Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kittugaadu intarpheyil ias pass

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ ప్రేమకథ

O college droup out  premakatha

అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, కచ్చ మనిషికి మనశ్శాంతి లేకుండాచేస్తాయి. ప్రస్తుతం వినోద్‌ పరిస్థితి అదే. లేకపోతే రాత్రి అంత ఓవర్‌గా మందుకొట్టి వుండేవాడుకాదు.

నిజానికి అస్సలు ఏ అలవాటూలేని వ్యక్తి ఏమీకాదు అతను, సిగరెట్‌ అలవాటుంది, మందు అలవాటుంది. ఇంకా చిల్లర అలవాట్లు కూడా కొన్ని వున్నాయి. కాని అవేమీ సుధాకర్‌నాయుడు గారి కంటపడకుండా జాగ్రత్తపడుతూ వచ్చాడు గాబట్టి ఆయన ఈ కుర్రాడ్ని చాలా గుణవంతుడు, బుద్దిమంతుడు, ఏ దురలవాటులేని కుర్రాడు అనే అభిప్రాయానికొచ్చాడు. అలా సంపాదించుకున్న గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికేట్‌ అది.

ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో జీనియస్‌. కాని ఎంత చదివినా, ఎంత టాలెంటెడ్‌ పర్సన్‌ అయినా ఈర్ష్యా అసూయలకు అతీతుడు కాలేడు. నిన్న సాయంకాలం త్రివిక్రమ్‌, వరేణ్యలు ఒకే కారులో వెళ్ళటం చూడగానే అతడి మనసు వికలమైంది.

తన స్వప్నాలన్నీ కళ్ళముందే కూలిపోతున్నట్టనిపించింది. చేతికి అందిన బంగారాన్ని ఎవరో అనామకుడు తన్నుకుపోతున్నంత బాధ. ఆ బాధను తట్టుకోలేక రాత్రి అతడికి మందు ఓవరైంది.

హేంగావర్‌గావున్నా ఇక బద్దకించకుండా లేచి ముఖం కడుక్కుని స్నానంచేసాడు. మరోసారి ఆఫీసుకు వెళ్ళి తన పేరుతో చెలామణి అవుతున్న ఆ యువకుడ్ని, ఆలాగే వరేణ్యని మరోసారి చూడాలని అతను ఉద్దేశం. వీలయితే వాడ్ని కార్నర్‌చేసి, వాడి బండారం బయటపెట్టాలని కోపం. అందుకే త్వరత్వరగా రెడీఅయి నీట్‌గా డ్రస్‌ వేసుకుని, రూంకి తాళంపెట్టి బయటికొచ్చి పక్కనే హోటల్లో టిఫిన్‌ చేసాడు.

ఆటోలో సన్‌ ఆటోమొబైల్స్‌ ఆఫీసుకి చేరుకునేసరికి పదిన్నర టైం. గేటు ముందే ఆటోదిగి లోనకు పోతూండగా, మళ్ళీఅదే ప్యూను.... ఆఫీస్‌ ప్యూన్‌ సింహాచలం ఎదురయ్యాడు. చూడగానే వినోద్‌ని గుర్తుపట్టి పలకరించాడు.

''ఏమిటిసార్‌. వినోద్‌సార్‌ కోసం వస్తున్నారా?'' అని అడిగాడు.

ఆ మాటలు వినటానికే మంటగా వుంది వినోద్‌కి.

అసలు వినోద్‌ తను ఇక్కడ ఎదురుగా వుండగా, వాడెవడినో వినోద్‌ అంటున్నాడు వీడు. ఇంతకన్నా విపరీతం ఏంకావాలి. అయినా తప్పదు, ఓపిక అవసరం.

''అవును, ఆయన వున్నారా?'' అనడిగాడు.

''లేరు సార్‌, ఇవాళ ఆఫీసుకు రారు'' చెప్పాడు వాడు.

''మేడం వరేణ్య?''

