Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka!

ఈ సంచికలో >> సినిమా >>

చక్రి తో ముఖాముఖీ

Chakri Interview

ఇటీవల నూరు అనే మాటకు నూరేళ్ళూ నిండిపోయాయనిపిస్తోంది. ఒక సినిమా నూరు రోజులు ఆడడం, ఒక నటుడు వంద సినిమాలు చేయడం ... అలా ఒక సంగీత దర్శకుడు నూరు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం లాంటివి అరుదైన అద్భుతంగా భావించాల్సి వస్తోంది. కానీ సంగీత దర్శకుడు చక్రి విషయంలో మాత్రం అలా అనుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆయనకు అరుదైనదీ కాదు, అద్భుతమైనదీ కాదు. ఇటీవల ఆచి తూచి అడుగెయ్యడంలో ఆ విషయం కొన్ని నెలలు వెనక్కి జరిగింది కానీ కేవలం అంకెల కోసమే పాకులాడి వుంటే   ఆ రికార్డు ఎప్పుడో బద్దలైపోయుండేది.

ఈ సంవత్సరం మాత్రం తప్పదు. 97 సినిమాలు పూర్తి అయిపోయాయి.మరో 3 సినిమాలు పరుగు పందెంలో వున్నాయి. అవి - వైవీయస్ చౌదరి 'రేయ్' , అందాల రాక్షసి హీరో నవీన్ చంద్ర  కొత్తమ్మాయి కాంబినేషన్ లో పేరింకా పెట్టని చిత్రం , వంశీ 'లవ్'.   ఈ  మూడిటి గురించి, మరిన్ని ముచ్చట్ల గురించి సంగీత దర్శకుడు చక్రి తో జరిపిన ' some భాషణే ' ఈ ఇంటర్ వ్యూ :

" ఈ మూడిటిలో ఏది మీ 100 వ సినిమా కావొచ్చు ?"
" రిలీజ్ ప్రకారం అనుకోవాలే తప్ప వాటి ప్లానింగ్ నా చేతిలో లేదు..."

"పోనీ మీ ప్రిఫరెన్స్ ? "
"అలా ఏం లేదు. దేనికైనా రెడీ "

" ఎందుకలా ? "
" దేనికైనా రెడీ నా 97వ సినిమా కాబట్టి జోక్ గా అన్నాను.  నిజానికి  ఫలానా సినిమాయే  నా 100వ సినిమా కావాలని నేను కోరుకోకూడదు.   ఎందుకంటే అందరూ నాక్కావలసిన వాళ్ళే ... "

" సరే ... ఈ మూడు సినిమాల్లో మీ మ్యూజిక్ ఎలా వుంటుంది ?"
" వంశీ గారి 'లవ్ ' సినిమాలో  ఆయన టైప్ మ్యూజిక్ తో పాటు మోడర్న్ టచ్ వుండే మ్యూజిక్ వుంటుంది. అసలిది వంశీ గారి సినిమాయేనా అని ఆశ్చర్యపోతారు. ఇంతవరకూ మన వాళ్ళు వెస్ట్రన్ ఫాస్ట్ బీటే విన్నారు. అందాల రాక్షసి హీరో నవీన్ చంద్ర తో రాబోయే సినిమాలో వెస్ట్రన్ మెలొడీ వింటారు. ఇక చౌదరి గారి ' రేయ్ ' లో డ్యాన్స్ బేస్డ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ వుంటుంది. మొత్తం 8 పాటలు. అవుట్ అండ్ అవుట్ ఎనర్జీ..."

" ఆయన తో మీ మొదటి సినిమా 'దేవదాసు' అంత హిట్ ఆవుతాయా పాటలు ? "
"కచ్చితంగా .... ఇదొక మ్యూజికల్ బొనంజా "

" సందర్భం వచ్చింది కనుక అడుగుతున్నాను. 'దేవదాసు' లో ఆ సినిమా కోసం కాకుండా మీ ట్యూన్ బ్యాంక్ లోంచి కొన్ని పాటలు తీసి వాడినట్టున్నారు ?"
" ఆ సినిమాలో - అడిగీ అడగలేక, బంగారం - పాటలు ట్యూన్ బ్యాంక్ నుంచి తీసి వాడినవే. అలాగే 'ఏం బాబూ  ఏంటి సంగతి' అంతకు రెండేళ్ళ ముందు చేసి పెట్టుకున్నదే.."

