Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ajent ekambar

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ ఏ ఎస్ పాస్

kittugaadu intarpheyil ias pass

 ఎంత అర్థమైతే అంతే! కానీ ఇప్పుడు? సందేహం వస్తే తీర్చేవాళ్ళున్నారు... వళ్ళు ముందుగా చదివేసి, అర్థం చేసుకుని సారాంశాన్ని మనకు బోధిస్తున్నారు. వీళ్ళు చెప్పింది విని ఆ తరువాత ఇంటికెళ్ళి పుస్తకం తెరిస్తే అర్థం చేసుకోవడం చాలా సులువు అవుతుంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

కాలేజీ చదివులు వేరు...

కాంపిటీషన్ చదువులు వేరు....

రెండింటికి ఎక్కడా పొంతన లేనేలేదు....

పోలిక లేనేలేదు ...

రాధాకృష్ణ గారు చెప్పింది అక్షర సత్యం.

నేను గోల్డ్ మెడలిస్టిని కదా.... నాకేమి? అని విశ్రమించిన వాడు మట్టిగొట్టుకుపోతాడు...

అలుపెరగకుండా శ్రమించిన వాడు తగిన ప్రతిఫలం పొందుతాడు...

ఈ గాడిదలాగా శ్రమించినవాడు ఏవరేజీ విద్యార్ధి అయినా పర్వాలేదు.

ఇంకో విషయం తెలుసుకున్నాడు కిట్టు.

కోచింగ్ కు వెళ్ళినంత మాత్రాన పనైపోలేదు ఒంటరిగా ముక్కు మూసుకుని

చదివితే లాభం లేదు. నలుగురైదుగురు మిత్రులతో కలిసి గ్రూపుగా తయారవ్వాలి. ఎవడైనా ఒక అంశంలో బాగా పట్టు సంపాదిస్తే దాన్ని మిగిలిన వాళ్ళకి వివరించాలి. అలాగే ఇతరులు కూడా.... తమకు పట్టు ఉన్న అంశాన్ని మిగతా వాళ్ళకి బోధించాలి. దీని వల్ల అందరికీ లాభం...

అయితే కొంతమంది మూర్ఖులు.. ' ఇది పోటీ పరీక్ష కదా... ఎదుటివాడి దగ్గరనుండి వాడికి తెలిసింది లాక్కుని తనకి తెలిసింది లాక్కుని తనకి తెలిసింది వాడికి చెప్పకుండా తప్పించుకోవాలి.... అనే ఆలోచనలో ఉంటారు. ' ఇలాంటి వారిని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. వీళ్ళ బుద్ధి తెలుసుకున్న వాళ్ళు వీళ్ళని దూరంగా పెట్టేస్తారు.

కిట్టు కూడా ఓ గ్రూపుని తయారుచేసుకున్నాడు. ఈ గ్రూప్ తయారుచేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా దూర గ్రామాల్లో ఉండి, సివిల్స్ కి తయారయ్యే విద్యార్థులకిది చాలా అవసరం.. ఒక్కటే బుర్రతో ఆలోచిస్తే ఒకే విషయం తడుతుంది. నాలుగు బుర్రలు కలిస్తే కొత్త కొత్త ఆలోచనా విధానాలు బయటకొస్తాయి. కొత్త కోణం లో విశ్లేషణ చెయ్యగలం.

ఇదే కావాలి సివిల్స్ కి..

ఉదాహరణకి రావణుడంటే సీతనెత్తుకెళ్ళిన రాక్షసుడు, దుర్మార్గుడు, చందగినవాడు. ఇంకో ఆలోచనా విధానముంది. అందులో రావణుడు దేవుడిలాంటోడు. సీతమ్మ తల్లి గర్భంలో లవకుశులు పడే సమయానికి ఆమె ఆరోగ్యం కోసం ఆమెకు రకరకాల మూలికల గాలులు తగిలి ఆమెకు, పిల్లలకీ మేలు జరుగుతుందని, ఆమెను తీసుకెళ్ళి అశోకవనం లో వుంచాడు. తప్పో, రైటో... ఇదొక ఆలోచనా విధానం. ..

