Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Chakri Interview

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aaditya hrudayam - vn adithya

పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టు, ఒక సినిమా పిచ్చోడి చేతికి రాయమని కాలమ్ ఇచ్చిన సిరాశ్రీ గారిని మీరందరూ తిట్టుకున్నా, నేను మాత్రం అభినందించి తీరుతాను.

అది 1993, మే 18 మధ్యాహ్నం 12 గంటల సమయం.

చెన్నై లోని పడపళని లో సుప్రసిద్ధ చందమామ విజయా కంబైన్స్ ఆఫీసున్న విజయా-వాహినీ స్టూడియోస్. ఆసియాలోనే ఆ రోజుల్లో అతి పెద్ద స్టూడియో అది. అఫీషియల్ గా 'భైరవ ద్వీపం' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎపాయింట్ అయ్యాక మొదటిసారి పెట్టిన అడుగు. ఇదే సీన్ సినిమాలో తీస్తే, కుడికాలు చెప్పుమీద క్లోజప్ - చేతి వాచీ క్లోజప్ - చొక్కా జేబులో పెన్ను, దేవుడి ఫోటో క్లోజప్, నుదుటిమీద బొట్టు క్లోజప్, స్లోమోషన్ (48 ఫ్రేమ్స్ లో) లో నడుస్తున్న 19 ఏళ్ళ బక్క కుర్రాడి నడక, 24 లెన్స్ లోయాంగిల్స్ లో గాలికి రెపరెపలాడుతున్న చొక్కా... డైనమిక్ ఎంట్రీ... వెనకాల మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోరు, నా మనసులో ఉన్న అనుభూతిని సెల్యులాయిడ్ మీద పెడితే ఇలాగే ఉంటుంది. కానీ అనుభవం వేరు - అనుభూతి వేరు. అనుభవం వాస్తవంగా ఉంటుంది . ఓ మృణాల్ సేన్ సినిమాలాగ, సత్యజిత్ రే సినిమాలాగ, బి. నరసింగరావు సినిమాలాగ - అనుభూతి ఓ రాఘవేంద్రరావు సినిమాలాగ, దాసరిగారి సినిమాలాగ, కె. విశ్వనాధ్ సినిమాలాగ ఉంటుంది. అనుభవానికి, అనుభూతికి ఉన్న తేడా నిజానికి, ఊహకి ఉన్నంత అని తెలిసిన రోజు అది.

వాస్తవంలో, ఓ పదేళ్ళ నుంచి రోజూ ఫ్యాక్టరీకి వెళ్తున్న కార్మికుడి అంత రొటీన్ గా లోపలికెళ్ళాను నేను - ప్రయత్నాల కోసం అంతకు ముందు పదే పదే వెళ్ళడం వలన, పైపెచ్చు ఎండ తప్పించుకోవడానికి అర కిలోమీటరు దూరం వడివడిగా నడుచుకుంటూ వెళ్ళాను. లోపలికెళ్ళి శ్రీ రావి కొండలరావు గారిని (ఆయనే నన్ను డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పెట్టించిన పుణ్యమూర్తి) కలిసి శ్రీ సింగీతం గారి స్టాఫ్ తో కలిసిపోయాను. పూర్ణా గారు, సాంబశివరావు గారు, రవిప్రకాష్ గారు నాకు సీనియర్లు - సింగీతం గారి తర్వాత గురువులు. రెండు, మూడు రోజుల తర్వాత ఎడిటర్ శ్రీ రాజగోపాల్ గారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ శ్రీ తాండవకృష్ణ గారు కలిసి కొన్ని, విడివిడిగా కొన్ని సి'నీతి'సూక్తులు బోధించారు. వాళ్ళు ఇండస్ట్రీలో నాకు ఎనిమిదవ, తొమ్మిదవ గురువులు.

రాజగోపాల్ గారు : "ఈ ఇండస్ట్రీలో మనం భయపెడితే భయపడతారు. మనం భయపడితే భయపెడతారు. అందుకని మెత్తగా, మొహమాటంగా, సున్నితంగా ఉండకు. ధైర్యంగా, ఎదిరించి ఉండు - త్వరగా డైరెక్టర్ వి అవుతావు"

తాండవ గారు :
ఎ) ఉచ్ఛులు, నీచులు, తుచ్ఛులు సమాజంలో ఉంటారు అన్ని రంగాల్లోనూ. మ్లేచ్ఛులని నాలుగోరకం సినిమాల్లో ఉంటారు. వాళ్లనే ప్రలోభాలు అంటారు. వాటి జోలికి ఎప్పుడూ పోకు. కెరీర్ పోయినా ఫర్లేదు. కాయకష్టం చేసుకుని బతికేస్తాం. ప్రాణాలు పొతే మన జీవితమే కాదు, మనమీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు కూడా పోయినట్టు"

బి)  "ఈ ఇండస్ట్రీలో నిద్రలో కూడా కాళ్ళూపుతూ పడుకోవాలి. లేకపోతే మనం పోయామనుకొని మన పనిలో ఇంకోడ్ని పెట్టేస్తారు. వాళ్ళ పని మాత్రం ఆగకూడదు. కోట్లలో వ్యాపారం కదా.. మనం అలర్ట్ గా ఉండాలి"

ఇలాంటివెన్నో...

ఇవన్ని ఒక ఎత్తయితే, చెన్నైలో ఉన్న నాలుగేళ్ళు శ్రీ రావి కొండలరావు గారితో, శ్రీమతి రాధాకుమారి గారితో గడిపిన నవ్వులమయమైన  ప్రతి సందర్భం నాకో మంచి పాఠమే కాదు - నా ఆయుష్షుని ఓ నలభై ఏళ్ళు పెంచేసిన ఔషధం కూడా. వాళ్ళబ్బాయి శశికుమార్ తో సమానంగా నన్ను ఆదరించిన వారిరువురి ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనిది.

శ్రీ సింగీతం గారితో స్టోరి డిస్కషన్ లో కూర్చున్నప్పుడు నాకు తెలియకుండానే గోళ్ళు కోరికేసేవాడిని. చిన్నప్పట్నుంచి ఇప్పటివరకూ సినిమాలు చూసేటప్పుడు మాత్రమే నాకది అలవాటు.

స్టోరి డిస్కషన్ లో సింగీతం గారు సీన్స్ చెప్తుంటే సినిమా చూసినట్టు చూసేవాణ్ణి. నిజంగానే ప్రేక్షకుడిలా - నవ్వేయడం, కన్నీళ్ళు చెమర్చడం అన్ని ఫీలింగ్స్ సేమ్ - అలాగే గోళ్ళు కోరికేయడం - అది గమనించిన శ్రీ రావి కొండలరావు గారు సుతిమెత్తగా తిట్టారు - "మన ప్రవర్తన మీద మనకి తెలియని కళ్ళుంటాయి ఈ పరిశ్రమలో. అవే మన కెరీర్ లని నిర్ణయిస్తాయి" అని చెప్పారాయన.

ఆ తర్వాత షూటింగ్ ప్రారంభం నుంచి నిర్మాత శ్రీ బి. వెంకట్రామిరెడ్డి గారు (స్వయానా నాగిరెడ్డి గారి అబ్బాయి), ఈయన్ని బాబ్జీగారు అని అంటారు. యువరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, కధానాయిక రోజా గారు - ముగ్గురూ మూడు ముఖ్యమైన పాఠాలు నేర్పారు. అవి... వచ్చేవారం.....

శ్రీ గురుభ్యోన్నమః

మరిన్ని సినిమా కబుర్లు
raja music muchchatlu