Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugaadu - inter fail.. ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ ప్రేమకథ

O college droup out  premakatha

ఎందుకంటే ఆమెకు తనమీద బాగా కోపం వచ్చింది. ఉదయం తన దారిన బిజినెస్‌ టూర్‌కివెళ్ళి రాత్రి ఎప్పటికో వస్తుంది కాబట్టి నోప్రాబ్లం. ఏదో వంకతో ఉదయం సూట్‌కేస్‌తో బయట పడవచ్చు.

ఈ ఆలోచన రాగానే

త్రివిక్రమ్‌ మనసుకు కొంచెం ప్రశాంతత చిక్కింది. అందుకే ఆ ప్రశాంతతో ప్రశాంతంగా నిద్రపోయాడు.

అంతేగాని

తెల్లవారగానే వరేణ్య అక్కడ ప్రత్యక్షమవుతుందని పాపం వూహించలేకపోయాడు త్రివిక్రమ్‌.

చింతలేని మనిషి చిదానందుడవుతాడు, సదానందుడవుతాడు అంటారు మహాత్ములు, ఇది నూటికి నూరుశాతం నిజంకూడ.

మనిషిని పుట్టించిన దేవుడు ఆశను కూడా పుట్టించాడు.

ఆశ అనేది మనిషి బ్రతికింప చేస్తుంది.

దురాశ పపతనానికి దారితీస్తుంది.

అందుకే

ఈ ప్రపంచంలోని సకల దుఃఖాలకు మూలం ఆశ అన్నారు. ఆశ అంటే కోరిక,  .....కోరికలను జయించినవాడు ఆత్మజ్ఞాని అవుతాడు. ఇది మహాత్ములకు తప్ప అందరికీ సాధ్యంకాదు.

సంసార జీవితంలోని మనిషి కోరికలను వదిలేస్తే సన్యాసి అవుతాడు. ఈ రోజుల్లో భోగభాగ్యాలు కోరుకునే వాళ్ళేగాని, సన్యాసం కోరుకునే వాళ్ళు ఎవరు? ఇంతకీ ఆశకు చింతకూ వున్న తేడా ఏమిటి ?

ఆశ అనేది కోరిక.

చింత అనేది విచారం.

కోరిక తీరినప్పుడు సంతోషం కలుగుతుంది.

కోరిక తీరనప్పుడు విచారం కలుగుతుంది.

అయితే

చింత అనేదానికి మూలం కోరిక ఒక్కటే కాదు. ఇంకా అనేకానేక సందర్బాల్లో చింత మనిషిన పట్టి పీడిస్తుంటుంది. ఒకడికి సమయానికి డబ్బు చేతికి అందలేదన్న చింత, ఒకడికి పెళ్ళాం కాపురానికి రాలేదన్న చింత మరొకరికి బాకీలవాడు ఎప్పుడు ఇంటికొస్తాడోనన్న చింత, మరొకడికి కొత్త సినిమాకి ఫస్ట్‌షో టికెట్‌ దొరకలేదని చింత. ఇలా ఆయా సందర్బాన్నిబట్టి, చింతన స్వరూపం మారిపోతుంటుంది.

అందుచేత ఈ ప్రపంచంలో చింతలేని మనిషిని మనం చూడలేం. జీవితానికి భద్రత కలిగిన, మనిషిలో మాత్రమే కొంతలో కొంత నిశ్చింతను మనం చూడగలుగుతాం.

నిశ్చింతగా బ్రతికే మనిషిలో సంతోషం ఎప్పుడూ వుంటుంది. సుఖశాంతులతో జీవిస్తాడు.

ప్రస్తుతం మన హీరో త్రివిక్రమ్‌ వరకు అతను నిశ్చింతుడంటే ఆశ్చర్యంలేదు.

ఎందుకంటే

అక్కడినుంచి ఎప్పుడు పారిపోదామా అనే ఆలోచనలో వున్న త్రివిక్రమ్‌ వరేణ్య తనతో టూర్‌కి రమ్మని ప్రపోజ్‌ చేయగానే కంగారుపడ్డాడు. ఆమెతో వెళితే మరోరోజు ఆగిపోవల్సి వస్తుంది. అది తనకు ఇష్టంలేదు.

