Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

ajent ekambar

టిప్ టాప్ గా తయారయి ఇంట్లో నుండి బయటకు వస్తూ టక్కున ఆగిపోయాడు ఏకాంబర్.

గుమ్మం దగ్గర నిలబడి వున్నాడు తండ్రి పీతాంబరం.

తండ్రిని చూస్తూనే అదిరిపడ్డాడు ఏకాంబర్.

ఎప్పుడూ తెల్లారితే గానీ నిద్రలేవని తండ్రి, ఈరోజు ఇంత పెందరాళే నిద్ర లేచిపోయాడెమిటబ్బా ! అనుకున్నాడు ఏకాంబర్.

"ఏరా! ఊరిమీదకు బయలుదేరావా?! ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నారో తెలుసుకోవచ్చా?" కోపంగా, కొంచెం వ్యంగ్యంగా అన్నాడు పీతాంబరం.

"ఈరోజు పెళ్లి... నిన్న... మొన్న... రోజూ ఇదేవేళకి ఇంట్లోనుండి పరారవుతున్నావు!? ఏంట్రా నీ ఉద్దేశం? ఇలా కాలం గడిచిపోతుందనుకుంటున్నావా?" కోపంగా అరిచాడు పీతాంబరం.

తండ్రి ఏం చెప్తున్నాడో ఏకాంబర్ బుర్రకి ఎక్కలేదు. అయోమయంగా తల ఎత్తి తండ్రి కళ్లల్లోకి చూశాడు.

"రోజూ నీ కోసం ఎవరో మీ ఫ్రెండుట. ఉదయం... సాయంత్రం ఇంటికొచ్చి అడిగి వెళ్తున్నాడు. కొంపదీసి ఆయన దగ్గర ఏమైనా డబ్బులు చేబదులు తీసుకున్నావా? ఏంటి? అతనికి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నావా కొంపదీసి?" కూపంగానే అడిగాడు పీతాంబరం.
'తన కోసం కోజూ ఇంటికెవరొస్తారబ్బా?! అనిల్ గాడు ఉద్యోగం చేసుకోవడానికి పోతాడు. రామకృష్ణగాడు కాదు. ఆచారిగాడు, శంకు... శంకుగాడు వస్తున్నాడా?! ఎందుకబ్బా?! అయినా, వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ కదా? వాడికంత ఖాళీ ఎక్కడ దొరికిందీ! వారం రోజులుగా తను కూడా మిత్రులెవరినీ కలవటం లేదు. అందుకోసం వస్తున్నారా? అయినా ఈ వ్యక్తి ఎవరై ఉంటారు?' పరిపరివిధాల ఆలోచిస్తూ నిలబడ్డాడు ఏకాంబర్.

"అలా బొమ్మలా నిలబడ్డావేరా? అప్పుగానీ తీసుకుని వుంటే చెప్పు! ఎంతివ్వాలో చెప్తే ఇచ్చి తగలడతాను. నిన్ను కన్నందుకు రుణభారం తప్పదు కదా?" కోపంగా అంటూనే కొడుకుకేసి చీదరింపుగా చూశాడు పీతాంబరం.

"నేనెవరి దగ్గరా అప్పులు తీసుకోలేదు నాన్నా! వాడెవడో నాకు అర్థం కావడంలేదు" ఆలోచిస్తూ అన్నాడు ఏకాంబర్.

"నీకు తెలీకపోవడమేంట్రా! ఎవరో పెద్ద హోదాలో ఉన్నవాడిలాగే ఉన్నాడతను. బైక్ మీద వస్తున్నాడు. మెళ్లో పెద్ద బ్యాగ్ ఒకటి. సూటుబూటు వేసుకుని దొరబాబులా ఉన్నాడు. నేనుండగానే రెండు మూడుసార్లు వచ్చాడు" ఆ వ్యక్తిని వర్ణిస్తూ చెప్పాడు పీతాంబరం.
అప్పుడర్థమయింది ఏకాంబరానికి. ఇంకెవడు. ఇన్స్యూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల రాజెంద్రగాడే! తనని పట్టుకోవడానికి ఆ రోజు నుండి పట్టు వదలని విక్రమార్కుడిలాగా తిరుగుతున్నాడు కాబోలు"

"అయ్యో వాడా నాన్నా! వాడు ఇన్స్యూరెన్స్ కంపెనీలో చేస్తున్నాడు" గుర్తొచ్చాక చిన్నగా నవ్వుతూ చెప్పాడు ఏకాంబర్.

