Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సినిమా నా జీవితంలో 5 శాతం మాత్రమే

intterview with praksh raj

మొండి పాత్రల్ని సైతం మొడ‌లు వంచి.. వాటిపై స‌వారీ చేయగ‌ల నటుడు ప్రకాష్‌రాజ్‌. డాడీ పాత్రల నుంచీ.. డాన్ వేషాల వ‌ర‌కూ - `కీల‌కం` అనిపించే ప్రతీ పాత్రకూ ఆయ‌నే గుర్తొస్తారు. ఇద్దరు, అంతఃపురం, ఒక్కడు, బొమ్మరిల్లు - ఇలా ఏం చెప్పాలి ఆయ‌న గురించి. ప్రతీ పాత్ర ఓ క‌థ చెబుతుంది. న‌ట‌న అంటే ఏమిటో.. ఓ పాఠంలా వివ‌రిస్తుంది. తెలుగునాట అత్యంత ఖ‌రీదైన క్యారెక్టర్ న‌టుడు ప్రకాష్‌రాజ్‌. ఆయ‌న‌లో మ‌రో కోణం.. ధోని తో బ‌య‌ట ప‌డింది. `ఇన్నాళ్లూ మ‌రొక‌రు వేసిన బొమ్మలో నేనొక రంగు మాత్రమే. ఇప్పుడు నేనే ఓ బొమ్మ వేస్తున్నా..` అంటూ త‌న‌లోని ద‌ర్శకుడిని క‌వితాత్మకంగా ప‌రిచ‌యం చేసుకొంటారు ప్రకాష్‌రాజ్‌. ఆయ‌న దర్శక‌త్వం వ‌హించిన ఉల‌వ‌చారు బిరియానీ ధియేట‌ర్లలో వేడి వేడిగా పొగ‌లు గ‌క్కుతోంది. ఈ సంద‌ర్భంగా ప్రకాష్‌రాజ్‌తో చిట్ చాట్‌.

* న‌టుడిగా చాలా చాలా బిజీ. కోట్లు పారితోషికం తీసుకొంటుంటారు. మ‌ధ్యలో ఈ ద‌ర్శక‌త్వం ఏమిటి?
- (న‌వ్వుతూ) న‌టుడిగా నేనేంటో అంద‌రికీ తెలిసింది. డ‌బ్బులు సంపాదించా. అంతో ఇంతో పేరు, కొన్ని అవార్డులూ తెచ్చుకొన్నా. ఎవ‌రైనా ఇక్కడితో స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ నాకంటూ ఓ సెప‌రేట్ ఫ్యాష‌న్ ఉంది. నాకంటూ ఓ కొత్త మార్క్ సృష్టించుకోవాల‌న్న త‌ప‌న ఉంది. అందుకే ఇలాంటి ప్రయ‌త్నాలు చేస్తున్నా.

* ధోని కోసం కొన్ని సినిమాలు వ‌దులుకొన్నారు.. ఉల‌వ‌చారు బిరియానీ కోసం కూడా కొన్ని ప్రాజెక్టులు ప‌క్కన పెట్టారు. ఇబ్బంది అనిపించ‌లేదా..?
- మీకో మాట చెప్పాలి. నేనెప్పుడూ  చేతి నిండా ప‌నితో బిజీగా ఉండాల‌నుకొంటాను. ఆ ప‌ని ఇష్టమైన ప‌ని అయితే ఇంకా బాగుంటుంది క‌దా..?  అటు న‌టించినా, ఇటు సినిమాలు చేసినా నేనే క‌దా..?  రెండూ నాకిష్టమైన రంగాలే. న‌టుడిగా ఎంత బిజీగా ఉంటానో, ద‌ర్శకుడిగానూ ఇప్పుడు అంతే బిజీగా ఉంటాను. అన్నిటికంటే సినిమాతో మ‌మేక‌మై ఉన్నా. అది చాలు నాకు. నా స్థానంలో మ‌రొక‌రు వ‌స్తార‌న్న అభ‌ద్రతా భావం ఏనాడూ లేదు. నాకోసం పుట్టిన పాత్రలు న‌న్ను వెతుక్కొంటూ వ‌స్తాయ‌న్న న‌మ్మకం పుష్కలంగా ఉంది.

* ధోని ఎలాంటి పాఠాలు నేర్పింది?
- పాఠాలు నేర్చుకోవ‌డానికి నేనేం త‌ప్పు చేయ‌లేదండి. ఓ క‌థ‌ని న‌మ్మి.. క‌థ‌గా తీశా. చూసినోళ్లంతా బాగుంద‌న్నారు. కాక‌పోతే అలా చూసినోళ్ల సంఖ్య కాస్త త‌క్కువ‌గా ఉందంతే. టీవీల్లో వ‌స్తే ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. `మంచి సినిమా తీశారండీ. ధియేట‌ర్లో చూడ‌లేక‌పోయాం` అంటుంటారు. ఆ సంతృప్తి చాలు నాకు.

* ఇంత‌కీ ఉల‌వ‌చారు స్పైసీగా ఉండ‌బోతోందా..?
- ఇది మ‌సాలా ద‌ట్టించిన సినిమాకాదండీ స్పైసీగా ఉండ‌డానికి. అనుబంధాలూ ఆప్యాయ‌త‌లూ ద‌ట్టించిన సినిమా. రుచిక‌రంగా ఉంటుంది అంతే.