''ఆవిడకూడా రారండి.  ఆవిడ సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌గదా, వినోద్‌ సార్‌తో కలిసి మార్కెట్‌ సర్వే కోసం టూర్‌ వెళ్ళారు. మీరు ఇవాళ వారిని కలవలేరు, రేపు రండి.''

''ఏ వూరు వెళ్ళారు.''

''బాగుందండోయ్‌, చెపితే ఆ వూరు వెళ్ళిపోతారా ఏమిటి? కలవటానికి రేపు రండి సార్‌.''

''మేనేజరు మధుసూదనరావుదగారు.''

''ఆయన కూడా ఈ పూట రారండి, ఏదో ఫంక్షన్‌కి వెళ్ళారు ఫ్యామిలీతో. అసలు మీరు ఎవర్ని కలవాలి? ఏం పనిమీద వచ్చారు? వరసపెట్టి ఒక్కొక్కరిని మాత్రం ఆడిగేస్తున్నారు పనేమిటో మాత్రం చెప్పటం లేదు.''

ఏం చెప్పాలో తోచలేదు వినోద్‌కి.

''బిజినెస్‌ గురించి మాట్లాడాలి, రేపు కలుస్తాలే'' అని చెప్పి వెనక్కి వచ్చేసాడు.

నిన్న కూర్చున్న హోటల్లో కూర్చుని చాయ్‌ తాగాడు అక్కడే చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు.

''వీడెవవో అసాధ్యుడిలా వున్నాడు. వరేణ్యతో టూర్‌ అంటే ఆమె వీడ్ని ఇష్టపడితేనేగా వెంట తీసుకెళుతుంది. కథ చాలా దూరం తీసుకుపోతున్నట్టున్నాడు. ఒక వేళ వరేణ్యవాడ్ని ప్రేమిస్తే నిజం తెలిసాక పరిస్థితి ఏమిటి? మరొకడ్ని ప్రేమించిన యువతిని తను పెళ్ళిచేసుకోగలదా? వాడి మోసాన్ని బట్టబయలు చేస్తేగాని ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అలా జరగాలంటే వాళ్ళిద్దరూ టూర్‌నుంచి రావాలి తను అప్పుడు సుధాకర్‌నాయుడు గారిని పిలిచి వీడి అంతుచూడాలి'' అనేక విధాలుగా ఆలోచించి అక్కడినుంచి బయలుదేరాడు వినోద్‌.

నిజానికి వినోద్‌ ఆలోచనధోరణిలోనే లోపం వుంది. సమస్య ఏర్పడిన వెంటనే పరిష్కారంగురించి  కూడా ఆలోచించి పనిచేయాలి. అంతేగాని సమస్యల్ని మురగబెడితే వ్యతిరేక ఫలితాల్ని ఇస్తాయి ఈ సంగతి వినోద్‌కి తెలీదు.

హైదరాబాద్‌నుంచి వైజాగ్‌ బయలుదేరిన పోలీస్‌ కానిస్టేబుల్స్‌ భద్రం, వీరభద్రం ఇద్దరూ వైజాగ్‌ స్టేషన్లో రైలు దిగేసరికి ఉదయం  ఆరుగంటలు దాటింది సమయం.

''ఒరే మావా!'' స్టేషన్‌లోంచి బయటకు రాగానే పిలిచాడు భద్రం.

''ఏందిరా అల్లుడూ!'' అడిగాడు వీరభద్రం.''

వాళ్ళిద్దరూ యిలా మామా అల్లుళ్ళ వరస పెట్టుకుని పిలుచుకోవటం అలవాటే. ఎందుకంటే భధ్రంకన్నా వీరభద్రం వయసు పదేళ్ళు ఎక్కువ. ఇప్పుడు భద్రం వయసు ముప్పై వీరభద్రం వయసు నలభై.

''ఆకాశంవంక ఓ లుక్‌ ఇచ్చుకో.''

''ఇచ్చుకున్నాను.''

''ఏం కనిపించింది?''

''ఆకాశం కనిపించింది.''

