Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Diabetes, Ayurvedic Tips and Treatment by Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ay)

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఇదో రకమైన పనిష్మెంటూ.... - భమిడిపాటి ఫణిబాబు

different punishment

చిన్న పిల్లల్ని పార్కులకు తీసికెళ్ళకపోతే కుదరదు. ఏదో వాళ్ళ అమ్మా నాన్నలుండాలి కానీ, తాతయ్యలకూ, నానమ్మా/ అమ్మమ్మ లకు మాత్రం  ఈ ప్రక్రియ మాత్రం ఓ పేద్ద punishment లాగే కనిపిస్తుంది. శుభ్రంగా మనవల్నీ, మనవరాళ్ళనీ ఏదో పార్కుకి తీసికెళ్ళి ఆడించండంటే, ఇదేమిటీ ఈయన అదేదో పేద్ద punishment  అంటాడూ అనుకోవచ్చు చాలా మంది. కానీ ఉన్న మాటేదో చెప్పుకోవాలి కదా!   తల్లితండ్రులు అనుకుంటారూ, ఏదో ఖాళీ గా ఉన్నారూ, పిల్లల్ని దగ్గర చేర్చుకుంటే, వీళ్ళకీ ఆ పిల్లలకీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయీ, bonding ఇంకా strong అవుతుందీ, etc..etc... అవన్నీ పుస్తకాల్లోనూ, ఏ child psychologist డబ్బులు పుచ్చుకుని చెప్తే వినడానికో, మహ బాగా ఉంటుంది. అసలు brass tacks కి వచ్చేటప్పటికే గొడవంతానూ ! అసలు వచ్చిన గొడవల్లా ఎక్కడంటే, పాపం ఈ తాతయ్యలకి ఒక వయసు దాటిన తరువాత  energy levels  క్షీణించి పోతాయి. పోనీ అలాగని చెప్పుకోలేరూ, ఏదో పిల్లల్ని పార్కుకే కదా తీసికెళ్ళమంటున్నామూ, ఎక్కడికో కాదు కదా, ఆమాత్రం దానికే ఇంత హడావిడా అని ఇంట్లోవాళ్ళు అనుకోవడం.

ఇదివరకటి రోజుల్లో అయితే, ఈ పార్కులూ గొడవా ఉండేవి కాదు. ఏ కాంపౌండులోనో, అరుగులమీదో ఆడుకునేవారు. ఆరోజుల్లో పార్కులనేవి, సాయంత్రం పూటల్లో, రేడియోల్లో వచ్చే వార్తలకోసమో, లేక ఏ గ్రామస్థుల కార్యక్రమంలో " బావగారి కబుర్లు" వినడానికో వెళ్ళేవారు. ఇంటి చుట్టూరా చెట్లూ చేమలూ ఉండడం తో greenery కి ఏమీ లోటుండేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కాంక్రీటే అవడం తో, ఎక్కడో అరకొరగా ఉండే పార్కులే దిక్కు. పైగా ఆ పార్కులకెళ్ళడం, ఓ పేద్ద కార్యక్రమం. మనం ఉండే ఇంటికి దగ్గరలో ఉంటే ఓ గొడవా, ప్రతీ రోజూ తీసికెళ్ళమంటారు పిల్లలు. ఏదో హోం వర్కూ అవీ ఉండడం ధర్మమా అని ప్రతీ రోజూ తీసికెళ్ళ వలసిన అవసరం ఉండదు. కానీ శలవలొచ్చాయంటే తప్పదు కదా.  ఈ పిల్లలకంటే శలవలు కానీ, అమ్మా నాన్నలకి ఉండవుగా. కొంపలో ఖాళీగా ఉండేవాళ్ళు ఈ తాతామ్మమ్మనానమ్మలు. కోడలో కూతురో ఆఫీసునుంచొచ్చేసరికి కాఫీయో చాయో, అదీకాకపోతే ఏ కుక్కరో పెట్టే వంకతో  ఈ అమ్మమ్మా నానమ్మలు తప్పించేసికుంటారు. ఎంతైనా అదృష్టవంతుల్లెండి ! ఈ హడావిడిలో తాతయ్యలు ఇరుక్కుపోతారు. పిల్లల్ని తీసికెళ్ళడం వీళ్ళకీ బాగానే ఉంటుంది. కాదనను. కానీ అక్కడకి తీసికెళ్ళిన తరువాత పడే పాట్లు, "పగవాడిక్కూడా" వద్దు బాబోయ్ అనిపిస్తుంది.