ఎలాగా అని మనసులోనే చింతన పట్టుకుంది. చివరకు ఆమె అలిగికోపగించి వెళ్ళిపోడంతో ఇక ఆమె తనకోసం రాదని వూహించుకుని సంతోషించాడు. చింత తొలగిపోయి ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు.

ఎంత గాఢనిద్రలో వున్నా

తెల్లవారుజామున అయిదు గంటలకు అతడికి మెలుకూ వచ్చేస్తుంది. ఇది చాలా కాలంగా అతడి అలవాటు. ఉదయం అయిదుగంటలకు లేచి అరగంట రన్నింగ్‌చేసి, అటునుంచి అటు కరాటే క్లాస్‌లకు వెళ్ళి ఏడు గంటలకు ఇంటికి చేరుకోవటం అలవాటు.

తండ్రి గోవిందరావుగారిచేత తిట్లు తినటం కూడా అలవాటే అనుకోండి.

ఇలా ఏర్పడిన అలవాటు కారణంగానే ఇప్పుడు కూడా అలారం కొట్టకుండానే తెల్లవారుజామున అయిదు గంటలకి అతడికి మెలుకువ వచ్చేసింది.

నిశ్చితంగా నిద్రపోయాడేమో

డీప్‌ స్లీప్‌నుంచి మెలుకూ వచ్చినా ఇంకా బద్దకం మాత్రం వదల్లేదు. అలాగని ఇక బెడ్‌మీదే వుండిపోలేదు త్రివిక్రమ్‌. ఈ టైంలో గెస్ట్‌హౌస్‌లో అంతా గాఢనిద్రలో వుంటారు. గాబట్టి తను తప్పించుకు వెళ్ళిపోడానికి ఇది చక్కని అవకాశం. ఈ అవకాశాన్ని వదులుకునే ఉద్దేశం అతడికి లేదు. అందుకే ఇక ఒక్క క్షణం కూడా అతను ఆలస్యం చేయలేదు.

అటాచ్డ్‌ బాత్‌రూంలో కాలకృత్యాలు తీర్చుకొని హాట్‌వాటర్‌లో హాట్‌హాట్‌గా స్నానంచేసి పావుగంటలో ఫ్రెషప్‌ అయిపోయాడు. డ్రస్‌వేసుకుని నీట్‌గా తయారయ్యాడు. తన బిలాంగింగ్స్‌ అన్నీ యధాప్రకారం సూట్‌కేస్‌లో సర్దేసుకుని లాక్‌చేసాడు. ఎందుకయినా మంచిదని డోర్‌ తెరిచి ఒకసారి హాలువరకు వచ్చి చూసాడు.

తన అంచనా కరక్టే!

పనివాళ్ళంతా హాల్లో తలోపక్కన గాఢనిద్రలో వున్నారు. వెనక్కి వచ్చి తన సూట్‌కేస్‌ అందుకున్నాడు. ఎవరూ తనను పసిగట్టకుండా చూడమని కనబడని దేవుళ్ళందరికీ మొక్కుకుంటూ పిల్లిలా బయటికొచ్చి తలుపు దగ్గరగా మూసాడు. అడుగులో అడుగు వేసుకొంటూ ముఖద్వారాన్ని చేరుకున్నాడు.

ఎక్కడో పాడుపిల్లి మ్యావ్‌మని అరిచింది.

బయట వీదిలో ఎక్కడో వెధవకుక్క బొఁయ్‌మని మొరిగింది. ఉలికిపాటున అణచుకొంటూ ఒక్కక్షణం అక్కడే ఆగిపోయాడు.

అంతలో

తోసుకురాబోయింది పెద్ద తుమ్ము ఒకటి. బలవంతంగా ఆపుకున్నాడు. ఈ సమయంలో తుమ్మితే  ఉలికిపడి లేచిపోతారంతా, ప్లానంతా పాడయిపోతుంది. అయినా ఏమిటిది? శకునమే బాగున్నట్టులేదే.