''ఇందుకే నీకు బుద్దిలేదంటాను మామా! ఆకాశంలో మబ్బులు కన్పిస్తున్నాయి.తెలీటంలేదా?''

''అవున్రా అల్లుడూ! వాతావరణం మారినట్టుందే, కొంపదీసి వర్షం పడుతుందంటావా?''

''వర్షం పడితే మన పాట్లు కుక్కపాట్లే. ఈ మహానగరంలో ఉత్తప్పుడే మనిషిని పట్టుకోడం కష్టం.ఇక వర్షం వస్తేచెప్పాలా''

''వస్తే రానివ్వరా? పడే వర్షాన్ని మనం ఏమన్నా చేయెత్తి ఆపగలమా ఏంటిగాని నీ దగ్గర సెల్‌ భద్రంగా వుందికదూ?''

''ఉందిలే మామా!''

''ఉందని చెప్తావని కాదురా పూల్‌, జైలర్‌సార్‌ చెప్పింది మర్చిపోయావా? రైలు దిగగానే ఫోన్‌కొట్టి రిపోర్ట్‌ చేయమన్నాడు. మనం అప్పుడే రైలు దిగి పది నిముషాలయింది. ఇదో ఆటోస్టాండ్‌ దాటి రోడ్‌ మీదికి వచ్చేసినాం, ముందు ఫోన్‌కొట్టి రైలు దిగినాం అని చెప్పు'' అంటూ గుర్తుచేసాడు వీరభద్రం.

''అవున్రా మామా! ఫోన్‌ చేయకపోతే జైలర్‌సార్‌ మీసం దువ్వుకూంటూ వైజాగ్‌ వచ్చినా వచ్చేస్తాడు. అంటూ వెంటనే హైదరాబాద్‌లోని తను జైలుకు సెల్‌నుంచి ఫోన్‌చేసాడు భద్రం.

వెంటనే లైన్‌లోకొచ్చాడు జైలరు ఆంజనేయులు.

''ఏమైంది?'' అవతలినుంచి హుంకరించాడు.

''ఇంకా ఏం కాలేదు సార్‌. మేమింకా స్టేషన్‌లోనే వున్నాం.'' చెప్పాడు భద్రం.

''స్టేషన్‌లో ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళింది విశాఖపట్నం రైల్వే స్టేషల్ని చూద్దామనిక్కాదు. త్రివిక్రమ్‌ని పట్టుకోడానికి అండర్‌స్టాండ్‌''

''అర్ధమైంది సార్‌. కాని మేం రైలు దిగింది ఇప్పుడే...........''

''ఓ.కేె.   ఓ.కె...  త్రివిక్రమ్‌కి మన పోలీసు పవరేమిటో తెలియాలి. వాడ్ని చూడగానే నాకు ఫోన్‌చేయండి. వాడ్ని పట్టుకోగానే నాకు ఫోన్‌చేయండి. ఎప్పటికప్పుడు నాకుఫోన్‌ చేస్తుండండి. గుర్తిందిగా క్రికెట్‌ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లోనే వాడు తిరుగుతూ వుంటాడు. కనబడగానే లటుక్కున పట్టేయండి.''

''యస్సార్‌! మళ్ళీ ఫోన్‌ చేస్తాను సార్‌.''

''జాగ్రత్త. వీరభద్రం అసలే హడావుడి మనిషి తప్పిపోతే ఆ త్రివిక్రమ్‌ సంగతి అలావుంచి మిమ్మల్ని మీరు వెతుకులాడుకోడంతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. బికేర్‌ఫుల్‌'' అంటూ హెచ్చరించి అవతల లైన్‌ కట్‌చేసాడు ఆంజనేయులు.

''ఏమంటాడు తోకలేని ఆంజనేయులు?'' సిగరెట్‌ ముట్టించుకొంటూ వెటకారంగా అడిగాడు వీరభద్రం.

''నీ గురించే, అసలే మతిమరుపు వీరభద్రుడు. దారితప్పి చిందులేస్తే వైజాగ్‌ జనం హడలిస్తారు. కాస్త కనిపెట్టి చూడమని వార్నింగ్‌ యిచ్చాడు'' చెప్పాడు భద్రం..

