Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ ఏ ఎస్ పాస్

kittugaadu - inter fail.. ias pass

అంతెందుకు? బొంబాయి వచ్చిన కొత్తలో ఈ ఎం టెక్ బ్యాచ్ ఎంత ఎక్కువగా ఉండేది ?

ఇప్పుడు ఎలా తగ్గిపోయిందో చూడు...సగం మందిని మనమే కదా ఫ్లైట్ ఎక్కించింది అమెరికాకి..అన్నాడు కమలాకర్. '  మేకుల్లాంటోళ్ళురా వీళ్ళు ' అనుకున్నాడు కిట్టు.

కాలం గడుస్తూ ఉంది.

కిట్టు తన తిప్పలు తను పడుతూనే ఉన్నాడు.

ఈలోగా కమలాకర్ ఆశించిన గవర్నమెంట్ ఉద్యోగం రానే వచ్చింది. కమలాకర్ వెళ్ళిపోయాడు. కనకరాజుగారికీ,శ్రీనివాస్ అనే ఇంకొకాయనకీ ' ఐయ్యీఎస్ ' వరించింది.

ఒకాయన రైల్వేకి,ఇంకొకాయన పోస్టల్ అండ్ టెలికాం డిపార్ట్ మెంట్ కీ  ఉనంత హోదాలో వెళ్ళిపోయారు. ఈ ఎం టెక్ స్టూడెంట్లు పెద్ద పెద్ద ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించి , కంపెనీ పేరు మీద జర్మనీ, జపాన్,అమెరికాలకు వెళ్ళిపోయారు.

కిట్టూ కి కొత్త రూమ్మేట్లు వస్తున్నారు...వెళ్తున్నారు.

కిట్టూ ప్రపంచం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

సివిల్స్...సివిల్స్...ఇదే ప్రపంచం.....

ఆఫీసుకి వెళ్ళడం,రావడం, సమయం దొరికినప్పుడల్లా చదవడం...

గిరిధర్ ఎప్పుడన్నా బొంబాయి వచ్చినప్పుడు తప్పకుండా కిట్టుని కలుస్తాడు.

గిరిధర్ తో కలిసినప్పుడు మాత్రం మామూలు లోకంలోకి వచ్చి ఆనందంగా సమయం గడిపేవాడు కిట్టు.

ఇది మిగిలిన రూమ్మేట్లకి కంటగింపుగా ఉండేది.

'మామూలు రోజుల్లో ఎవ్వడితో మాట్లాడేవాడు కాడు కిట్టు.

రాగానే పుస్తకాలు తీసుకుని బాల్కనీలో లైట్ వేసుకుని తలుపు వేసుకుంటాడు...

ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు పొద్దున్నే పోతాడో తెలియదు.

' ఈ గిరిధర్ వచ్చినప్పుడు మాత్రం ఉల్లాసంగా కాలం గడుపుతాడు.' అనుకునేవారు.

కిట్టూతో అనేవారు కూడా...నవ్వేసి ఊరుకునేవాడు కిట్టు.

' ఈలోగా బొంబాయిలో అల్లర్లు చెలరేగాయి.బాంబు  పేలుళ్ళు, దాడులు..మారణహోమం...మొదలయ్యింది. 

అంతా అల్లకల్లోలమైపోయింది.అందర్లోనూ భయం..ఆందోళన....

కిట్టు ఉండే ప్రదేశం ఇలాంటి వాటికి అనువైన ప్రదేశం. ఏ అర్ధరాత్రి ఎవడు రూమ్మీద దాడి చేస్తాడో ఏమవుతుందో అనే భయం. రాత్రి పూట పోలీసులు గస్తీ తిరిగేవారు. అదే సమయం లో దేవుడు దయ తలచినట్లుగా కిట్టుకి హైద్రాబాద్ కి ట్రాన్స్ ఫర్ అయ్యింది. ఇక ఆలస్యం చేయకుండా బ్రతుకు జీవుడా అనుకుంటూ మూటా ముల్లే సర్దుకుని వెంటనే హైద్రాబాద్ బండెక్కేసాడు కిట్టు.

ప్రశాంత నగరం...

హైద్రాబాద్..