పది సెకన్ల సందేహంతో అలాగే నిలబడిపోయాడు.

అయినా తలకాయ రోట్లో పెట్టాక రోకలిపోటు తగులుతుందన్న భయం దేనికి? టైం బాగుంటే నిరాటకంగా వీధిలోకెళ్ళిపోతాడు. ఎవరన్నా
చూస్తే తిరిగి లోనకు వచ్చి కూర్చుంటాడు. ఇందులో తెగ ఆలోచించేంత విషయం ఏముంది? అని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు.

 బోల్ట్‌ తీసి చప్పుడు గాకుండా వీధి తలుపు తెరిచాడు. బయటకు అడుగుపెట్టి నిశ్శబ్దంగా, తలుపు దగ్గరగా మూసాడు. ఉదయపు గాలి ఆహ్లాదపరుస్తోంది. మొదటి గండం గడిచిపోయిందికాబట్టి ఎగిరి గంతులు వేయాలన్నంత ఆనందం కలిగింది. త్రివిక్రమ్‌ పోర్టికోనుంచి గేటువైపు అడుగులు వేసాడు.

ఎందుచేతో ఇవాళ వాతావరణం మారింది.

ఆకాశంలో మబ్బులు కన్పిస్తున్నాయి. దట్టమైన మబ్బులు, గాలి కూడా చలిగా వుంది. అదృష్టవశాత్తు గేటు దగ్గర సెంట్రీలు కూడా లేరు. బహుష పక్కన కాకా హోటల్లో చాయ్‌తాగి రావటానికి వెళ్ళుండాలి. టైం అయిదన్నర అయింది.

ఇక తనకు ఎదురులేదు అనుకుంటూ చకచకా గేటు సమీపంలోకి వచ్చేసాడతను, ఇంకో ఇరవై అడుగులు వేస్తే గేటు దాటి వీధిలోకి వెళ్ళిపోయేవాడే.

కాని ఇంతలోనే కొంప మునిగిపోతున్నట్టుగా రివ్వున దూసుకొచ్చేసింది ఆటో ఒకటి. గేటులోంచి లోనకు తిరుగుతున్న ఆటోను చూసి ఎత్తిన పాదాన్ని ఎత్తినట్టే దించి బొమ్మలా అక్కడే నిలబడిపోయాడు త్రివిక్రమ్‌.

అయినా ఇంత పొద్దుటే ఆటో ఎక్కి వస్తున్న చుట్టం ఎవరని? వేళాపాళ వుండక్కర్లా? తన  దారిన వెళ్ళిపోవాలా ఆగాలా...........ఆటో తనను దాటి పోర్టికోలోకి వెళ్ళిపోతుందనుకున్నాడు. కాని సెడన్‌బ్రేక్‌తో అతడి సమీపంలోనే ఆగింది ఆటో.

మెరుపుతీగలాంటి ఒక యువతి ఆటో దిగుతుంటే చూసి మొదట ఎవరో అనుకున్నాడు. ఆ వెంటనే గుర్తుపట్టి తేలుకుట్టినట్టు ఉలికిపడ్డాడు. బయలుదేరి బయటికొస్తుంటే పిల్లీ ఎందుకు మ్యావ్‌ అందో......... కుక్క ఎందుకు భౌభౌ మందో... తనకు ఎందుకు పెద్ద తుమ్ము ముంచుకురాబోయిందో ఇప్పుడు.....ఇప్పుడు అర్ధమవుతోంది.

ఆటో దిగిన లేడీ ఎవరో కాదు.

సాక్షాత్తూ వరేణ్య.

అనుకున్న ప్రకారం టూర్‌కి వెళ్ళటం కోసం ప్రిపేరై పొద్దునే వచ్చేసిందామె.

ఆమె రాదనుకుని డిసైడ్‌పోయిన త్రివిక్రమ్‌కి ఇది పెద్ద షాక్‌.......... అనవసరంగా ఆమెకు దొరికిపోయాడు.

