Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మహిమాన్విత మంత్రాలయం (పర్యాటకం) - లాస్య రామకృష్ణ

manthralayam tourism

ఆంధ్రప్రదేశ్ లో ని కర్నూల్ జిల్లాలోఉన్న మంత్రాలయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 232.6 కిలో మీటర్ల దూరం లో ఉంది. దక్షిణ భారత దేశం లోనే అత్యంత ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రం మంత్రాలయం. శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న ప్రదేశం ఇది.

కర్ణాటక సరిహద్దులో, కావేరి నది యొక్క ప్రధాన ఉప నది అయిన తుంగభద్ర నది ఒడ్డున  ఉన్న మంత్రాలయం పురాతన సంతతికి చెందిన ఒక పవిత్ర స్థలంగా భావించబడుతుంది.ఇదే ప్రదేశం లో ప్రహ్లాదుడు యజ్ఞాలు చేసాడని పురాణాలూ చెబుతున్నాయి.

రికార్డుల ప్రకారం మంత్రాలయం చుట్టు పక్కల తుంగబధ్ర నది వైపుగా ఉన్న బంజరు భూమిని ఆదోని యొక్క సిద్ది మసూద్ ఖాన్ అనే నవాబు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం కి ఇచ్చారని తెలుస్తోంది.

శ్రీ రాఘవేంద్ర స్వామి, కుంబకోణంకి చెందిన శ్రీ సుధీంద్ర తీర్థుల యొక్క శిష్యుడు మరియు అనుచరుడు. ఆయనే రాఘవేంద్ర స్వామికి ద్వైత వేదాంతాన్ని, వ్యాకరణాన్ని అలాగే ప్రాచీన సాహిత్య రచనలు మరియు వేద పాఠాలు నేర్పారు.

పుర్వాశ్రమం
తిమ్మన్న భట్టు, గోపికాంబల రెండవ సంతానం గా  వేంకట నాథుడు జన్మించాడు. 1614 లో సరస్వతిని వివాహమాడిన వేంకట నాథుడు గురువు సుదీంద్రతీర్ధుల వారి నేతృత్వం లో తంజావూరు రాజు రఘునాథుని అద్వర్యం లో సన్యాసం స్వీకరించారు. ఈ సందర్భంలో రాఘవేంద్రతీర్థులుగా వెంకట నాధునికి సుదీంద్ర తీర్థుల వారు నామకరణం చేశారు.

ఆ తరువాత, శ్రీ రాఘవేంద్ర స్వామి తన అనుచరుల చేత 'మాంచాలే రాగప్ప' గా పిలువబడ్డారు. 1671 లో మంత్రాలయం లో స్వామి 'జీవ సమాధి' చెందారు.

ప్రహ్లాదుని అవతారం
శ్రీ రాఘవేంద్ర స్వామి, మహా విష్ణువు భక్తుడు అయిన భక్త ప్రహ్లాద అవతారమని అంటారు. జీవ సమాధి చెందడం ద్వారా స్వామి బృందావనం లోకి ప్రవేశించారని (సజీవ బృందావనం) అక్కడ నుండి మరి కొన్ని వందల సంవత్సరాల వరకు భక్తుల కోరికలు నేరవేరుస్తారని భక్తుల విశ్వాసం.

ఆలయాలు
నేడు, మంత్రాలయం అనే పట్టణం బృందావనం గా ప్రసిద్ది చెందిన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయానికి పర్యాయపదం గా మారింది. మాంచాలమ్మ ఆలయం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకి కూడా మంత్రాలయం ప్రసిద్ది.

ఉత్సవాలు
మహారథొత్సవం మరియు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం మంత్రాలయం లో పెద్ద ఎత్తున నిర్వహింపబడే పండుగలు.

మతాలకు అతీతంగా అనేక మంది భక్తులు ఏడాది పొడవునా మంత్రాలయానికి చేరుకుంటారు. కర్నూల్, హైదరాబాద్, తిరుపతి, వరంగల్, బెంగుళూరు మరియు విజయవాడలకు దగ్గరగా ఉండడం వల్ల కూడా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది.

లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్
మంత్రాలయం మఠ సముదాయ ప్రధాన కేంద్రంలో లక్ష్మివెంకటేశ్వర ఆలయం గా కూడా ప్రసిద్ది చెందిన శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఉంది. అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం ఈ ఆలయం లో ఉంది. శ్రీ రాఘవేంద్ర స్వామే స్వయంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని అంటారు. స్వామి ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి ని ప్రతి రోజు కొలిచేవారని నమ్ముతారు. ఈ మఠ సముదాయం లో ఈ ఆలయం ప్రధాన ఆకర్షణ.

ఈ ఆలయానికి సమీపం లో ఉన్న ఆకర్షణ మాంచాలమ్మఆలయం. మంత్రాలయం యొక్క దేవతగా మాంచాలమ్మ ని కొలుస్తారు.

ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది.