బస్సుల కోసం పరిగెత్తేవారు...ఫుట్ బోర్డింగ్ చేసేవారు...హైద్రాబాద్ లో బస్సు ప్రయాణం చెయ్యాలంటే  లెక్కల్లో ' ప్రాబబిలిటీ ' అనే అంశమొకటుంటుంది. అందులో నిష్ణాతులై ఉండాలి. ఈ ప్రాబబిలిటీ ఏమిటంటే ఒక నాణేన్ని పైకి విసిరితే బొమ్మ పడుతుందో, బొరుసు  పడుతుందో చెప్పగలగడం. అలాగే ఒక బుట్టలో ఎర్ర బంతులు, పసుపు బంతులు వేసి చేయి పట్టి పైకి లాగితే చేతిలోకి ఎన్ని ఎర్ర బంతులు రావచ్చు..ఎన్ని పసుపు బంతులు రావచ్చో చెప్పగలగడం....ఈ ప్రాబబిలిటి బాగా వచ్చినవాడే బస్సుల్లో ప్రయాణించగలడు.

నువ్వున్న స్టాపులో బస్సు ఆగదు. ముందుకైనా ఆగుతుంది..వెనకైనా ఆగుతుంది. పరుగెత్తుకెళ్ళి పట్టుకునేలోపు వెళ్ళిపోతుంది. ప్రాబబిలిటీ వచ్చి ఉంటే బస్సు ముందు ఆగుతుందో, వెనక ఆగుతుందో అంచనా వేసి తెలుసుకోగలం.

లేదంటే చాలా కష్టం...బస్సు డ్రైవర్ బస్సుని బస్సుగా కాక స్కూటర్ లాగా భావించి పరుగెత్తిస్తాడు. పద్మ వ్యూహం లో ' అభిమన్యుడి ' లాగా కండక్టర్ టికెట్ కొడుతూంటాడు.  ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణీకులు ఆడ, మగ అనే తేడా లేకుండా ..ఎక్కడైనా ఎక్కుతారు, ఎక్కడైనా దిగుతారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్సాగితే ...దాన్నే బస్టాపుగా భావించి, ఎక్కుతూ, దిగుతూ ఉంటారు. పరిగెత్తే బస్సుల్లోంచి ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎక్కుతారో, దిగుతారో తెలియదు. ఈ హడావుడిలో కొంతమంది బస్సు కింద పడతారు. బస్సెక్కబోతూ కాలేజీ విద్యార్థి మృతి లేదా, విద్యార్థిని మృతి అని తర్వాత రోజు పేపర్లో వస్తుంది. ఆ చనిపోయిన విద్యార్థి లేదా విద్యార్థిని తల్లిదండ్రులకు కడుపుకోత. బంధు మిత్రులకు ఆవేదన.

కథ మళ్ళీ షరా మామూలే.

అమెరికా వాసులు స్వేచ్చా జీవులు.. తిండి లేకపోయినా బ్రతకగలరు...కానీ స్వేచ్చ లేకపోతే బ్రతకలేరు. తీవ్రంగా బాధపడతారు. ఆ స్వేచ్చతోనే తుపాకులు కొంటూంటారు. విరివిగా....ఎవడికో తోచక ఒక బిల్డింగ్ పైకెక్కి దారిన పోయే వాళ్ళని లెక్కబెట్టుకుంటూ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తుంటాడు.

తర్వాతి రోజు పేపర్లో వస్తుంది...ఉన్మాద స్థితిలో ఉన్న గన్ మెన్ పాతిక మందిని కాల్చి పారేసాడని....ఇది తరచూ పేపర్లో వచ్చే వార్త...
అలాగే హైద్రాబాద్ వాసులు కూడా స్వేచ్చా జీవులే..తమ ఇష్టం వచ్చినట్టు బస్సు ఎక్కుతారు..దిగుతారు.. ప్రాణాలు కూడా లెక్క చేయరు.. ఒకవేళ  వీళ్ళని కట్టడి చేయాలని ప్రయత్నిస్తే అన్ పాపులర్ అయిపోతామేమో అని భయపడి ప్రభుత్వం కూడా ' అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడ ' మని దేవుణ్ణి ప్రార్ధిస్తూ ఉంటారు.