''ఓరి దేవుడా! గండం గట్టెక్కింది నన్ను వీధిలో పడేయమని గుర్తున్న అమ్మలందిరికీ దండం పెట్టుకున్నాను. కానీ ఏం లాభం? మనసులోనే ఉడుక్కున్నాడు త్రివిక్రమ్‌.

నిన్నంతా ఆమెని చీర, జాకెట్టులోనే చూసాడు. ఇప్పుడామె చక్కటి చుడీదార్‌లో సీతాకోకచిలుకలా తయారైవచ్చింది. అందుకే వెంటనే ఆమెని గుర్తుపట్టలేకపోయాడు.

''ఎక్కడికి....?'' ఆటోదిగి అతడివంక చూస్తూ దబాయించింది వరేణ్య.

''ఇక్కడికే'' అన్నాడు.

''ఇక్కడికే అంటే? చేతిలో సూట్‌కేస్‌ వుంది?''

''తాళం చెడిపోయింది. బాగుచేయిద్దామని.''

''నీకు నిజంచెప్పే అలావాటులేదా? పొద్దుటే ఎక్కడికి పారిపోతున్నావ్‌?''

''పొద్దుటే పోలేరమ్మలా అరవకు, నేన్నిజమే  చెప్పాను.''

''మైగాడ్‌! నన్ను చూస్తుంటే పోలేరమ్మ గుర్తొస్తొందా నీకు?''

''పోలేరమ్మగాకుంటే బంగారమ్మ. నన్నొదులు, అసలు విషయం చెప్పేస్తున్నాను. నాకిక్కడ నచ్చలేదు. ............నచ్చలేదంతే....... బయట హోటల్లో రూం తీసుకుంటాను.''

''ఎందుకు నచ్చలేదు?''

''రాత్రంతా నిద్రేలేదు?''

''ఏమైంది? నల్లులు పొడిచాయా, దోమలు కుట్టాయా? దయ్యం ఏదన్నా పట్టుకుందా?''

''నువ్వే వచ్చేసావ్‌గా, వేరే దయ్యం ఎందుకు?''

''మైగాడ్‌! ఇట్స్‌ టూమచ్‌........ఆగు నీ పని చేస్తా.''

ఆమె ఏదో చెప్పబోతుంటే

మధ్యలో ఆటోవాడు అరిచాడు.

అమ్మా! మీరు తర్వాత గొడవపడండి తల్లీ. నా ఆటో డబ్బులిస్తే వెళ్ళిపోతాను'' అంటూ.

''నువ్వాగవయ్యా'' విసుకుంది వరేణ్య.

''నేనాగితే తెల్లారిపోతుందమ్మా! చూస్తుంటే మీది లవ్‌ కేస్‌లా వుంది. ఇప్పుడు తేలదుగానీ నా డబ్బులు పడేస్తే వెళ్ళిపోతాను మేడం'' అన్నాడు.

వాడు లవ్‌కేస్‌ అని జడ్జిమెంట్‌ ఇచ్చినందుకు

వాడ్ని ఆటోలోంచి లాగి నాలుగు తన్నితే ఎలా వుంటుందాని ఆలోచించాడు త్రివిక్రమ్‌.

ఈ లోపల ఆమె వాడికి డబ్బులిచ్చేసి, ఆటో సీటుమీదున్న ఖరీదైన తన వేనిటీబేగ్‌ అందుకుని భుజానికేసుకుంది.

ఆటో వెళ్ళిపోయింది

''పద లోపలకు'' అంది వెనక్కుచూస్తూనే.

''నేను రాను'' అన్నాడు

''వస్తున్నావ్‌..........పద.''

''రానంటున్నాగా.''

త్రివిక్రమ్‌కి చాలా కడుపుమంటగా వుంది. రాదు అనుకున్న వరేణ్య పొద్దుటే యిలా వచ్చి తన ప్లానంతా చివరిక్షణంలో  నాశనం చేస్తుందని అసలు హూహీంచలేదు. అందుకే మోరాయించాడు.