రెండు బుర్రలు కలిస్తే తప్ప, కొత్త ఐడియాలు రావు. నేనే పెద్ద పుడింగిని, నేనే చదువుకోగలను అనుకుంటే తుస్సే!

ఒకో రోజు ఇంటికెళ్ళకుండా మిత్రుల రూముల్లో పడకేసేవాడు కిట్టు.

ఒరే! నువ్వెక్కడికెళ్తున్నావో... ఏవే వెధవ్వేషాలు వేస్తున్నావో ... నాకు తెలియదనుకోకు!

పిచ్చి పిచ్చి వేషాలు మానేసి, కోచింగ్ అయిపోగానే ఇంటికి చేరుకో! అనే వాడు కిట్టు పెద్దన్నయ్య...

నీ పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.... నేనేం తిప్పలు పడుతున్నానో నేకేం తెలుసు? కావాలంటే నేను ఈరోజు ఫలానా చోట... ఫలానా రూములో వుంటాను... వచ్చి చూసుకో' అనేవాడు కెట్టు. అయినా పెద్దన్నయ్య వదిలేవాడువాడు కాదు. చెప్పిన రూంకివెళ్లి చెకింగ్ చేసేవాడు.

పెద్దన్నయ్య వెళ్లిన సమయానికి గుండ్రంగా కూర్చొని, తర్కవితర్కాలు చేసుకుంటున్న గ్రూపుని గమనించేవాడు. ఆ గ్రూపుని పరిచయం కూడా చేసుకునేవాడు. ఎవరేం చదువుతున్నారో అడిగి తెలుసుకునేవాడు. ఆ తర్వాత నెమ్మదిగా చెకింగ్ లు మానేశాడు.

ఉస్మానియా యూనివర్సిటీ కేంపస్...

ఈ కేంపస్ లో పీజీలు, న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు సివిల్స్ కోచింగ్ లకు వెళ్లేవాళ్లే...

కిట్టు అప్పుడప్పుడూ వాళ్ల రూంలకి వెళ్లేవాడు. సాయంత్రం పూట ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా వున్న హాస్టల్ బయట వున్న పెద్దరాయి మీద కూర్చొని బజ్జీలు గిని, టీ తాగేవారు ఫ్రెండ్స్...

ఈ ఉస్మానియా విద్యార్థులు సూక్ష్మంలో మోక్షంలా అటు పీజీ, ఇటు సివిల్స్ చదివేవారు.

ఒక పీజీ కాగానే రకరకాల పోటీ పరీక్షలకి తయారవుతూ మళ్లీ ఇంకో పీజీలో చేరేవారు. ఎందుకంటే, కేంపస్ ని వదిలితే కోచింగులకు వెళ్లలేరు. ఫుడ్ వుండదు, బెడ్ వుండదు.

అందుకనే ఈ చదువులకి ఫుడ్డు కోర్సులని పేరు. ఉద్యోగం సంపాదించేదాకా ఇలా కేంపస్ అనే తల్లి ఒడిలో ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కేంపస్ నుండి వెళ్లిపోతారు.

ఇదేదో వినడానికి తప్పులాగానో, ఏదో కొంపలు మునిగే విషయంలా వుండవచ్చు.

చంద్రబాబు నాయుడుగారు చీఫ్ మినిస్టర్ గా వున్నప్పుడు ఎవరో ఆయన బుర్రలో ఈ విత్తనాన్ని నాటారు. యూనివర్సిటీలు ఫుడ్ కోర్సులకి నిలయంగా మారుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలి.

నాయుడుగారికి నిజమే అనిపించింది. ఆయనకి ఈ యూనివర్సిటీల విషయం బాగానే తెలుసు. ఒక పీజీ కాగానే విద్యార్థిని యూనివర్సిటీ నుండి పంపిస్తే మంచిదే... అన్నారాయన. అది అమలు కాలేదు కానీ, ఒకవేళ అమలులోకి వస్తే పర్యవసానం ఎలా ఉంటుందంటే... ఇంట్లో ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతున్న కుమారుణ్ణి, కూతుర్ని చూస్తూ తల్లిదండ్రులు కలత చెందుతారు.

పిల్లలకు, తల్లిదండ్రులకు బేదాభిప్రాయాలొస్తాయి.