ఒక పది మందిని ఎక్కించుకుని తమ ' ఎం ' కు అనగా మనసుకు ఎటువైపు తిప్పాలని అనిపిస్తే అటువైపు ' తూనీగ ' లాగా ఆటోను తిప్పే ఆటో వాళ్ళు, రోడ్డుని దాటేసి, పచ్చ లైటు వచ్చేలోపే, రోడ్డుని దాటేసే స్కూటరిస్టులు...స్కూటరిస్ట్ లు దేవుడు తమకు స్కూటరిచ్చింది, ఎక్కడా ఆగకుండా ముందుకు వెళ్ళడానికి అని గాఢంగా నమ్మి ఏ అడ్డమొచ్చినా ఏది ఏమైనా సరే ఆగకుండా, ఏదో ఒక సందులోంచో, ఫు ట్ పాత్ పైనుండో, డివైడర్ మధ్యలోనుండో , ట్రాఫిక్ కు వ్యతిరేక దిశలోనో దూసుకు పోతుంటారు. స్కూటరిస్టులు, ఆటో ఆటో వాళ్ళు, కార్ల వాళ్ళు, ట్రక్కుల వాళ్ళు, బస్సుల వాళ్ళు అందరూ తమకు తోచినట్లుగా

ఉన్నా లేకున్నా .. చిన్న పిల్లవాడి చేతికి నొక్కగానే కుయ్యిమనే బొమ్మ చేతికిస్తే..ఎలా ఆగకుండా ఇష్టం వచ్చినట్టు నొక్కుతాడో అలాగే వీళ్ళందరూ ' హారన్ ' ని పూర్తిగా వాడుతూ, ఇష్టం వచ్చినట్లుగా నొక్కుతూ..నగరం లో విహరిస్తూ ఉంటారు.

హైద్రాబాద్ సాల్ట్ బిస్కట్లు..ఇరానీ చాయ్...బిర్యానీ..ఎంత చెప్పుకున్నా ఇంకా చాలని నగరం హైద్రాబాద్..హైద్రాబాద్లో ఇంకో విచిత్రం ఉంది.
నడి రోడ్డు మీద ఎవడో ఒక పోల్ పాతుతాడు. దానిపై హిందూ అయితే హిందూ జెండా..మరో మతం అయితే వాళ్ళ వాళ్ళ జెండా కడతాడు...ఈ తర్వాత ఒక పోల్ కాస్తా రెండు పోల్ లైపోతాయి. ఆ తర్వాత నెమ్మదిగా మతాన్ని బట్టి విగ్రహమో, లేదా ఏదో ఒక గుర్తో వెలుస్తుంది.ఈ  తర్వాత దాని చుట్టూ ఒక గోడ వెలుస్తుంది

అలా ఇంతింతై..వటుడింతై అన్నట్టుగా ఒక పెద్ద డెవాలయమో మసీదో వెలిసి భారీ  ఎత్తున పూజలూ, పునస్కారాలూ జరిగిపోతూ ఉంటాయి...ట్రాఫిక్ కి ఎంత అడ్డుగా ఉన్నా సరే ఎవరూ ఏమీ అనరు.

అందరికీ భయం...ఎందుకన్నా మంచిదని ఒక దణ్ణం పెట్టుకుని పోతారు. ఇలాంటివి నగరం లో కొన్ని వందలు ఉన్నాయి. ప్రభుత్వం వారికీ భయమే. ఒకవేళ ఈ కట్టడాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తే ఆయా మతస్థుల మనోభావాలు ఎక్కడ దెబ్బ తింటాయో ఏం కొంపలు మునుగుతాయి తమ పీకల మీదకు వస్తుందో అని ప్రభుత్వం వారి భయం..' ట్రాఫిక్ కి అడ్డంగా ఉండి ..ఇబ్బంది కలిగించే కట్టడాలను తొలగించండి ' అని సుప్రీం కోర్టు చెప్పినా గానీ అందరికీ భయమే.... ఈ సంస్యా పరిష్కారానికి ఒకాయన ' ఈ కట్టడాలను పడగొట్టకుండా వాటిపై వంతెనలు కడితే బాగుంటుంది. ' అని సూచించాడు.

ఒకటా, రెండా...ఎన్నింటికని వంతెనలు కడతారు ? మరి దీనికి పరిష్కారమేమిటి? చాలా సింపుల్ పరిష్కారముంది..నగరంలో మొత్తం ఎన్ని ఇలాంటి కట్టడాలు ఉన్నాయో లెక్కించాలి.