రాఘవేంద్ర స్వామి బృందావనం
కర్నూల్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం లో రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది. రాఘవేంద్ర స్వామి సమాధి ఉన్న ప్రాంతాన్ని బృందావనం గా పిలుస్తారు. అందమైన ప్రకృతి నడుమ తుంగభద్ర నది ఒడ్డు న ఉన్న ఈ మఠం శ్రీ రాఘవేంద్ర స్వామి నివాసం. వేల మంది భక్తులు ఈ సమాధి ని సందర్శించి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు అందుకోవడానికి ప్రతి రోజు విచ్చేస్తారు.

స్వామి 1671 లో జీవ సమాధి చెందారు. స్వామి ఏంతో మంది భక్తుల సమస్యలను ఎన్నో అధ్బుతాలు చేసి పరిష్కరించారు. రాఘవేంద్ర స్వామి భక్తులకి కలలో కనిపించి సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నో గాధలు ఉన్నాయి. భక్తుల కోరికలు తీర్చే స్వామిని కామధేను మరియు కల్పవృక్షం గా భక్తులు పిలుచుకుంటారు.

మాంచాలమ్మ ఆలయం
మంత్రాలయం మఠ సముదాయం లో సమాధి ఆలయం వద్ద నెలకొని ఉన్న ఆలయం మాంచాలమ్మ ఆలయం. మంత్రాలయం గ్రామ దేవతగా మాంచాలమ్మని కొలుస్తారు. పార్వతి దేవి యొక్క అవతారం గా మాంచాలమ్మ ని భావిస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆచారం ఎప్పటి నుంచో ఉంది. రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారిని ప్రతి రోజు పూజించే వారని అంటారు. మాంచాలమ్మ దర్శనం పొందిన రాఘవేంద్ర స్వామి అమ్మ వారి అనుగ్రహం తో నే ఇక్కడ కొలువున్నారని గాధలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారు మూల బృందావనం లో ని శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునే ముందు మాంచాలమ్మ ఆలయాన్ని సందర్శించాలని రాఘవేంద్ర స్వామి సూచించారు. ఇప్పటికీ ఈ ఆచారాన్ని భక్తులు పాటిస్తున్నారు.

పంచముఖి ఆంజనేయ
రాఘవేంద్ర స్వామి మఠం సముదాయం లో ఈ ఆలయం ఉంది.మంత్రాలయం నుండి ఈ ఆలయం చేరుకోవడానికి 45 నిముషాలు పడుతుంది. అందమైన పరిసరాల మధ్య ఒక చిన్న కొండపై ఈ ఆలయం ఉంది. ఏభై మెట్లు ఎక్కి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అయిదు ముఖాలతో ఇక్కడ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకమైనది.

ఈ విగ్రహం ఒక గుహలో ఉన్నదని ఒక బ్రాహ్మణుడికి కలలో తెలిసిన విధంగా ఈ గుహకి వచ్చి ఆ విగ్రహాన్ని కనిపెట్టారని అంటారు. ఈ గుహని కూడా భక్తులు ఈ ప్రాంతం లో గమనించవచ్చు. ఈ మందిరానికి చేరే దారి ఇరుకుగా ఉంటుంది. అందుచేత భక్తులు ఒకే లైన్ లో ఒకరి వెనుక ఒకరు దర్శనానికి చేరుకోవాలి.

వేద పాఠశాల
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ సముదాయం లో నే వేద పాఠశాల ఉంది. మంత్రాలయం లో ఉన్న వేద పాఠశాల వేదాల అధ్యనాలలోనే ఈ ప్రాంతం ప్రసిద్ది చెందినది. వేల మంది వేద పండితులు ఈ పాఠశాల లో నే వేదాలు నేర్చుకున్నారు.

వాయు మార్గం
మంత్రాలయం నుండి 232.6 కిలోమీటర్ల దూరం లో ఉన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి సమీపం లో ఉన్న విమానాశ్రయం. హైదరాబాద్ నగరం దేశ విదేశాలకి వాయు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంటుంది. ఈ విమానాశ్రయం నుండి మంత్రాలయానికి టాక్సీ సేవలు లభ్యమవుతాయి.

రైలు మార్గం
మంత్రాలయం రైల్వే స్టేషన్ కేవలం 15 కిలోమీటర్ల దూరం లో నే ఉంది. చెన్నై మరియు రాయచూర్ రైల్ రూట్ లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ లో సమీప నగరాలకు రెగ్యులర్ రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

బస్సు మార్గం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ బస్సుల ద్వారా మంత్రాలయం చక్కగా అనుసంధానమై ఉంది. మంత్రాలయం నుండి కర్నూల్ మరియు హైదరాబాద్ ల కు బస్సు సర్వీసులు తరచూ అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఈ ప్రాంతం సందర్శనకు అనువుగా ఉంటుంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యొక్క మూల బృందావన దర్శనానికి ఈ సమయం ఉత్తమమైనది.

మరిన్ని శీర్షికలు
Dullu Koora