''అంత మాటన్నాడా?'' ఆ మెంటల్‌గాడి సంగతి నాకు తెలుసులే పద. ఇప్పుడు ఏం చేద్దాం?'' అన్నాడు వీరభద్రం.

''వళ్ళంతా చిరాగ్గా వుంది మామా! వెధవది జనరల్‌ బోగీలో ప్రయాణమంటేనే ప్రాణసంకటం. ముందు స్నానంచేసి తర్వాత హేపీగా మందుకొట్టి నిద్రపోవాలి, మధ్యాహ్నం లేచి బోంచేసి త్రివిక్రమ్‌ కోసం బయలుదేరుదాం, ఏమంటావ్‌?''

''నాకొచ్చిన అయిడియానే నీకూ వచ్చిందిరా భడవా?'' ఎంతయినా మామా అల్లుళ్ళం గదా. పద, ముందు ఏదో ఒక లాడ్జింగ్‌లో దూరిపోవాలి'' అన్నాడు హుషారుగా వీరభద్రం.

ఇద్దరూ ఆటోలో ఒక లాడ్జికి చేరుకుని డబుల్‌రూం తీసుకున్నారు. స్నానాలుచేసి తీరిగ్గా కూర్చుని రూంబోయ్‌చేత ఒక ఫుల్‌ విస్కీబాటిలు, చిప్స్‌ తెప్పించుకున్నారు. ఒక అరగంటలో బాటిల్‌ ఖాలీ అయిపోయింది. చికెన్‌కర్రీతో పరోటాలు తెప్పించుకుని తిని తలుపు బిగించి పక్కమీద వాలిపోయారు.

అంతే

ఇలా నడుం వాల్చగానే అలా గాఢనిద్రలోకి వెళ్ళిపోయారు ఇద్దరూ. వీళ్ళు తీసుకున్న రూంకి పక్క రూంలోనే వినోద్‌ దిగింది. ముగ్గురూ త్రివిక్రమ్‌ బాధితులే. కాని ఒకరికొకరు తెలీదు. అదీ విషయం.

సబ్‌జైలు.

మధ్యాహ్నం టైం.

భోజనానికి ఇంటికి వెళ్ళటానికి  అప్పుడే బయలుదేరుతున్నాడు జైలర్‌ ఆంజనేయులు, ఇంతలో ఒక కానిస్టేబుల్‌ హడావిడిగా పరుగెత్తుకువచ్చాడక్కడికి.

''మునిగింది సార్‌.........కొంపలు మునిగిపోతున్నాయి సార్‌'' అని కూడా రొప్పుతూ అరిచాడు.

అలవాటు ప్రకారం ఆంజనేయులు మీసం దువ్వుతూ కోపంగా చూసాడు.

''మునిగితే మన జైలు మునగాలిగాని కొంపకాదు ఏమైంది? హుస్సేన్‌సాగర్‌ కట్టలు తెంచుకుందా? మూసీనది ముంచుకొస్తోందా?'' అనరిచాడు అసహనంగా.

''అంతకన్నా ప్రమాదం సార్‌. సడెన్‌విజిట్‌కి సూపర్నెంట్‌సాతర్‌ వచ్చి పడుతున్నారు. బయట ఆయన జీప్‌ దిగటం చూసాను'' వచ్చిన పనిచెప్పాడు కానిస్టేబుల్‌.

ఆ మాట వినగానే

ఎవరో తలమీద పెద్ద సుత్తితో కొట్టినట్టు ఉలికిపడ్డాడు ఆంజనేయులు. వెంటనే కళ్ళముందు మెదిలాడు సూపర్నెంట్‌ రామకృష్ణమాచారి.