మరీ ఎండగా ఉన్నప్పుడు తీసికెళ్ళలేమూ, అలాగని మరీ చీకటి పడ్డ తరువాతా కష్టమే. పిల్లల మాటెలా ఉన్నా, ఈ తీసికెళ్ళిన తాతయ్యకి, ఏ కళ్ళ రోగమో ఉంటే, మనవడో మనవరాలో గుర్తుపట్టలేక, ఇంకో పిల్లనో పిల్లాడినో చేయి పట్టుకుని తెచ్చేస్తే మళ్ళీ అదో గొడవా.

పిల్లల్నెత్తుకుపోయేవాడనుకుని ఎవరైనా బడితపూజ  కూడా చేయొచ్చు! దానితో ఏ అసురసంధ్యవేళో బయలుదేరి, ఆ పార్కులోనో ఎక్కడో, ఓ చేత్తో మనవణ్ణీ, ఇంకో చేత్తో మనవరాల్నీ పట్టుకుని వెళ్ళడం. ఆవుదూడ పలుపు తెంచికుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా, ఇందులో కొద్దిగా పెద్దదయిన మనవరాలేమో, తాతయ్యా నా చెయ్యొదులూ అంటూంటుంది.   తాతయ్య చెయ్యిపట్టుకోడం నామోషీ దానికీ! ఏ దెబ్బైనా తగిలిందంటే మళ్ళీ చీవాట్లూ ఇంట్లో. మరీ కొడుకూ,కోడలూ,కూతురూ అనడానికి మొహమ్మాటపడ్డా, ఆ లోటు ఇంటావిడ తీర్చేస్తుంది. అదేమిటండీ ఇంత వయస్సొచ్చింది, పిల్లల్ని జాగ్రత్తగా ఆమాత్రం చూళ్ళేరూ అని! ఎందుకొచ్చిన బ్రతుకురా అనిపించేస్తుంది!

అసురసంధ్యవేళలు చూసుకోడం మనం ఒక్కళ్ళే కాదుకదా, ప్రపంచంలో ఇలాటి "ప్రాణులు" ఇంకా ఉంటారు. ఈ తెగకి చెందిన ప్రతీ తాత పక్షీ అక్కడే కనిపిస్తారు. అక్కడ ఓ సిమెంటు బెంచీయో ఏదో వేస్తారు. అదేం కర్మమో, ఒక్కటీ ఖాళీ ఉండదు. అయినా మనం పార్కుకొచ్చింది ఖాళీగా కూర్చోడానికా ఏమిటీ అని, ఓసారి ఆత్మశోధన చేసేసికుని (ఇంకేమీ చేయలేక!, చేతిలో ఉన్న మనవణ్ణొక్కడినీ ( అప్పటికే కొద్దిగా వయసున్న మనవరాలు తూనిగలా పారిపోవడం వల్ల) తీసికుని అక్కడుండే, ఏదొ స్వింగో. జారుడుబల్లో ఇంకో సింగినాదమో దేంట్లోనో ఓ దాంట్లో ఖాళీ ఉందేమో చూద్దామనుకుంటే, అన్నీ occupy అయిపోయుంటాయి. ఎవరిపిల్లలు వాళ్ళకి ముద్దేకదా.చిన్న పిల్లల మాట సరే, ఒక్కోప్పుడు కొద్దిగా వయసొచ్చిన పిల్లలు కూడా ఏ స్వింగు మీదో ఆడుతూండడం కూడా చూస్తూంటాం.

