Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ ఏ ఎస్ పాస్

జరిగిన కథ: కిట్టు వాళ్ళ నాన్నగారు, కిట్టుని పెళ్ళి చేసుకోమని, అమ్మాయి గుణగణాలను వివరించి ఒప్పిస్తాడు. అంతే అమ్మాయిని చూడ్డం, ఇద్దరూ ఒకరికొకరు అంగీకారం తెలపడం, పెళ్ళి చక చకా జరగడం అయిపోయాయి. కొద్ది రోజుల తరువాత హైద్రాబాద్ కు మకాం మార్చి కొత్తకాపురం పెట్టాడు. కిట్టు.

అనిత...

కిట్టు భార్య...

సంసృతంలో అనిత అంటే " ముక్కుసూటి " అనీ, "నాయకుడు " అనీ అర్థాలున్నాయి. హిబ్రూ భాషలోనూ, స్పానిష్ భాషలోనూ, ఫిన్లాండ్ భాషలోనూ " నిండైన మనిషి " , " ఇతరుల మన్నన పొందే మనిషి " అని అర్థాలున్నాయి. అప్సరస కాకపోయినా ఇతరుల మన్నన పొందే రూపం కలిగినది అనిత. సన్నగా కొంచెం పొట్టిగా , మెరుగైన దేహచ్చాయ కలిగి ఉంటుంది. పెద్ద పెద్ద చదువులు చదవలేదు. జ్ఞానాన్నిచ్చేంత చదువు చదివింది. పాలకొల్లు, భీమవరం లాంటి చిన్నచిన్న ఊర్లు మాత్రమే తెలుసు. ఈ మాత్రం మనిషికి నాయకత్వ లక్షణాలెక్కడొస్తాయి?  పేరుని బట్టీ నాయకత్వ లక్షణాలొస్తాయా? అయినా పేరులో ఏముంది? మహారాజు అని పేరు పెట్టుకుని అడుక్కుతినేవాళ్ళు లేరా? సరే, రాపం ని బట్టీ ఇతరుల మంచిని, మన్ననను బట్టి పొందవచ్చుగాక, నాయకత్వ లక్షణాలు ఎలా వస్తాయి? ఆమె ప్రవర్తనని గమనించాక కిట్టు ఆమె పుట్టిన తేదీని బట్టి, ఇంగ్లిష్ గ్యోతిష్య శాస్త్రం (ఆస్ట్రాలజీ ) తిరగేశాడు.

ఆమెది సింహ రాశి.

సింహా లకి మంచి అభిరుచి ఉంటుంది. అలాగే ఈమె కూడా ఇంటినీ, వంటగదినీ కడిగిన ముత్యంలా ఉంచుతుంది. వాడేసిన పాత్రని రేపు కడుక్కోవచ్చులే అని వదిలేయదు. ఎంత రాత్రయినా, లేటయినా, శుభ్రం చేసిగానీ వదలదు. నడుచుకుంటూ షికారుకి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ఈగలు వాలుతున్న టీ షాపు వచ్చినప్పుడు తాగుదామా అంటే వద్దు .. అది ఉన్న ప్రదేశం బాగాలేదని అంటుంది. అలాగని ఆమె ధనవంతుల కుటుంబం నుండి రాలేదు... మామూలు మధ్య తరగతి కుటుంబమే.. ఏదన్నా విషయం పట్టుబడితే... మళ్ళీ ఆ అభిప్రాయాన్ని మళ్ళించడానికి కిట్టుకి చాలా సమయం పట్టేది. మందులు వాడకూడదు. .. అనిత అభిప్రాయం ఇది.

దేవుడే బాగుచేస్తాడు.

ఆమెని కిట్టు ' అనీ ' అని పిలుస్తాడు.

అది కాదు అనీ...