మతాన్ని బట్టి మత పెద్దల్ని కమిటీలుగా తయారు చేయాలి. ఈ కమిటీ సాయంతో మతానికి తగ్గట్టుగా పూజలూ, పునస్కారాలూ, శాంతులూ చేయించి, దేవుళ్ళ చిహ్నాలు, విగ్రహాలు గౌరవంగా తీసి, ఏదో పెద్ద డెవాలయంలోనో మసీదులోనో కలిపేయాలి. ఆ తర్వాత ' మత పెద్దల ' ఆధ్వర్యం లోనే వాళ్ళ అంగీకారం తో, ఆశీర్వాదంతో వాళ్ళ  సమక్షంలో మిగిలిపోయిన గోడలు తొలగించాలి. ప్రజలందరికీ మేలు జరిగే ఈ కార్యక్రమం ప్రభుత్వం దగ్గరుండి నడిపించాలి. ఎవర్నీ బాధించకుండా ఈ విధంగా అడ్డంగా ఉన్న కట్టడాలు తీసేస్తే హైదరాబాద్ ట్రాఫిక్ చక్కగా చల్లగా, సాఫీగా సాగిపోతుంది. ఈ పని చేయాలంటే ముందుగా కావలసింది చిత్తశుద్ధి. మనసుంటే మార్గం ఉంటుంది.

రావడం రావడం ' చింతల బస్తి ' లో ఉన్న పెద్దన్నయ్య ఇంట్లో దిగాడు కిట్టు. పెద్దన్నయ్య సిటీ కానిస్టేబుల్. అన్న, వదిన, ముచ్చటైన ముగ్గురు పిల్లలు. ఒకటవ అంతస్థులోని చిన్న ఫ్లాట్ లో ఉండేవాడు.

కింద సరిగ్గా వీళ్ళ పోర్షన్ కింద ' కిషన్ మటన్ షాపు ' ఉండేది. కిట్టు వాళ్ళ అన్నయ్య పైనుంచి పెద్దగా అరిచేవాడు కిషన్ భాయ్...ఏక్ కిలో మటన్...

ఠీక్ హై...అనేవాడు కిషన్...

పైనుండి వదినగారు తాడు కట్టిన చిన్న బకెట్ కిందకు వదిలేవారు. మటన్ అందులోనే ఉంచేవాడు కిషన్ భాయ్. 

' బక్కెట్ షాపింగ్ ' మటన్ కే కాదు, వదిన గారు బాల్కనీలోంచే క్రింద వెళ్తున్న కూరగాయల బండి వాళ్ళతో కూరగాయలు బేరమాడేసి బక్కెట్ షాపింగ్ చేసేది.పూచి పుల్లతో సహా బస్తీలోనే దొరుకుతాయి.

ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. బస్తీ వాళ్ళు ఒకరికొకరు బాగా తెలుసు. ఒక రకమైన గ్రామం లోని వాతావరణం.

సరిగ్గా వీళ్ళ ఫ్లాట్ కి ఆమడ దూరం లోనే ఒక మేడ ఉంటుంది. ఆ మేడలో ఉన్న ఆసామి సాయిబాబా భక్తుడు. ప్రొద్దున్న, సాయంత్రం పెద్ద పెద్ద మైకులతో మొత్తం బస్తీకి వినిపించేంత సౌండ్ తో గంటలు గంటలు సాయిబాబా భజనలు వినిపిస్తాడు. అతని మీద కేసులు కూడా పెట్టారంట ఈ సౌండ్ భరించలేని కొంతమంది. కేసులూ లేవు, గీసులూ లేవు...

ఎవర్నీ లెక్క చేయడంట ఆ ఆసామి. భజన గీతాల్ని ఆపే సమస్యే లేదు.

కిట్టు ఆఫీస్ కోఠీలో  ఉమెన్స్ కాలేజీ ఎదురుగా...