" అలా ట్యూన్ బ్యాంక్ లోంచి వాడుకున్న పాటలు ఇంకే సందర్భాల్లోనైనా వున్నాయా ? "
" పూరి జగన్ గారిని  'జగనన్నా' అని పిలుస్తాను. ఆయన్ని మొదటి సారి కలిసినప్పుడు ' ఓ మగువా నీతో స్నేహం కోసం' పాట ట్యూన్ ని, 'మోనా మోనా మోనా' పాట ట్యూన్ ని వినిపించాను. ' రెండూ బాగున్నాయి. దాచి వుంచు. మనమే ఫ్యూచర్లో వాడుకుందాం' అని వేరే పాటలు చేయించుకున్నారు. "

" మోనా మోనా మోనా పాట 'శివమణి'  లో  వాడుకున్నారు ... సరే .. మరి 'ఓ మగువా' పాట 'సత్యం' లో సూర్యకిరణ్ కి వాడేరు గా ? "
" అది ఆ సినిమాకి సరిపోతుందనిపించింది. అంచేత జగనన్న కి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకునే ఇచ్చాను."

" జగన్ గారి తో పరిచయం అదీ అన్నీ ఇప్పటికీ గుర్తున్నాయా ? "
"ఎందుకు లేదు .. ప్రతి బిట్టూ గుర్తుంది. ఆ రోజు జూన్  15.  నా  బర్త్ డే. అదే రోజు జగనన్నకి  ఫోన్ చేసి 'మిమ్మల్ని కలవాలి, నా ట్యూన్ లు వినిపించాలి ' అని అడిగాను. 'రేపు కలుద్దాం ... మనం కచ్చితంగా కలిసి పనిచేస్తున్నాం' అన్నారు.  'ఈ మాటని నా బర్త్ డే గిఫ్ట్ గా భావించొచ్చా ? ' అని అడిగాను. 'యస్ ... ఇట్స్ మై ప్రామిస్' అన్నారాయన. ఆగష్టు 2 న మొదటి పాట ' ఓ చిలకా రా చిలకా' రికార్డింగ్ . నవంబర్ 9న మొదటి సినిమా 'బాచీ' రిలీజ్. జగనన్నతో అదీ బిగినింగ్. ఆ తర్వాత కథ అందరికీ తెలిసినదే"

"మరి ఇంత అనుబంధం, ఇన్ని జ్ఞాపకాలు వుండి కూడా మీ మధ్య ఎందుకింత గ్యాప్ వచ్చింది ? "
" జగనన్న తో పని చెయ్యాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. నేనెంత కంఫర్టబుల్ మ్యూజిక్ డైరెక్టర్ నో తనకు బాగా తెలుసు. ఐనా కొన్ని కొన్ని ఒత్తిళ్ళ వల్ల ఇద్దరం ఈ మధ్య కలిసి పని చేయలేకపోయిన మాట నిజమే. వచ్చే ఏడాది కి ఈ ప్రశ్న అడిగే చాన్స్ ఎవరికీ వుండదు. ఎందుకంటే ఈ సంవత్సరం లోనే ఇద్దరం కలిసి పనిచేస్తాం"

" చౌదరి గారి సినిమా లోంచి పూరి గారి ట్రాక్ లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ వెనక్కి  వస్తే మీరు 'దేవదాసు' చెయ్యకముందు చౌదరి గారికి కీరవాణి  గారు మ్యూజిక్ ఇచ్చేవారు. ఆయన ప్లేస్ ని మీరెలా భర్తీ చెయ్యగలననుకున్నారు ? "
" చౌదరి గారు కలిసినప్పుడు అడుగుతుండే వాణ్ణి - ఓ సినిమా కలిసి చెయ్యాలనుందని. 'దేవదాసు' టైమ్ కి ఆయనే  అడిగారు  - ' మీ టైప్  ఆఫ్ ఎనర్జీ కావల్సిన సాంగ్స్ ఇందులో వుంటాయి. కాబట్టి మీరే చెయ్యాలి' ఆన్నారు. కీరవాణి గారిది, నాది ఎవరి స్టైల్ వారిది. అందుకని భర్తీ అనే ఆలోచనే నాకు లేదు, రాలేదు."