నీకు గత వారం పది రోజులుగా దగ్గు తగ్గడం లేదు... ఇచ్చిన మందులు వేసుకోవడం లేదు. దేవుడు మనల్ని బాగు చేయాలంటే మనం ఏమీ చేయకుండా ఉంటే దేవుడు కూడా బాగుచేయడు. అందుచేత మందు వేసుకో... అదీగాక నువ్వసలే సన్నంగా కనబడుతున్నావు. దానికి తోడు దగ్గు. అందరూ నన్నంటున్నారు మీ ఆవిడకు 'టీబీ ' ఆ అని . ఎందుకు డాక్టర్ కి చూపించడంలేదని... నా మాట విని మందులు వేసుకో అన్నాడు కిట్టు. చచ్చిపోతే చచ్చిపోతాను గానీ... మందులు వేసుకోను అన్నది అనిత. ఇక లాభం లేదు. ఏక్షన్ తీసుకోవాల్సిందే... తలుపులు దగ్గరగా వేసి, అనితకు దగ్గరగా వెళ్ళాడు కిట్టు...

చెళ్ళు చెళ్ళు మంటూ నాలుగు చరుపులు వీపు మీద చరిచాడు.

ఇవిగో బిళ్ళలు.. ఇవిగో నీళ్ళు...

వేసుకుంటావా లేదా...

లేకపోతే చంపేస్తాను... నియ్యమ్మ

అని పెద్ద కంఠంతో అరిచాడు.. కిట్టు.

అనితకు పెద్ద షాక్...

వీపంతా చిరచిరలాడింది. .. అయినా ఏ మాత్రం తగ్గలేదు...

నేను వేసుకోను అనిత కూడా అరిచింది.

ఇక్కడే వుండు నియ్యమ్మ!

ఏలాగూ దగ్గుతో సస్తావు నువ్వు... దానికంటే ముందే నీ పీక కోసేస్తే పీడా పోతుంది. ..

అని పెద్ద గొంతుకతో అరుచుకుంటూ పరిగెత్తుకు వెళ్ళి, వంట గదిలోంచి కత్తి తీసుకువచ్చాడు కిట్టు... భయం తో గబుక్కున టాబ్లెట్లు మింగి, నీళ్ళు గొంతులో పోసేసుకుంది అనిత.

లోలోపల నవ్వుకున్నాడు కిట్టు.

కత్తి కింద పడేసి, కోపంతో నేలను దబాదబా తన్నుతూ బయటకు వెళ్తున్న కిట్టు వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి తనకున్న బలమంతా ఉపయోగించి కిట్టు వీపు మీద చరిచింది అనిత. నన్నే కొడుతావా? అని ఆ తరువాత అనుకున్నాడూ కిట్టు.. పెళ్ళాన్ని కొట్టొద్దన్న నా కొడుకెవడు? వాడికి బుద్ధి లేదు... అని మొగుడూ, పెళ్ళాలు కొడ్లాదుకుని, ఆ తరువాత మళ్ళీ ఫ్రెండ్స్ అవడం లో ఎంతో మజా వుంది.
 కిట్టుకి జ్యోతిష్య శాస్త్రం మీద కొద్దిగా కూడా నమ్మకం లేదు...

కానీ తన రాశిలో రాసిన ముఖ్య లక్షణాలు అంతవరకే.. ఇదొక వింత. అంతే... మరి ఇవి కలిసినప్పుడు మిగిలిన వెందుకు కలవవు?
ఇది రిసర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీకు లవర్ దొరుకుతుంది..

ఈ రోజు మీకు డబ్బు దొరుకుతుంది...

ఈ రోజు మీ పని అయిపోతుంది...

ఈ మీ ఇంటికి చుట్టాలు వస్తారు...

ఈ రోజు మీకు బంగారం దొరుకుతుంది...

ఈ రోజు పులై పోతారు...

ఈ రోజు మీరు కుక్కై పోతారు.

ఇలా రాసినవేమీ ఎవరికి నెరవేరలేదు.. నెరవేరవు కూడా...... అంచేతా తలబద్దలు కొట్టుకోవడం అనవసరం...

ఈ విషయం అందరికి అనుభవపూర్వకంగా తెలుసు...

కాదు.. కూడదూ..  అనుకున్న వాడికర్మ ...

ఇక కిట్టు హనీమూన్...