* మ‌ల‌యాళ సినిమా సాల్ట్ అండ్ పెప్పర్‌కి రీమేక్ క‌దా..?  సొంత క‌థ తీయ‌కుండా రీమేక్ ఎందుకు ఎంచుకొన్నట్టు...?
- నేను చెప్పబోతోంది సొంత క‌థా?  లేదంటే ఎరువు క‌థా?  అని ఆలోచించ‌ను. క‌థ నాకు న‌చ్చాలి. సాల్ట్ అండ్ పెప్పర్ చూసిన‌ప్పుడు స్పెల్ బౌండ్ అయిపోయా. అరె.. భ‌లే ఉందీ సినిమా అనిపించింది.  ఈ క‌థ‌కు నా అనుభ‌వాలు జోడించి మ‌ళ్లీ చెప్పాల‌నిపించింది. అందుకే ఈ క‌థ ఎంచుకొన్నా. ఆక‌లి, ప్రేమ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది.  అవి ఏ ప్రాంతంలో అయినా ఒకేలా ఉంటాయి. కాక‌పోతే.. మ‌న వాతావ‌ర‌ణానికి త‌గిన మార్పులు చేయ‌గ‌లిగా.

* వంట‌ల‌పై ప‌రిశోధ‌న‌లాంటిది ఏమైనా చేశారా?
- చేయాలి క‌దండీ మ‌రి. ఎందుకంటే ఈ సినిమాలో చాలా ర‌కాల రెసిపీల‌ను చూపించ‌బోతున్నాం. మ‌న‌వైన వంట‌ల రుచులు సినిమా ఆసాంతం త‌గులుతూనే ఉంటాయి. వంట‌ల‌పై ఓ పాట కూడా ఉంది.

* మీరూ బిరియానీ ప్రియులా?
- అవును. ఏదైనా కొత్త ప్రాంతం వెళితే అక్కడి బిరియానీ టేస్ట్ చేయందే వ‌ద‌ల‌ను. అస‌లు మ‌న సంస్కృతి బిరియానీతో మిళిత‌మై ఉంద‌ని నా న‌మ్మకం.

* అన్నట్టు ప్రధాన పాత్రకు ప్రకాష్‌రాజ్‌ని తీసుకొన్నారు. అంత‌కంటే మంచి న‌టుడు లేడా..?
- (న‌వ్వుతూ) మంచి ప్రశ్న వేశారు. చెబితే గ‌ర్వం అనుకొంటారు గానీ.. నాకు నా లాంటి న‌టుడు క‌నిపించ‌లేదు. ఈ సినిమా మూడు భాష‌ల్లో తీస్తున్నాం. మూడు భాష‌ల్నీ అర్థం చేసుకొని, నాక అర్థమ‌య్యే న‌టుడు నాకు దొర‌క‌లేదు. అందుకే ప్రకాష్‌రాజ్‌ని తీసుకొన్నా.

* న‌టుడు, ద‌ర్శకుడు, నిర్మాత‌... మూడు బాధ్యత‌ల్లో దేన్ని ఆస్వాదించారు..?
- మేకింగ్ ఆఫ్ సినిమాని బాగా ఆస్వాదించా.

* ఇప్పటికే మీలో చాలా కోణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. లోప‌ల ఇంకేమున్నాయి?
- చూద్దాం.. ఇంకా ఏమేం వ‌స్తాయో.?  నేను ప్లాన్ ప్రకారం ఏమీ చేయ‌నండీ. పైగా నాకు సినిమా ఒక్కటే వ్యాప‌కం కాదు. అది నా జీవితంలో 5 శాతం మాత్రమే. మిగిలిన 95 శాతం జీవితం ఉంది. నా కుటుంబం, నా అల‌వాటు, నా పుస్తకాలు.. మ‌ధ్య మ‌ధ్యలో వ్యవ‌సాయం చేస్తుంటా. ఇలా నాకు ఎక్కడ సంతృప్తి దొరుకుతుందో ఆ ప‌నిలో నిమ‌గ్నమైపోతా.

* వివాదాలూ ఉన్నాయి క‌దా..?
- ఏవండీ.. మూడొంద‌ల సినిమాలు చేశా. అందులో ప‌ది మంది ద‌ర్శకుల‌తో గొడ‌వ పెట్టుకొన్నానేమో..?  మిగిలిన 290 ద‌ర్శకుల‌తో స‌వ్యంగానే ప‌నిచేశా క‌దా. నేను నేనులానే ఉంటా. దాన్ని అహంకారం అనుకొంటే నేనేం చేయ‌లేను.

* ఉల‌వ‌చారుని హిందీలోకి తీసుకెళ్తారా?
- ఆ ఆలోచ‌న ఉంది. అందుకే ఆ సినిమా హిందీ రైట్స్ నాద‌గ్గరే అట్టిపెట్టుకొన్నా. అస‌లు తెలుగు, త‌మిళ‌, క‌న్నడ ల‌తో పాటు స‌మాంత‌రంగా తీయాల్సిందే. కానీ మ‌న సంస్ర్కృతికీ, అక్కడికీ చాలా తేడా ఉంది. అందుకే క‌థ‌లో కీల‌క‌మైన మార్పులు చేయాలి. అవ‌న్నీ చేస్తే.. హిందీలోకి తీసుకెళ్తా..

* మీ బిరియానికీ, న‌టుడిగా మీ ప్రయాణానికీ ఆల్ ది బెస్ట్‌..
- ధ్యాంక్యూ సో మ‌చ్‌.

-- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Ulavacharu Biryani