" ఇప్పుడు మీ కంపోజింగ్ టైమింగ్స్ మారేయా ... లేక ఇది వరకిటిలా తెల్లవారు జామున 3-4 దాకా చేస్తున్నారా ?"
" లేదు లేదు ... రాత్రి 10 కే ముగించేస్తున్నాను. ఎప్పుడైనా తప్పదనుకుంటే 11 లేదా 12 ... అంతే.."

"సడన్ గా ఎందుకింత మార్పు వచ్చేసింది ?"
" ఫ్యామిలీ తో కూడా స్పెండ్ చెయ్యాలి కదా ... అదొకటి .... హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకటి .."

" మరోలా అనుకోవద్దు ... మిమ్మల్ని చూసిన వాళ్ళు చక్రి ఎందుకింత లావుగా అయిపోతున్నాడు అని అనుకుంటున్నారు .. "
" నిజమే .. దానికి కొంత జీన్స్ కారణం అనుకుంటున్నాను. సినిమా ఫీల్డ్ కి రాకముందు జిమ్ కి వెళ్ళేవాడిని. మైళ్ళకు మైళ్ళు నడిచి మార్కెటింగ్ చేసేవాణ్ణి. మ్యూజిక్ డైరెక్టర్ని అయ్యాక కూచోవడం ఎక్కువయ్యింది. ఫిజికల్  మూమెంట్స్ తగ్గిపోయాయి. దానికి తోడు ఇర్రెగ్యులర్ ఫుడ్ హాబిట్స్ ఎక్కువై,   టైమ్లీ స్లీపింగ్ లేకపోవడం ఇవన్నీ బాడీ షేప్ మీద పడ్డాయి. ఇప్పుడవన్నీ మార్చుకుంటున్నాను. డైట్ కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాను. కానీ  నా బాడీలో ఫ్లెక్సిబిలిటీ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకేలా వుంది. అప్పుడప్పుడు నేల మీద కూచొని భోజనం  చెయ్యాలనిపిస్తే హాపీగా ఏ ఇబ్బందీ లేకుండా కూచొని చేసేసేవాణ్ణి. నాతో పని చేయించుకోడానికొచ్చిన డైరెక్టర్లు ఆశ్చర్యపోయేవారు - నా ఫ్లెక్సిబిలిటీ కి. "

"పుట్టిన రోజు నాడు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మీరు. అదెలా వచ్చింది ?"
" కొంత మా నాన్న గారి ఇన్ స్పిరేషన్, కొంత చిరంజీవి గారి ఇన్ స్పిరేషన్  ... నిజానికి చాలా సాదా సీదా లైఫ్ నుంచి వచ్చిన వాణ్ణి. మా నాన్నగారు ఓ టీచరు. ఇప్పుడు నేననుభవిస్తున్న లైఫ్ నేనుండాల్సిన లైఫ్ కన్నా ఎంతో ఎక్కువ అనే స్పృహ నాలో ఎప్పుడూ వుంటూనే వుంటుంది. నడుస్తున్నప్పుడు కాల్లో ముల్లు గుచ్చుకుంటే తీసి పారేసి ముందుకు పోను. అది మరొకళ్ళకి గుచ్చుకోకుండా దూరంగా విసిరేసిన తర్వాతే నడక    మొదలు పెడతాను.  ఇప్పటికీ కార్లో వెళుతున్నప్పుడు రోడ్డుకడ్డంగా చెట్టు కొమ్మలు పడివుంటే - వాటిని పక్కకై తప్పించేసి వెళ్ళొద్దూ ... దూరంగా పారేసి రా ఆ తర్వాతే వెళదాం - అని మా డ్రైవర్ తోచెబుతూంటాను. బేసికల్ గా ఇదీ నా నేచర్. బహుశా అదే సేవా కార్యక్రమాల దాకా నడిపించిందనుకుంటున్నాను.  ఈ తత్వం  వల్ల ఎంతోమందికి ఫ్రీ గా సర్జరీలు జరిగాయి. ఎంతోమంది మెడికల్ స్టూడెంట్స్ ఫీజుల టెన్షన్ లేకుండా చదువుకుంటున్నారు.  ఇదంతా ఈ వయసుకే అవసరమా ? అని అనుకుంటున్న వాళ్ళూ వున్నారు, డైరెక్ట్  గా అడిగిన వాళ్ళూ వున్నారు. ఇది నా తత్వం. నాకు ఇందులోనే  హాపీనెస్ దొరుకుతోంది. మనసు హాపీగా వుంటేనే క్రియేటివిటీ బావుంటుంది."