''అయినా యింత పొద్దున్నే నువ్వెందుకో తగలడ్డావిక్కడికి'' అసహనంతో అన్నాడు త్రివిక్రమ్‌.

''నిన్ను తగులుకుందామని'' అంటూ ఠకీమని తడుముకోకుండా సమాధానం చెప్పింది. నిజం తెలిస్తే తనని చూపులతోనే మర్డర్‌ చేస్తుందేమో. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నిన్నటికన్నా ఈ పూట మరీ అందంగా కన్ను చెదురగొడుతోంది. దట్టమైన పొగమంచులో విచ్చిన లేతగులాబిలా మతిపోగొడుతోంది.

''ఛఛ.... ఏం మాటలవి? తగులుకోటం ఏమిటి అసహ్యంగా?'' అన్నాడు టీజింగ్‌గా.

''నువ్వు తగలబడ్డావ్‌ అంటే అసహ్యంలేదా? పోలేరమ్మనంటావు? దయ్యానంటావ్‌? మాట్లాడ్డం నీకేకాదు నాకూవచ్చు. మన టూర్‌ ప్రోగ్రామ్‌ మర్చిపోయావా?''

''రానని అప్పుడే చెప్పాను.''

''వస్తున్నానని నేనూ చెప్పాను. మర్చిపోయావా? పదలోనికి.''

''అయినా ఆడపిల్లకి ఇంత మంకుతనం పనికిరాదు'' ఇక వదలదని అర్ధంకాగానే ఆమెను అనుసరిస్తూ కామెంట్‌ చేసాడు.

''మంకుతనంకాదు, మహాపెంకిదాన్ని. అసలేమనుకుంటున్నావ్‌ నా గురించి.''

''అందంగా వున్నావనుకుంటున్నాను.''

''అనుకుంటావ్‌. అంతేగాని అందంగాలేనా? నిన్నూ..........'' అంటూ ఇక ఆపుకోలేక నవ్వేస్తూ భుజంమీద కొట్టింది.

అప్పటికి తెలతెలవారిపోతోంది.

ఇద్దరూ లోనకొచ్చేసరికి

అప్పటికింకా సర్వెంట్స్‌ నిద్రపోతూనే వున్నారు.

తిన్నగా తన బెడ్‌రూంలోకి వెళ్ళిపోయి సూట్‌కేస్‌ రాక్‌లో పడేసి కూర్చుండిపోయాడు త్రివిక్రమ్‌. వరేణ్య పేరు పేరున అరిచి నౌకర్లను లేపటం వినబడుతోంది.

ఆమె గొంతు వింటూనే హడావిడిగా లేచిపోయారంతా.

''ఏందమ్మాయిగారు?''

''వినోద్‌ సార్‌ బెడ్‌రూంలో రాత్రి బెడ్‌షీట్లు మార్చలేదా? నల్లులు, దోమలువంటివి వున్నాయా? ఆయనకు రాత్రి నిద్రపట్టలేదట. తెలుసా? మీరు పనిచేస్తున్నారా, నిద్రపోతున్నారా?''

''లేదమ్మాయిగారు. అక్కడ నల్లులేవు, దోమల్లేవు, బెడ్‌షీట్లు ఏపూటకాపూటే మార్చేస్తాను.''

''సరిసరి....అర్ధగంట మీకు టైమిస్తున్నాను. టిఫిన్‌ రెడీచేయాలి. నువ్వెళ్ళి కారుటాంక్‌ పుల్‌ చేయించుకురా, కారు మేం తీసుకెళుతున్నాం. నువ్వు ఆటోలో ఆఫీస్‌కి వెళ్ళిపో.''

''అలాగే మేడం.''

గదిలోని త్రివిక్రమ్‌కి హాల్లోని మాటలు విన్పిస్తూనే వున్నాయి. ఆఫీస్‌లోనే అనుకున్నాడు. గెస్ట్‌హౌస్‌లో కూడా వరేణ్యకి ఇంత పట్టువుందని వూహించలేదు. అదే ఆశ్చర్యంగా వుంది.

వరేణ్య లోనకొచ్చి

అతడి ఎదురుగా సోఫాలో కూర్చుంది.

