Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aaditya hrudayam - vn adithya

ఈ సంచికలో >> సినిమా >>

రాజా మ్యూజిక్ ముచ్చట్లు

ఇట్లు తో మొదలైన హిట్లు
ఇ .. టు.. ఇ అంటే 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' నుంచి 'ఇద్దరమ్మాయిల తో'  వరకు వచ్చిన హిట్ కాంబినేషన్ అని అర్ధం. ఈ టైటిల్ ఒక్క భాస్కరభట్ల రవికుమార్ - పూరీ జగనాథ్ కాంబినేషన్ కి మాత్రమే సూటవుతుంది. ఆ సినిమా నుంచి ఈ సినిమా దాకా మొత్తం 19 సినిమాల అనుబంధం వారిది. ప్రతి సినిమాకి మినిమమ్ ఒక్క హిట్ సాంగైనా వుంటూ వస్తోంది. లేటెస్ట్ గా రాబోతున్న 'ఇద్దరమ్మాయిల తో' సినిమాలో 'టాప్ లేసిపోద్ది' సాంగ్ ఇప్పుడు మార్కెట్ లో టాప్ లేపేస్తోంది. 

ఈ పాట వెనుక కథ ఏమిటంటే ... ముందో పాట ఆల్రెడి అనేసుకుని, రాసేసుకుని ఒకే అనుకోవడం జరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆలోచన ఏమిటంటే ... 'కెవ్వు కేక' ,'ఆకలేస్తే అన్నం పెడతా' లాంటి పాట అయితే అక్కడి సిట్యుయేషన్ కి ఎలా వుంటుంది అనుకున్నారు.
ఈ రెండూ ఐటమ్ సాంగ్స్ ... ఇప్పుడు కావలసిన పాట హీరో హీరోయిన్ల  మీద వుంటుంది. ఎలా ... ?

పూరి జగన్నాథ్ కారులో వెళుతూ , ఆలోచిస్తూ భాస్కరభట్ల కి ఫోన్ చేసి ఓ మాంచి హుక్ లైన్ చెప్పమన్నారు. భాస్కరభట్ల వెంటనే ఓ నాలుగైదు చెప్పారు. అందులో ఒకటి వినగానే పూరీ గారికి నచ్చింది . అదే - టాప్ లేచిపోద్ది. ''లేటెస్ట్ గా ఇలా అనుకున్నాం కాబట్టి ఇంతకు ముందు రాసిన పాట ప్లేస్ లో ఈ హుక్ లైన్ ని పెట్టుకుని మరో పాట రాసెయ్'' అన్నారు. భాస్కరభట్ల నొచ్చుకోలేదు సరికదా రెచ్చిపోయారు. పైగా పూరీ జగన్ టేస్ట్ తెలుసు కనుక అన్నీ జనం నోటికి పట్టే పదాల్తో వెంటనే పాట రాసేసి మళ్ళీ ఓకే చేయించుకున్నారు. అదిప్పుడు అదరగొట్టేస్తోంది.. అతి త్వరలో రికార్డ్ బద్దలు కొట్టేసినా ఆశ్చర్యపోవలసిన పని లేదు.

అందులో..
'సమ్మర్ లోన లస్సీ లా, వింటర్ లోన కాఫీ లా
ఊరిస్తున్నావే పట్టి లాగేస్తున్నావే పిల్లా పొంగే పొంగే పూరిలా'  అని ఓ లైన్ వుంది.
''ఇది కావాలనే రాసినట్టుంది'' అని అంటే ''అవును ... కావాలనే రాశాను . ఎందుకంటే నాకిష్టమైన టిఫెన్ పూరి నాకిష్టమైన వ్యక్తి పూరి '' అన్నారు భాస్కరభట్ల