"ఇన్స్యూరెన్స్ కంపెనీ కుర్రాడా!! నీకే దారీతెన్నూ లేదు. నువ్వేం కడతావ్ రా పాలసీలు గ్రట్రా! నీకంటే తలమాసినవాడు ఎవడూ దొరకలేదా ఆ కుర్రాడికి. పనిగట్టుకుని రాత్రీ, పగలూ అనవసరంగా తిరుగుతున్నాడు" చిరాగ్గా అంటూ గదిలోకి వెళ్లిపోయాడు పీతాంబరం.

తండ్రి మాటలు విని మనసులోనే ముసిముసిగా నవ్వుకున్నాడు ఏకాంబర్.

'ఈసారి రాజనాలగాడు ఇంటికొస్తే నాన్నే గట్టిగా చెప్తాడు. మావాడ్ని ఒదిలెయ్యమని క్లాస్ తీసుకుంటాడు!' మనసులోనే అనుకున్నాడు ఏకాంబర్.

తండ్రి అలా గుమ్మానికి అడ్డులేచి గదిలోకి వెళ్లిపోవడంతోనే పరుగందుకున్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ ఇంట్లోనుండి వెళ్లిన అరగంటకే రాజనాల రాజేంద్ర అక్కడకు చేరుకున్నాడు.

వీధిలైట్లు వెలుగుతున్నాయి. వూరకుక్కల అరుపులు. కొండమీద దేవాలయంలో నుండి వినిపిస్తున్న వేదమంత్రాలు శ్రావ్యంగా వినిపిస్తూంటే వింటూ గేటు తీసుకుని ఏకాంబర్ వాళ్ల ఇంట్లోకి వెళ్లాడు రాజనాల.

వీధి తలుపు దగ్గరున్న కాలింగ్ బెల్ నొక్కాడు. రెండోసారి కాలింగ్ బెల్ నొక్కేసరికి తలుపులు తెరచుకుని పీతాంబరం వచ్చాడు.

"నువ్వా బాబూ! వాడిప్పుడే వెళ్లిపోయాడు. అయినా వాడు నీకేం పాలసీ కట్టగలడనుకుని ఇలా తిరుగుతున్నావ్!" వచ్చీ రావడంతోనే రాజనాలను చూసి చిరాగ్గా అన్నాడు పీతాంబరం.

"లేదంకుల్! నేను ఏకాంబరాన్ని పాలసీ కోసం అడగటంలేదు. మా కంపెనీలో చేరమని అడుగుదామని తిరుగుతున్నాను." వినమ్రంగా చెప్పాడు రాజనాల.

"మీ కంపెనీలోనా? దేనికి?!" ఆశ్చర్యంగా అన్నాడు పీతాంబరం.

"అదే అంకుల్! ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా జాయిన్ చేద్దామని" నసుగుతూ అన్నాడు రాజనాల రాజేంద్ర.

"వాడా?! ఏజెంటా?!" పకపకా నవ్వాడు పీతాంబరం.

"అదేంటంకుల్! వాడికేం?! ఓపిగ్గా తిరగ్గలడు కదా!" అన్నాడు రాజనాల.

"ఊరిమీద తిరిగితే సరిపోతుందా?! వీడ్ని ఎవరైనా నమ్మాలా?! వీడిమీద అందరికీ నమ్మకం కలగాలా? వీడికి కూడా అంత ఓపిక ఉండాలా? అయినా, ఇన్స్యూరెన్స్ పాలసీలు కట్టించమంటే కంచం ముందు కూర్చుని ఖాళీ చేయడం కాదు. వీడ్ని నమ్ముకుని నీ టైమంతా పాడు చేసుకోకు. వెళ్లయ్యా" నిష్కర్షగా అన్నాడు పీతాంబరం.

"అలా అంటారేంటంకుల్! వీడంటే మా మిత్రులందరికీ మంచి అభిప్రాయం ఉంది. నమ్మకం ఉంది." చెప్పాడు రాజనాల.

"వీడు చదివిందే అత్తెసరు చదువు. వాడి పేరే వాడు సరిగా రాసుకోలేడు. అయినా ఈరోజుల్లో ఇన్స్యూరెన్స్ ఎవడు కడతాడు బాబూ!!