   ''మైగాడ్‌! ఈ తిక్కలోడు ఈ టైంలో రావటం ఏమిట్రా........ ఉద్యోగాలు పోతాయి. అసలే చిక్కుల్లో వున్నాం. పరుగెత్తు, లోనకు పరుగెత్తి ఇన్‌చార్జి సుబ్బారావు ఎక్కడున్నాడో చూడు. అలాగే ఆ ఇడియట్‌ త్రివిక్రమ్‌ సెల్లో వెంకటస్వామిగాని, ధర్మారావుగాని ఎవడో ఒకడు రెడీగా వున్నాడో లేదో చూడు, లేకపోతే మేం అటు వచ్చేలోగ ఆ ఏర్పాటు చూడండి లగెత్తు.........త్వరగా'' అంటూ అతడ్ని లోనకు తరిమి తను ఓసారి డ్రస్సు టోపీ సరిచేసుకుని సూపర్నెంట్‌ను రీసీవ్‌ చేసుకోడానికి గబగబా బయటికొచ్చాడు.

అప్పటికే అరడజనుమంది సిబ్బంది వెంటేసుకుని పెద్ద పెద్ద అంగలతో ఆఫీసువైపు వచ్చేస్తున్నాడాయన. అప్పుడే ఆయన్ని చూస్తూన్నట్టుగా ముఖంనిండా నవ్వు వులుముకొంటూ ''రండిసార్‌..........రండి రండి'' అంటూ ఆయన్ని ఆఫీస్‌లోకి ఆహ్వానించాడు.

ఫార్మాలిటీస్‌గా సెల్యూట్‌ సమర్పించుకున్నాక ఆంజనేయుల్ని.

ఆయన  ప్రసన్నంగా చూసాడు.

''ఏమిటోయ్‌ ఆంజనేయులు, నువ్వు ఆహ్వానిస్తే వస్తున్నామాలేక భోజనానికి వస్తున్నామా? రండి రండి అంతగా ఆహ్వానించక్కర్లేదు. మేం వచ్చింది ఆకస్మిక తనిఖీకి. పద, ముందు స్టాఫ్‌ అందర్నీ నా ముందుకు రమ్మను. క్విక్‌'' అంటూ ఆఫీసుకొచ్చి ఆంజనేయులు సీట్లో కూర్చున్నాడాయన.

ఆంజనేయులు కానిస్టేబుల్‌తో స్టాఫ్‌కి వెంటనే కబురు పంపించాడు. టోపీతీసి టేబుల్‌మీద పెట్టి అతి సీరియస్‌గా ఫోజు పెడుతూ ఆంజనేయుల్ని చూసాడు సూపర్నెంట్‌.

జైలర్‌ని కొంచెం కంగారు పెట్లాయా చూపులు.

జైళ్ళ అధికారులు ఎవరో ఒకరు యిలా సడెన్‌గా విజిట్‌కి రావటం మామూలే మరొకప్పుడైతే జైలర్‌గాని, జైలు సిబ్బందిగాని ఇంతగా టెంక్షన్‌ పడేవాళ్ళు కాదు.

కాని ఇప్పటి పరిస్థితి వేరు.

ప్రస్తుతం ఒక ఖైదీ పరారీలో వున్నాడు.

ఆ ఖైదీ త్రివిక్రమ్‌.

అతడు పారిపోయిన విషయం బయటకు పొక్కకుండా మేనేజ్‌చేస్తూ వస్తున్నాడు. పారిపోయినవాడు బాగనే వున్నాడు. తమకు వచ్చి పడ్డాయి తిప్పలు.

అతడ్ని పట్టి వెనక్కు తీసుకరావటానికి ఇద్దరు పోలీసుల్ని వైజాగ్‌ పంపించారు ఇద్దరు పోలీసుల్ని షిప్టు పద్దతిలో పగలు ఒకడ్ని, రాత్రి ఒకడ్ని జైలు డ్రస్‌వేసి, త్రివిక్రమ్‌ సెల్‌లో ముఖం కనపడకుండా అటు తిప్పి నిలబెట్టారు

చూస్తే టైం బాగున్నట్టులేదు ఇప్పుడు విషయం బయటపడిపోయేలా వుంది అందుకే అందరికీ టెంక్షన్‌.