''ఏమిటలా చూస్తున్నావ్‌?'' అతడు తనవంక నిశితంగా చూడటం గమనించింది అడిగింది.

''ఏం లేదు. ఏమిటి మరీను. ఇదేదో నీ బాబుగాడి గెస్ట్‌హౌస్‌ అయినట్టు పనివాళ్ళమీద అలా పెత్తనం చెలాయిస్తున్నావ్‌? ఈ కంపెనీలో నువ్వు ఒక ఎంప్లాయ్‌వి. ఆ సంగతి మర్చిపోయావ్‌?'' అనడిగాడు.

ఆమె అందంగా నవ్వింది.

''చూడు మిస్టర్‌ వినోద్‌! నేను మర్చిపోలేదు. కాని నీకే తెలీక కొత్తగా ఫీలవుతున్నావ్‌. మా డాడీ, మన బాస్‌ సుధాకర్‌నాయుడుగారు క్లోజ్‌ఫ్రెండ్స్‌'' అంది.

''ఓహో! అందుకేనా ఈ దబాయింపు''

''అవును, అందుకే నాకిక్కడ ఇంత స్వాతంత్య్రం.''

''మంచిది.''

సరిగ్గా ఏడుగంటలకు త్రివిక్రమ్‌, వరేణ్యలు టిఫిన్‌, కాఫీలు తీసుకున్నారు. డ్రయివరు తాతారావు అప్పటికే కారు అప్పగించి వెళ్ళిపోయాడు వరేణ్య స్టీరింగ్‌ తీసుకుంది.

ఆమె పక్కన కూర్చున్నాడు త్రివిక్రమ్‌.

కారు కాంపౌండ్‌దాటి వీధిలోకి పరిగెత్తింది.

చాలాసేపు ఇద్దరిమధ్య మౌనం రాజ్యం చేసింది.

కారు గాజువాక గాటుతుండగా వరేణ్య అడిగింది.

''మౌనం దేనికి? నా డ్రయివింగ్‌ బాగలేదా?''

''నువ్వు డ్రయివింగ్‌లో ఎక్స్‌పర్ట్‌వి. అది కారు బయలుదేరినప్పుడే అర్ధమైంది.''

''కాని నీ మౌనానికి అర్ధం నాకు తెలీలేదు''

''చిన్నప్పట్నుంచి నువ్వింతేనా?''

''అంటే?''

''గిల్లికజ్జాలకు రెడీగా వుండటం.''

''ఇందులో గిల్లికజ్జా ఏముంది. ఏదన్నా మాట్లాడమన్నాను. ఇలా ఒంటరిగా, మనం పక్కపక్కన కూర్చుని ప్రయాణం చేస్తూంటే  నీకేమి అన్పించటంలేదా?''

''ఏమనిపిస్తుంది..........? నథింగ్‌..............మన పరిచయం ఏర్పడి ఇంకా వారం కూడా పూర్తికాలేదు. ఇంతలోనే ఏమనిపిస్తుంది? నీ గురించి నాకు పూర్తిగా తెలీదు నా గురించి నీకు పూర్తిగా తెలీదు.....''

''అవును. తెలీదు..........ఏమీతెలీదు. కాని తెలీదని తెలిసికూడా మనసుకెందుకీ ఆరాటం.''

''ఏమో................ నాకెలాంటి ఆరాటంలేదు, నన్ను సేఫ్‌గా తిరిగి నువ్వు వైజాగ్‌ చేరిస్తేచాలు ఐ విల్‌ బి హేపీ.''

''యూ..........నిన్నూ..........'' అంటూ ఫక్కున నవ్వేసింది వరేణ్య.

ఎ.సి కారు మెత్తగా అనకాపల్లి దిశగా దూసుకుపోతూనే వుంది.

రాత్రి ఫుల్‌గా మందుకొట్టి పడుకున్నాడేమో ఉదయం తొమ్మిది గంటలకిగాని నిద్రలేవలేకపోయాడు వినోద్‌.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
ajent ekambar