అనితని ఊటీ.. కొడైకెనాల్..భూటాన్..నేపాల్.. తీసుకువెళ్ళాల్సిన పనిలేదు. తీసుకెళ్ళెంత డబ్బు కూడా కిట్టుకి లేదు. ఆమెకి హైద్రబాదే చాలా వింతగా, విశేషం గా వుంది. బజాజ్ సన్నీ మీద ఇద్దరూ తిరిగేవారు..

ఒక రోజు బిర్లా బిర్లా మందిర్, ఒకరోజు ట్యాంక్ బండ్, ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్నవన్నీ చూడడానికే చాలా రోజులు పట్టీంది. నెహ్రూ జూ పార్క్, చార్మినార్, గోల్కొండ, పబ్లిక్ గార్డెన్స్, ఉస్మానియా యూనివర్సిటీ పార్కులు తిరిగేవారు... కిట్టుకి సెలవు పెట్టాల్సిన అవసరం లేదు... సాయంత్రం కొంచెం ముందుగా పర్మిషన్ అడిగి, ఇంటికి వచ్చేసే వాడు. శనివారం, ఆదివారాలు ఎలాగూ సెలవులు, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి.. ఎన్ని రోజులు గడిచాయో.. ఎన్ని నెలలు గడిచాయో.. కిట్టుకి తెలియడం లేదు.. కాలం గడుస్తూ ఉంది. . ఫ్రెండ్స్ ఎవర్నీ కలవడం లేదు... కోచింగ్ కు వెళ్ళడం లేదు.ఆఫీస్, ఇల్లు, సినిమాలు, షికార్లు...

అకస్మాత్తుగా ఆఫీస్ ఒకతని చేతిలో ఎంప్లాయ్ మెంట్ న్యూస్ చూసాడు. ఎంప్లాయ్ మెంట్ న్యూస్ చూడగానే సివిల్స్ గుర్తుకు వచ్చింది. ఔను ధరఖాస్తు చేసుకున్నాడు... ఇంకా పరీక్షకి మూడు నెలలే వుంది... కిట్టు హడావుడి గమనించిన అనిత అడిగింది ఏమయ్యింది.. ఏమయ్యింది.. అని. తన సివిల్స్ కి సంబంధించిన విషయాలన్నీ చెప్పాడు. ఇంకా మూడు నెలలు ఉందన్నారు కదా..

సెలవు పెట్టేసి చదువుకోండి. ఎంచక్కా... అంది అనిత.

మరుసటి రోజు ఆఫీస్ కు వెళ్ళి సెలవడిగాడు. కిట్టు. తీసుకో... పోయిన సారిలాగానే జీతం రాదు... అదీగాక సర్వీస్ బ్రేక్ ఐపోతుంది అన్నారు.
సర్వీస్ బ్రేక్ అంటే?

అడిగాడు కిట్టు...

&fsat &fsat &fsat &fsat   అని చెప్పారు అఫెస్ వాళ్ళు.

కిట్టుకి ఒక్క అక్షరం ముక్క అర్థంకాలేదు...

"ఏమైతే అయ్యింది సెలవిచ్చేయండి అన్నాడు. సెలవు తీసుకుని ఇంట్లో కూర్చున్నాడు కిట్టు. చేతులు పొడవుగా వుండి, అట్ట పెట్టుకుని చదువుకోవడానికి వీలుగా వున్న అల్లిక వున్న మడత కుర్చీ వుంది కిట్టు దగ్గర... నూటాఢెభ్భై రూపాయాలకి కొన్నాడు.' దాంట్లో కూర్చుని చదివేవాడు....

ప్రిలిమినరీ వరకు కోచింగు తీసేసుకున్నాడు కిట్టు. కాబట్టి ఇక కోచింగ్ కు వెళ్ళాల్సిన పనిలేదు... ఇంట్లో కూర్చుని చదువుకోవడమే.. ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నాడు కిట్టు.