బస్సులో వెళ్ళడం..రావడం...గొడవ ఎందుకని కిట్టు వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న గారితో చెప్పి , కిట్టుకి ఒక బజాజ్ సన్నీ కొనిపెట్టాడు. ఈ బజాజ్ సన్నీ ఎలుకలాగా ఉంటుంది. వినాయకుడికి మూషిక వాహనమెలాగ సేవ చేస్తుందో ఈ బజాజ్ సన్నీ కిట్టుకి అలాగ సేవ చేసింది.
ఇక సివిల్స్ లో కోచింగ్ లో చేరడం మిగిలింది. హైద్రాబాద్ లో కోచింగ్ సెంటర్లకు కొదువ లేదు. బొంబాయిలో పుటం వేసి వెతికినా కోచింగ్ సెంటర్లు దొరకవు. సివిల్స్ ప్రిపరేషన్ అంటూ ..రెండేళ్ళు ముక్కు మూసుకుని తపస్సు చెయ్యలేరు. బొంబాయి వాళ్ళు బొంబాయి స్టూడెంట్లు అర్జెంటుగా డబ్బులు వచ్చే కోర్సుల్లో చేరిపోయి, అవి పూర్తి కాగానే, ఉద్యోగాల్లో చేరి సంపాదన ప్రారంభిస్తారు. సివిల్స్ జ్వరం బొంబాయిలో లేదు. హైద్రాబాద్ సివిల్స్ కు పెట్టింది పేరు. ముందుగా చెప్పుకోదగిన కోచింగ్ సెంటర్ ' రాయు ' గారిది. ' రాయు ' అని కిట్టు పిలుచుకునేది ఎందుకంటే, ఇంగ్లీష్ అక్షరాలు ఆర్ ఏ యూ ' రావ్ అనాలి.

ఆర్ ఏ ఓ కూడా రావ్ నే, ఆర్ ఏ ఓ రావ్ కోచింగ్ సెంటర్ ఒకటుంది హైద్రాబాద్ లో...5వ తరగతి నుండి మొదలుపెట్టి పీజీ దాకా కోచింగ్ లు ఇచ్చెయ్యగలరు ఈ ఆర్ ఏ ఓ రావ్ గారు.

పనిలో పని సివిల్స్ వదలడం ఎందుకని సివిల్స్ కి కూడా కోచింగ్ ఇచ్చేస్తానంటున్నారాయన. 

ఆర్ ఏ యూ రావ్ గారు సివిల్స్ కి పెట్టింది పేరు. ఆయన దగ్గర చేరిన వాళ్ళు ఉత్తీర్ణులై తీరతారు అనే  పేరుంది..ఆయన దగ్గర చేరదామని ఎంక్వైరీ చేస్తే ఫీజు ఎక్కువని తెలిసింది.

ఈలోగా కిట్టు పెద్దన్నయ్య హైద్రాబాద్ స్టడీ సర్కిల్ నాకు బాగా తెలుసు, దాన్ని నడిపించే వాళ్ళలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. సేవాదృక్పధంతో నడిచే సంస్థ అది. అని కిట్టుని తీసుకెళ్ళి వాళ్ళని బ్రతిమిలాడి ఫీజు రాయితీ పొంది  కిట్టుని జాయిన్ చేసేశాడు.

అటు అఫీసు, ఇటు కోచింగ్ క్లాసులకు హాజరయ్యేవాడు కిట్టు. కిట్టు హైద్రాబాద్ లో నిలదొక్కుకోవడనికీ, ఆ తర్వాత చదువు ప్రశాంతంగా కొనసాగించడానికీ..కిట్టు వాళ్ళ పెద్దన్నయ్య , వదినలు చేసిన సాయం అంతా ఇంతా కాదు.

ఈ కోచింగ్ చాలా ఉత్సాహాన్నిచ్చింది కిట్టుకి.

భౌతిక శాస్త్రం చెప్పడానికి ' పాచెకో ' అనే ఆయన వచ్చేవాడు.

ఆయన మెడ తిప్పాలంటే మనిషంతా తిరగాలి.

భౌతిక శాస్త్రాన్ని మెత్తగా రుబ్బి, వడపోసి, ఆ రసాన్ని చిన్న చిన్నగా స్పూన్ తో నోట్లో పోస్తున్నట్లుండేది ఆయన బోధించడం.ఇంత సులభతరంగా.. అర్థమయ్యేట్లుగా..సరళంగా...నవ్వుతూ,...ప్రేమతో రంగరించి పోస్తున్నాడాయన.