అదే కేంపస్ లో వుంటే ఏదో చదువు కొనసాగిస్తున్నాడు పోనీలే అనుకుంటారు.

అదీగాక, ఇంటిదగ్గర పోటీ పరీక్షలకి తయారయ్యే వాతావరణం కొరవడి వున్న తెలివి ఊడిపోయే అవకాశం వుంది.

చెడు సావాసాలు పెరిగి, డబ్బు చేతిలో లేక దొంగతనాలు, త్రాగుడు, వ్యభిచారం, మోసాలు, నేరాలు, ఘూరాలకు పాల్పడవచ్చు.
కొన్ని దేశాల్లో నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మన దేశంలో అది లేదు. అటువంటప్పుడు ఈ నిరుద్యోగ భృతి యూనివర్సిటీ రూపంలో దొరుకుతున్నప్పుడు కంగారు పడటమెందుకు?

ఇక ప్రేమలో పడే ఉద్దేశం ఇన్న వాళ్లని ఎవరూ ఆపలేరు. ఆ ఉద్దేశం ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు యూనివర్సిటీల్లోనే తోడు వెదుక్కుంటారు.

యూనివర్సిటీల్లోనే ప్రేమించి, పెళ్లి చేసుకున్న జంటలున్నాయి. ఇది మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఉంది. అప్పుడప్పుడూ ఆ ఊరి చిన్నోడు, ఈ ఊరి కుర్రోడు రష్యా అమ్మాయినో, చైనా అమ్మాయినో యూనివర్సిటీలో ప్రేమించి, భారతదేశంలో తన ఊరికి తీసుకువచ్చి పెళ్లి చేసుకున్నాడు... అనే వార్తలు వస్తూనే వున్నాయి.

ఇలా ప్రేమిద్దామనుకున్న కుర్రాళ్లను, డబ్బులేక, ఉద్యోగం లేక నిరుద్యోగులుగా వున్న యువకులను, వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో సమాజం మీదికి వదిలేస్తే వచ్చే పర్యవసానం చాలా భయంకరంగా వుంటుంది. సమాజం అల్లకల్లోలమైపోతుంది. నేరాలు, ఘోరాలు పెరిగిపోతాయి...

ఇంతమంది యువతను సమాజం మీద వదిలేయకుండా, సమాజాన్ని యూనివర్స్తీలు కాపాడుతున్నాయి.

ఈ యువతని భరించే బాధ్యత వీసీలకు, ప్రొఫెసర్లకు ఇవ్వబడింది. ఈ యువత బరువుని మొయ్యడం ఎంతొ కష్టమైన పని. ఆ బరువుని యూనివర్సిటీలు మోస్తున్నాయి.

సంతోషించదగ్గ విషయమే...

మెచ్చుకోదగ్గ విషయమే...

ఒకరోజు యథావిధిగా ఆఫీసులో కూర్చుని పని చేసుకుంటున్నాడు కిట్టు.

ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడ్డట్టుగా ఊడిపడ్డాడు గిరిధర్...

గిరిధర్... బొంబాయి ఫ్రెండ్ ! ఏయ్యా ! అని నెల్లూరు యాసలో అంటూ... మొదలెట్టాడు... ఎక్కడకు పొయ్యావ్... ఏమైపొయ్యావ్... అసలు ఈ గిరిధర్ అనే మిత్రుడు వున్నాడా? పోయాడా? అనే ఆలోచన కూడా నీకు లేదు. నేనే నీ గురించి ఏంక్వైరీ చేసుకుని, నిన్ను పట్టుకోవాల్సి వచ్చింది. నువ్వు పాతాళంలో దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుంటా ! అన్నాడు.|

కెట్టుకి చాలా ఆశ్చర్యం కలిగించింది గిరిధర్ రాక... నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా... అన్నాడు కిట్టు. నిజమే చెప్పు.
నీవు నాకంటే గొప్పవాడివి. పెద్ద పెద్ద వాళ్లు నీ స్నేహితులు... ఏదో బొంబాయిలో మన తెలుగు వాళ్లు ఎవరూ లేరు కదా. అని మాదగ్గరకు వచ్చేవాడివి... నేనేదో చిరుద్యోగిని. నేను నీకు గుర్తుంటానని నేనెప్పుడూ అనుకోలేదు... అన్నాడు కిట్టు.