లేచి అటూ ఇటూ తిరుగుతున్నాడు... తప్పదన్నట్లుగా మళ్ళీ పుస్టకం పట్టుకుంటున్నాడు కిట్టు. గుట్టల్లాగా పుస్తకాలు, నోత్సులు.. స్తడీమెటీరియల్.. చిందర వందరగా ఉండేవి.
|
అనిత వచ్చి తనకి తోచినట్లు సర్దేది.

ఇంతలోనే ఇంకోటేదో చదివిన పుస్తకాలు|

చిందర వందర చేసేవాడు.

గంటల తరబడి కూర్చుని చదవాలి. ఒక వారం కష్టంగా వుంది. తరువాత తరువాత అలవాటవుతూ ఉంది.. అలా చదువుతూ వుండగా...
' కిట్టుకి తన చిన్నతనం, ఆ చిన్న తనం లో తను చదివిన చదమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, కామిక్స్ పుస్తకాలు, చిన్న పాకెట్ సైజు కథల పుస్తకాలు, ఆంధ్ర భూమి , డిటెక్టివ్ పుస్తకాలు.. అన్నీ గుర్తుకొచ్చేవి ' ఔనూ!.. ఊరికే ఇబ్బంది పడతావేంటిరా కిట్టుగా. నీకు అలవాటేకదరా కూర్చుని చదవడం, ఒక్కసారి నీ బాల్యం అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ తో చదివేవాడివి? ఇప్పుడెందుకు ఏదో కష్టమనుకుకుంటాను? అదే అలవాటు గుర్తుతెచ్చుకో.. హాయిగా చదువుకో... అంటూ తనలో తానే మాట్లాడుకునే వాడు కిట్టు. మళ్ళీ ఎప్పటికో తలెత్తి గడియారం వైపు చూసేవాడు.
రాత్రి ఒంటిగంట...

మళ్ళీ టీ కప్పుతో అనిత...

నువ్వు పడుకో నాకోసం నిద్ర పాడు చేసుకోకు అనేవాడు.

మళ్ళీ చదువు...

ఏఏసారి తెల్లవారు ఝాము నాలుగు గంటలు...

కునికి పాట్లు పడుతున్న కిట్టుని భుజం మీద తట్టి లేపి టీ అందించింది అనిత...

అలా ఎప్పటి వరకు చదివాడో, ఎప్పుడు చదువో.. ఒక సమయం సంధర్భం లేదు.. కిట్టుతో పాటు

అనిత కూడా అదే టైం టెబుల్.. నీకెందుకు? నా తిప్పలు నేను పడుతున్నా కదా...

నీవు నీ నిద్ర ఎందుకు చెడగొట్టకుంటున్నావు అని ఎన్ని సార్లన్నా...

లెక్క కూడా చేసేది కాదు అనిత..

ఈమె పట్టు పట్టిందంటే ఇంక దానికి తిరుగులేదురా బాబూ అనుకునేవాడు.

కిట్టు ప్రిలింస్ రాసేసాడు...

ఫలితాలు రావడానికింకా సమయం ఉంది...

కొంచెం గా మళ్ళీ మామూలు లోకంలోకి ఆఫెసుకి వెళ్ళి వస్తున్నాడు...

అనిత కూడా మామూలు లోకంలో పడింది.

సాయంత్రం పార్కులు, సినిమాలు...

|ఫలితాలు రానే వచ్చాయి...

' ఈ సారి కిట్టు ... పాసయ్యాడు...

ఇది మూడో సారి కిట్టు ప్రిలింస్ రాయడం...

కిట్టుకి ఎంతో ఆనందం కలిగింది. అనితకి కూడా సంతృప్తి.. పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చిందని... ఆమెకిదేదో చిత్రమైన గేం లా వుంది.
పూర్తి అవగాహన లేకపోయినా...

ఇదేదో గట్టిగా పోరాడాల్సిన విషయమే అని తెలుసుకుంది.. కిట్టు విజయమే తన విజయమని నిర్ణయించుకుంది...దేవిడిచ్చిన ఈ అవకాశాన్ని వదలకూడదు అనుకున్నాడు కిట్టు. తరువాత మెట్టు మెయిన్స్...