ఇంటర్మీడియట్ లో సడెన్ గా ఇంగ్లీష్ మీడియం లో భౌతిక శాస్త్రంలో పీజీ చేసిన వాళ్ళు కూడా ఆయన క్లాస్ కు మానకుండా వచ్చేవాళ్ళు. అంత గొప్పవాడు ' పాచెకో ' మహాశయుడు.

ఇక చరిత్ర విషయానికొస్తే, గోపాలరెడ్డి గారు.అదొక ప్రభంజనం...' ఆయన వ్యక్తి కాదు, శక్తి ' అనేమాట గోపాల రెడ్డి గారికి సరిపోతుంది. ఏం తెలుసురా మీకు చరిత్రంటే...? అదేదో పనికిరాని పాత చెత్త అనుకుంటున్నారా...? చరిత్ర యొక్క ఔన్నత్యం మీకేం తెలుసురా..? అనే భావం ఆయన బొధించే విధానాన్ని బట్ట్ట్టి సులువుగా అర్థమౌతుంది. విద్యార్థుల మనసుల్లో ఏముందో ఆయనకు తెలుసు.

కంచు కంఠం...ఎవరైనా మైకు చేతికిస్తే విసిరి పడేసేవాడు.భారీ కాయం, మిలిటరీ కమాండర్ లాగా చొక్కాకి భుజకీర్తులు ఎంటీ ఆర్ లాగా హావ భావాలు...చేతిని కదపడం....

చరిత్రని ఔపోసన పట్టి, దానిని సరళతరం చేసి ..విద్యార్థుల బుర్రల్లోకి దూసుకుపోయేలా బాణాల్లాంటి మాటలతో ఆయన బోధిస్తూంటే క్లాసంతా సూది కింద పడ్డా వింపినిచేటంత నిశ్శబ్దం...

ఒకసారి విన్న వాళ్ళంతా వినేసాం కదా మళ్ళీ అదే క్లాస్ కు ఎందుకు ? అనుకోకుండా మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాళ్ళు. స్టూడెంట్స్ అందరికీ ఆయనంటే దడ...గౌరవం... చరిత్ర నేర్చుకోవాలంటే గోపాల రెడ్డీ గారి దగ్గరే నేర్చుకోవాలి అనేవారు. ఆయనంటే గిట్టనివాళ్ళు ఆ..అందరూ చెప్పేదే ఆయనా చెప్తాడు..కాకపోతే సినిమా ఎఫెక్టులతో మాయ చేస్తాడు అనేవారు.

భౌగోళిక శాస్త్రాన్ని ' విజయాభోళె ' అనే మేడం భోధించేవారు. ఎవరికైనా ఏదైనా విద్య బాగా వస్తే ఇంగ్లిష్ లో ఫింగర్ టిప్స్ మీద ఉంది అతనికి ఆ విద్య అంటారు. ఈ ' ఫింగర్ టిప్స్ ' అనేమాట మేడం కి బాగా సరిపోతుంది. సన్నటి తీగ లాంటి పర్సనాలిటీ! వేళ్ళని చిత్రంగా కదుపుతూ బోధించేవారామె. అర్థం కాలేదు మేడం... మళ్ళీ చెప్పండి అనేవారే లేరు.

లెక్కలు చెప్పడానికి ' కోటీ ' గారు వచ్చేవారు. భుజాన్ని తమాషాగా కదుపుతూ చకచకా లెక్కలు చేసేసేవారు.

ఆయన చెప్పిందంతా రాసేసుకుని, ఇంటికి వెళ్ళి ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తే చాలు.

కిట్టు జీవితం లో మొదటిసారి ఫర్వాలేదు కొద్దో గొప్పో లెక్కలు చెయ్యవచ్చు అన్న ధైర్యం కలిగింది.

అలాగే భారత ఆర్ధిక వ్యవస్థ, రాజకీయాలు, రసాయన శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం, కరెంట్ అఫైర్స్, (అనగా భారత దేశం లోనూ, చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ ఏమి జరుగుతుందో తెలుసుకోవడం) చక్కగా అర్థమయ్యే రీతిలో బోధించేవారు.

ఒంటరిగా చదివినప్పుడు ఏదన్నా సందేహం వస్తే తీర్చేవారే లేరు.

తనంతట తాను చదువుకోవాలి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
O college droup out  premakatha