ఇన్స్యూరెన్స్ ఏజెంటుని చూస్తే జనాలు జడుసుకుని పారిపోతున్నారు. నీ శ్రమ ఫృధా" అన్నాడు ఖరాఖండీగా...

"ఇంతకీ ఏకాంబర్ ఇంత పెందరాళే ఎక్కడికి వెళ్ళిపోయాడంకుల్. రోజూ తెల్లారేక వస్తుంటే దొరకట్లేదని ఈరోజు ఎలాగైనా వాడ్ని పట్టుకుందామని మరీ ఇంత పెందరాళే వచ్చాను." విచారంగా అన్నాడు రాజనాల.

రాజనాల ఒక్కసారే డీలా పడిపోతూ అలా అనేసరికి అతని మీద పీతాంబరానికి జాలేసింది. పాపం! కుర్రాడు. ఏకాంబర్ వయసువాడు. కానీ, ఎంత బాధ్యతగా తిరుగుతున్నాడు?! వీడు కుర్రాడంటే...!' మనసులోనే అనుకుంటూ ఏకాంబర్ ఎక్కడికి వెళ్లాడో క్షణం ఆలోచనలో పడిపోయాడు పీతాంబరం.

"వస్తానంకుల్!... రాత్రి పది గంటలకైనా దొరుకుతాడంటారా?" విచారంగా వెనుదిరుగుతూ అన్నాడు రాజనాల.

"ఆగు బాబూ! ఈరోజు వాడి ఫ్రెండ్స్ అక్క పెళ్లన్నాడు. బహుశా గాంధీనగర్ వెళ్లి వుండొచ్చు" అన్నాడు పీతాంబరం.

"థాంక్స్ అంకుల్!" ఆనందగా అంటూ బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు రాజనాల.

'ఈరోజు ఏకాంబర్ గాడ్ని ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలి!" మనసులోనే స్థిరంగా అనుకున్నాడు రాజనాల. ఆ రోజుకి నెలరోజులవుతోంది ఏకాంబరాన్ని బజార్లో కేంటీన్ దగ్గర కలసి. ఆ తర్వాత నుండి అసలు కనిపించడమే మానేశాడు. ప్రతి ఆదివారం మిత్రులందరూ కలసి కేంటీంకి వస్తున్నారు. ఏకాంబర్ తప్ప అందరూ కలుసుతున్నారు. ప్రతిసారీ అప్పుడే వెళ్లిపోయాడని చెప్తున్నారు. ఇంటి దగ్గర కూడా దొరకటంలేదు. ఉదయం, సాయంత్రం తప్పకుండా ఎన్నిసార్లు తిరిగినా దొరకలేదు.

"ఇప్పుడు ఎలాగైనా ఆ పెళ్లిలోనే వాడ్ని పట్టుకోవాలి ' స్థిరంగా అనుకున్నాడు ఇన్స్యూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల.

పీతాంబరం చెప్పిన విషయం వింటూనే ఏకాంబర్ ని వెదుక్కుంటూ గాంధీనగర్ చేరుకున్నాడు రాజనాల.

దేవుడి కోనేటికి ఈవల ఈశాన్యంలో చెరువుగట్టును ఆనుకునే వుంది గాంధీనగర్. మూడే మూడు వీధులున్న ప్రాంతం గాంధీనగర్.

అక్కడున్న వాళ్లంతా 'కల్లుగీత ' కార్మికులే. ఇప్పుడిప్పుడే యువత చదువుకుని ఇతర వృత్తుల్లో స్థిరపడుతున్నారు.

దేవుడి కోనేటికి ఆవల విజినిగిరిపాలెంకు వెళ్లే రోడ్డు చెరువుగట్టును ఆనుకునే వుంది. ఆ రోడ్డు నుండి ఇటు గాంధీనగర్ రావడానికి ఈ మధ్య కోనేటికి దక్షిణ భాగంలో గట్టునానుకుని రోడ్డును నిర్మించారు.

పాత అడివివరం నుండి నేరుగా గాంధీనగర్ చేరుకున్న రాజనాల, పెళ్లి జరుగుతున్న ఇంటిని తేలికగానే కనుక్కోగలిగాడు.

పెళ్లిపందిరిలో బైక్ ని పార్క్ చేసి అక్కడ నిలబడ్డతన్ని అడిగాడు రాజనాల. "సార్! ఏకాంబర్ వచ్చాడు. ఏక్కడున్నాడు సార్?" అని.

