఉంది. వీకెండ్ కొంచెం లేట్ గా లేస్తుందని తెలిసి రాత్రే అన్నీ సిద్ధం చేస్తుంది. వెంటనే ఉప్మా రవ్వ తీసి ఉప్మా సిద్దం చేసాను. నాకు అది మాత్రమే చెయ్యడం వచ్చు. తనకి కాఫీ అంటే చాలా ఇష్టం. అందులో బెడ్ కాఫీ అంటే ఇంకా ఇష్టం. అందుకే కాఫీ రెడీ చేసాను.

ఈ లోపు తనే లేచింది.

"వచ్చేసారా, సారి, మొద్దు నిద్ర పట్టేసింది. లేవలేకపోయాను." అని ముద్దొచ్చే మొహం తో అంది. "సారి ఏంటి. మరీ ఫార్మల్ గా. ఇదిగో తీసుకో నీకు ఇష్టమని కాఫీ తయారు చేసాను. తాగి ఫ్రెష్ అప్ అవ్వు టిఫిన్ తిందాం"

"కాఫీ..."అని ఆల్మోస్ట్ అరచినంత పని చేసింది.

హాయిగా సిప్ చేస్తూ తాగింది.

"ఫ్రెష్ అప్ అవ్వు టిఫిన్ చేద్దాం"

"ఎంత బాగా చేసారో కాఫీ. థాంక్ యు స్వీట్ హార్ట్. ఉండు ఫ్రెష్ అప్ అయి వస్తాను" అని బాత్రూం లో కి వెళ్ళింది. తనకి ముద్దొస్తే రకరకాలు గా పిలుస్తుంది..

స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని రాగానే ఇద్దరం కలిసి ఉప్మా తిన్నాము.

ఆ తరువాత ఎప్పుడు నిద్రపోయానో కానీ నాకు నిద్రపట్టేసింది.

నైట్ షిఫ్ట్ లు చెయ్యడం వల్ల ఒక సారి నిద్రపోతే ఏకంగా ఆరేడు గంటలు ఏకధాటిగా నిద్రపోతాను. వీకెండ్ అంటే నిద్ర కోసమే అన్నట్టుంటుంది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ పరిస్థితి. హాల్ లో నే నిద్రపోయాను.

***

లేచేసరికి రాత్రి ఎనిమిదయింది. పక్కన అంజలి లేదు. "అంజలి, అంజలి" అనిపిలిచాను. చక్కగా తెల్ల చీర కట్టుకుని మల్లె పూలు పెట్టుకుని ఉంది. పదహారణాల బాపు బొమ్మలా ఉంది. ఆత్రంగా దగ్గరికి వెళ్లబోతుంటే "ఆగండి, ఆగండి" మీరు మధ్యాహ్నం కూడా భోజనం చెయ్యలేదు. నిద్ర సరిపోవట్లేదని మిమ్మల్ని లేపలేదు. వెళ్లి కాళ్ళు, చేతులు మొహం కడుక్కుని భోజనానికి రండి. మీకు నచ్చిన వన్నీ వండాను. నా చేతులతో తినిపిస్తాను" అని అంది.

వెంటనే ఫ్రెష్ అప్ అయి అంజలి ముందు వాలిపోయాను. "ఈ భోజనానికి కొంత సమయం ఆగాలి మహానుభావా, ముందు ఈ భోజనం తినండి" అని నాకిష్టమైన వంకాయ కూర ని అన్నం లో కలిపి నాకు నోట్లో పెడుతోంది. నేను కూడా అంజలి కి కొన్ని ముద్దలు (మధ్య మధ్య లో ముద్దులు) తినిపించాను.

నాకు తెల్ల పంచె, తెల్ల షర్టు ఇచ్చింది. అవి కట్టుకోగానే నా కళ్ళకి గంతలు కట్టి మా బెడ్ రూం లో కి తీసుకెళ్ళింది. ఆ తరువాత సన్నటి రొమాంటిక్ మ్యూజిక్ వినబడడం ప్రారంభం అయింది. నా కళ్ళకున్న గంతలు విప్పింది.

స్వర్గం లో కి అడుగుపెట్టానా అన్నట్టుగా ఉంది మా బెడ్ రూం. ఎంత అందం గా అలంకరించిందో. మా మొదటి రాత్రి ని తలపించేలా ఉంది ఆ గది. అగరబత్తి సువాసనలు. మంచం నిండా అలంకరించిన మల్లె పువ్వులు. సన్నగా వినిపించే 'జీన్స్ మూవీ' లో ని 'ని స రీ సా' అనే రొమాంటిక్ థీమ్. పక్కనే ప్లేట్ లో రక రకాల స్వీట్లు. ఆ మంచం పై అజంతా శిల్పం లా ఉన్న మా ఆవిడ. ఇంత కంటే అదృష్టం ఇంకేం కావాలి.

మెల్లగా ఆమె వద్దకు వెళ్లి ఆమె తలలోని మల్లెల మత్తులో ని ఆనందాన్ని ఆస్వాదిస్తూ చెవిలో గుసగుసగా అన్నాను "మనసా కవ్వించకే నన్నిలా" అని. ఈ విధం గా మా వీకెండ్ స'ద్వినియోగం' అయ్యిందని వేరే చెప్పేదేముంది!! 

మరిన్ని కథలు
ditective anumaanlu comedy story