''చూడు ఆంజనేయులు, నా పేరు రామకృష్ణమాచారి. కృష్ణుడు పుట్టింది ఎక్కడో తెలుసా? జైల్లో అంచేత ఏ జైలులో అవకతవకలు జరిగినా నా కళ్ళు గప్పలేరు'' హెచ్చరికగా స్పీచ్‌ ఇచ్చాడు సూపర్నెంట్‌.

''అవును సర్‌. అందుకేగా నేనెప్పుడూ కోరుకుంటాను. రామాంజనేయ యుధ్ధం రాకూడదని'' అన్నాడు నేర్పుగా జైలర్‌.

అతడి సమాధానం విని పొట్టచేత్తో పట్టుకొని మరీ ''హిహిహిహి!'' అంటూ  నవ్వాడాయన. అసలే ఆజానుబాహుడు ఆపైన భారీకాయం ఆయన కూర్చుంటే చాలు, కుర్చీ కిరకిరలాడుతూ రక్షించమని గోల చేస్తుంది. ఆయన నవ్వు చూస్తే మాయాబజార్‌లో ఘటోత్కచుడి నవ్వు గుర్తొస్తుంది.

సూపర్నెంట్‌ గారి పేరుతో రాముడున్నాడు. జైలర్‌గారి పేరులో ఆంజనేయుడున్నాడు. ఇవి రెండూకలిపి ఇక్కడ ఏమి అవకతవకలు జరగదంటూ నర్మగర్బంగా ఆయనకు తెలియచేయటానికే. జైలరు రామాంజనేయయుద్దం రాకూడదని కోరుకుంటాను అన్నాడు. ఈ ఛలోక్తి సూపర్నెంటుగారిపైన టపాకాయలా పేలింది. పొట్ట చేత్తో పట్టుకొని మరీ నవ్వాడాయన.

''భలే ఆంజనేయులు భలే, నీలో కూడా సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ చాలా వుందయ్యా. ఐ లైకిట్‌, బట్‌ డ్యూటీలో నేను మహాస్ట్రిక్టు తేడా పాడాలుంటే తోకలు కత్తిరించేస్తాను. పిలు ఎక్కడ మీ స్టాఫంతా ముందు వాళ్ళందర్నీ పిలు'' అంటూ ఆర్డర్‌ వేసాడు ఫైళ్ళు ముందుకు లాక్కొంటూ.

''వచ్చేస్తున్నారు సార్‌, కబురుపెట్టాను'' చెప్పాడు ఆంజనేయులు ఇంతలో స్టాఫ్‌ వచ్చేసారు.

రిజిష్టర్‌ చెక్‌ చేసాడు సూపర్నెంట్‌.

''ఎక్కడ ? వాళ్ళిద్దరూ ఎక్కడ? భద్రం, వీరభద్రం వాళ్ళు ఇద్దరూ ఏమయ్యారు? అడిగాడాయన.

''వాళ్ళిద్దరూ లీవులో వున్నారు సార్‌. చెరో వారం లీవుపెట్టారు ఒకడు ఉత్తరాది యాత్రలకు, ఒకడు దక్షిణాది యాత్రలకి టూర్‌ వెళ్ళారు.

''నాకు తెలుసు, నీది మంచిమనసయ్యా ఆంజనేయులు, అందుకే అడగ్గానే వెనకా ముందు చూడకుండా వీళ్ళకి లీవ్‌ ఇచ్చి పడేస్తుంటావ్‌. పదండీ ఓసారి లోపలంతా చూద్దాం. అంతా సవ్యంగా జరుగుతోందా?'' అంటూ లేచాడాయన.

''పర్‌ఫెక్ట్‌గా వుందిసార్‌. పూచికపుల్ల కూడా తేడా రాదు...........'' ధైర్యం చెప్పాడు జైలరు.