"ఏకాంబర్ గారా! ఇంతవరకూ ఇక్కడే ఉండాలే! వంట దగ్గర కూర్చోవడం చూశాను. ఏదో పనిమీదే వెళ్లినట్టున్నాడు. వెళ్లి అక్కడ అడగండి" అంటూ వంటలు చేస్తున్న ప్రాంతాన్ని చూపించాడు అతను.

'ఏకాంబరానికి అందరూ దోస్తులే! వూరంతా 'ఏకాంబరాన్నీ ఏరా, పోరా అనేవాళ్లే! అది ఆప్యాయతో, అవహేళనో అర్థం కావడం లేదు ' ఆలోచిస్తూ అటుకేసి నడచి వెళ్లాడు రాజనాల.

అదే క్షణంలో ఏవో సామాన్లు కొనడానికి గోపాలపట్నానికి వెళ్లిన ఏకాంబర్, అతని మిత్రుడు బైక్ మీద వస్తున్నారు. దూరం నుండే 'రాజనాల ' వంటల దగ్గరకు నడచి వెళ్లడం చూసిన 'ఏకాంబర్ ' అదిరిపడ్డాడు.

"ఒరేయ్ రంగా! బైక్ ఆపరా! నాకోసం వంటల దగ్గరకు ఆ 'జిడ్డుగాడు ' వెళ్తున్నాడు. దొరికితే నా పని అంతే!" అంటూనే బైక్ స్లో కాగానే గెంతేసి ప్రక్కకి వెళ్లి దాక్కున్నాడు. బైక్ మీదున్న మిత్రుడికి తను గోపాలపట్నంలోనే ఉండిపోయానని చెప్పమని చెప్పి వేరే ఇంకో మిత్రుడి ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు ఏకాంబర్.

"ఒరేయ్ ఏకాంబర్!..." అని అతను ఏదో చెప్పభోతున్నా వినకుండా పరిగెట్టాడు ఏకాంబర్.

వంటల దగ్గర చాలామంది కూర్చుని వున్నారు. వంట పంతులు పర్యవేక్షణలో సహాయకులు పనిలో నిమగ్నమై వున్నారు. ఓ మూల ఆడవాళ్లు కూరగాయలు కోస్తున్నారు.

కుర్చీలో కూర్చున్నవాళ్లంతా పెళ్లివాళ్ల బంధువులు, స్నేహితులు. తిన్నగా వెళ్లి కూర్చున్నతన్ని అడిగాడు రాజనాల.

"ఎవరూ! పొడవుగా... బక్కగా... సరుగుడు చెట్టు మాదిరి రివటలా ఉంటాడే అతనా! అవునండీ! ఉదయం నుండి ఇక్కడే ఉన్నాడు. ఏదో 'వస్తువు ' అవసరమై కొనడానికి రంగాతో పాటు వెళ్లాడాయన." అంటూ చెప్పాడు ఒకతను.

ఇంతలో వేరే వ్యక్తి గబాలున "అదిగో సార్! రంగా వచ్చేస్తున్నాడు. వాడ్ని అడగండి. మీరు వెదుకుతున్న వ్యక్తి  గురించి వాడికే తెలుస్తుంది. ఇద్దరూ కలిసే వెళ్లారు" దూరం నుండి బైక్ మీద వస్తున్న రంగాని చూస్తూ అన్నాడు.

అతను అలా అనేసరికి మహదానందంగా గిర్రున వెనక్కి తిరిగి చూశాడు రాజనాల.

బైక్ మీద 'రంగా' అనే వ్యక్తి ఒక్కడే రావడం చూసి ఒక్కసారే నిరుత్సాహంతో నీరసించిపోయాడు రాజనాల.రంగా బైక్ కు ఎదురెళ్లి నిలబడ్డాడు.
బైక్ స్టాండ్ వేసి తను తెచ్చిన సామాన్లను వంటవాళ్లకి ఇచ్చివచ్చాడు రంగా.

"సార్! మీతో ఏకాంబర్ వచ్చాడట కదా సార్! ఇక్కడకు వచ్చాడా?" దీనంగా అడిగాడు. ఆయనతో ఏకాంబర్ కనిపించకపోయేసరికి షాకయిపోయాడు రాజనాల. 

"లేద్ సార్! వాడు గోపాలపట్నంలో ఎవర్నో కలవాలని దిగిపోయాడు. మీరెవరు? వాడితో పనుందా?" అడిగాడు రంగా.