మాయాబజార్ పాటలు - అపోహలు - ఊహాగానాలు
ఐబీయన్ లైవ్ వారు వందేళ్ళ సినిమా చరిత్రకు సంబంధించి దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో 'మాయాబజార్' సినిమా  నంబర్ వన్ స్థానంలో నిలబడడం తెలుగు వారందరూ జీవితాంతం గర్వకారణంగా చెప్పుకోదగ్గ విషయం. ఈ సినిమాలోని 4 పాటలకు సంబంధించి కొన్ని అపోహలు కొన్ని ఊహాగానాలు వున్నాయి..అవేమిటంటే  ఇందులో ఏయన్నార్, సావిత్రి మీద చిత్రీకరించిన 4 యుగళ గీతాలూ స్వరపరచింది ఘంటసాల కాదు యస్. రాజేశ్వరరావు గారని.. 'మాయాబజార్' సినిమాలో యస్. రాజేశ్వరరావు గారు 4 పాటలను స్వరపరిచిన మాట నిజమే.  కానీ అందులో యుగళ గీతాలు మూడే . అవి - చూపులు కలసిన శుభవేళా, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునది.

ఇక నాలుగవ పాట ఏదంటే -  శ్రీకరులు దేవతలు శ్రీ రస్తులనగా .. మరి నాలుగు యుగళ గీతాలు యస్. రాజేశ్వరరావు గారు స్వరపరిచారన్న వార్త బైటికి ప్రచారంలోకి రావడానికి కారణం 'నీవేనా నను తలచినది.' పాట కూడా ఆయనే స్వరపరిచారనుకోవడమే. అందుకు కారణం కూడా వుంది. మొదట 'కుశలమా కుశలమా నవ వసంత మధురిమా' అంటూ పింగళి గారు రాసిన పాటను పల్లవి వరకు స్వరపరిచి ఆ తర్వాత కొన్నివిషయాలు సరిపడక ఆ సినిమాని ఒదులుకుని వెళ్ళిపోయారు యస్. రాజేశ్వరరావు. ఆ మూడు యుగళ గీతాలు, సినిమా మొదట్లో వచ్చే 'శ్రీకరులు దేవతలు' పాట అప్పటికే పూర్తయిపోవడం వల్ల రాజేశ్వరరావు గారి పేరు వేయకుండానే వాడుకున్నారు నిర్మాతలు. ఇక 'కుశలమా కుశలమా'  పాట సంపూర్ణంగా ఒక స్వరూపానికి రాలేదు కనుక ఆ పాటను పక్కన పెట్టేసి ఆ స్థానంలో 'నేవేనా నను తలచినది' పాటని తాజాగా చేసుకున్నారు. ఈ పాట, మిగిలిన పాటలు పద్యాలు ఘంటసాల స్వరపరిచినవే.
ఈ విషయాలన్నిటినీ మనకు విపులంగా చెప్పగలవారు ఒక్కరే - ఆయనే కే వి రెడ్డి గారికి ఎన్నో చిత్రాలలో సహాయకుడిగా పని చేసిన నేటి మేటి దర్శకుడు - సింగీతం శ్రీనివాస రావు.

పకడో పకడో
ఏఎన్ఆర్, ఎన్‌టీఅర్ నటించిన 'తెనాలి రామకృష్ణ ' సినిమా సీడీ కవరిది. (ఫొటో నంబర్ 1) ఇందులో ఏఎన్ఆర్ ఫొటో ఒక్కటే ఆ సినిమాకి సంబంధించినది. ఎన్‌టీఅర్ , జమున ఫొటో లు 'పల్నాటి యుద్ధము' చిత్రం నుండి తీసుకున్నారు. ఆ సినిమాలో వారి గెటప్పులు ఎలా వుంటాయో ఫొటో నంబర్ 3 చూసి తెలుసుకోవచ్చు 'తెనాలి రామకృష్ణ ' సినిమాలో ఎన్‌టీఅర్, జమున గెటప్పులు ఫొటో నంబర్ 2 లో వున్నాయి

మరిన్ని సినిమా కబుర్లు
sreenu vaitla revrsed the formula