ప్రిలింస్ లో ఈ బిట్ పేపర్ లాంటి ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి. వాటికి సమాధానాలు గుర్తించాలి. ఇప్పుడు మెయిన్స్ సమాధానాలు (చేతిలో పేపర్, పెన్ను పట్టుకుని) పేరాలుగా పరా పరా రాయాలి.

ఇంకా ఇంకా శోధించి, చాలా వివరాలు సంపాదించాడు.

ప్రిలింస్ లో ఉన్న జనరల్ స్టదీస్ పేపర్ ఈ మెయిన్స్ లో కూడా ఉంటుంది.

ఆ తరువాత రెండు సబ్జెక్ పేపర్ల ఇక మిగిలినది వ్యాసరచన పేపరు మొత్తానికి జనరల్ స్టడీస్, రెండు సబ్జెక్ట్ లు వ్యాస రచన, పదో తరగతి స్టాండర్డ్ లో తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు రాయాల్సి వుంటుంది.

వ్యూహం..

వ్యూహం అనే మాట మనకి మహాభారతం లో వినిపిస్తుంది. పద్మవ్యూహం.. అభిమన్యుడు..

అది యుద్ధం కదా?

యుద్ధం లో వాడే ' వ్యూహం ' కీ మూలాన కూర్చుని పెన్ను తో పరా పరా రాసుకునే పరీక్షలకి సంబంధం ఏముంది? పూర్వ కాలం లో బళ్ళాలు, కత్తులు పట్టుకుని ఒక సైన్యంతో భయంకరమైన యుద్ధం చేసేది, బళ్ళాలతో పొడుచుకునేవారు... కత్తులతో నరుక్కునేవారు. .. రక్తం ఏరులైపారేది... ఎందుకోసం.. రాజ్యం కోసం.. రాజ్యం వస్టె ఏమొస్తుంది...? ధనమొస్తుంది... ప్రజలకు రాజు కావచ్చు... రాజు ఏం చేయాలి? ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజలకి సేవ చేయాలి.. రాజుకి పేరు వస్తుంది.. చివరికి ధనానికి ధనం, పేరుకి పేరు రెండూ వస్తాయి. . కాలం మారింది...

యుద్ధానికి బదులు పోటీ పరీక్షలు వచ్చాయి. . ఈ పోటీ పరీక్షలు కూడా యుద్ధమే! కొన్ని లక్షల మందితో దేశ వ్యాప్తం గా యుద్ధం చేయాలి బళ్ళాల బదులు.. పెన్ను పాళీలు ఈ యుద్ధం లో వాడతారు. అక్కడ రక్తమైతే ఇక్కడ సిరా.. ఎందుకోసం.. ఉద్యోగం కోసం.. ఉద్యోగమొస్తే ఏమొస్తుంది? జీతమొస్తుంది.. ఒక ఉన్నత అధికారి కావచ్చు.. ఉన్నతాధికారి ఏం చేయాలి? ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజలకి సేవ చేయాలి. ఉన్నతాధికారికి పేరు వస్తుంది. చివరికి జీతానికి జీతం, పేరుకు పేరు రెండూ వస్తాయి. . అందుకే యుద్ధానికి వ్యూహం కావాలి... పోటీ పరీక్షలకి వ్యూహం కావాలి... ఆచీ తూచీ అడుగులు వేయాలి.. అప్పుడప్పుడు ఇంటర్ తరువాత ఏం చదవాలి? అనే ప్రశ్న వచ్చినప్పుడు విన్న "గాయపడ్డ సైనికులు" అనే మాట గుర్తుకొచ్చింది కిట్టుకి.|

అవును నిజమే.. యుద్ధానికి, చదువుకీ చాలా దగ్గరి సంబంధం వుంది.

"జనరల్ స్టడీస్" పేపర్ తో ప్రిలింస్ ద్వారా పరిచయం వుంది. కాబట్టి ఎక్కువ బయపడాల్సిన అవసరం లేదు.. అలాగని భయపడకుండా వుంటే గోవిందా..  ఇక, రెండు సబ్జెక్టులు ఎంచుకోవాలి..                  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
21st Episode