"చిన్న పనుంది సార్! ఏకాంబర్ నాకు ఫ్రెండ్ సార్!" అన్నాడు రాజనాల.

"అంతేనా? లేక మీకైమైనా ఏకాంబర్ గాడు డబ్బులివ్వాలా?!" చిన్నగా ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు రంగ.

"ఛ! ఛ! అదేంలేదు. ఏకాంబర్ ని కలవాలి. అంతే! మీరేం చేస్తుంటారు" అప్రయత్నంగానే అడిగాడు రాజనాల.

అతనికి యువకులు ఎవరు కనిపించినా వాకబు చేయడం అలవాటు. ఒక విధంగా వృత్తిధర్మం. వాళ్లు పనేంలేదు... ఖాళీగా వున్నామంటే ఠక్కున వాళ్లని పట్టేసి తన అండర్ లో ఏజెంటుగా జాయిన్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. కొందరు డెవలప్ మెంట్ ఆఫీసర్లయితే పేపర్లలో ప్రకటనలు ఇచ్చి కూడా యువతీయువకుల్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో నమ్మశక్యంగాని ప్రకటనలు ఇస్తుంటారు. 'మీరు నిరుద్యోగులా! కొద్ది సమయం వెచ్చించి లక్షలు ఆర్జించండి అనో, మీరెవరినా, ఏ పని చేసినా పార్ట్ టైంగా ఇంటి దగ్గర ఉండే నెలనెలా కాలు కదపకుండా వేలకు వేలు సంపాదివచ్చనో' రకరకాల పిచ్చి పిచ్చి ప్రకటనలు ఇస్తుంటారు. అందులో 'వీసమెత్తు ' నిజమున్నా, నమ్మశక్యంగాని ఆదాయం చూసి ఎవరూ అంతగా విశ్వసించరు.

అయితే, రాజనాల అలాంటి ప్రకటనల ద్వారా ముక్కూ, మొహం తెలీని వాళ్లని ఏజెంట్లుగా నియమించేకంటే మిత్రులద్వారా, బంధువుల ద్వారా, తెలిసినవాళ్ల ద్వారా మెరికల్లాంటి యువతని పట్టి సాన పెడితే మంచిదని నమ్ముతాడు.

అదే తోవలో నడుస్తున్నాడు. అయితే, అతను జాయిన్ అయి ఆర్నెల్లు గడుస్తున్నా ఒకర్ని కూడా ఏజెంటుగా నియమించలేకపోయాడు. దొరక్క దొరక్క దొరికిన ఏకాంబరాన్ని ఎలాగైనా ఏజెంటుగా నియమించాలనే పంతం, పట్టుదలతో విసుగు, విరామం లేకుండా తిరుగుతున్నాడు రాజనాల.

రంగా చెప్పింది వినేసరికి ఏకాంబర్ మిస్సయ్యాడని గ్రహించిన రాజనాల పెద్దగా బాధపడలేదు. 'రంగా' ఏంచేస్తున్నాడో తెలిస్తే మంచిదని, తనకి పని చేస్తాడేమో అన్న ఆశతో అడిగాడు.

"నేనా సార్! పెయింటర్ ని సార్! రోజు కూలీకి బిల్డింగులకి రంగులు వెయ్యడానికి వెళ్తుంటాను" చెప్పాడతను.

"ఏం చదివారు?" కుతూహలంగా అడిగాడు రాజనాల.

"అమ్మానాన్న చదువుకోమన్నప్పుడు శ్రద్ధగా బడికి వెళ్లి వుంటే నాకీ ఖర్మెందుకు సార్! అయిదో తరగతిలోనే డుమ్మా కొట్టాను" బాధగా చెప్పాడు రంగా.

రాజనాలలో ఒక్కసారే ఆశ ఆవిరైపోయింది. ఏకాంబర్ కోసం తిరుగుతూనే దొరికిన వాళ్లనందర్నీ  మనసులో మిణుకుమిణుకుమంటున్న ఆశతో వారినందర్నీ వాకబు చేస్తూనే వున్నాడు.

డిగ్రీ చదువుకున్నవాళ్లు దొరికినా ఏదో... ఎక్కడో చిన్నా చితకా ఉద్యోగం చేస్తున్నామన్నవాళ్లే! వాళ్లకి

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugaadu intarpheyil ias pass