''వూరుకోవయ్యా నువ్వ మరీను. పూచికపుల్ల తేడాలు ఏం కనిపించి ఛస్తాయ్‌ ఈ వయసులో'' అంటూ అదో గొప్ప జోకులా పగలబడి నవ్వుతూ చెకింగ్‌కి జైలు గదులవైపు బయలుదేరాయడాయన.

జైలర్‌ మాట్లాడుతున్నాడు గాని

అరచేతులు చెమటలు పట్టేస్తున్నాయి

సుబ్బారావువంక చూసాడు.

కంగారు పడక్కర్లేదు అన్నట్టు అతగాడు కళ్ళతోనే సైగచేసి, జైలర్‌కి ధైర్యం చెప్పాడు. స్టాఫ్‌ అంతా అప్పటికే తమ విధుల్లోకి లోనకు వెళ్ళిపోయారు.

కొందరు దూరంగా ఏవేవో పనులు చేస్తున్నారు. కొందరు ఖైదీలు సెల్‌లోనే వుంచబడ్డారు. బయట వున్న ఖైదీలంతా లెక్కకుసరిపోయారు. చివరగా జైళ్ళవైపు వచ్చారు. ఒక్కో సెల్‌ను గమనిస్తూ వస్తున్నాడు.

ఒక సెల్‌లో ఒక్కడే ఖైదీ నేలమీద అటు తిరిగి పడుకుని వున్నాడు. కాళ్ళు చేతులు మునగతీసుకుని పడుకుని వున్నాడు. జైలర్‌ ఆంజనేయులుకి గుండెలు టకటక కొట్టుకుంటున్నాయి ఎందుకంటే త్రివిక్రమ్‌ సెల్‌ అదే. లోన పడుకున్నాడు త్రివిక్రమ్‌ కాదు. కానిస్టేబుల్‌ ధర్మారావు. గుట్టుబయట పడితే తనకి సస్పెండు వేటు తప్పదు.

''వాడెవడు?'' కటకటాలముందు ఆగి లోన ఖైదీని చూస్తూ అడిగాడు సూపర్నెంట్‌ రామకృష్ణమాచారి.

''అతను త్రివిక్రమ్‌ సార్‌. బ్యాంకు రాబరీ ఖైదీ.''

''ఐసీ, మరలా పడుకున్నాడేమిటి. లేపండి.....''

''మూడు రోజులుగా వాడికి ఆరోగ్యం బాగాలేదు సార్‌. ఫుల్‌ఫీవర్‌. ఆపైన కళ్ళకి మద్రాస్‌ ఐ కూడా సోకింది.

''మద్రాస్‌ ఐ అంటే?''

''అదేనండి, కళ్ళు ఎర్రబారిపోయి ఇసుకపోసినట్లు మండిపోతూ వుంటాయి, అంతేకాదు సార్‌ ఆ ముఖంలో ముఖంపెట్టినా కళ్ళలో కళ్ళుపెట్టి చూసినా ఆ వ్యాధి మన కళ్ళకి సోకుతుంది. వీడు బయటకొస్తే జైలు మొత్తం మద్రాస్‌ ఐ సోకుతుందని భయంవేసి లోపలే వుంచాను. వాడి ముఖం ఇటు తిప్పకూడదని ఫుల్‌వార్నింగిచ్చా.........

''అమ్మో. అయితే వాడి ముఖం మనం చూడొద్దులేగాని, కనీసం డాక్టరయినా చూస్తున్నాడా?''

''నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని మరీ లోనకువెళ్ళి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నాడు సార్‌, హి విల్‌ బి ఆల్‌రైట్‌.''

''ఓ.కె. కమాన్‌.............''

అంతా ముందుకు కదిలారు.

గండం గడిచిందని తేలిగ్గా వూపిరి తీసుకున్నాడు జైలరు. కాని నాలుగడుగులు వేసినట్టే వేసి తిరిగి వెనక్కి వచ్చి సెల్‌లోకి చూసాడు  సూపర్నెంట్‌.

దాంతో మరోసారి జైలరు గుండెలో రాయి పడింది.

''ఏమైంది సార్‌?'' కంగారును అణచుకుంటూ అడిగాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్