" చక్రి ఈ మధ్య బాగా రిలాక్సయిపోయాడు అని అనుకుంటున్నారు. దీన్లో నిజం ఎంత ?  "
" ఇన్ని రకాల ట్యూన్ లు ఇచ్చాక , పాత ట్యూన్స్ ని రిపీట్ చేసుకోకుండా, ట్యూన్స్ లో కొత్తదనం  రావాలంటే మనం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వుంటుంది. అందుకోసం పడే తపన అది నాకే తెలుస్తుంది. కానీ అదే ఎదుటివారికి రిలాక్సేషన్ లా అనిపిస్తోందేమో .!? ఏం చెప్పగలం. నేనింకా చాలామంది పెద్ద హీరోల సినిమాలకి మ్యూజిక్ చెయ్యాలి. మంచి మంచి ట్యూన్ లు ఇవ్వాలి. ఇవన్నీ బుర్రలో వుంటుంటే ఎలా రిలాక్సవగలం !?"

" ఇప్పుడు మీ యాక్టింగ్ లోకొద్దాం ... 'సత్యం' సినిమాలో యాక్ట్ చెయ్యడం ఎలా జరిగింది ?"
" ఆక్కడ సీన్ ని బట్టి ఓ మ్యూజిక్ డైరెక్టర్ వుండాలి. అది నటనలా కాకుండా సహజంగా వుండాలి. అంచేత వాళ్ళూ వీళ్ళూ ఎందుకు మీరైతేనే నేచురల్ గా వుంటుంది అన్నారు. దాంతో ' ఓ మగువా నీతో స్నేహం కోసం' పాటలో నటించాను ... కాదు ... కనిపించాను, బాగుంది అని అనిపించాను . ఆ తర్వాత 'దెవదాసు' లో రికార్డింగ్ స్టూడియో సీన్ లో , అ క్రమంలోనే 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా'  లోను కనిపించాను. ఈ మూడు సినిమాలూ హిట్టే.  "

" ఎవడైతే నాకేంటి లో ఆర్టిస్ట్ గా కనిపించారు ...దాని సంగతి ?"
"అది హీరో డాక్టర్ రాజశేఖర్ గారి రిక్వస్ట్. పైగా నాకోసం రెండు నెలలు వెయిట్ చెయ్యడం తో తప్పలేదు ."

" చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ... మీరు ఎంతో గౌరవించే ఇళయరాజా వంటి వారు కూడా ఫారిన్ లో షోలు ఇస్తున్నారు. ఈ విషయంలో మీ పేరు తక్కువగా వినిపిస్తోంది. ఎంచేత ?"
" ఓ సారి అమెరికా లో షో ఇచ్చాను. అక్కడ షోలివ్వాలంటే ఇంచుమించు నెలా రెణ్ణెల్లు ఇక్కడవన్నీ ఒదులుకుని వెళ్ళాలి.  అంచేత చాలా షోలు ఒదులుకోవలసి వచ్చింది. "

రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
aaditya hrudayam - vn adithya