గిరిధర్ కి ఈ మాటలు బాగా నచ్చాయి... పెద్ద లేదు, చిన్న లేదు... మనం ఫ్రెండ్స్ అంతే... మన మధ్యలో తేడాలుండవ్... అన్నాడు గిరిధర్.
ఆరోజు సాయంత్రం పార్టీ చేసుకున్నారు మిత్రులిద్దరూ... కిట్టు విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు గిరిధర్... కిట్టు కోచింగ్ వ్యవహారం తెలుసుకున్నాడు... నీకు పుస్తకాలకీ, కొచిగులకీ డబ్బులు అవసరమైతే నన్ను మొహమాటపడకుండా అడుగు అని చెప్పాడు గిరిధర్... అనడమే కాదు, అవసరమొచ్చినప్పుడల్లా సహాయం చేశాడు కూడా...

ప్రిలింస్ పరీక్ష దగ్గర పడుతున్నది...

ఉద్యోగం చేస్తూ మధ్యమధ్యలో సెలవులు పెడుతూ... కోచింగ్ లకు వెళ్తూ చదువుతున్నాడు కిట్టు.

ఇంకా ప్రిలింస్ మూడు నెలలుందనగా... ఆ మూడు నెలలు సెలవు కావాలని ఆఫీసులో అడిగాడు కిట్టు.

'ఇప్పటికే వున్న సెలవులన్నీ వాడేసుకున్నావు. నీకింక సెలవులు లేవు... ఈ మూడు నెలలు సెలవు కావాలంటే దొరుకుతుంది కానీ... జీతం రాదు.'

చావు కబురు చల్లగా చెప్పారు ఆఫీసులోనివారు. కిట్టు వెనకాడ దలచుకోలేదు.

ఐనా సరే నాకు సెలవిచ్చేయండి... అని సెలవు తీసుకున్నాడు. ఆఫీసుల్లో పని చేస్తూ... పోటీ పరీక్షలకి తయారయ్యేవాళ్లు సెలవులు పెట్టకుండా... జీతం పోకుండా... బాసుల దగ్గర చెడ్డ కాకుండానే పోటీ పరీక్షలకి తయారవుతూ ఉంటారు.

ఇలా అవ్వా కావాలి, బువ్వా కావాలి అనుకుంటే కష్టమే... ఈ అవ్వా, బువ్వా రెండూ కావాలనుకునే వాళ్లకి విజయం సాధించడం కష్ట సాధ్యమే...

తాడో, పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుని, కష్టాల్ని, నష్టాల్ని భరించగలిగితే విజయం సాధించడం సులభతరమౌతుంది.
ప్రిలింస్ రాశాడు కిట్టు... ఇది రెండోసారి...

ఈసారి కూడా అనుమానం లేకుండా దిగ్విజయంగా ఫెయిల్ అయ్యాడు.

సివిల్స్ రాసేముందు రాతపూర్వకంగా ఆఫీసుకి తెలియజెప్పాలి, నేను సివిల్స్ రాస్తున్నాను అని...

చెప్పకపోతే, తీరా పసయిన తర్వాత, నాకు చెప్పకుండా రాశావు, నువ్వు పాసైనా సరే నేను పంపించను అని ఆఫీస్ అనవచ్చు. మొత్తం గోల్ మాల్ అయిపోతుంది. అందుకని, కిట్టు కూడా ఆఫీసుకి రాతపూర్వకంగా తెలియపరిచాడు.

ఇంకేముందీ ?

అందరికీ తెలిసిపోయింది...

కొందరు కిట్టుని అడుగుతున్నారు...

ప్రిలింస్ రిజల్ట్ వచ్చింది...

ఏమైంది... ?

పాసయ్యావా... ?

ప్రేమగా, సదుద్దేశంతో అడుతుగున్నవాళ్లూ వున్నారు.

అయితే, వాళ్ల సంఖ్య తక్కువ...