వాళ్ళకెందుకు చెప్పండి ఈ చిన్న పిల్లల ఆటలు? ఏదో చాలాసేపు వెయిట్ చేయగా ...చేయగా... చేయగా ఎవడో ఒకడు మనమీద జాలిపడి ప్లేసిస్తాడు. తీరా అక్కడకి తీసికెళ్తే ఈ మవడికేమో భయం, ఒక్కడూ కూర్చోడానికి. పోనీ వీడికి భయం కదా అని వాడి అక్కని పిలుద్దామంటే, దానికి నామోషీ, మరీ చిన్నపిల్లలతో ఆడ్డానికీ, అక్కడికేదో పుట్టడమే పెద్దదానిలా పుట్టినట్టుగా! పోనీ ఏదో ఒకదాంట్లో ఆడించేసి తీసుకుపోదామా అనుకుంటే, అంతదృష్టం కూడానా? ఇంకోటేదో చూపించి, అదెక్కుదామంటాడు.అక్కడా మళ్ళీ ఇదే గొడవా.వాడి వెనక్కాలే పరుగులెత్తడానికి ఈ తాత గారు ఆపసోపాలు పడిపోతూంటాడు. మధ్యమధ్యలో ఆ మనవరాలివైపుకూడా ఓ కన్నేసుకునుండాలి, అదేమీ అఘాయిత్యం చేయకుండా. ఏదో అంతా బావుందీ అనుకునేటంతట్లో, అక్కడ బెంచీల మీద కూలబడ్డ తాతెవ్వడో, తనతో తెచ్చిన కూల్ డ్రింకు బాటిలో, మంచినీళ్ళ బాటిలో తన తో వచ్చిన మనవడికో మనవరాలికో ఇస్తాడు. తన డ్యూటీ ఏదో తను చేసికున్నా, ఈ బాటిలుందే మన ప్రాణం మీదకు  తెస్తుంది. అప్పటిదాకా ఆడుకుంటున్నవాడు కాస్తా, తాతా దాహం అంటాడు. అయిపోయిందే తాతయ్యల పని! అక్కడెక్కడో దొరికే నీళ్ళివ్వకూడదూ, ఇచ్చేదాకా వీడేడుపాపడూ, పోనీ కొంపకెళ్ళిపోదామా అనుకుంటే , ఆ ఆడుకుంటున్న మనవరాలేమో తెమలదూ.  Just five minutes.. అంటూనే  ఉంటుంది. ఆ మాయదారి  Just five minutes.. అయేటప్పటికి ఓ అరగంట పడుతుంది. ఈ లోపులో కొంపలంటుకుపోయినట్లు వీడి ఏడుపూ,   పోనీ ఇంతసేపూ పార్కులో ఆడనిచ్చేనా, అయినా సరే ఆ మనవరాలికి అలకా, ఏదో మొత్తానికి కొంప చేరతాము. మూతిముడుచుక్కూర్చున్న మనవరాలితోనూ, ఏడుస్తున్న మనవడితోనూ. ఇంక ఇంట్లో ఏమై ఉంటుందో అడగాలా ?  ఈ చిన్నపిల్లలకి ఏమివ్వండి, ఎక్కడకు తీసికెళ్ళండి, ఏ నియమాలూ, ఆంక్షలూ పెట్టకుండా ఉన్నంతసేపూ అందరూ మంచివాళ్ళే, ఏదైనా అన్నామా, అయిపోయిందే.. పైగా ఈ exercise ఒక్కరోజుతో అయేదా, అబ్బే వేసవికాలం శలవలున్నంతకాలమూ, ప్రతీ వీకెండూ తప్పించి, five day week లాగన్నమాట...

  మరి ఇదంతా పనిష్మెంటు కాకపోతే ఏమంటారమ్మా .....

మరిన్ని శీర్షికలు
duradrustapudongalu