ఎక్కువమంది ఎకసక్కెంగానే అడుగుతున్నారు.

వాళ్ల లోలోపల...

వీడి మొహం... సివిల్స్ అంటాడు...

ఆఫీసుకి రాడు,

గాలికి తిరుగుతాడు...

ఐనా పాలితెక్నిక్ వాడు...

ఏదో బియ్యే వెలగబెట్టాడంట...

మహామహులు ఎంటెక్ వాళ్లకే రాలేదు...

వీడికేం వస్తుంది ? అనుకుంటూ ఉంటారు...

ఒకడు ఏమయ్యింది ? అని ఏదురుగా అడిగి,

పోయిందని అనగామే మనిషి ముందుకు వెళ్లగానే వెనకాల ఫక్కుమని నవ్వుతాడు.కిట్టుకి అన్నీ అర్థమయ్యేవి...ఈ అవమానాలు, హేళనలు అవసరమా?

నా డబ్బులు ఖర్చు పెట్టుకుని, నేను పుస్తకాలు కొనుక్కుంటున్నాను...

వాడి బాబుగాడి సొమ్ములేమన్నా నాకిచ్చాడా...

పెద్ద పరీక్షలు వీళ్లే రాయాలి...

వీళ్లు రాయకూడదు అనే రూలేమన్నా ఉందా?

నేను ఫెయిలయితే వాడికీ పైశాచిక ఆనందం ఎందుకు?

పొరపాట్న ఏ సర్వీసూ రాకపోతే మళ్లీ

రోజూ ఇదే ఉద్యోగం చేస్తూ వీళ్ల ముఖాల్లో హేళనను చూస్తూ,

వాళ్ల వెకిలి నవ్వుల్ని భరిస్తూ బ్రతకాలా?

కొత్తగా ఎవడైనా వస్తే...

తెలీని వాడికి కూడా తెలియజెప్పి, వర్ణించి,

వాడు కూడా వేళాకోళంగా నవ్వేదాకా, వీడు నిద్రపోడు.

ఇవేం మనస్తత్వాలో, వీళ్లేం మనుషులో...

పోతే పోనీ...

ఇలాంటి వాళ్లని పట్టించుకోగూడదు...

పట్టించుకుంటే మానసిక వ్యథ ఇంకా పెరుగుతుంది.

పట్టించుకోవద్దు కిట్టూ... వీళ్లని పట్టించుకోవద్దు...

జీతం చాలడం లేదు... డబ్బులు కావాల్సి వస్తున్నాయి...

నాన్నగారేమో డిక్లేర్ చేసేశారు. ఖచ్చితగా తెగేసి చెప్పారు. అంత ఎత్తుకు నువ్వు ఎగరలేవు... నీవల్ల కాదు... చిన్న ఉద్యోగి మీ నాన్న అని తెలియగానే నువ్వెన్ని మార్కులు తెచ్చుకున్నా నిన్ను బెడబట్టి గెంటేస్తారు. అనవసరంగా డబ్బులు వృథా చెయ్యకు... ఇప్పుడు చేసుకుంటున్న ఉద్యోగమే చేసుకో... 'కట్ ది కోట్ యాజ్ ఫర్ ది క్లాత్, నీకున్న డబ్బులతో నీ బతుకు ఎంతో అంతే బతుకు, ఎక్స్ ట్రాలు చెయ్యకు...' నేనేమన్నా నీకు డబ్బులిచ్చినా, నువ్వు ఈ పరీక్షలకే తగలేస్తావు. అందుకని నేనేమీ నీకు ఇవ్వను...

కాదు... కూడదూ, నా దారిలో నేను వెళ్తాను... అనుకుంటే నీకు వచ్చే దాంతో సర్దుకో...

కిట్టు అనుకునేవాడు నాకు ఉన్న కష్టాలు, నవ్వేవాళ్లను, వాళ్ల మాటలను పట్టించుకోకూడదు.

బుద్ధుడు అన్నాడట !

ఎవడైనా నిన్ను బాధపెడుతున్నాడంటే

తప్పు వాడిది కాదు...

నీదే...

వాడిని నీ మనస్సులోకి రానివ్వడమే నీ తప్పు...
      

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
O college droup out  premakatha